• facebook
  • whatsapp
  • telegram

అణుసాంకేతికత

సమాజ శ్రేయస్సుకి.. సర్వ నాశనానికి!

 

 


అధిక దిగుబడినిచ్చే వంగడాల ఉత్పత్తికి, హానికర కీటకాల సంఖ్యను అదుపులో ఉంచడానికి, రక రకాల ఆహార పదార్థాల నిల్వలకు, ఆరోగ్య సేవలు సహా అనేక  ప్రయోజనాల కోసం అణు సాంకేతికతను వినియోగిస్తున్నారు.  పరిశ్రమల్లో, పరిశోధనల్లో, పర్యావరణ హితమైన విద్యుత్తు ఉత్పత్తిలో, రవాణాలో, సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియలోనూ వాడుతున్నారు. సమాజ శ్రేయస్సుకి, సర్వనాశానికి ఉపయోగపడే ఈ టెక్నాలజీ వివరాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

మనిషి అభివృద్ధి చేసిన టెక్నాలజీల్లో శ్రేయస్సుకి, వినాశనానికి ఉపయోగడేది అణుసాంకేతికత. దీని ఉపయోగాలు అనేకం ఉన్నాయి. అదుపుతప్పినా, అణు దుర్ఘటనలు జరిగినా కలిగే నష్టం కూడా అపారంగా ఉంటుంది.

 

భారతదేశంలో అణుసాంకేతికత అభివృద్ధి చెందిన విధానం: డాక్టర్‌ హోమీ జహంగీర్‌ బాబాను భారత అణుసాంకేతికత పితామహుడిగా పిలుస్తారు. ఈయన ఆధ్వర్యంలో 1945లో ముంబయిలో ఏర్పాటు చేసిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌(TIFR) సంస్థతో మన దేశంలో అణుసాంకేతికత అభివృద్ధి ప్రారంభమైందని చెప్పవచ్చు. 1948, ఆగస్టు 10న అటామిక్‌ ఎనర్జీ కమిషన్‌ ఏర్పడింది. దీనికి మొదటి ఛైర్మన్‌గా హోమీ జహంగీర్‌ బాబా వ్యవహరించారు. 

 

 1954 జనవరిలో అటామిక్‌ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంట్, ట్రాంబే (AEET) సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థను హోమీ జహంగీర్‌ బాబా మరణానంతరం 1967లో బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌(BARC)గా పేరు మార్చారు. దీన్ని ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌(IGCAR), రాజారామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (RRCAT), వేరియబుల్‌ ఎనర్జీ సైక్లోట్రాన్‌ సెంటర్‌(VECC)లాంటి పరిశోధన సంస్థలకు మాతృ సంస్థగా భావిస్తారు. BARC నుంచి శాస్త్రవేత్తలు వివిధ పరిశోధనా సంస్థలను స్థాపించడానికి, వాటి అభివృద్ధికి పాటుపడ్డారు. 1954, ఆగస్టు 3న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ(DAE) ఏర్పాటు చేయడంతో అణుసాంకేతికత పరిశోధనలు ఊపందుకున్నాయని చెప్పవచ్చు. దీని తర్వాత 1967 అక్టోబరు 4న యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(UCIL), 1968 డిసెంబరు 21న న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌(NFC) 1969 మే 1న హెవీ వాటర్‌ బోర్డ్‌(HWB) ఏర్పడ్డాయి. ఈ విధంగా భారతదేశంలో అణుసాంకేతికత అభివృద్ధి చెందింది.


ఉపయోగాలు: 

* అణుసాంకేతికతను వ్యవసాయం, పారిశ్రామిక రంగం, విద్యుత్తు శక్తి ఉత్పాదనలో వినియోగిస్తారు. 

* వైద్య, ఆరోగ్య రంగాలు, పరిశోధనా రంగం, పదార్థాలను సూక్ష్మజీవ రహితం చేయడం లాంటి వాటికి అణుసాంకేతికత ఉపయోగపడుతుంది.


వ్యవసాయ రంగం:  

* బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ గామా కిరణాలను ఉపయోగించి ఉత్పరివర్తన ప్రజననం ద్వారా 49 రకాల అధిక దిగుబడినిచ్చే వంగడాలను రూపొందించింది. అందులో వేరుశనగ, ఆవాలు, సోయాబీన్, సన్‌ఫ్లవర్, వరి, జనుము, కంది, పెసర లాంటివి ఉన్నాయి. 

* రేడియో నైట్రోజన్‌ (N*15) ను ఉపయోగించి మొక్కల ఎరువుల శోషణాన్ని గుర్తిస్తున్నారు.

* రేడియేషన్‌తో కీటకాలను వ్యంధ్యంగా మార్చి హానికర కీటకాల సంఖ్యను అదుపులో ఉంచవచ్చు. దీన్నే స్టెరైల్‌ ఇన్‌సెక్ట్‌ టెక్నిక్‌ అంటారు.


ఆహారం నిల్వ, సూక్ష్మజీవ రహితం చేయడం: ఆహార పదార్థాలు, పండ్లు, ధాన్యాలు, ఎండిన పండ్లు, సుగంధ ద్రవ్యాలు, చేపలు, మాంసం, కూరగాయలు, దుంపలను నిల్వ చేయడానికి అణుసాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దీన్ని ఫుడ్‌ ఇర్రేడియేషన్‌ అంటారు. దీనిలో గామా కిరణాలు, ఎక్స్‌ కిరణాలను పదార్థాలు, కూరగాయలపై ప్రసరింపజేసి వాటిని సూక్ష్మజీవ రహితం చేస్తారు. దీనివల్ల వీటి నిల్వ కాలంతో పాటు దుంపలు, ధాన్యాల జీవితకాలం కూడా పెరుగుతుంది. నిల్వ సమయంలో మొలకెత్తకుండా నిరోధించవచ్చు. పండ్లను తొందరగా పక్వానికి రాకుండా చేసి వాటి నిల్వ కాలాన్ని పెంచవచ్చు.


పరిశ్రమలు, పరిశోధనలు: పరిశ్రమల్లో రేడియో ఐసోటోపులను రియాక్టర్ల పనితీరు తెలుసుకోవడానికి, వాటిలో పగుళ్లను గుర్తించడానికి వాడుతున్నారు. పరిశోధనల్లో రేడియో ఐసోటోపులను ట్రేసర్‌లుగా ఉపయోగిస్తున్నారు. వివిధ జీవక్రియల గురించి అధ్యయనం చేయడానికీ అవి తోడ్పడతాయి.


వైద్య, ఆరోగ్య రంగాలు: వైద్యరంగంలో అనేక వ్యాధులను గుర్తించడానికి, క్యాన్సర్‌ లాంటి వ్యాధుల చికిత్సకు రేడియో ఐసోటోపులు, అణుసాంకేతికతను వినియోగిస్తున్నారు. వైద్యంలో భాగంగా వాడే పరికరాలు, శస్త్ర చికిత్సకు ఉపయోగించే వస్తువులను సూక్ష్మజీవ రహితం చేయడానికి రేడియేషన్‌ (గామా కిరణాలతో) చేస్తారు.


విద్యుత్తు ఉత్పత్తి: అణు సాంకేతికతను ఉపయోగించి అణు రియాక్టర్ల ద్వారా అణువిద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ఇతర ఉత్పత్తులతో పోలిస్తే చౌక. పర్యావరణానికి అంతగా హాని చేయదు. 


రవాణా: యుద్ధ నౌకలు, జలాంతర్గాములను నడపడానికి అణుసాంకేతికతను వినియోగిస్తున్నారు. సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చడానికి అణువిద్యుత్తును ఉపయోగిస్తున్నారు. దీన్నే వాటర్‌ డీసాలినేషన్‌ అంటారు. 

అణుసాంకేతికతను అభివృద్ధి చేస్తున్న సంస్థలు: 

* BARC - బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్, ముంబయి

* GCAR - ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్, కల్పకం (తమిళనాడు) 

* RRCAT - రాజారామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ, ఇందౌర్‌ (మధ్యప్రదేశ్‌)

* VECC - వేరియబుల్‌ ఎనర్జీ సైక్లోట్రాన్‌ సెంటర్, కోల్‌కతా

* AMD- అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్, హైదరాబాద్‌

* HWB-హెవీ వాటర్‌ బోర్డ్, ముంబయి

*NFC - న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్, హైదరాబాద్‌

* BRIT- బోర్డ్‌ ఆఫ్‌ రేడియేషన్‌ అండ్‌ ఐసోటోప్‌ టెక్నాలజీ, ముంబయి

* NPCIL -న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, ముంబయి

* UCIL - యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, జాదుగూడ (ఝార్ఖండ్‌)

* IRE - ఇండియన్‌ రేర్‌ ఎర్త్‌ లిమిటెడ్, ముంబయి

* GCNEP -  గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ పార్ట్‌నర్‌షిప్, బహదూర్‌గర్‌ (హరియాణా)

*BHAVINI - భారతీయ నబ్‌హికియ విద్యుత్‌ నిగమ్‌ లిమిటెడ్, కల్పకం (తమిళనాడు)

* TIFR - టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌. దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. పుణె, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఉపకార్యాలయాలు ఉన్నాయి.

*SINP - సాహా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఫిజిక్స్, కోల్‌కతా

* HRI  - హరీశ్‌ చంద్ర రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, అలహాబాద్‌

*IOP-ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్, భువనేశ్వర్‌

* IMS - ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్, చెన్నై

* IPR - ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్, గాంధీనగర్‌ (గుజరాత్‌) 

*HBNI  -హోమీబాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్, ముంబయి

 

మాదిరి ప్రశ్నలు

1) కింది ఏ సంస్థను ఇతర అణుపరిశోధనా సంస్థలకు తల్లి లాంటిదని భావిస్తారు?

1) బాబా అటామిక్‌ రిసెర్చ్‌   2) ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌ 

3) రాజారామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ   

4) ఆటమిక్‌ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంట్‌

 

2. భారతదేశంలో ఉన్న అణువిద్యుత్‌ రియాక్టర్లను నిర్మిస్తూ, నిర్వహణ బాధ్యతలను చూస్తున్న న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) దిల్లీ   2) ముంబయి   3) హైదరాబాద్‌   4) కోల్‌కతా

 

3. అణుశక్తికి సంబంధించిన ఏ సంస్థ హైదరాబాద్‌లో ఉంది?

1) హెవీ వాటర్‌ బోర్డ్‌     2) యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ 

3) న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌     4) ఇండియన్‌ రేర్‌ ఎర్త్‌ లిమిటెడ్‌

 

4. వినియోగంలో భాగంగా వివిధ రంగాల్లో వాడుతున్నారు?

1) ఆల్ఫా కిరణాలు   2) బీటా కిరణాలు  3) గామా కిరణాలు  4) ఎక్స్‌ కిరణాలు

 

5. కల్పకం (తమిళనాడు)లోని భారతీయ నబ్‌హికియ విద్యుత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ప్రధాన విధి?

1) పరిశోధనా రియాక్టర్ల నిర్వహణ

2) ఫాస్ట్‌ బ్రీడర్ల రియాక్టర్ల నిర్మాణం, నిర్వహణ

3) అణువిద్యుత్‌ను దేశమంతటా సరఫరా చేయడం

4) దేశంలో అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేయడం


సమాధానాలు

1-1;    2-2;     3-3.    4-2;     5-2.

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌

Posted Date : 27-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌