• facebook
  • whatsapp
  • telegram

ఆవరణ వ్యవస్థ విధులు

ఆ గొలుసులో ఉత్పత్తిదారులు.. విచ్ఛిన్నకారులు!

  భూమండలంపై ప్రతి జీవి ఆహారానికి మూలాధారం సూర్యుడి నుంచి లభించే శక్తి ప్రవాహం. దీని ఆధారంగానే పత్రహరితం తయారై శాకాహార, మాంసాహార జీవులకు ఆహారం లభిస్తుంది. దీనిలో భాగంగా శిలావరణం, వాతావరణం, జలావరణాల మధ్య చక్రీయ అనుసంధానంతో ఆవరణ వ్యవస్థ కొన్ని ముఖ్య విధులను నిర్వహిస్తోంది. పర్యావరణం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వాటిపై అవగాహన కలిగి ఉండాలి.

 

  ప్రతి జీవికి నిరంతరం మనుగడ కల్పించడమే ఆవరణ వ్యవస్థ ప్రధాన విధి. ఆవరణ వ్యవస్థలోని జీవ, నిర్జీవ అనుఘటకాల మధ్య జరిగే చర్య, ప్రతి చర్యలను ఆవరణ వ్యవస్థ విధి నిర్వహణ అంటారు. దీని సమగ్ర విధి నిర్వహణ కింది అంశాల ద్వారా జరుగుతుంది.

 

ఉత్పాదన 

ఒక ప్రమాణ కాలం, వైశాల్యంలో ఆవరణ వ్యవస్థ నుంచి శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఉత్పత్తిదారులు (వృక్షజాతులు) తయారుచేసిన జీవ ద్రవ్యరాశి ఉత్పత్తి రేటును ఉత్పాదన అంటారు. వృక్ష, జంతు జాతుల ఉత్పాదనను ‘ఉత్పాదన ఆవరణ శాస్త్రం’ (ప్రొడక్షన్‌ ఎకాలజీ) అంటారు. వనరుల యాజమాన్యం దృష్ట్యా ఉత్పాదన శాస్త్ర విజ్ఞానానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.

  మానవుడి సంక్షేమం కోసం పర్యావరణం, తత్సంబంధమైన సంరక్షణా పద్ధతులను పెంపొందించడానికి ఇంటర్నేషనల్‌ బయోలాజికల్‌ ప్రోగ్రాం ఆధ్వర్యంలో సంస్థాగతంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. మొత్తం ఉత్పాదనకు కావాల్సిన కర్బన పదార్థాల పునరాభివృద్ధి రేటును టర్నోవర్‌ అంటారు.

టర్నోవర్‌ విలువ (T) = Bmax - Bmin

Bmax = సంవత్సరంలో గరిష్ఠ జీవ ద్రవ్యరాశి రేటు

Bmin = సంవత్సరంలో కనిష్ఠ జీవ ద్రవ్యరాశి రేటు

 

ప్రాథమిక ఉత్పాదన: ఒక నిర్ణీత ఆవరణ వ్యవస్థలోని ఉత్పత్తిదారులు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారుచేసుకునే పిండి పదార్థాలకు వినియోగపడిన సౌర వికిరణ శక్తి విలువల రేటును ప్రాథమిక ఉత్పాదన అంటారు.

 

ద్వితీయ ఉత్పాదన: నిర్ణీత ఆవరణ వ్యవస్థ నుంచి అభివృద్ధి చెందిన వినియోగదారుల పోషక స్థాయిల్లోని శక్తి విలువల రేటును ద్వితీయ ఉత్పాదన అంటారు.

 

శక్తి ప్రవాహం 

సూర్యుడి నుంచి భూమి వైపు ప్రసరించే సౌరశక్తిని సూర్యపుటం అంటారు. దీనిలో 51% మాత్రమే భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ శక్తిని జీవ, నిర్జీవ అనుఘటకాల ద్వారా శిలావరణం, వాతావరణం, జలావరణం మధ్య జీవ, భూరసాయన వలయాల ద్వారా చక్రీయంగా థర్మోడైనమిక్‌ సూత్రాలకు అనుగుణంగా బదిలీ చేయడం ఆవరణ వ్యవస్థ మరొక ముఖ్య విధి.

 

విచ్ఛిన్నత విధి 

ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారులుగా పిలిచే బ్యాక్టీరియా, శిలీంద్రాలు లాంటి సూక్ష్మజీవులు వృక్ష, జంతు జీవ జాతుల మృత కళేబరాలు, విసర్జకాలను విచ్ఛిన్నం లేదా కుళ్లిపోయేలా చేస్తాయి. ఈ విచ్ఛిన్నత వల్ల సంక్లిష్ట కర్బన పదార్థాలు సరళ అకర్బన పదార్థాలుగా మారి భూవాతావరణంలో విలీనమవుతాయి. ఆవరణ వ్యవస్థ విధుల్లో ఇది చాలా ముఖ్యమైంది.

 

జీవావరణ అనుక్రమం 

ఏదైనా ఆవరణ వ్యవస్థలో కాలం, ప్రాంతాన్ని బట్టి శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఒక జీవ సమాజ స్థానంలో మరొక జీవ సమాజం ఆక్రమించడాన్ని జీవావరణ అనుక్రమం అంటారు. ఇది నెమ్మదిగా, అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ చివరకు స్థిరమైన జీవ సమాజం ఉన్న ఒక సమాజ ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. దీన్ని పరాకాష్ఠ జీవ సమాజం అంటారు. 

* జీవావరణ అనుక్రమం కింది దశల్లో జరుగుతుంది.

 

అనాచ్ఛాదన: నేల స్థితి, జీవ సంబంధ, శీతోష్ణ కారకాల వల్ల ఒక భౌగోళిక ప్రాంతంలో అనేక మార్పులు వస్తాయి. దీని కారణంగా ఒకప్పటి వృక్ష, జంతు జాతులు నశించి ఆ ప్రదేశం క్రమంగా ఎలాంటి జీవజాతులు లేని బంజరు భూమిగా మారడాన్ని అనాచ్ఛాదనం అంటారు.

 

దురాక్రమణ: గాలి, నీటి ద్వారా కొన్ని విత్తనాలు, సిద్ధ బీజాలు లాంటివి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొట్టుకుపోతాయి. కొన్ని జంతు జాతులు కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లి స్థిరపడతాయి. దీన్నే దురాక్రమణ అంటారు.

 

జాతుల మధ్య పోరాటం: ఒక ప్రాంతంలో జాతుల జనాభా పెరగడం వల్ల ఆవాస, ఆహార కొరత ఏర్పడుతుంది. దీనివల్ల జాతుల మధ్య పోరాటం జరిగి చివరకు కొన్ని జాతులు అక్కడి నుంచి తరలిపోవాల్సి వస్తుంది.

 

ప్రతిస్పందన: ఒక ప్రాంతంలో ఆదిపత్యం సాధించి స్థిరపడిన జాతులు పర్యావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం లేదా పర్యావరణానికి అనుకూలంగా తమ విధులను మార్చుకుంటూ మనుగడ సాగించడాన్ని ప్రతిస్పందన అంటారు.

 

ఆహార గొలుసు  

ఆవరణ వ్యవస్థలో ఒక జీవి మరొక జీవిని తినడం, ఆ జీవి ఇంకో జీవికి ఆహారంగా మారడం జరుగుతుంది. ఈ విధంగా శక్తి, ఆహార పదార్థాలు ఉత్పత్తిదారుల నుంచి పరాకాష్ఠ వినియోగదారులకు రేఖీయంగా బదిలీకావడం వల్ల ఏర్పడిన నిర్మాణాన్నే ఆహార గొలుసు అంటారు. ఇది విచ్ఛిన్నకారులతో అంతమవుతుంది. ఆహార గొలుసులో మొదటి పోషక స్థాయిలో ఉత్పత్తిదారులు, అంతిమ పోషక స్థాయిలో విచ్ఛిన్నకారులు ఉంటారు.

 

గడ్డిమైదాన ఆహార గొలుసు: గడ్డి మిడత కప్ప పాము గద్ద 

 

ఆకురాల్చే అడవుల ఆహార గొలుసు: గడ్డి కుందేలు నక్క తోడేలు ® పులులు/సింహాలు 

 

చిట్టడవి ఆవరణ ఆహార గొలుసు: గడ్డి కుందేలు గద్ద  

 

మానవ నిర్మిత ఆహార గొలుసు: గడ్డి గొర్రెలు/మేకలు మానవులు 

 

మంచినీటి ఆహార గొలుసు: వృక్ష ప్లవకాలు జంతు ప్లవకాలు చిన్న చేపలు పెద్ద చేపలు కొండలు

 

సముద్ర ఆవరణ ఆహార గొలుసు: వృక్ష ప్లవకాలు జంతు ప్లవకాలు చిన్న చేపలు పెద్ద చేపలు తిమింగలాలు/మొసళ్లు  

 

పరాన్నజీవి ఆహార గొలుసు: గడ్డి గొర్రె మానవుడు గుండ్రటి పురుగు 

 

పూతికాహారపు ఆహార గొలుసు: మృత కళేబరాలు బ్యాక్టీరియా/శిలీంధ్రాలు ఉడుతలు/కోళ్లు గద్దలు 

 

ఆహారపు వల: జీవులు వాటి ఆవాసాలు, ఆహారపు వనరులను కోల్పోయినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆహారాన్ని పొందే ప్రయత్నం చేస్తాయి. దీనిలో భాగంగా ఆవరణ వ్యవస్థలోని ఆహారపు గొలుసులను ఆక్రమిస్తాయి. ఇలాంటప్పుడు ఆహారపు గొలుసులు ఒకదాంతో మరొకటి అనుసంధానించగా ఏర్పడిన వల లాంటి క్రియాత్మక నిర్మాణాన్ని ఆహారపు వల లేదా ఆహారపు జాలం అంటారు.

 

మాదిరి ప్రశ్నలు 

 

1. ఆహారపు గొలుసులు దేంతో అంతమవుతాయి?

1) ప్రాథమిక ఉత్పత్తిదారులు   2) ద్వితీయ ఉత్పత్తిదారులు

3) పోషకాహారులు         4) విచ్ఛిన్నకారులు

 

2. ఆవరణ శాస్త్ర అధ్యయనంలో అతిచిన్న ప్రమాణం?

1) జీవి   2) జాతి  3) జనాభా  4) సమూహం

 

3. ఒకదాంతో మరొకటి అనుసంధానించిన ఒకటి కంటే ఎక్కువ ఆహార గొలుసుల సముదాయాన్ని ఏమని పిలుస్తారు?

1) ఆహార గొలుసు   2) ఆహార పిరమిడ్‌   

3) శక్తి పిరమిడ్‌     4) ఆహారపు జాలం

 

4. గడ్డి గొర్రె మానవుడు గుడ్రటి పురుగు (అస్కారిస్‌) దేన్ని తెలియజేస్తుంది? 

1) పూతికాహారపు ఆహార గొలుసు    2) పరాన్నజీవి ఆహార గొలుసు

3) మేత ఆహార గొలుసు           4) పైవన్నీ 

 

5. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు లాంటి వైపరీత్యాల వల్ల అక్కడి జీవులు నశించి నూతన జీవుల ఆవిర్భావం జరగడాన్ని ఏమంటారు?

1) అనాచ్ఛాదన    2) దురాక్రమణ   3) జీవావరణ అనుక్రమం    4) ప్రతిస్పందన

 

6. మానవుడు భూమి మీద శాశ్వతంగా నివసించని ప్రాంతాలను ఏమంటారు?

1) ఏక్యుమన్‌   2) ఎకోటైప్‌   3) పయోనీర్స్‌    4) ఆడ్‌మచ్‌

 

7. ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ ఏ విధంగా ఉంటుంది?

1) సమాంతరంగా    2) రేఖీయంగా   

3) చక్రీయంగా      4) జిగ్‌జాగ్‌గా

 

8. కిందివాటిలో సర్వభక్ష జీవి అని దేన్ని పిలుస్తారు?

1) పులి   2) దుప్పి   3) కాకి  4) తిమింగలం

 

9. ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారుల పాత్ర పోషించేవి?

1) వైరస్‌లు    2) బ్యాక్టీరియాలు    3) శిలీంధ్రాలు 4) 1, 2  

 

10. జలావరణ వ్యవస్థలో సుర్యకాంతి ప్రసరించని ప్రాంతం?

1) ప్రొఫండల్‌ మండలం    2) యూఫోటిక్‌ మండలం

3) జీరార్క్‌ మండలం       4) హైడార్క్‌ మండలం

 

సమాధానాలు 

1-4; 2-1; 3-4; 4-2; 5-3; 6-1; 7-2; 8-3; 9-2; 10-1.

 

రచయిత: జల్లు సద్గుణ రావు

Posted Date : 17-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌