• facebook
  • whatsapp
  • telegram

మతం

''మత ఆవిర్భావానికి సంబంధించిన అనేక సిద్ధాంతాలున్నాయి. అందరూ ఏకీభవించే మత ఆవిర్భావ సిద్ధాంతం ఏదీ లేనప్పటికీ ఆదిమ మతం ప్రకృతి ఆరాధనతో మొదలైంది. ప్రకృతి వల్ల కలిగే భయాలు లేదా మద్దతు ఆధారంగా మతప్రక్రియలు ప్రారంభమయ్యాయి.''
మతం.. మన సమాజంలో ఒక ప్రాధాన్య అంశం. భారతదేశం లౌకిక దేశం.. మతస్వేచ్ఛను హక్కుగా ప్రసాదించింది రాజ్యాంగం. ఇలాంటి మతానికి సంబంధించిన భావనలు, రాజ్యాంగంలోని అంశాలపై అవగాహన అవసరం. టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు సామాజిక మినహాయింపు / వెలి (సోషల్ ఎక్స్‌క్లూజన్) విభాగంలో మతం ఒక అధ్యయన అంశం.
మానవుడి ఆధ్యాత్మిక ఆలోచనలకు సంబంధించిన సాంఘిక నిర్మితే మతం. ఇది అలౌకిక అంశాల పరిజ్ఞానానికి సంబంధించింది. దైవారాధనలోని వైవిధ్యాలే మతాల మధ్య విభిన్నతకూ కారణం. పుట్టుక, చావు, పాపం, పుణ్యం వంటి అనేక అంతుచిక్కని అంశాలకు ప్రత్యేక పరిష్కార మార్గాలను అందిస్తుంది. వ్యవస్థీకృతమైన విశ్వాసాలు, సాంస్కృతిక వ్యవస్థలు, విశ్వం, జీవి పుట్టుక, కొనసాగింపు వంటి అంశాలతో ముడిపడిన సాంఘిక రూపం మతం.

 

లౌకిక దేశం మనది..
రాజ్యాంగ ప్రవేశికలో భారత దేశాన్ని 'లౌకిక' దేశం అని స్పష్టంగా పేర్కొన్నారు. అందువల్ల భారతదేశానికి అధికార మతం అంటూ ఏదీ లేదు. రాజ్యాంగంలో మతస్వేచ్ఛను ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించడం వల్ల ప్రజల మనోభావాలకు 'మతం' కోణంలో పూర్తి మద్దతు ఇచ్చిందనే చెప్పవచ్చు.
ఆర్టికల్-25: మతస్వేచ్ఛకు పూర్తి మద్దతిస్తున్న ఆర్టికల్ ఇది. రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న లౌకికత్వానికి మూల పునాది ఈ ఆర్టికల్ అని చెప్పవచ్చు. 'ఒక వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధం మేరకు ఏ మతాన్నైనా విశ్వసించవచ్చు, ఆరాధించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు' అని పేర్కొంది. మతం విషయంలో రాజ్యం ప్రామాణికత ఏమిటో చెప్పినట్లయింది.

ఆర్టికల్-26: 'మత సంస్థలు తమ మతం కోసం ఆస్తిపాస్తులు వంటి ప్రత్యేక ఏర్పాట్ల'కు రాజ్యాంగం అంగీకరిస్తుంది.
ఆర్టికల్-27: మత సంస్థల ఆదాయంపై పన్నులు విధించకూడదు. తద్వారా ప్రభుత్వం మతాల వల్ల వివక్ష, అసమానత్వం ప్రదర్శించి నియంత్రించకుండా చర్యలు తీసుకున్నారు.
ఆర్టికల్-28: ప్రజలకు విద్య అవసరాన్ని గుర్తిస్తూ.. విద్యను పొందే క్రమంలో 'మతం' ఒక అవరోధం కాకూడదనే భావనతో మతం ఆధారంగా విద్యాలయాల్లో ఎవరి ప్రవేశాన్నీ నిషేధించకూడదు అని ఈ ఆర్టికల్‌లో స్పష్టంగా పేర్కొనడం ద్వారా ప్రజల మనోభావాలకు రాజ్యాంగం పెద్దపీట వేసింది.

ఆర్టికల్-29, 30: వీటి ద్వారా 'సాంస్కృతిక విద్యా హక్కు'ను ప్రాథమిక హక్కుగా గుర్తించారు. సాంస్కృతిక పరిరక్షణ కోణంలో అల్పసంఖ్యాక వర్గాల మతాన్ని గౌరవించారు.
వివాదాలు
ఆచారాలు - సంప్రదాయాలు
మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలు, ఇతర కారణాల వల్ల మొత్తం జనాభాలో హిందువుల వృద్ధిరేటు తగ్గింది. ముస్లింల వృద్ధిరేటు పెరిగింది.
2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాభా వృద్ధిరేటు 16.8 శాతంగా ఉంది. ముస్లింల జనాభాలో ఇది 24.6 శాతంగా నమోదైంది.
మత నిబంధనలు, రాజకీయ లక్ష్యాల నేపథ్యంలో.. ఒక మతవర్గం తమ జనాభాను నియంత్రించడం లేదనే వివాదం తలెత్తింది. దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జనాభా నియంత్రణ అనేది అన్ని మతాల లక్ష్యంగా ఉండాలని భావిస్తుండటంతో.. తాజాగా ప్రకటించిన ఈ వృద్ధిరేట్లు వివాదానికి మూలకారణంగా నిలిచాయి.
మైనార్టీలంటే ఎవరు?
మైనార్టీల నిర్వచనంపై గతంలో సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పటికీ.. ఇప్పటికీ దీనిపై స్పష్టత లేదు. రాజ్యాంగంలో మైనార్టీల రక్షణ, అభివృద్ధి చర్యలకు నిర్దేశాలున్నాయి. మైనార్టీలుగా ఎవరిని పరిగణించాలనే విషయంలో సరైన ప్రామాణికత లోపించింది. మతం కోణంలో మైనార్టీల సంరక్షణకు రాజ్యాంగంలోని 25 నుంచి 30 ప్రకరణలు ఉపకరించాయి. భాషా ప్రాతిపదిక మైనార్టీలకు రక్షణల గురించి ఆర్టికల్ 350 (ఎ)లో ప్రస్తావించారు.

'మైనార్టీ' అనే ప్రాతిపదికను 'హిందూయేతర' అనే కోణంలో చూస్తూ పాలన నిర్ణయాలు కొనసాగడం కూడా విమర్శలకు తావిస్తోంది. 'మైనార్టీల' పేరుతో ఒక సామాజిక వర్గం మాత్రమే అధిక ప్రయోజనాలు పొందుతోందనే విమర్శ కూడా వివాదంగా ఉంది.


మత మార్పిడులు
హిందూ సామాజిక చట్రంలోని కుల వివక్ష, మరికొన్ని సామాజిక కారణాల వల్ల 'మత మార్పిడులు' కనిపిస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్-25 ప్రకారం అంతరాత్మ ప్రబోధం మేరకు మతమార్పిడి రాజ్యాంగబద్ధమే అని రెవరెండ్ ఫ్రాన్సిస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే మత మార్పిడులు 'బాహ్య ప్రలోభాల' ద్వారా జరగకూడదని స్పష్టం చేసింది.
భారతదేశంలో ప్రధానంగా మతమార్పిడులు హిందూమతం నుంచి క్రైస్తవ, ఇస్లాం మతాలకు జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మతం వైపు ఈ మార్పిడులు అధికంగా జరుగుతున్నాయి. ఫలితంగా హిందూమతం దాడులకు గురవుతోందనే అభిప్రాయం హిందూ అతివాదులు, సనాతనవాదుల్లో ఏర్పడింది.


కారణాలు..
* బలహీన వర్గాల్లోని పేదరికం.. ప్రత్యేకించి షెడ్యూల్డ్ కులస్థులు, అగ్రవర్ణాల్లోని పేదలు మతం మార్చుకుంటే వచ్చే బాహ్య ప్రయోజనాల పట్ల ఆకర్షితులవుతున్నారు.
* హిందూ సామాజిక చట్రంలోని కుల వివక్ష కూడా మత మార్పిడులకు కారణం. కులవ్యవస్థ చివరికి ఆధ్యాత్మిక విషయాల్లో కూడా తమకు సరైన మద్దతు ఇవ్వడంలేదని భావించి కొందరు మతమార్పిడుల వైపు దృష్టి సారిస్తున్నారు.
* అగ్రకులాల్లోని కొంతమందిలో పెరిగిన హేతుబద్ధత.. సొంత మతంలోని లోపాలను గమనించి మతమార్పిడి వైపు మొగ్గు చూపుతున్నారు.
* కుటుంబ వ్యవస్థలోని వివక్ష కూడా మహిళలను మతమార్పిడి వైపు దృష్టి సారించేలా చేస్తోంది. మధ్యయుగ కాలంలో భక్తి ఉద్యమం వైపు మొగ్గు చూపినట్లే ఆధునిక కాలంలో మతమార్పిడి వైపు ఆసక్తి చూపుతున్నారు.
* బ్రిటిష్ వారి కాలం నుంచి సేవాతత్పరతను ప్రదర్శిస్తూ.. ఇతర మతస్థులను ఆకర్షించడం ద్వారా క్రైస్తవ మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయి.
* తమ ప్రత్యేకతను ప్రదర్శించేందుకు, తమ మతంలో ఇతరుల కంటే విభిన్నతని ప్రదర్శించేందుకు కుటుంబాలు, కులాలవారీగా మత మార్పిడులు జరిగాయి.
* రాజ్యంగ బద్ధంగా, చట్టబద్ధంగా అనుకూలత ఉండటం వల్ల కూడా మతమార్పిడులు సులభమయ్యాయి.
* కొన్ని మత సంస్థలు నేరుగా ఇతర మతాలను లక్ష్యంగా చేసుకుని వాటిలోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రచారం చేయడం వల్ల కూడా మత మార్పిడులు భారీగా జరుగుతున్నాయి.
* ఉపాధి కల్పన, జీవన భత్యాలు వంటి ఆకర్షణలు ఇస్తున్న మతాలు మతమార్పిడులుకు కారణం అవుతున్నాయి.


తెలంగాణ ప్రభుత్వ నిబద్ధత
తెలంగాణ ప్రభుత్వం లౌకికత్వానికి నిబద్ధత చూపిస్తూనే మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
1. స్వయంప్రతిపత్తి ఉన్న ఉర్దూ అకాడమీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉర్దూ అకాడమీ కింది విధులను నిర్వహిస్తుంది..
* ఉర్దూ భాష పరిరక్షణ, అభివృద్ధి.
* కంప్యూటర్ విద్యలో వృత్తిపరమైన శిక్షణ.
* ప్రభుత్వ పథకాలపై ముస్లిముల్లో చైతన్యం తీసుకురావడం.
* ఉర్దూ ఘర్, షాదీఖానాల ఏర్పాటు.
* కొత్త హజ్‌హౌస్‌ల ఏర్పాటు
2. అజ్మీర్‌లోని హజ్రత్‌బాబా మొయినుద్దిన్ చిస్తీ గలీబ్ నవాబ్ దర్గా వద్ద తెలంగాణ ముస్లింల కోసం రూ. 5 కోట్లతో ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు.
3. స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు. ముస్లిం విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను పెంచేందుకు ఈ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేస్తారు. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్పులు ఇవ్వడం లాంటి సహాయ కార్యక్రమాలను చేపడుతుంది. 2014-15 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 20 కోట్లు కేటాయించింది.
4. తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు. తెలంగాణ ప్రభుత్వం రూ. 10 కోట్లు కేటాయించింది. క్రైస్తవులకు విద్య, ఉపాధి విషయంలో తగిన మద్దతు ఇచ్చే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసింది.
5. వక్ఫ్‌బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కాంపిటెంట్ అథారిటీగా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యిద్ హుమర్ జలీల్, సీఈవోగా అసదుల్లాను నియమించింది.

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌