• facebook
  • whatsapp
  • telegram

ఫైటోహార్మోన్‌లు 

చిగురించినా... రాలిపోయినా..!

 

   ఆకులు చిగురించడం, రాలిపోవడం, పండ్లను కృత్రిమంగా పండించడం, విత్తనాలు లేని పండ్లు ఏర్పడటం వీటన్నింటికీ కారణం హార్మోన్లే. మొక్కల్లోని ఈ జీవక్రియలను నియంత్రించడానికి రకరకాల హార్మోన్లు పనిచేస్తుంటాయి. వాటి గురించి, అవి నిర్వహించే చర్యల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి.

 

మానవుడు, ఉన్నత స్థాయి జంతువుల్లో నియంత్రణ సమన్వయానికి హార్మోన్‌లు ఉన్నట్లే మొక్కల్లో కూడా నియంత్రణ సమన్వయం, పెరుగుదల, జీవక్రియల నియంత్రణకు హార్మోన్లు ఉంటాయి. వీటినే ఫైటోహార్మోన్‌లు లేదా వృద్ధి నియంత్రకాలు అని పిలుస్తారు. ఫైటోహార్మోన్లు అయిదు రకాలు. అవి ఆక్సిన్‌లు, జిబ్బరెల్లిన్‌లు, సైటోకైనిన్‌లు, అబ్‌సిసిక్‌ ఆమ్లం, ఇథిలీన్‌. వీటిలో మొదటి మూడింటిని పెరుగుదల ప్రోత్సాహకాలు, మిగిలిన రెండింటిని పెరుగుదల నిరోధకాలు అంటారు.

 

ఆక్సిన్‌లు:  ఖండించిన మొక్క కాండం నుంచి వేర్లు ఏర్పడటానికి ఆక్సిన్‌ను ఉపయోగిస్తారు. దీని ద్వారా ఉద్యానవన మొక్కలను వేగంగా వ్యాప్తి చెందించేందుకు వీలవుతుంది. ఆక్సిన్‌లు అగ్రాధిక్యతను ప్రేరేపిస్తాయి. కాండం అగ్రభాగం పార్శ్వపు మొగ్గలు లేదా శాఖలను ఎదగనీయకుండా చేయడాన్ని అగ్రాధిక్యత అంటారు. ఆక్సిన్‌లు అనిషేక ఫలనాన్ని (Parthenocarpy) కలిగిస్తాయి. ఫలదీకరణం జరగకుండానే పుష్పంలోని అండాశయం ఫలంగా మారడాన్ని అనిషేక ఫలనం అంటారు. దీనివల్ల విత్తనాలు లేని ఫలాలు ఏర్పడి తినే భాగం పెరుగుతుంది. మొక్క కణాన్ని వ్యాకోచింపజేయడానికి, స్త్రీ పుష్పాల సంఖ్యను పెంచడానికి ఆక్సిన్‌లు ఉపయోగపడతాయి. 2, 4 - D (2, 4 - డైక్లోరో ఫినాక్సి ఎసిటిక్‌ ఆమ్లం); 2, 4, 5 - T (2, 4, 5 - ట్రైక్లోరో ఫినాక్సి ఎసిటిక్‌ ఆమ్లం) అనే ఆక్సిన్‌లు కలుపు మొక్కల నాశకాలుగా ఉపయోగపడతాయి.  ఉదా: IAA (ఇండోల్‌ ఎసిటిక్‌ యాసిడ్‌), IBA (ఇండోల్‌ బ్యుటరిక్‌ యాసిడ్‌), NAA (నాఫ్తలీన్‌ ఎసిటిక్‌ యాసిడ్‌)

జిబ్బరెల్లిన్‌లు: ఇవి ప్రత్యేకంగా కణుపు మాధ్యమాలను వ్యాకోజింపజేసి కాండం పొడవు పెరగడానికి సహాయపడతాయి. మొక్కల్లో మరుగుజ్జుతనాన్ని నివారిస్తాయి. విత్తన సుప్తావస్థను తొలగించి త్వరగా మొలకెత్తించేందుకు సహాయపడతాయి. ఆక్సిన్‌ల కంటే ఎక్కువగా అనిషేక ఫలనాన్ని ప్రేరేపిస్తాయి. పత్ర వ్యాకోచాన్ని, కుకుర్బిటా మొక్కల్లో పురుష పుష్పాల సంఖ్యను పెంచుతాయి. జిబ్బరెల్లిన్‌లు మొక్కల్లో ముఖ్యంగా పత్రాలు, పిండం, కాండాగ్ర భాగాల్లో ఉంటాయి.

సైటోకైనిన్‌లు: సైటోకైనిన్‌లు కణ విభజనను ప్రేరేపిస్తాయి. పుష్పాల ఉత్పత్తి పెంచుతాయి. వార్ధక్యాన్ని ఆలస్యం చేస్తాయి. పత్రరంధ్రాలు తెరచుకునేలా చేస్తాయి. ఉదా: కైనిటిన్, BAP (బెంజైల్‌ అమైనో ప్యూరిన్‌) 

అబ్‌సిసిక్‌ ఆమ్లం: ఇది కాండానికి, పత్రానికి మధ్య తెగే చోటును ఏర్పరిచి పత్రాలు రాలిపోయేలా చేస్తుంది. పత్రాల్లోని పత్రరంధ్రాలను మూసుకునేలా చేసి బాష్పోత్సేకాన్ని నియంత్రిస్తుంది. అందుకే ఈ హార్మోన్‌ను యాంటీ ట్రాన్స్‌పరెంట్‌ హార్మోన్‌ (బాష్పోత్సేకాన్ని నిరోధించే హార్మోన్‌) అంటారు. విత్తనాల్లో సుప్తావస్థను (Seed davmancy) ను ప్రేరేపిస్తుంది.పత్రాల్లో వార్ధక్య దశను ప్రేరేపిస్తుంది. 

ఇథిలీన్‌: దీన్ని పండ్లను పరిపక్వం చెందించే హార్మోన్‌ అంటారు. ఇది పత్రాలు రాలిపోయేలా చేసి అగ్రాధిక్యతను పెంచుతుంది. ఈ హార్మోన్‌ వాయు రూపంలో ఉంటుంది. పండ్లను కృత్రిమంగా పండించేందుకు ఇథిపాన్‌ (Ethepan) అనే ద్రావణాన్ని వాడుతున్నారు. ఇది ఇథిలీన్‌ వాయువును విడుదల చేస్తుంది.

 

పండ్ల పరిపక్వ దశలో కలిగే మార్పులు 

* కణకవచంలో మార్పులు కలిగి వర్ణద్రవ్యాలు పెరుగుతాయి. 

* పిండిపదార్థాలు చక్కెరలుగా మారతాయి.

* మంచి వాసన, బాష్పశీల పదార్థాలు పెరుగుతాయి.

 

ఏజెంట్‌ ఆరెంజ్‌ 

ఇది 2, 4 - D, 2, 4, 5  T అనే రెండు రసాయనాల మిశ్రమం. దీన్ని అమెరికా వియత్నాం యుద్ధంలో ఉపయోగించింది. దీన్ని అడవుల్లో చల్లడం వల్ల ఆకులన్నీ రాలిపోయాయి. దీని కారణంగా అనేకమంది క్యాన్సర్, జన్యు వ్యాధులు, టైప్‌ - II మధుమేహం లాంటి వ్యాధుల బారినపడ్డారు. 


మాదిరి ప్రశ్నలు

1. ఫైటోహార్మోన్లకు సంబంధించిన కింది వాక్యాల్లో సరైంది?

1) వీటిని వృద్ధి నియంత్రకాలు అంటారు.       2) ఇవి మొక్కల్లో నియంత్రణ సమన్వయానికి తోడ్పడతాయి.

3) వీటిని కృత్రిమంగా కూడా తయారు చేయవచ్చు.       4) పైవన్నీ 

జ‌:  పైవన్నీ 

 

2. కిందివాటిలో ఫైటోహార్మోన్‌ కానిది?

1) ఆక్సిన్‌      2) జిబ్బరెల్లిన్‌      3) ఆస్కార్బిక్‌ ఆమ్లం      4) అబ్‌సిసిక్‌ ఆమ్లం

జ‌: ఆస్కార్బిక్‌ ఆమ్లం

 

3. మొక్కల్లోని వృద్ధి నియంత్రకాల్లో పెరుగుదల నిరోధకంగా పనిచేసేది? 

1) అబ్‌సిసిక్‌ ఆమ్లం      2) ఆక్సిన్‌లు      3) సైటోకైనిన్‌లు      4) జిబ్బరెల్లిన్‌లు

జ‌: అబ్‌సిసిక్‌ ఆమ్లం

 

4. ఫలదీకరణం జరగకుండానే పుష్పంలోని అండాశయం ఫలంగా మారడాన్ని ఏమంటారు?

1) అనిషేక జననం      2) అనిషేక ఫలనం 

3) అనిషేక ఫలదీకరణం      4) అలైంగిక ప్రత్యుత్పత్తి

జ‌: అనిషేక ఫలనం

 

5. మొక్కల్లో ఆక్సిన్‌లకు సంబంధించిన చర్యల్లో సరైంది? 

1) ఖండించిన మొక్క కాండం నుంచి వేర్లను ఉత్పత్తి చేస్తాయి.        2) అగ్రాధిక్యతను ప్రేరేపిస్తాయి.

3) అనిషేక ఫలనాన్ని ప్రేరేపిస్తాయి.         4) పైవన్నీ 

జ‌: పైవన్నీ 

 

6. మొక్కల్లో అనిషేక ఫలనం వల్ల కలిగే ఉపయోగం? 

1) ఫలాల్లో విత్తనాలు ఎక్కువగా ఏర్పడతాయి. 

2) విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. 

3) విత్తనాలు లేని ఫలాలు ఏర్పడి, ఫలంలో తినే భాగం మాత్రమే పెరుగుతుంది.

4) ఫలాలు ఆలస్యంగా పక్వానికి వస్తాయి. 

జ‌: విత్తనాలు లేని ఫలాలు ఏర్పడి, ఫలంలో తినే భాగం మాత్రమే పెరుగుతుంది.

 

7. 2, 4 - డైక్లోరో ఫినాక్సి ఎటిసిటిక్‌ ఆమ్లం అనే ఆక్సిన్‌ను ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? 

1) ఖండించిన కాండం నుంచి వేర్ల ఉత్పత్తికి       2) కలుపు మొక్కల నాశకాలుగా 

3) పత్రాల వైశాల్యం పెంచడానికి       4) బాష్పోత్సేక నిరోధకంగా

జ‌: కలుపు మొక్కల నాశకాలుగా

 

8. కిందివాటిలో ఆక్సిన్‌లకు ఉదాహరణ?

1) ఇండోల్‌ ఎసిటిక్‌ యాసిడ్‌        2) ఇండోల్‌ బ్యుటరిక్‌ యాసిడ్‌  

3) నాఫ్తలిన్‌ ఎసిటిక్‌ యాసిడ్‌        4) పైవన్నీ

జ‌: పైవన్నీ

 

9. మొక్కల్లో మరగుజ్జుతనాన్ని నివారించి, కాండం పొడవు పెరగడానికి ఉపయోగపడే వృద్ధి నియంత్రకం?

1) ఇథిలిన్‌      2) జిబ్బరెల్లిన్‌      3) సైటోకైనిన్‌       4) ఆక్సిన్‌

జ‌: జిబ్బరెల్లిన్‌      

 

10. కిందివాటిలో సైటోకైనిన్‌లకు ఉదాహరణ?

1) కైనిటిన్‌ బెంజైల్‌ అమైనో ప్యూరిన్‌        2) పాంటోథెనిక్‌ ఆమ్లం, సిట్రిక్‌ ఆమ్లం 

3) 2, 4 - D, 2, 4, 5 - T        4) ఇండోల్‌ ఎసిటిక్‌ ఆమ్లం, ఇండోల్‌ బ్యుటరిక్‌ ఆమ్లం

జ‌: కైనిటిన్‌ బెంజైల్‌ అమైనో ప్యూరిన్‌

 

11. జిబ్బరెల్లిన్‌లకు సంబంధించి కిందివాటిలో సరైంది?

1) ఇవి కణుపు మాధ్యమాలను వ్యాకోచింపజేసి కాండం పొడవును పెంచుతాయి. 

2) విత్తన సుప్తావస్థను తొలగించి త్వరగా మొలకెత్తిస్తాయి.  

3) అనిషేక ఫలనాన్ని ప్రేరేపిస్తాయి.  

4) పైవన్నీ 

జ‌: పైవన్నీ

 

12. కిందివాటిలో ఏ ఫైటోహార్మోన్‌ వార్ధక్యాన్ని ఆలస్యం చేస్తుంది?

1) ఇథిలిన్‌      2) అబ్‌సిసిక్‌ ఆమ్లం      3) సైటోకైనిన్‌       4) ఆక్సిన్‌

జ‌: సైటోకైనిన్‌       

 

13. మొక్కల నుంచి సహజంగా వెలువడే ఏ వాయువు పండ్లను పరిపక్వం చెందిస్తుంది?

1) ఇథిలిన్‌      2) ఎసిటలిన్‌      3) హైడ్రోజన్‌       4) ఇథిపాన్‌

జ‌: ఇథిలిన్‌      

 

14. మొక్కల్లో అబ్‌సిసిక్‌ ఆమ్లం ఏ చర్యలను ప్రభావితం చేస్తుంది?

1) పత్రరంధ్రాలు మూసుకునేలా చేస్తుంది.        2) విత్తనాల్లో సుప్తావస్థను ప్రేరేపిస్తుంది.

3) పత్రాల్లో వార్ధక్య దశను ప్రేరేపిస్తుంది.       4) పైవన్నీ 

జ‌: పైవన్నీ 

 

15. కిందివాటిలో ఏ రసాయనాన్ని అమెరికా వియత్నాం యుద్ధంలో అడవులపై చల్లడం వల్ల మొక్కల ఆకులు రాలిపోయాయి? 

1) ఏజెంట్‌ ఆక్సిన్‌      2) ఏజెంట్‌ ఆరెంజ్‌      3) యూరికామ్లం      4) సిట్రిక్‌ ఆమ్లం

జ‌: ఏజెంట్‌ ఆరెంజ్‌


రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

‣ జీవశాస్త్రంలో కొత్త ఆవిష్కరణలు

 కార్బోహైడ్రేట్లు

 వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 03-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌