• facebook
  • whatsapp
  • telegram

పూర్వచారిత్రక యుగం (ఆదిమ చరిత్ర)

ప్రాచీనకాలం నుంచి ప్రజలు సంతోషంగా జీవించడానికి చేసిన ప్రయత్నమే చరిత్ర.
* సాధారణంగా భూమి 100 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని భావిస్తున్నారు. భూమిపై మానవుల లాంటి జీవులు, వారి పూర్వీకులు 20 లక్షల సంవత్సరాల నుంచి 30 లక్షల సంవత్సరాల మధ్య కాలంలో నివసించేవారు.
* సుమారు 5 లక్షల సంవత్సరాల నుంచి మానవుడు సాగించిన జీవిత యాత్రను 'ఆదిమ చరిత్ర' అంటారు.
* ఈ పరిణామ క్రమంలో మానవ సాంస్కృతికాభివృద్ధి, చరిత్ర 10 వేల సంవత్సరాల పూర్వం నుంచే ప్రారంభమైంది.
* ప్రపంచ భౌతికాభివృద్ధిని వర్ణించడానికి 80 కి.మీ. కాగితాన్ని ఉపయోగిస్తే దానిలో మానవ పరిణామ ప్రగతి కేవలం 10 సెం.మీ. మాత్రమేనని, ఇది ప్రపంచ వయోపరిణామంలో 10 లక్షల భాగంలో ఒకవంతు అని వర్ణించారు.
* మానవుడు వివిధ కాలాల్లో పరిసరాలను తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకుని క్రమంగా అభివృద్ధి చెందాడు.

ప్రపంచ మానవ చరిత్రను మూడు విభాగాలుగా అధ్యయనం చేయవచ్చు
1) పూర్వచారిత్రక యుగం (ఆదిమ చరిత్ర): దీనికి లిఖిత ఆధారాలు లేవు. దీన్ని ప్రీ హిస్టరీ అంటారు.
2) సంధికాలపు చారిత్రక యుగం: దీన్ని ప్రోటోహిస్టరీ అంటారు. ఇది రెండు యుగాల మధ్య కాలం.
3) చారిత్రక యుగం (హిస్టారిక్ పీరియడ్): ఇది రెండు యుగాల మధ్యకాలం. దీనికి లిఖిత ఆధారాలు ఉన్నాయి.
చారిత్రక యుగాన్ని 3 భాగాలుగా అధ్యయనం చేస్తారు.
1) ప్రాచీన యుగం
2) మధ్యయుగం
3) ఆధునిక యుగం
* పూర్వ చారిత్రకయుగాన్ని తెలుసుకోవడానికి లిఖిత ఆధారాలు లేవు. దీని గురించి తెలుసుకోవడానికి 'పురావస్తు శాస్త్రం', 'మానవశాస్త్రం' తోడ్పడతాయి.


పురావస్తు శాస్త్రం
      ప్రాచీనకాలంలో మానవుడు నివసించిన ప్రాంతాలు, ఉపయోగించిన పరికరాలు, వస్తువులు, మట్టితో కప్పబడి మరుగునపడ్డాయి. పురాతత్వవేత్తలు ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి, అక్కడ లభించిన వస్తువులను పరిశీలించి, పరిశోధించి ఆ కాలంనాటి మానవుల జీవిత విశేషాలను తెలుసుకున్నారు. ఈ తవ్వకాలను 'ఉత్ఖాతనం' అని, వీటి గురించి వివరించే శాస్త్రాన్ని 'పురావస్తు శాస్త్రం' అని అంటారు.
* ఈజిప్టులోని పిరమిడ్లు, అప్పటి ప్రాచీన నాగరికత విశేషాలను ఉత్ఖాతనాల వల్ల అధ్యయనం చేశారు.
* భారతదేశంలోని పంజాబ్, సింధు రాష్ట్రాల్లో హరప్పా, మొహంజొదారో తవ్వకాలను అధ్యయనం చేసిన జాన్ మార్షల్ 5000 సంవత్సరాల పూర్వపు సింధులోయ నాగరికత గురించి తెలుసుకున్నారు.
* ఉత్ఖాతనల అధ్యయనం వల్ల సింధు నాగరికత ఈజిప్టు, మెసపటోమియా నాగరికతలకు సమకాలీనమైందని తెలిసింది.
* మన రాష్ట్రంలోని నాగార్జున కొండ ప్రాంతంలో లభించిన ఉత్ఖాతనాలు క్రీ.శ.3వ శతాబ్దం నుంచి ఇక్ష్వాకుల కాలంనాటి నాగరికతను తెలుసుకోవడానికి తోడ్పడ్డాయి. ఈ విధంగా పురావస్తు శాస్త్రం ప్రాచీన కాలపు రచనకు దోహదపడుతోంది.


మానవశాస్త్రం
* మానవశాస్త్రం ప్రాచీన రచనకు ఎంతో తోడ్పడుతోంది. వివిధ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో వేలాది సంవత్సరాల కిందట జీవించిన మానవుల అస్తిపంజరాలు, పుర్రెలు, ఎముకలు, దంతాలు బయటపడ్డాయి.
* భూమి పైపొరల్లో లభించిన శిలాజాలు, గతంలో మానవుడు ఉపయోగించిన పరికరాలు, పనిముట్లు ఆదిమ మానవ చరిత్రకు అతివిలువైన సాక్ష్యాధారాలు.
* వీటిలో ఉన్న రేడియో కార్బన్ల నిష్పత్తి కాల నిర్ణయానికి ఉపయోగపడుతోంది. మార్టిమర్‌వీలర్ వీటిని వస్తువులుగా కాకుండా 'ప్రాచీన కాలపు మనుషులు'గా వర్ణించాడు. ఈ విధంగా మానవశాస్త్రం అప్పటి చరిత్ర రచనకు మూలమైంది.


భూమిపై ప్రాణకోటి ఆవిర్భావం:
* భూమి సూర్యుడి నుంచి విడిపోయి భూగ్రహంగా ఏర్పడింది. అనేక భౌతిక మార్పులు చెందిన తర్వాత భూమి ప్రాణకోటికి నివాసయోగ్యమైంది.
* భూమి మీద మొదట 'లార్వా', ఆ తర్వాత 'ప్లాజిలెట్ట' జీవులు ఆవిర్భవించాయి. కాలక్రమంగా వృక్షజాతి, జంతుజాలం, చివరిగా మానవుడు ఉద్భవించాడు.


మానవ జీవిత పరిణామ దశలు:
1) ఆస్ట్రోఫిథికస్
2) రామాఫిథికస్
3) హోమో ఎరక్టస్
4) నియన్‌డెర్తల్ నరుడు
ఈ జాతులు మనిషి లాంటి ప్రాణులు. క్రీ.పూ.1,40,000 - 4000కు పూర్వం జీవిస్తుండేవి.
5) హోమోసేపియన్లు ఆధునిక మానవులకు పూర్వీకులు. వీరిని క్రోమాగ్నన్‌లు అని కూడా అంటారు.
* 20 వేల సంవత్సరాలకు పూర్వం జీవించిన వీరు కొన్ని రకాల పనిముట్లను ఉపయోగించేవారు. గుహ చిత్రాలను గీసేవారు. ఈ చిత్రాలు వారి అనుభవాలను తెలియజేసేవి.
* మానవుడి నాగరికత పరిణామ క్రమం రాతియుగంతో ఆరంభమైంది. ఈ యుగాన్ని 3 దశలుగా విభజించారు.


పాతరాతియుగం
* క్రీ.పూ.2,50,000 - 1000 వరకు (సుమారుగా) ఈ యుగంలో మానవుడు గొడ్డళ్లు, కత్తులు, రాతి పనిముట్లు తయారుచేసుకొని, ఆహారం, ఆత్మరక్షణకు ఉపయోగించేవాడు. గుహల్లో నివసిస్తూ జంతవుల చర్మంతో శరీరాన్ని కప్పుకునేవాడు.
* ఆహారం కోసం వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవాడు. అనుభవాలను చిత్రాలుగా పెద్ద రాళ్లపై గీసేవాడు.


మధ్య శిలాయుగం
* పాతరాతి, కొత్తరాతి యుగానికి మధ్య కాలాన్ని 'మధ్య శిలాయుగం' అంటారు. ఈ యుగంలో వాతావరణం మార్పు చెందడం వల్ల ఆలోచన, విచక్షణా జ్ఞానం పెరిగింది. ఈ యుగంలోనే మానవుడు నిప్పును కనుక్కున్నాడు.
* మధ్య శిలాయుగంలో మానవులు చిన్న సామాజిక వర్గాల్లో నివసించేవారు. ఫలితంగా సాంఘిక సంబంధాలు బలపడటంతో పాటు సాంఘిక నిబంధనలు ఏర్పడ్డాయి.


కొత్తరాతియుగం
* ఈ యుగంలో పరికరాలు, పనిముట్ల నాణ్యత పెరిగింది. మానవుడు ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకుని వ్యవసాయం, పశుపోషణను ప్రారంభించాడు.
* మట్టి కుండలను కాల్చడం రసాయనిక శాస్త్ర అధ్యయనానికి తొలిమెట్టుగా పరిణమించింది. చేనేత కళ ఆరంభమై క్రమంగా భౌతిక శాస్త్ర అభ్యసనానికి పునాది వేసింది. పత్తిపంటను పండించడం వృక్ష శాస్త్ర అభ్యసనానికి దారితీసింది. వస్తుమార్పిడి పద్ధతి వ్యాపార, వాణిజ్యాలకు మార్గదర్శకమైంది.
* ఈ విధంగా ఆధునిక శాస్త్ర విజ్ఞానాల ఆరంభం కొత్తరాతియుగంలోనే జరిగింది. మానవుడు ఆహార సేకరణ, వేటగాడి దశ నుంచి స్థిరజీవన దశకు చేరుకున్నాడు.


ఆర్థిక జీవనం
* ఈ కాలంలో వ్యవసాయంతో పాటు పశుపోషణ ఉండటం వల్ల మిశ్రమ ఆర్థిక విధానం రూపుదిద్దుకుంది. ఆర్థిక జీవన నిర్మాణంలో స్త్రీ, పురుషులు సమాన పాత్రలు పోషించారు.
* 'చక్రాన్ని' ఆవిష్కరించడం వల్ల ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.


మతవిశ్వాసాలు
* ప్రజలు ఇతర దేవతలతో పాటు భూమిని కూడా పూజించేవారు. పూజారులను దేవతలు, మానవులకు మధ్యవర్తులుగా భావించేవారు. ఆనాటి ప్రజలు పునర్జన్మ ఉంటుందని విశ్వసించేవారు.


రాజకీయ జీవనం
* ఈ కాలంలో ప్రజలను శత్రువుల బారి నుంచి కాపాడటం పరిపాలకుల విధి. వారికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని విశ్వసించేవారు.
* ఈ యుగంలో జరిగిన పరిశోధనలు, ఆవిష్కరణలు ప్రజలకు అన్ని రంగాల్లో ప్రయోగాత్మకమైన అనుభవాలను కలిగించాయి. ఫలితంగా ఇది శాస్త్రీయ విజ్ఞాన ప్రగతికి ఆరంభదశగా రూపొందింది.


కాంస్యయుగపు నాగరికత
* సంస్కృతి, నాగరికత అనే పదాలను విభిన్న అర్థాల్లోనే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయ పదాలుగా కూడా ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో 'నాగరికత' అంటే సమాజంపై సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి ప్రభావమని, 'సంస్కృతి' అంటే లలితకళలు, తాత్వికచింతనలు అని భావిస్తున్నారు.
* అందుకే సంస్కృతి మానవులంతా కలిసి ఏర్పాటుచేసిందని, నాగరికత కొన్ని సమాజాలు మాత్రమే సాధించిన అంశమని తెలిపారు.
* నాగరికత అంటే నగరాల్లో నివసించే సమాజ ప్రగతి. నగరాలు అభివృద్ధి చెందిన చోట నాగరికతలు వెలిశాయని అంటారు.
* పురావస్తు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడినట్లుగా క్రీ.పూ.4000 సంవత్సరాల సమీప దశను 'రాగి తగరపు యుగం' అంటారు. నాగరికతా వ్యాప్తికి మూలమైన లోహయుగపు ప్రగతిలో ఈ యుగాన్ని మొదటి దశగా వర్ణించారు.
* ఈ యుగం రాగి, తగరం వాడుకతో ఆరంభమై కంచు, ఇనుము వాడుకలోకి వచ్చే వరకు కొనసాగింది. దీన్ని మానవ చరిత్రలో ప్రముఖ ఘట్టంగా పేర్కొన్నారు.


కాంస్య యుగం
* భాష, రాత సాధనాల ఆవిర్భావంతో మొదలైన నాగరికత నగర సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు మూలమైంది. జనాభా పెరుగుదలతో పరిసరాల గురించి ఏర్పడిన పరిజ్ఞానం వల్ల ఆర్థికాభివృద్ధి జరిగింది. దీన్నే 'నాగరికతా విప్లవం' అంటారు.
* రాయడం, నేర్చుకోవడం తెలిసిన తర్వాతనే పంచాంగం, భూగోళశాస్త్రం లాంటి విజ్ఞానశాస్త్రాలు రూపొందాయి.


ప్రాచీన నాగరికతలు
* ప్రాచీన నాగరికతలన్నీ సాధారణంగా నదీ లోయల్లోనే పుట్టాయి. ప్రపంచంలోని ముఖ్య నాగరికతలైన మెసపటోమియా, ఈజిప్టు, సింధు నాగరికతలు నదీ లోయల్లోనే వ్యాపించాయి.
* ఈ నాగరికతలు ఇంచుమించుగా క్రీ.పూ.3000 సంవత్సరాల ప్రాంతంలో ఏర్పడి మానవ జీవితాన్ని వ్యవస్థీకరించడానికి దోహదం చేశాయి. ఈ సమయంలోనే ప్రపంచమంతటా లోహం వాడుకలోకి వచ్చింది.
* ఈ నాగరికతాభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచమంతటా విస్తరించింది.
* అటవీ సంపద, భూమిపై సహజ వనరులు పెరగడం వల్ల ఆదాయం పెరిగింది. దీంతోపాటు విరామ సమయం కూడా పెరగడం వల్ల, ప్రజలు కొత్త భావాలు, ఆవిష్కరణలను ప్రవేశపెట్టగలిగారు. ఈ విధంగా ప్రపంచమంతటా సాంస్కృతికాభివృద్ధి జరిగింది.


నదీలోయ నాగరికతలు
* మానవ నాగరికత టైగ్రిస్, యూప్రెటిస్ నదీలోయలైన మెసపటోమియాలో ఆరంభమైంది. ఈజిప్టు, సింధు నాగరికతలు మెసపటోమియాలోని నాగరికత కంటే భిన్నంగా ఉన్నప్పటికీ, అనేక సామాన్యమైన అంశాలు ఉండటం వల్ల ఇవి ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేశాయి.
* ప్రపంచంలోని అన్ని దేశాలు, జాతులు సమష్టిగా కృషి చేసినందువల్లే ప్రపంచ నాగరికత అభివృద్ధి చెందింది.
* ఈ యుగంలో మానవుడు సాధించిన సాంస్కృతికాభివృద్ధి ఆధునిక ప్రపంచ నాగరికతలో అంతర్భాగమైంది.
* శాస్త్రీయ, సాంకేతిక, వైజ్ఞానిక పరిశోధనల వల్ల క్రమేపి సమాజంలోని మానవులంతా సమానులే అనే భావన ఏర్పడింది. ఇది ప్రజాస్వామ్య విధానాలకు మార్గదర్శకమై ఆధునిక యుగానికి నాందిపలికింది.


సామాజిక లక్షణాలు
* ఈ యుగంలో వేటగాళ్ల దశ అంతమై వ్యవస్థీకృత జీవనం మొదలైంది. రాత నేర్చుకోవడం వల్ల సమాజంలో స్థిరత్వం ఏర్పడి మానవుడి ఆలోచనలకు ఒక క్రమరూపం ఏర్పడింది. రాతికి బదులు లోహాన్ని ఉపయోగించడం వల్ల వృత్తి నైపుణ్యం పెరిగింది.
* గ్రామాల స్వయంసమృద్ధి అంతరించి పట్టణాలపై ఆధారపడాల్సి వచ్చింది. కొత్తగా కనుక్కున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల పరిశ్రమలు ఏర్పడ్డాయి.
* వ్యవసాయంలో లోహాన్ని ఉపయోగించి మెరుగైన నాగళ్లను వాడటం వల్ల పంటల సాగు విస్తృతమైంది.
* నదీమైదానాల్లో నివసించే ప్రజలు వరదలను నివారించడానికి అడ్డుకట్టలు నిర్మించారు. వరదల సమయంపై అవగాహన ఏర్పడటం వల్ల వ్యవసాయ రుతువులను గుర్తించగలిగారు.
* 'చక్రం' ఉపయోగించడం వల్ల సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.


రాజకీయ మతజీవనంపై నూతన సాంకేతిక పరిజ్ఞానపు ప్రభావం
* లోహయుగం నాటికి అభివృద్ధి చెందిన మెసపటోమియా, ఇరాన్ ప్రాంతాల వారు ఇతరులపై పెత్తనం చేసేవారు. యుద్ధంలో ఓడిపోయిన వారిని బానిసలుగా చేసుకుని తమ ఆర్థికాభివృద్ధికి ఉపయోగించేవారు.
* నగర శిథిలాల్లో లభించిన అవశేషాలను పరిశీలించడం వల్ల, ఆ కాలంలో నగరపాలక సంస్థలుండేవని తెలుస్తోంది. వర్తకులు, భూస్వాముల సంబంధాలు వేర్వేరుగా ఉండేవి.
* మెసపటోమియా పట్టణ దేవాలయాలు పరిపాలన కేంద్రాలుగా 'పటెశి' అని పిలవబడే పూజారుల ఆధిపత్యంలో ఉండేవి. సుమేరియా పట్టణాల్లో ఈ కేంద్రాలను 'జిగ్గురాత్' అని పిలిచేవారు. నగరాన్ని రక్షించడం, ఆర్థిక సంపదను సమాజంలోని వివిధ వర్గాలకు పంచడం లాంటివి అప్పటి ప్రభుత్వ పనుల్లో ముఖ్యమైనవి.


మత జీవనం
* ఈ యుగంలోనే 'పూజారులు' అనే ప్రత్యేక వర్గం ఏర్పడింది. ముద్రలు, పచ్చబొట్లు మహిమగలవని మానవులు విశ్వసించేవారు. దేవతల చిహ్నాలను ఆయా దేవాలయాల్లో ప్రదర్శించేవారు. ప్రకృతి శక్తులను జయించడానికి మానవుడు చేసిన ప్రయత్నాలన్నీ మత విశ్వాసాల నుంచి గ్రహించినవే.
* 'దేవుడు' నగర జీవనానికి ప్రధానమైనవాడు. పూజారి ద్వారానే ఆయన ప్రజలకు సన్నిహితుడౌతాడు అని నమ్మేవారు. దేవుడికి ఆహార పానీయాలు సమకూర్చడానికే మానవుడు, సుమేరియన్లు సృష్టించబడ్డారని నమ్మేవారు.
* ఈజిప్టు సుమేరియా దేశాల్లో సూర్యుడు ప్రధాన దైవం. సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని మానవుడి జనన మరణాలతో పోల్చి చూస్తూ మానవులకు పునర్జన్మ ఉంటుందని అక్కడి ప్రజలు విశ్వసించేవారు.
* సమాధుల్లో లభించిన వస్తువుల ఆధారంగా అప్పటి ప్రజలకు మరణానంతరం మరో జీవితం ఉంటుందనే నమ్మకం ఉండేదని స్పష్టమవుతోంది. నగరానికి బయట శ్మశానం ఉండేదని, అనేక పూజా కార్యక్రమాలతో అంత్యక్రియలు నిర్వహించేవారని తెలుస్తోంది.


భాషాకళల విశిష్టత
* ఈజిప్ట్‌లోని పిరమిడ్ల నిర్మాణాలను పరిశీలిస్తే కళాకారుల పనితనంతో పాటు వారిపై మత విశ్వాసాల ప్రభావం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
* రాజుల సమాధుల్లో స్త్రీలను, ధనధాన్యాలను, విలాస వస్తువులను పూడ్చిపెట్టేవారు. ఈ వస్తువులు చనిపోయిన రాజుకు ఉపయోగపడతాయని వారి నమ్మకం. కాంస్య యుగంలో ఆవిష్కృతమైన లిపి ప్రభావం వల్ల గణితం, భూగోళ, వైద్యశాస్త్రాల అభివృద్ధికి మార్గం సుగమమైంది.
* ప్రాచీన కాలంనాటి ఈజిప్షియన్లు కాలాన్ని సంవత్సరాలు, నెలలు, వారాలుగా విభజించి క్యాలెండర్‌ను రూపొందించారు. రోజుకు 24 గంటల కాలమానాన్ని నిర్ణయించారు. వారు పిరమిడ్ల నిర్మాణంలో కచ్చితమైన కొలతలను పాటించారు. ఈ ప్రయోగాలన్నీ తక్షణ అవసరాలకు మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తాయి.
* కాంస్యయుగంలో సాధించిన పరిజ్ఞానం అడవులను పెంచడానికి యుద్ధాల్లో విజయం సాధించడానికి, వ్యాపారం కొనసాగించడానికి ఉపయోగపడింది. వీటిని గమనిస్తే మానవుడు భౌతిక వనరులను, తనకు తన సంతానానికి, సుఖ సంతోషాలను కలిగించడానికి ఉపయోగించేవారు.
* ఆ కాలంనాటి శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన పదాలన్నీ మత విశ్వాసాల నుంచే ఏర్పడ్డాయి.
* కాంస్యయుగంలో వివిధ ప్రాంతాల్లోని మానవులు సాధించిన సాంకేతిక పరిజ్ఞానంలో సామాన్యమైన లక్షణాలు ఉండటం సమైక్య రాజకీయ వ్యవస్థల ఏర్పాటుకు దోహదంచేసింది.

Posted Date : 14-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు