• facebook
  • whatsapp
  • telegram

స‌హ‌జ‌వ‌న‌రులు

* సహజ వనరులే మన సంపద
* సంరక్షణ అందరి బాధ్యత

 

  సమాజంలో ఎవరైనా నీతికి విరుద్ధంగా చేసే పనులన్నీ అనైతిక చర్యలు. గత కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి అక్రమ, అనైతిక చర్యలు పెరిగి పోతుండటంతో పర్యావరణంలో అసమతౌల్యం పెరిగిపోతోంది. మరోవైపు సహజ వనరులు తరిగి పోతున్నాయి.
ప్రకృతి ప్రసాదించిన గాలి, నీరు, భూమి, ఖనిజ సంపద, అడవులను సహజవనరులుగా పరిగణిస్తారు. సమాజ జీవనంలో వ్యవసాయం వంటి వాటికి ఉపయోగపడే జంతువులను కూడా సహజవనరులుగానే పరిగణిస్తాం. ఇవి కూడా పర్యావరణంలో ముఖ్య భాగం. అందుకే భారతీయ సంస్కృతిలో చాలామంది సంప్రదాయంగా జంతువులను ఆరాధిస్తుంటారు.

 

సహజ వనరులు.. రకాలు

బపునరుద్ధరణ వ్యూహం ఆధారంగా సహజ వనరులను 2 రకాలుగా వర్గీకరిస్తారు.

 

1. పునరుద్ధరించగల సహజ వనరులు

ఈ రకమైన వనరులను ప్రవాహ వనరులు అనికూడా అంటారు. ఇవి స్థిరంగా ఉండి తరిగిపోని వనరులు. తిరిగి సమకూర్చుకోగలిగిన లేదా సృష్టించుకోగలిగిన వనరులను పునరుద్ధరించగల సహజ వనరులు అంటారు. ఇవి పరిమితి లేకుండా సమకూరుతుంటాయి. ఇలాంటి పునరుద్ధరించగల సహజ వనరులను ఉపయోగించేటప్పుడు సంఘ ప్రయోజన దృక్పథం అవసరం. ఎందుకంటే ఒక వనరు ఉపయోగించే విధానం వేరొక వనరుపై ప్రభావాన్ని చూపుతుంటుంది.
ఉదా: నీరు, అడవులు, మత్స్యసంపద, సౌరశక్తి, తరంగశక్తి, జంతుజాలాలు.

 

2. పునరుద్దరించలేని సహజ వనరులు

ఇవి అంతరించిపోయే స్వభావం ఉన్న వనరులు. వీటిని తిరిగి సృష్టించుకునే అవకాశాలు ఉండవు. వినియోగ ప్రక్రియలో ఈ వనరులు అంతరించిపోతాయి. ఒక నిర్ణీత సమయంలో వీటి పరిమాణం స్థిరంగా ఉంటుంది. ఉదా: బొగ్గు నిల్వలు, పెట్రోలియం, గ్యాస్, ఖనిజ నిక్షేపాలు. వీటిలో కొన్ని ఖనిజపరమైన వనరులను పునఃచక్రీకరణ (రీసైక్లింగ్) చేయవచ్చు. మొదటిసారిగా ఉపయోగించినప్పుడు ఇవి నశించిపోతాయి. రీసైక్లింగ్ చేయడం ద్వారా తిరిగి వీటిని వేరొక రూపంలో ఉపయోగించుకోవచ్చు. ఉదా: రాగి, వెండి, బంగారం.

 

ప్రాధాన్యం
 

* సహజ వనరులు భౌతిక పర్యావరణంలో భాగంగా ఉంటూ మానవుడు, జంతువులు, ఇతర జీవరాశుల మనుగడకు తోడ్పడతాయి
* భూమి లాంటి సహజ వనరు వ్యవసాయం, పారిశ్రామిక, గృహనిర్మాణం, తృతీయరంగ కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది.
* సహజ సంపద ఒక దేశం భౌగోళిక ఉనికి, ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.
* సౌరశక్తి, వాయుశక్తి, తరంగశక్తి, ప్రవాహ వనరులు నిరంతరం అందుబాటులో ఉంటాయి.
* ఆహారం, పశుగ్రాసం, వంటచెరుకు.. సహజ వనరులైన మొక్కలు, చెట్ల ద్వారా లభిస్తాయి. పర్యావరణ సమతౌల్యానికి, సకాల వర్షాలకు అడవులు ఎంతో తోడ్పడతాయి.
ఇలా సహజ వనరులు నిష్క్రియాత్మకంగా ప్రకృతిలో నిక్షిప్తమై ఉంటాయి. భారతదేశం, అర్జెంటీనా, బ్రెజిల్ లాంటి దేశాల్లో సహజ వనరులు ఎక్కువ. స్విట్జర్లాండ్, ఇంగ్లండ్, జపాన్ లాంటి దేశాల్లో సహజ వనరులు తక్కువ. దీన్నిబట్టి పరిశీలిస్తే నిరంతర పరిశోధన, నూతన వనరుల అన్వేషణకు ప్రతి దేశంలోనూ ప్రోత్సాహం ఉండాలి. వనరుల నిర్వహణలో జీవవైవిధ్యం, ఆవరణ సంతులన సాధించడానికి దేశాలన్నీ ప్రయత్నించాలి.

 

ప్రధాన వనరులు

 

భూమి

భూమి, సంబంధిత వనరులు అంటే విస్తృతార్థంలో జీవావరణపు స్వరూప స్వభావంతో విస్తరించిన భూ ఉపరితలభాగం. కొన్ని సందర్భాల్లో భూమిని సహజ, నశింపజేయ వీల్లేని మృత్తికాశక్తిగా నిర్వచించవచ్చు. భూమి అనేది నిర్ధారిత భౌతిక సంపద. సహజ వనరులన్నీ భూమిపైనా, అంతర్గతంగా ఆవరించి ఉండి, పరిమిత సరఫరా కలిగి ఉన్నాయి.
ఉదా: భౌగోళిక ప్రదేశాలు, ఖనిజ నిల్వలు

 

వృక్షాలు

వృక్షాలు, జంతుజాలం కలిసి పర్యావరణానికి ఒక సమగ్ర స్వరూపాన్ని కలుగజేస్తున్నాయి. ఈ రెండింటి పరిరక్షణ పర్యావరణ సమతౌల్యానికి చాలా అవసరం. వృక్షాలు వేర్లతో నేలను పట్టుకోవడం ద్వారా మృత్తికా క్రమక్షయాన్ని తగ్గించి నీటి నాణ్యతను పెంచుతున్నాయి. మనం పీల్చే గాలిని శుభ్రపరుస్తున్నాయి. జంతువులకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తూనే, వన్యప్రాణులకు ఆవాసాలుగా మారుతున్నాయి. చెట్లు ప్రధానమైన సహజవనరులు. కాబట్టి ఎన్ని వీలైతే అన్ని చెట్లను నాటడం మన బాధ్యత. ఇవి పుస్తకాల తయారీకి కావాల్సిన కాగితపు గుజ్జునిస్తాయి. అడవుల ద్వారా పండ్లు, తేనె, కలప, వంట చెరుకు, సుగంధ ద్రవ్యాలు, పూలు, ఔషధాలు, ఇంధనం; బొమ్మలు, బూటుపాలిష్, టూత్‌పేస్టుల తయారీకి కావాల్సిన ముడిసరుకులు లభిస్తాయి.

 

నీరు

నీరు మనకు జీవనాధారం. నీటిలో ఉపరితల జలం, భూగర్భజలం అనే రెండు రకాలుంటాయి. భూ ఉపరితలంపై 79% నీరు ఆక్రమించి ఉంది. భూమి ఉపరితలంపై ఉన్న నీటిలో 97.25% ఉప్పునీరు, 2.75% మంచినీరు ఉంది. మూడింట రెండొంతుల నీటిని మంచు కప్పేసింది. జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు తయారీలో ఉపయోగపడుతూ, నీరు పునరుత్పాదక వనరుగా మెరుగైన పాత్ర పోషిస్తోంది.

 

గాలి

ఇది ప్రధానమైన సహజ వనరు. ఇది భూమిపై ఉన్న సకల జీవరాశికి అత్యావశ్యకం. ప్రతిప్రాణి మనుగడకు గాలి అవసరం. ఇంధనాలు మండటానికి, రసాయన చర్యలు జరగడానికి ఇది తప్పనిసరి. ప్రాణికోటికి జీవనాధారమైన గాలి తరిగిపోని సహజవనరు.

 

ప్లాస్టిక్, పురుగుమందుల వినియోగం

ప్లాస్టిక్: ప్లాస్టిక్ అనేది క్లిష్టమైన భార అణువులతో కూడిన పాలిమర్లు. ప్లాస్టిక్ పరిశ్రమల్లో తయారుచేసే కృత్రిమ లేదా పాక్షిక కృత్రిమ కర్బన ఘన పదార్ధాలు.

పర్యావరణ సమస్యలు తెచ్చిపెట్టే కొన్ని నూతన రసాయన పదార్థాల్లో ప్లాస్టిక్ ఒకటి. దీని తయారీలో పాలీఎథిలీన్, పాలీవినైల్ క్లోరైడ్, పాలీస్టిరీన్ అనే రసాయనాలు ఉపయోగిస్తారు. నదులు, ఉద్యానాలు, వీధులు, సముద్రాలు, తీరప్రాంతాలనూ ప్లాస్టిక్ కలుషితం చేస్తోంది. ఒకవేళ ప్లాస్టిక్‌ని మండించినట్లయితే అది గాల్లోకి విషవాయువులను చిమ్ముతుంది. చాలా జంతువులు ప్లాస్టిక్‌తో మిళితమైన ఆహారాన్ని తిని చనిపోతున్నాయి.
ప్లాస్టిక్ క్యాన్సర్ లాంటి వ్యాధులకు దారితీస్తుంది. దీన్ని పునశ్శుద్ధి చేసే విధానం కూడా చర్మ, శ్వాసకోశ సంబంధ సమస్యలతో ముడిపడి ఉంది. అందువల్ల అందరూ ప్లాస్టిక్ సంచులకు బదులు దుస్తుల సంచులను వాడి ప్లాస్టిక్‌ను నియంత్రించవచ్చు.

పురుగుమందులు: క్రిమి కీటకాలను చంపడానికి, నిరోధించడానికి, నియంత్రించడానికి పురుగుమందులను ఉపయోగిస్తారు. ఆహారోత్పత్తిలో విరివిగా యూరియా, పురుగుమందులను వాడటం వల్ల వాటి అవశేషాలు ఆ ఆహారాన్ని తీసుకునే వారిలోనూ కనిష్ఠ స్థాయిలో కనిపిస్తాయి. కీటకనాశినులను తరచూ వాడే రైతులు తలనొప్పి, అలసట, నిద్రలేమి, చేతులు వణకడం, నాడీ సంబంధ సమస్యలతో బాధ పడుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లల్లో ఈ పురుగుమందుల ప్రభావంతో నాడీ వ్యవస్థ దెబ్బతింటోంది.

 

ప్రత్యామ్నాయాలు:

* పురుగుల నియంత్రణలో సూక్ష్మజీవులు, వివిధ జీవ రసాయనాలను వాడాలి.
* కీటకాల పెరుగుదలను అరికట్టాలి.
* సేంద్రీయ వ్యర్థాలను వాడాలి.
* మిశ్రమ పంటలు, పంటమార్పిడి పద్ధతులను అవలంబించాలి.
* పురుగులను చంపే ఇతర జీవులను పంటల్లో వదలాలి.

 

తరిగిపోతున్నాయి జాగ్రత్త!

గత కొన్ని దశాబ్దాలుగా పర్యావరణం క్షీణిస్తోంది. ఫలితంగా సహజ వనరులు తరిగిపోతున్నాయి.

 

1. తరుగుదల లేదా క్షయం

సహజ వనరుల పునరుత్పత్తి కంటే వేగంగా వాటి వినియోగం జరిగితే దాన్ని సహజ వనరుల తరుగుదల అంటారు.

 

2. మృత్తికా క్రమక్షయం

గాలి లేదా నీరు వరద ప్రవాహం వల్ల భూ ఉపరితలంపై మట్టి, రాళ్లు ఉన్నచోటు నుంచి క్రమక్షయం చెంది మరోచోట నిలిచిపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు. అధిక మృత్తిక క్షయం వల్ల నేలలు సారహీనమై ఎడారులుగా మారతాయి. నేలసారం తగ్గి వ్యవసాయోత్పత్తి కూడా తగ్గిపోతుంది. నేల సారహీనం కావడానికి గాలి, నీరు, ప్రాథమిక కారణాలు. ఇందులో 84% నేల సారహీనం కావడానికి కారణమైతే మిగతా 16% భౌగోళిక పర్యావరణ సమస్యల వల్ల ఉత్పన్నమవుతుంది. ఇలా మృత్తికాక్షయానికి గాలితోపాటు వర్షపాతం, నదులు, ప్రవాహాలు, తీరప్రాంతాలు, మంచుప్రాంతాలు, మంచుగడ్డ కట్టడం లాంటివి కారణాలుగా చెప్పవచ్చు.

 

నివారణ చర్యలు

* సాగు భూముల మధ్య గడ్డి పెంచడం
* సాగు నేలను అతిగా ఉపయోగించకుండా, ఎక్కువగా పశువులు మేయకుండా చూడటం.
* వివిధ రకాల మొక్కలను పెంచడం ద్వారా జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడం.
* తడి నేలను పరిరక్షించడం.
* మొక్కలు, రకరకాల గడ్డి జాతులను పెంచడం.
* బంజరు భూముల్లో ఎక్కువ మొత్తంలో చెట్లు పెరిగేలా చూడటం.

 

3. అడవుల నరికివేత

మానవులు తమ అవసరాల కోసం అడవులు, సంబంధిత పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. పారిశ్రామిక యుగం నుంచి దాదాపుగా ప్రపంచంలోని సగభాగం అడవులు ధ్వంసం కావడంతో లక్షలాది జంతు, వృక్షజాతులు అంతరించిపోయాయి.
అడవుల నరికివేతకు చాలా కారణాలున్నాయి. నరికివేసిన అటవీ భూభాగాన్ని పశువుల దాణా, వ్యవసాయం, ఆవాసాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇలా అటవీ భూములకు ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్ల వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతోంది. జీవవైవిధ్యం లోపించడం వల్ల భూములు బంజర్లుగా మారుతున్నాయి.

 

నష్ట నివారణ చర్యలు

* అడవుల నరికివేత అవసరమైనప్పుడు మరొక ప్రాంతంలో తప్పనిసరిగా మొక్కలను పెంచాలి.
* చెట్లు, అడవుల పరిరక్షణ కోసం పాటుపడేవారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి.
* కచ్చితంగా, నిజాయతీగా ఉండే అధికారుల యాజమాన్యంతో అడవులను సంరక్షించాలి.

 

ముఖ్యాంశాలు

* ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ నివేదిక ప్రకారం.. ప్రతి సంవత్సరం సుమారు 15 కోట్ల చెట్లను నరికి వేస్తున్నారు.
* 1960లో 'ఏజెంట్ ఆరేంజ్' అనే రసాయనాన్ని యుద్ధ సమయంలో అమెరికా, వియత్నాంపై ప్రయోగించింది. ఈ రసాయన ప్రభావం వల్ల మొక్కల ఆకులు రాలిపోతాయి, ఎండిపోతాయి.
* అడవులను పెంపొందించి పర్యావరణాన్ని కాపాడటం కోసం భారత ప్రభుత్వం 5వ పంచవర్ష ప్రణాళికలో సామాజిక అడవుల కార్యక్రమాన్ని ప్రారంభించి, 6వ ప్రణాళికలో అభివృద్ధి చేసింది.
* తెలంగాణ ప్రభుత్వం తరిగిపోతున్న అడవులను పెంపొందించేందుకు 2015 జులై 3-7 తేదీల మధ్య 'హరితహారం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
* మానవ వ్యర్థ పదార్థాలు సముద్రాల్లో కలిసిపోవడం వల్ల నత్రజని శాతం పెరిగి రకరకాల జలచరాలు మరణిస్తున్నాయి. ఫలితంగా ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. దీన్ని 'బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ)' అంటారు.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌