• facebook
  • whatsapp
  • telegram

పీఠభూములు

అంచులు వాలుగా... నేలలు ఎత్తుగా!

ఖనిజ నిల్వలు కలిగి, జలపాతాలతో అలరారుతూ మానవాళికి ఎనలేని మేలు చేకూర్చే భూస్వరూపాలు పీఠభూములు. ఈ నేలలు ఎక్కువ విస్తీర్ణంతో  పరిసరాలకంటే ఎత్తుగా, సమతలంగా ఉంటాయి. అంచులు వాలుగా ఉండటం వీటి ప్రత్యేకత. జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నల్లో రకరకాల పీఠభూములపై ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థులు వాటిపై స్థూలమైన అవగాహన పెంచుకోవాలి. 

 

  అంచులు వాలుగా ఉండి, ఎక్కువ విస్తీర్ణంతో సమతలంగా ఉన్న భూభాగాన్ని పీఠభూమి అంటారు. ఇవి మూడు వందల మీటర్లు అంతకంటే కొద్దిగా ఎత్తుగా ఉంటాయి. కొన్ని పీఠభూముల అంచులు నిట్రవాలుగా ఉంటాయి. ఇలాంటి వాటిని టేబుల్‌ లాండ్స్‌ (బల్లపరుపు భూములు) అని పిలుస్తారు. పీఠభూముల ద్వారా ప్రవహించే నదుల లోయలు లోతుగా ఉంటాయి. నదుల క్రమక్షయం వల్ల ఇవి ఖండిత పీఠభూములుగా ఏర్పడతాయి. ప్రపంచంలోని ఎత్తయిన పీఠభూములన్నీ పర్వత నిర్మాణ క్రియతో పాటే ఏర్పడ్డాయి.

 

పీఠభూములు మూడు విధాలుగా ఏర్పడతాయి.

1) పర్వత మాలోద్భవం (వరుసగా ఆవిర్భవించిన)తోపాటు ఏర్పడిన పీఠభూములు

2) అగ్నిపర్వత క్రియ వల్ల ఏర్పడిన పీఠభూములు

3) శిథిలం కాకుండా మిగిలిన పురాతన కఠిన శిలలతో ఏర్పడిన ఎత్తయిన పీఠభూములు

 

పర్వత మాలోద్భవంతోపాటు ఏర్పడిన పీఠభూములను మూడు రకాలుగా విభజించారు. 

 

ఎ) పర్వతాంతర పీఠభూములు: ఇవి పర్వతాలతో పరివేష్టితమైన పీఠభూములు. వీటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోని ఎత్తయిన పీఠభూములన్నీ పర్వతాల మధ్యలోనే ఉన్నాయి. ఇవి ముడుత పర్వతాల ఆవిర్భావంతోపాటు ఏర్పడ్డాయి.

ఉదా: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన, అతిపెద్దదైన టిబెట్‌ పీఠభూమి, పామీర్‌ పీఠభూములు (వీటినే ప్రపంచ పైకప్పులు అని పిలుస్తారు), బొలీవియా, మంగోలియా, మెక్సికో పీఠభూములు.

 

బి) గిరిపద పీఠభూములు: ఇవి ముడుత పర్వతాల ఆవిర్భావంతోపాటు పర్వత పాదాల వద్ద ఏర్పడ్డాయి. వీటికి ఒకవైపు పర్వతాలు, మరొకవైపు సముద్రాలు/ సరస్సులు/ మైదానాలు సరిహద్దులుగా ఉంటాయి. అందుకే వీటిని సరిహద్దు పీఠభూములు అని కూడా పిలుస్తారు.

ఉదా: అమెరికాలోని కొలరాడో పీఠభూమి. ఇది రాఖీ పర్వత పాదాలకు, బేసిన్‌ రేంజ్‌ ప్రావిన్స్‌కు మధ్య ఉంది. అర్జెంటీనాలోని పెటగోనియా పీఠభూమి.

 

సి) కలశ పీఠభూములు: భూఅంతర్భాగంలోని ఊర్థ్వ బలాల వల్ల భూపటలంలోని కొంత భాగం కలశాకారంగా పైకి లేవడంతో ఇవి ఏర్పడతాయి.

ఉదా: అమెరికాలోని అర్కన్సాస్, ఓజార్క్‌ పీఠభూములు. 

 

అగ్నిపర్వత క్రియ వల్ల ఏర్పడిన పీఠభూములు రెండు రకాలు.

 

లావా పీఠభూములు: భూగర్భంలోని క్షార లావా భూఉపరితలానికి ప్రవహించి కుప్పగా పోగై విశాలమైన, ఎత్తయిన పీఠభూమిగా ఏర్పడుతుంది. 

ఉదా: భారతదేశంలోని దక్కన్‌ పీఠభూమి, అమెరికాలోని స్నేక్‌రివర్, కొలంబియా పీఠభూమి, మాల్వా పీఠభూమి.

 

ఖండాంతర్గత పీఠభూములు: భూ అంతర్భాగంలోని ఊర్థ్వ బలాల వల్ల మైదాన ప్రాంతం లేదా సముద్రభూతలం పైకి నెట్టుకురావడం వల్ల ఇవి ఏర్పడతాయి. దక్షిణాఫ్రికాలోని పీఠభూములు దీనికి ఉదాహరణ.

శిథిలం కాకుండా మిగిలిన పురాతన కఠిన శిలలతో ఏర్పడిన ఎత్తయిన పీఠభూములు.

 

అవశిష్ట పీఠభూములు: భూఉపరితలంపై కొండలు, గుట్టలు వికోషీకరణ బలాల శైథిల్య, క్రమక్షయ చర్యలతో శిథిలమై ఈ పీఠభూములుగా పరిణామం చెందుతాయి. 

ఉదా: మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న బుందేల్‌ఖండ్‌ పీఠభూమి, మధ్యప్రదేశ్‌ ఈశాన్య సరిహద్దులోని బాగల్‌ఖండ్‌ పీఠభూమి (పన్నావజ్రపు గనులకు ప్రసిద్ధి), ఝార్ఖండ్‌లోని హజీరాబాద్, రాంచీ పీఠభూమి (కాపర్‌ నిల్వలకు ప్రసిద్ధి), కోడెర్మా పీఠభూమి (మైకా నిల్వలకు ప్రసిద్ధి), చోటానాగపూర్‌ పీఠభూమి (ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉంది. దీనినే రూర్‌ ఆఫ్‌ ఇండియా లేదా ఖనిజాల కాణాచి అని పిలుస్తారు).

 

రచయిత: సక్కరి జయకర్‌


 

Posted Date : 15-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌