• facebook
  • whatsapp
  • telegram

టెరిడోఫైట్స్‌

లక్షణాలు

టెరిడోఫైట్స్‌ నాళికా (వాస్క్యులర్‌) కణజాలాన్ని కలిగి ఉంటాయి. ఇది మొక్క అంతటా నీరు, పోషకాలను రవాణా చేసే ప్రత్యేక కణజాలం.

* టెరిడోఫైట్స్‌ విత్తనాలను ఉత్పత్తి చేయవు. అవి సిద్ధబీజాల ద్వారా పునరుత్పత్తి జరుపుకుంటాయి.

టెరిడోఫైట్స్‌ నిజమైన వేర్లు, కాండం, ఆకులతో బాగా భిన్నమైన మొక్కల శరీరాకృతిని కలిగి ఉంటాయి.

టెరిడోఫైట్స్‌ స్పొరాంజియా అని పిలిచే నిర్మాణాల్లో సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయి.

స్పొరాంజియా తరచుగా స్పోరోఫిల్స్‌ అనే ప్రత్యేక ఆకులపై కనిపిస్తుంది.

ఇవి ఏకాంతర జీవిత దశలను చూపే జీవిత చక్రాన్ని కలిగి ఉంటాయి. ఇందులో రెండు విభిన్న తరాలు ఉంటాయి. 

అవి: 

1. స్పోరోఫైట్‌    

2. గామిటోఫైట్‌. 

స్పోరోఫైట్‌: ఇది ఆధిపత్య తరం. బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది. 

గామిటోఫైట్‌: ఇది చిన్నది, తక్కువ ప్రస్ఫుటమైన తరం. ఇది గామెట్‌లను ఉత్పత్తి చేస్తుంది.

అనేక టెరిడోఫైట్‌లలో స్పోరోఫైట్, గామిటోఫైట్‌ తరాల పరిమాణం లేదా రూపంలో ఒకేలా ఉండవు. దీన్నే తరాల హెటిరోమార్ఫిక్‌ ఆల్టర్నేషన్‌ అంటారు. యువ టెరిడోఫైట్‌ ఆకులు తరచూ సిర్సినేట్‌ వెర్నేషన్‌ను కలిగి ఉంటాయి. అంటే ఆకు ఫిడేల్‌హెడ్‌ లాగా గట్టిగా చుట్టి ఉంటుంది.

టెరిడోఫైట్‌లు అడవులు, చిత్తడి నేలలు, పర్వతాలు మొదలైన ఆవాసాల్లో నివసించే విభిన్న మొక్కల సమూహాం. 

కొన్ని టెరిడోఫైట్స్‌ ఇతర మొక్కలపై పెరుగుతాయి. వీటిని ఎపిఫైట్స్‌ అంటారు. మరికొన్ని జలచరాలు.


ఉదాహరణలు

ఫెర్న్‌లు: బ్రాకెన్‌ ఫెర్న్, మైడెన్‌హెయిర్‌ ఫెర్న్, బోస్టన్‌ ఫెర్న్‌

హార్స్‌ టైల్స్‌: ఎక్టోకార్పస్‌

క్లబ్‌మోసెస్‌: లైకోపోడియం, సెలాజినెల్లా


ఆర్థిక ప్రాముఖ్యత - అనువర్తనాలు


టెరిడోఫైట్స్‌ అనేవి ఫెర్న్‌లు, హార్స్‌టెయిల్‌లు, క్లబ్‌మోస్‌లను కలిగి ఉన్న మొక్కల సమూహం. అవి యాంజియోస్పెర్మ్స్‌ (పుష్పించే మొక్కలు) లాంటి కొన్ని ఇతర మొక్కల సమూహాల్లా ఆర్థికంగా ముఖ్యమైనవి కావు. అయినప్పటికీ వీటికి కొంత ఆర్థిక ప్రాముఖ్యత, కొన్ని అనువర్తనాలు ఉన్నాయి. అవి:


అలంకరణకు వాడే మొక్కలు: అనేక ఫెర్న్‌ జాతులను అలంకార సాధనాలుగా వాడతారు. వాటి రంగు, ఆకృతి అందంగా ఉండటమే ఇందుకు కారణం.

 *  ల్యాండ్‌స్కేపింగ్, ఇండోర్‌ గార్డెనింగ్‌లో వీటిని ఉపయోగిస్తారు. 

ఉదా: బోస్టన్‌ ఫెర్న్‌ (నెఫ్రోలెపిస్‌ ఎక్సల్టాటా), మైడెన్‌ హెయిర్‌ఫెర్న్‌ (అడియంటం ఎస్‌పీపీ) అనేవి ప్రసిద్ధ అలంకార మొక్కలు.


ఔషధ ఉపయోగాలు: కొన్ని టెరిడోఫైట్‌లను సంప్రదాయ ఔషధ తయారీలో వాడతారు. 

ఉదా: డ్రయోప్టెరిస్‌ ఫిలిక్స్‌ - మాస్‌ (మగ ఫెర్న్‌). దీని రైజోమ్‌లను వివిధ రుగ్మతలకు చికిత్స చేసేందుకు మూలికా వైద్యంలో ఉపయోగిస్తారు.


ఎరోషన్‌ కంట్రోల్‌: ఫెర్న్‌లు విస్తృతమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. కొండ లేదా చెదిరిన ప్రాంతాల్లోని నేల స్థిరీకరణ, కోతను నియంత్రించడానికి ఆ ప్రదేశాల్లో వీటిని పెంచుతారు.


వంటల్లో: కొన్ని సంస్కృతుల్లో వివిధ తినదగిన ఫెర్న్‌ల రెమ్మలను ఆహారంగా తీసుకుంటారు. ఉదా: ఫిడేల్‌హెడ్స్, కొన్ని ఫెర్న్‌ జాతులకు చెందిన కాయిల్డ్, ఫ్రాండ్‌లు. వీటిని కొన్ని ప్రాంతాల్లో రుచికరమైన ఆహారంగా పరిగణిస్తారు.


బయోఇండికేటర్లు: కొన్ని టెరిడోఫైట్లు పర్యావరణ కాలుష్యం, మార్పులకు సున్నితంగా ఉంటాయి. గాలి నాణ్యత, పర్యావరణ పరిస్థితులపై ఇవి అంతర్‌దృష్టులను అందిస్తాయి.


హార్టీకల్చర్, హైబ్రిడేషన్‌: టెరిడోఫైట్‌లను ఉద్యాన మొక్కల పెంపకంలో వాడతారు. కొత్త సాగుకు అవసరమైన లక్షణాలతో రూపొందించడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇతర టెరిడోఫైట్స్‌ కంటే ఫెర్న్‌లతో ఇది సర్వసాధారణం.


శిలాజ ఇంధనాలు: జెయింట్‌ హార్స్‌టైల్‌ (కలామైట్స్‌) లాంటి కొన్ని టెరిడోఫైట్‌లు బొగ్గు నిక్షేపాల ఏర్పాటుకు దోహదపడతాయి. ఇవి ప్రస్తుతం ఆర్థికంగా ఉపయోగకరమైనవి కానప్పటికీ, దీనికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది.


ఫార్మాస్యూటికల్‌ పరిశోధన: టెరిడోఫైట్స్‌ నుంచి సేకరించిన కొన్ని సమ్మేళనాలను ఔషధాలను పరీక్షించడానికి, మందుల్లో ఉపయోగిస్తున్నారు. 

ఉదా: కొన్ని ఫెర్న్‌ల నుంచి సేకరించిన సమ్మేళనాలకు క్యాన్సర్‌ నిరోధక లక్షణాలు ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.


మాదిరి ప్రశ్నలు


1. టెరిడోఫైట్స్‌ను కింది ఏ విధంగా పిలుస్తారు?

ఎ) విత్తన మొక్కలు      బి) వాస్క్యులర్‌ క్రిప్టోగ్రామ్‌లు

సి) పుష్పించే మొక్కలు    డి) జిమ్నోస్పెర్మ్‌లు
2. టెరిడోఫైట్‌లు వేటి ద్వారా పునరుత్పత్తి జరుపుకుంటాయి?

ఎ) విత్తనాలు    బి) సిద్ధబీజాలు  

సి) ఎ, బి    డి) ఏదీకాదు
3. టెరిడోఫైట్స్‌లో ఆధిపత్య తరం ఏది?

ఎ) స్పోరోఫైట్‌    బి) గామిటోఫైట్‌  

సి) ఎ, బి     డి) ఏదీకాదు
4. టెరిడోఫైట్స్‌లో క్షయకరణ విభజన కింది దీనిలో సంభవిస్తుంది?

ఎ) స్పొరాంజియా     బి) గామెటాంజియా 

సి) ఎ, బి     డి) ఏదీకాదు
5. టెరిడోఫైట్స్‌లోని ప్రోథాలస్‌ వేటిని సూచిస్తుంది?

ఎ) స్పొరోఫైట్‌     బి) గామిటోఫైట్‌  

సి) ఎ, బి     డి) ఏదీకాదు
6. టెరిడోఫైట్స్‌ అనేవి బ్రయోఫైట్‌ల నుంచి భిన్నంగా ఉంటాయి. దానికి కారణం?

ఎ) వాస్క్యులర్‌ కణజాలం     బి) సిద్ధబీజం

సి) ఎ, బి          డి) ఏదీకాదు
7. టెరిడోఫైట్స్‌లోని సోరై సాధారణంగా కింది ఏ రకానికి చెందినవి?

ఎ) యూస్పొరాంజియేట్‌     బి) లెప్టోస్పొరాంగజియేట్‌

సి) ఎ, బి         డి) ఏదీకాదు
8. టెరిడోఫైట్స్‌లోని స్పొరాంజియా సాధారణంగా ఎక్కడ అమరి ఉంటుంది?

ఎ) సోరై      బి) స్ట్రోబిలి    

సి) ఎ, బి      డి) ఏదీకాదు
9. టెరిడోఫైట్స్‌లో ఏ మొక్కలో హెటిరోస్పోరి అత్యంత సాధారణ రకంగా కనిపిస్తుంది?

ఎ) ఐసోయెట్స్‌         బి) సెరాటోప్టెరిస్‌

సి) సెలాజినెల్లా         డి) మార్సిలియా


సమాధానాలు

1-బి, 2-బి, 3-ఎ, 4-సి, 5-బి, 6-సి, 7-బి, 8-ఎ, 9-సి.


 

Posted Date : 01-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌