• facebook
  • whatsapp
  • telegram

సంస్థాగత ఏర్పాట్లు

 

సమస్త యంత్రాంగం సంసిద్ధం!

 

ఇటీవల ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఎక్కడెక్కడి నుంచో అనేకమంది సిబ్బంది గంటల్లో మోహరించారు. వేగంగా సహాయక చర్యలను చేపట్టి ప్రాణ నష్టం మరింత తీవ్రం కాకుండా నివారించారు. విపత్తు అనివార్యం. కానీ  దాని వల్ల కలిగే ఇబ్బందులను అడ్డుకునే అవకాశం ఉంది. అందుకోసం ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది. అది విపత్తు నివారణ, ఉపశమన కార్యక్రమాలను నిర్వహించే అధికారాన్ని సంబంధిత అధికార వర్గాలకు అందిస్తుంది. వివిధ స్థాయుల్లో సమన్వయాన్ని సులభతరం చేస్తుంది. సమస్త యంత్రాంగం సమష్టి బాధ్యతతో సంసిద్ధమయ్యే విధంగా చూస్తుంది. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

 

విపత్తు నిర్వహణ అమలు విధానం రూపకల్పన, పర్యవేక్షణకు అవసరమైన వ్యవస్థాగత యంత్రాంగాలను సిద్ధం చేయడానికి భారత ప్రభుత్వం 2005, డిసెంబరు 23న విపత్తు నిర్వహణ చట్టాన్ని రూపొందించింది. విపత్తు నివారణ, దాని ప్రభావ మదింపు, ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు ప్రభుత్వంలోని వివిధ విభాగాలు చేపట్టాల్సిన చర్యలను ఈ చట్టం వివరిస్తుంది. 

 

చట్టం ప్రకారం సంస్థాగత ఏర్పాట్లు

1) ప్రాధికార సంస్థలు: విపత్తు నిర్వహణ మూడు దశల్లో జరుగుతుంది. 

* ప్రధాన మంత్రి అధ్యక్షతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎమ్‌ఏ - నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ).

* ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎస్‌డీఎమ్‌ఏ - స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ).

* జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (డీడీఎమ్‌ఏ - డిస్ట్రిక్ట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ). 

 

2) కార్యనిర్వాహక కమిటీలు: విధి నిర్వహణ కోసం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో కార్యనిర్వాహక కమిటీలను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఎన్‌డీఎమ్‌ఏ ఆధ్వర్యంలో జాతీయ కార్యనిర్వాహక కమిటీ, ఎస్‌డీఎమ్‌ఏ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తారు.

 

3) సామర్థ్య నిర్మాణం కోసం: ఎన్‌డీఎమ్‌ఏ సామర్థ్య నిర్మాణం కోసం కేంద్రం స్థాయిలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎమ్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌)ను ఏర్పాటు చేస్తారు.

 

4) సహాయక చర్యలు చేపట్టేందుకు: విపత్తుల సమయంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి కేంద్ర స్థాయిలో జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళాన్ని (ఎన్‌డీఆర్‌ఎఫ్‌ - నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) ఏర్పాటు చేయాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందనా దళాన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు.

 

 

5) ప్రణాళికలు రూపొందించడం: విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ ప్రణాళికకు అనుగుణంగా రాష్ట్రాలు, జిల్లాలు, అన్ని రకాల మంత్రిత్వ శాఖలు, వాటి విభాగాలు తమ సొంత విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించుకోవాలి.

 

వివిధ సంస్థల కూర్పు

జాతీయ విపత్తు ప్రాధికార సంస్థ: విపత్తు నిర్వహణ చట్టం చేసిన తర్వాత 2006, సెప్టెంబరు 27న ప్రధానమంత్రి అధ్యక్షుడిగా లాంఛనంగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు. మరో తొమ్మిది మంది సభ్యులను నియమించి అందులో ఒకరిని ఉపాధ్యక్షులుగా ఎంపిక చేస్తారు. ఈ కార్యాలయంలో ఒక ఆర్థిక సలహాదారు,  అయిదుగురు సంయుక్త కార్యదర్శులు, పది మంది జాయింట్‌ అడ్వైజర్లు, మరికొంత మంది సిబ్బంది ఉంటారు. ఈ సంస్థ విపత్తు నిర్వహణ విధానాలను రూపొందిస్తుంది. జాతీయ ప్రణాళికలను ఆమోదిస్తుంది. విపత్తు నిర్వహణలో రాష్ట్ర ప్రాధికార సంస్థలు రాష్ట్ర స్థాయి ప్రణాళికల రూపకల్పనలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను జారీ చేస్తుంది. 

 

జాతీయ కార్యనిర్వాహక కమిటీ: ఎన్‌డీఎమ్‌ఏకు విధి నిర్వహణలో సాయపడేందుకు జాతీయ కార్య నిర్వాహక కమిటీ ఉంటుంది. దీనికి కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. వ్యవసాయం, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం-అడవులు, రక్షణ శాస్త్ర సాంకేతిక రంగం తదితర శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. రక్షణ దళాల సంయుక్త అధిపతి అయిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) కూడా సభ్యులుగా ఉంటారు.

 

రాష్ట్ర విపత్తు ప్రాధికార సంస్థ: అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ అథారిటీల ఏర్పాటును చట్టంలోని చాప్టర్‌-3 సెక్షన్‌-14 వివరిస్తోంది. 2003 నుంచి గుజరాత్, డామన్, డయ్యూ ఆ విధమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 

 

రాష్ట్ర కార్య నిర్వాహ‌క‌ కమిటీ: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేయవచ్చని విపత్తు నిర్వహణ చట్టం చెబుతోంది. ఆయనతో పాటు మరో నలుగురు ఇతర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

 

 

జిల్లా విపత్తు ప్రాధికార సంస్థ: జిల్లా కలెక్టర్‌ దీనికి ఛైర్మన్‌. జిల్లా పరిషత్తు అమల్లో ఉంటే జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ ఈ సంస్థకు సహ ఛైర్మన్‌గా ఉంటారు. ఛైర్మన్‌ నియామకం జరగపోతే, జిల్లా స్థానిక సంస్థలకు ఎన్నికైన ఒక ప్రతినిధి (జడ్పీటీసీ) సహ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో జిల్లా ప్రధాన కార్యనిర్వాహక అధికారి (జడ్పీ సీఈఓ), జిల్లా సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్, జిల్లా ముఖ్య వైద్యాధికారి, ఇద్దరు జిల్లా స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు.

 

మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఏర్పాటు: రెండో పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సు ప్రకారం 25 లక్షలు పైబడిన జనాభా ఉన్న పెద్ద నగరాల్లో సంక్షోభాల నిర్వహణకు మేయర్‌ ప్రత్యక్ష బాధ్యత వహిస్తారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్, నగర పోలీసు కమిషనర్‌ సహకారం అందిస్తారు.

 

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎమ్‌): విపత్తును సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు, విపత్తు నిర్వహణ పరిశోధన, విద్యా సంబంధ కోర్సులు, సమావేశాలు, సెమినార్లు తదితరాలను జరిపే అవకాశాన్ని చట్టం కల్పించింది. అందుకోసం ఏర్పాటైన ఈ సంస్థకు కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షుడిగా, ఎన్‌డీఎమ్‌ఏ వైస్‌ ఛైర్మన్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 

 

జాతీయ ప్రతిస్పందనా దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌): పారా మిలిటరీ దళాల నుంచి తీసుకున్న 12 బెటాలియన్ల దళాన్ని విపత్తులకు స్పందించి సహకారం అందించడానికి సిద్ధంగా ఉంచుతారు. ఒక బెటాలియన్‌లో వెయ్యి మంది ఉంటారు. వీరు దేశవ్యాప్తంగా 12 కేంద్రాల్లో సిద్ధంగా ఉంటారు. ఎన్‌డీఎమ్‌ఏ వైస్‌ ఛైర్మన్‌ ఈ దళానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

 

జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎమ్‌సీ): విపత్తుల సందర్భంగా పునరావాస, సహాయక చర్యలను సమర్థంగా సమన్వయం చేయడానికి జాతీయ స్థాయిలో జాతీయ క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఉంటుంది. దీనికి కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ఛైర్మన్‌గా ఉంటారు. 15 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. 

 

రాష్ట్ర సంక్షోభ నిర్వహణ కమిటీ: దీనికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడిగా ఉంటారు. రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

 

పౌరరక్షణ దళం: పౌర రక్షణ చట్టం 1968 ప్రకారం అత్యవసర ఉపశమన వ్యవస్థ పథకంలో భాగంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో పౌర రక్షణ చర్యలు తీసుకోవడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన పౌర రక్షణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. ప్రజలకు స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని కల్పించడానికి వీలుగా 2010లో ఈ చట్టాన్ని సవరించారు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు చేసింది?

1) 2005  2) 2007  3) 2003  4) 2015

 

2. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు ఛైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?

1) ప్రధానమంత్రి  2) హోంశాఖ మంత్రి  3) హోంశాఖ సెక్రటరీ  4) వ్యవసాయశాఖ మంత్రి

 

3. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఎవరు?

1) కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ  2) హోంశాఖ సెక్రటరీ  3) ఎన్‌డీఎమ్‌ఏ ఉపాధ్యక్షుడు 4) ఎన్‌డీఎమ్‌ఏ అధ్యక్షుడు

 

4. జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

1) ఆగస్టు 15  2) నవంబరు 5  3) అక్టోబరు 5 4) అక్టోబరు 29

 

5. జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళానికి ఛైర్‌పర్సన్‌ ఎవరు?

1) ఎన్‌డీఎమ్‌ఏ ఛైర్మన్‌ 2) ఎన్‌డీఎమ్‌ఏ వైస్‌ ఛైర్మన్‌ 3) హోం సెక్రటరీ  4) కేబినెట్‌ సెక్రటరీ

 

సమాధానాలు: 1-1; 2-2; 3-1; 4-4; 5-2.

 

రచయిత: జల్లు సద్గుణరావు 
 

 

Posted Date : 13-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌