• facebook
  • whatsapp
  • telegram

చరిత్ర పూర్వయుగం

తెలంగాణలో ఆదిమ సంస్కృతి ఆనవాళ్లు!

మానవ పరిణామ క్రమంలో ఆదిమ మానవుడు సంఘజీవిగా మారి, నాగరిక లక్షణాలను సంతరించుకున్న దశలన్నింటికీ తెలంగాణ ప్రాంతమూ ఒక వేదికగా నిలిచింది. నిర్దిష్టమైన లిపి ఏర్పడక ముందున్న చరిత్ర పూర్వయుగ కాలంలో మనిషి ఆర్థిక, సామాజిక కార్యకలాపాలు, సామూహిక జీవన విధానం, ఆవాసాలు, జంతుపోషణ, చిత్రకళ, కర్మకాండలకు సంబంధించిన  సాక్ష్యాలు ఇక్కడ కూడా బయటపడ్డాయి. ఉట్నూరులో వెలుగు   చూసిన బూడిద కుప్పలు, హైదరాబాద్‌ చుట్టు పక్కల కనిపించే రాక్షసగూళ్లు తదితరాలన్నీ ఆనాటి గుర్తులే. ఈ పరిణామ దశ గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. వేల సంవత్సరాల కిందట తెలంగాణలో విస్తరించిన ఆదిమ సంస్కృతి, ఇతర ప్రాంతాలతో ఉన్న సామీప్యత, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రాతియుగపు ఆనవాళ్లు వెలుగు చూసిన ప్రాంతాలు, వాటి విశేషాలపై అవగాహన కలిగి ఉండాలి.

తెలంగాణలో కొన్ని లక్షల ఏళ్లనాటి మానవ మనుగడ బయటపడింది. మానవ జీవితాన్ని, నాగరికతలను అనుసరించి పలు యుగాలుగా చరిత్రకారులు విభజించారు. మొదటి ఆదిమానవుడి కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మానవ పరిణామ దశలను వివరించారు.

కొత్త రాతియుగంలో పనిముట్ల సాంకేతిక పురోగతి: కొత్త రాతియుగంలో ముఖ్యంగా త్రిభుజాకారపు గొడ్డళ్లు, బాడిసలు, బడిసెల రాళ్లు, మద్దురాళ్లు, కలవాలు, పొత్రాలు, చెర్ట్‌తో చేసిన బ్లేడు, అర్ధచంద్రాకారపు పనిముట్లు వాడుకలో ఉండేవి. ఈ యుగం చివరి దశలో బ్లేడు పనిముట్ల పరిశ్రమతోపాటు రాగి, కంచు వస్తువులు మహబూబ్‌నగర్‌లోని చిన్నమారూరు, చాగటూరులో వెలుగు చూశాయి. మీసాల రాగి ఖడ్గాలు మెదక్‌ జిల్లాలోని రిమ్మనగూడెంలో లభించాయి. ఈ రాగి నిల్వల సంస్కృతి గంగానది తీర ప్రాంతం నుంచి తెలంగాణకు విస్తరించిందని భావిస్తున్నారు. ఆ రాగి కత్తులకు ఇరాన్‌లో దొరికిన రాగి కత్తులకు పోలిక ఉండటం ఆధారంగా అక్కడి ప్రజలే ఇక్కడికి తరలి వచ్చారని అల్చిన్‌ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఈ ఇరు ప్రాంతాల వస్తు సంస్కృతి, ఖనన సంస్కృతుల మధ్య కూడా పోలికలున్నాయని వివరించాడు. కొత్త రాతి యుగంలో మట్టిపాత్రలను ప్రధానంగా చేతితోనే చేసేవారు. బూడిద లేదా లేత గోధుమ రంగు పాత్రలు  ఉండేవి. ఈ పాత్రలకు నలుపు లేదా ఎరుపు రంగుతో నునుపు చేసిన పూత ఉండేది. ఎక్కువగా కెంపు రంగు అలంకారం కనిపించేది. చిల్లుల జాడీలు, కుండలు కూడా ఈ యుగంలో వాడుకలో ఉండేవి. వాటి ఉపరితలాలు ముతకగా ఉండేవి. ఇలాంటి కుండలకు తొలి సింధూ నాగరికతకు చెందిన కుండలకు దగ్గరి పోలికలున్నాయి. అదే విధంగా బెలూచిస్థాన్, తొలి హరప్పా నాగరికతకు చెందిన కుండలతో కూడా పోలికలు కనిపించాయి. కొన్నిచోట్ల బూడిదరంగు లేదా పసుపు రంగు పాత్రలను చక్రం మీద తయారు చేశారు. వీటికి మహారాష్ట్రలోని తామ్ర శిలాయుగానికి చెందిన జోర్వే పాత్రలతో సామ్యత ఉంది (జోర్వే పాత్రలు క్రీ.పూ. 1400-1050 మధ్యకాలానికి చెందినవి).

ఆర్థిక వ్యవస్థ లక్షణాలు: కొత్తరాతి యుగపు ఆర్థిక వ్యవస్థ మొత్తం పశుపోషణ, వ్యవసాయం మీద ఆధారపడింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఉట్నూరు లాంటి ప్రదేశాల్లో వెలుగు చూసిన బూడిద కుప్పలు, కొన్ని అడవి జంతువుల దొడ్లు /పశువులను మందగా ఉంచిన కొట్టాలు అందుకు నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి. పశువుల పేడ కుప్పలను ఒక కర్మకాండ మాదిరిగా దహనం చేయడం వల్ల బూడిద కుప్పలేర్పడ్డాయని అల్చిన్‌ చెప్పాడు. తవ్వకాల్లో బయటపడిన అవశేషాల ద్వారా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలు, పిట్టలను ఆనాటి మానవులు మచ్చిక చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని కొత్త రాతియుగపు ఆవాసాల్లో పశుపోషణ ప్రాధాన్యాన్ని తెలియజేసే మూపురపు ఎద్దుల టెర్రకోట (కాల్చిన మట్టి) బొమ్మలు, రాతి బొమ్మలు, రాతి చిత్రలేఖనాలు వెలుగు చూశాయి. ఈ యుగపు రంగు చిత్రాలు, రేఖాచిత్రాలు నేటి కరీంనగర్‌ జిల్లాలోని బూదగవి, వరంగల్‌ జిల్లాలోని పాండవుల గుట్ట, నల్గొండ జిల్లాలోని రాచకొండ, ఖమ్మం జిల్లాలోని నల్లముడి, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దుప్పడ్‌గట్టు, దొంగలగట్టు తదితర ప్రాంతాల్లో వెలుగు చూశాయి. ఈ యుగపు ఎద్దుల చిత్రాలు వంపు తిరిగిన కొమ్ములు, మూపురాలు, గంగడోలు, పొడవాటి శరీరాలతో అందంగా కనిపిస్తాయి. వాటి పక్కన బాణాలు పట్టుకున్న మనుషులు కనిపిస్తారు. కొన్నిచోట్ల మూపురపు ఎద్దులు ఢీకొంటున్నట్లు చిత్రించారు. కొన్ని కొత్త రాతియుగపు స్థిర ఆవాసాల్లో లభించిన గింజల అవశేషాల ఆధారంగా ఆ కాలం ప్రజలు ప్రధానంగా జొన్నలు, రాగులు, పప్పులు (పెసలు, మినుములు, ఉలవలు), వడ్లు పండించేవారని తెలుస్తోంది. పంటలను ప్రధానంగా వర్షాధారంగానే పండించేవారు. కొత్త రాతియుగంలో చనిపోయిన వారి (శవం) తలను ఉత్తరం వైపుపెట్టి ఖననం చేసేవారు. నాగార్జునకొండ ఆవాస ప్రాంతంలో ఇద్దరు శిశువులను కుండలో సమాధి చేసిన ఆధారాలు వెలుగు చూశాయి. తెలంగాణలో పలుచోట్ల కొత్తరాతియుగపు ప్రాంతాలు అయో యుగంలోకి చొచ్చుకొచ్చాయి.

రాక్షస గూళ్ల యుగం-పరిణామ ప్రక్రియలో కనిపించిన మార్పులు:  క్రీ.పూ.1500 నుంచి క్రీ.పూ. 300 సంవత్సరాల మధ్య తెలంగాణలోని ప్రజలు, చనిపోయినవారి అస్థిపంజరాలను మట్టి శవపేటికలోగాని, రాతిగూడులో గాని పెట్టి పూడ్చి ఆ గూడు చుట్టూ పెద్ద పెద్ద రాళ్లను వలయాకారంలో నిలిపేవారు. కొన్నిచోట్ల గూడు నిర్మాణంలో వాడిన రాళ్లు కూడా భారీ పరిమాణంలో ఉన్నాయి. అందుకే ఈ యుగాన్ని రాక్షస గూళ్ల యుగం లేదా పెద్దరాతి యుగమని వ్యవహరించారు. ఈ యుగంలో మొదటిసారిగా ఇనుప వస్తువులను విరివిగా వాడినందుకు అయో యుగమని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు వీటిని పాండవుల గూళ్లు, వీర్లపాడులు అని పిలుస్తారు.

రాక్షస గూళ్ల నిర్మాణం, రకాలు, ప్రయోజనం: మనిషి చనిపోయినప్పటికీ ఆత్మ జీవించి ఉంటుందని, అది గ్రామాల్లోకి వచ్చి ప్రజలకు హాని చేయకుండా సమాధి వరకే పరిమితమై ఉండటానికి, చనిపోయిన వ్యక్తి బతికున్నప్పుడు వాడిన పనిముట్లతోపాటు అతడికి ఇష్టమైన ఆహార పదార్థాలను కుండలో పెట్టి సమాధిలో నిక్షిప్తం చేసేవారు. చాలా సందర్భాల్లో చనిపోయిన వ్యక్తికి ప్రియమైన పెంపుడు జంతువులను కూడా అతడితోపాటు ఖననం చేసేవారు. ఇలాంటి రాక్షసగూళ్లు ప్రపంచమంతా కనిపించినప్పటికీ ఐరోపా, ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. భారతదేశమంతటా ఇవి ఉన్నప్పటికీ దక్కన్‌లోనే ఎక్కువగా కనిపిస్తాయి. తెలంగాణాలో గుట్టలపై ఉండే సమతల ప్రదేశాల్లోనూ, లోయల్లోనూ, నీటివనరుల దగ్గర ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ప్రకారం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆవరణలో ఉన్న ఒక రాక్షస గూడు సమాధి దేశంలోనే మొదటిదని తేలింది. దానిలో దొరికిన ఆహారపు గింజలు 4,250 ఏళ్ల క్రితం నాటివని శాస్త్రీయ పరీక్షలు నిర్ధారించాయి. రాక్షస గూళ్లు కొన్ని అప్పటికప్పుడు నిర్మించినవి కాగా, మరికొన్ని మనిషి బతికున్నప్పుడే నిర్మించుకున్నవి. ఈ యుగపు సమాధులను మొదటి తరహా సమాధులు, రెండో తరహా సమాధులని విభజించవచ్చు. చనిపోయిన మనుషులను అలాగే సమాధి చేస్తే మొదటి తరహా సమాధులని, అలాకాకుండా శవాలను కాల్చిన లేదా దహనం చేసిన తర్వాత మిలిగిన అవశేషాలను (ఎముకలను) సమాధి చేస్తే వాటిని రెండో  తరహా సమాధులని నిర్వచించవచ్చు.
 

నమూనా ప్రశ్నలు


1. త్రిభుజాకారపు గొడ్డళ్లు ఏ యుగంలో ఉండేవి?

ఎ) మధ్యశిలా యుగం    బి) కొత్తరాతి యుగం 

సి) కాంస్య యుగం  డి) అయో యుగం 


2. బ్లేడు పనిముట్ల పరిశ్రమ ఏ ప్రాంతంలో ఉండేది?

ఎ) మెదక్‌   బి) బోధన్‌   సి) చాగటూరు   డి) కోటిలింగాల


3. మీసాల రాగి ఖడ్గాలు ఏ ప్రాంతంలో లభించాయి?

ఎ) మారుటూరు   బి) చాగల్లు  సి) మారూరు   డి) రిమ్మనగూడెం


4. రాగి నిల్వల సంస్కృతి తెలంగాణకు ఏ ప్రాంతం నుంచి వ్యాపించింది?

ఎ) గంగానది తీర ప్రాంతం   బి) కావేరి నది ప్రాంతం

సి) మధ్యదరా ప్రాంతం   డి) సింధూనది ప్రాంతం


5. తెలంగాణలో లభించిన రాగి ఖడ్గాలకు ఏ దేశంలో లభించిన రాగి ఖడ్గాలకు దగ్గరి పోలిక ఉంది?

ఎ) ఇరాక్‌     బి) పాలస్తీనా   సి) పర్షియా    డి) ఇరాన్‌


6. తెలంగాణలో లభించిన కుండలకు, ఏ నాగరికతకు చెందిన కుండలకు పోలిక ఉంది?

ఎ) హరప్పా నాగరికత    బి) ఈజిప్టు నాగరికత

సి) నైలునది నాగరికత    డి) మెసపటోమియా నాగరికత


7. ఏ ప్రదేశంలో బూడిద కుప్పలు లభించాయి?

ఎ) మారుటూరు  బి) రిమ్మనగూడెం సి) చాగల్లు డి) ఉట్నూరు

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి 
 

Posted Date : 24-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌