• facebook
  • whatsapp
  • telegram

పునరుత్పాదక శక్తి వనరులు

 

శిలాజ ఇంధనాలు, న్యూక్లియర్‌ శక్తి వనరులు ప్రపంచానికి సరిపడా విద్యుత్‌ శక్తిని అందిస్తున్నాయి. అయితే వీటి వల్ల పర్యావరణం కలుషితమవుతోంది. సంప్రదాయ ఇంధన వనరుల వల్ల హరితగృహవాయువులు, CO2 ఉద్గారాలు అధికమై, ‘గ్లోబల్‌ వార్మింగ్‌’కు దారితీస్తున్నాయి. 2030 నాటికి ప్రపంచ శక్తి వినియోగం రెట్టింపు అవుతుందని అంతర్జాతీయ శక్తి సంస్థ (International Energy Agency-IEA) అంచనా వేసింది. కాబట్టి పర్యావరణానికి హితమైన శక్తి వనరుల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. భారత్‌ 2030 నాటికి 450  GW పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది.


పునరుత్పాదక శక్తి ఆవశ్యకత
CO2, హరితగృహవాయువుల ఉద్గారాన్ని 2050 నాటికి 60 శాతం తగ్గించకపోతే మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. శిలాజ ఇంధన వనరులు కాలుష్య కారకాలే కాదు, పరిమితమైనవి కూడా. వీటికి ప్రత్యామ్నాయమే పునరుత్పాదక శక్తి వనరులు. ఇవి శక్తి అవసరాలను తీరుస్తూ, పర్యావరణాన్ని కాపాడతాయి. ఇందులో ప్రధానమైనవి సౌరశక్తి, పవనశక్తి, జలశక్తి, జీవశక్తి, జీవ ఇంధనాలు. పునరుత్పాదక శక్తి వనరులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వికేంద్రీకృత శక్తి సరఫరాను కల్పిస్తాయి. పేదరికం, శక్తి వనరుల కొరత, పర్యావరణ సంక్షోభాలను అధిగమించేందుకు ఇవి ఉపయోగపడతాయి. అన్ని నవీన యోగ్యకరమైన శక్తి వనరులను పర్యావరణ హితంగా భావించలేం. జీవ ద్రవ్యరాశి  (Biomass), అతిపెద్ద జలవిద్యుత్‌ ఉత్పాదక నీటి ఆనకట్టలు పర్యావరణానికి, అడవిలో నివసించే జీవులకు ముప్పును కలిగిస్తున్నాయి.


భారత్‌లో పునరుత్పాదక శక్తి
భారత్‌లో నూతన, పునరుత్పాదక శక్తి అంశాల పరిశీలన కోసం 1982లో సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగాన్ని (Department of Non-Conventional Energy Sources-DNES) ఏర్పాటుచేశారు. దీన్ని 1992లో  ప్రత్యేక మంత్రిత్వ శాఖగా మార్చి, సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖగా పేరు పెట్టారు. దీన్నే 2006, అక్టోబరులో మినిస్ట్రీ ఆఫ్‌ న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ  (MNRE)గా పేరు మార్చారు. దీని ఆధీనంలో మూడు స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు, రెండు పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్‌ సంస్థలు పనిచేస్తున్నాయి. అవి: 
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ (గురుగ్రామ్‌): సౌరశక్తి రంగంలో పరిశోధన, అభివృద్ధి విషయంలో ప్రధాన సాంకేతిక సంస్థ.
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ విండ్‌ ఎనర్జీ (చెన్నై): పవనశక్తి రంగంలో పరిశోధన, అభివృద్ధి (R&D) విషయంలో ప్రధాన సాంకేతిక సంస్థ.
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో ఎనర్జీ (కపుర్తలా-పంజాబ్‌): జీవశక్తి రంగంలో పరిశోధన, అభివృద్ధి సంస్థ.
* ఇండియన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (IREDA): ఇది పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేసే సంస్థలు, ఇతర ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చే నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థ.
* సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SECI): ఇది సోలార్‌ మిషన్, విండ్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌ల లక్ష్యాలను పూర్తి చేసేందుకు తోడ్పడే మంత్రిత్వశాఖ విభాగం.


పారిస్‌ ఒప్పందంలో భారత్‌ 
పారిస్‌ ఒప్పందంలో భాగంగా 2021-30 నాటికి భారతదేశ నిర్దేశిత పునరుత్పాదక లక్ష్యాలు (Nationally Determined Contributions) ఈ విధంగా ఉన్నాయి.
* 2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 2005 జాతీయాదాయం విలువలో 33 నుంచి 35 శాతానికి తగ్గించడం.
* 2030 నాటికి స్థాపిత విద్యుత్‌ ఉత్పాదనలో కనీసం 40 శాతం విద్యుత్‌ను శిలాజేతర ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేయాలి. దీనికోసం విదేశీ సాంకేతికతను ఉపయోగించడంతో పాటు అంతర్జాతీయంగా తక్కువ వడ్డీ రుణాలు పొందాలి. ఈ లక్ష్యాల సాధన కోసం భారత్‌ కృషిచేస్తోంది. ఇందులోభాగంగా మొత్తం స్థాపిత (Installed) విద్యుదుత్పాదక సామర్థ్యంలో 23.39% విద్యుత్‌ను పునరుత్పాదక శక్తి వనరుల నుంచే పొందుతోంది. 2020 ఫిబ్రవరి నాటికి ఈ రంగం ఉత్పత్తి చేసిన విద్యుత్‌ 368.98 గిగావాట్లు. ప్రపంచంలో స్థాపిత పునరుత్పాదక శక్తి వనరుల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. గత అయిదేళ్లలో పునరుత్పాదక శక్తి సామర్ధ్యం 226% పెరిగింది. భారత ప్రభుత్వ  నూతన పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక 2020-21 ప్రకారం భారత్‌ ప్రపంచ సౌర విద్యుత్‌ సామర్థ్యంలో అయిదో స్థానంలో ఉండగా, పవన విద్యుత్‌ సామర్థ్యంలో నాలుగో స్థానంలో ఉంది.


ప్రభుత్వ పథకాలు
* ప్రధానమంత్రి కిసాన్‌ ఉర్జా సురక్ష ఏవం ఉత్థాన్‌ మహాభియాన్‌ (PM-KUSUM):  కేంద్రం దీన్ని 2019లో ప్రవేశపెట్టింది. దేశంలోని సుమారు 3.5 మిలియన్ల రైతులకు సోలార్‌ ఆధారిత వ్యవసాయ పంపులను అందించడం దీని లక్ష్యం.
* రూఫ్‌ టాప్‌ సోలార్‌ (RTS) ప్రోగ్రాం: దీన్ని 2015 డిసెంబరు 30, 2019 ఫివ్రవరిలో రెండు దశల్లో ప్రారంభించారు. గృహాలు, సంస్థలు, ఇతర నిర్మాణాలపై సోలార్‌ ప్యానెల్స్‌ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రోత్సాహకాలు, సబ్సిడీలను అందిస్తారు. 2022 నాటికి 40,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పాదనను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
* సోలార్‌ పార్కులు: ఈ పథకం ద్వారా దేశంలోని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సోలార్‌ పార్కులను ఏర్పాటు చేయాలనుకునే వివిధ ఏజెన్సీలు, ప్రభుత్వాలు, ప్రయివేట్‌ రంగ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తారు. భారత్‌లో 40 గిగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
* గ్రీన్‌ ఎనర్జీ కారిడార్లు: ఈ ప్రాజెక్ట్‌లో రాష్ట్రాలను, రాష్ట్రాల్లోని పునరుత్పాదక విద్యుత్‌ వనరులను ట్రాన్స్‌మిషన్‌ లైన్ల ద్వారా అనుసంధానం చేస్తారు. దీన్ని 2015లో ప్రారంభించారు. ఇందులో భాగంగా అధిక పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఎనిమిది రాష్ట్రాలను 20,000 మెగావాట్ల విద్యుత్‌ ప్రసారాలకు అనుసంధానం చేస్తున్నారు. ఆ  రాష్ట్రాలు తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌.
* గ్రీనింగ్‌ ఆఫ్‌ ఐలాండ్స్‌: అండమాన్‌-నికోబార్, లక్షద్వీప్‌ దీవుల్లో 2021, మార్చి నాటికి 52 లీజూ సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఈ పథకం లక్ష్యం. ఇందులో భాగంగా వికేంద్రీకృత గ్రిడ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.


సౌరశక్తి
సూర్యుడు ఎన్నో శక్తి వనరులకు మూలం. సౌరశక్తిని మనం ఎన్నో విధాలా ఉపయోగిస్తున్నాం. ఒక గంట సమయంలో భూమిని చేరే సౌరశక్తి, భూమిపై నివసించే మొత్తం జనాభా ఒక సంవత్సర కాలంలో ఉపయోగించే మొత్తం శక్తి కంటే ఎక్కువ. సోలార్‌ లేదా ఫొటో వోల్టాయిక్‌ (PV) ఘటాలు (Cells) సూర్య కాంతిని నేరుగా విద్యుత్‌ శక్తిగా పరివర్తనం చెందిస్తాయి. వీటిని సిలికాన్‌తో తయారు చేస్తారు. సాధారణ సౌర కాంతి తీవ్రత 1 కిలోవాట్‌/ మీ.2. సౌర కాంతి కిరణాలను దర్పణాలు ఉపయోగించి ఒక చోట కేంద్రీకరించి వాటి తీవ్రతను 100 నుంచి 3000 రెట్లకు, ఉష్ణోగ్రతను 750-3500 డిగ్రీ సెల్సియస్‌ వరకు పెంచొచ్చు. ఇలాంటి పరికరాల సహాయంతో సౌరశక్తిని నీటిని, గాలిని వేడిచేయడానికి కూడా వాడతారు. సౌరశక్తి ద్వారా గాలి కాలుష్యం ఉండదు. కానీ సోలార్‌ ప్యానెల్స్‌ తయారీతో కొన్ని పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి.


సౌరశక్తిలో భారత్‌: భారత్‌ ఉష్ణమండల ప్రాంతంలో ఉండటం వల్ల సుమారు 250 నుంచి 300 రోజుల పాటు సూర్య కాంతి మన భూభాగాన్ని చేరుతుంది. భూమిని చేరే సౌరతీవ్రత ఏడాదికి సుమారు 1600 నుంచి 2,200 kWh/m2. సంవత్సర కాలంలో భారత్‌ ఉత్పత్తి చేసే విద్యుత్‌ సామర్థ్యం ఆరు వేల మిలియన్ల గిగావాట్‌ అవర్స్‌ (GWh). 2020 డిసెంబరు 31 నాటికి దేశంలో స్థాపిత సోలార్‌ విద్యుత్‌ సామర్థ్యం 37.46 GW. మరో 36.69 GW. సామర్థ్య పనులకు టెండర్లు ఖరారయ్యాయి. మరో 18.47 GW ల సామర్థ్య పనులకు టెండర్లను పిలిచారు. 2021, మార్చి నాటికి 40 GW. సామర్థ్యంతో పనిచేసే సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలు ప్రారంభం అవుతాయని 2020 చివర్లో ప్రభుత్వం అంచనా వేసింది. 2020 డిసెంబరు నాటికి  సోలార్‌ విద్యుత్‌ను (GW.లలో) అధికంగా ఉత్పత్తి చేస్తున్న మొదటి అయిదు రాష్ట్రాలు వరుసగా..
* కర్ణాటక (7,328)
* రాజస్థాన్‌ (5,389)
* తమిళనాడు (4,315)
* తెలంగాణ (3,936)
* గుజరాత్‌ (3,918)

 

నేషనల్‌ సోలార్‌ మిషన్‌
భారతదేశాన్ని సౌరశక్తి రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం 2010, జనవరి 11న ‘‘నేషనల్‌ సోలార్‌ మిషన్‌’’ పథకాన్ని ప్రారంభించింది. దీన్నే జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ సోలార్‌ మిషన్‌ (JNNSM) అని కూడా పిలుస్తారు. 2022 నాటికి మూడు దశల్లో 20 GW  సౌర విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. 2015 జులై 1న కేంద్రం ఈ లక్ష్యాన్ని 100  GW కి పెంచింది.


లక్ష్య సాధనకు భారత్‌ తీసుకున్న నిర్ణయాలు:
* డాబాలపై సోలార్‌ ప్యానళ్లను నిర్మించి, వాటి ద్వారా 40 GW విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం.
* గ్రిడ్‌కి అనుసంధానం చేయగల పెద్ద, మధ్యతరహా సోలార్‌ ప్రాజెక్టుల ద్వారా 60 GW విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం.
* 2017 నాటికి 15 మిలియన్‌ చదరపు మీటర్లు, 2022 నాటికి 20 మిలియన్‌ చదరపు మీటర్ల విస్తీర్ణంలో సోలార్‌ థర్మల్‌ కలెక్టర్లను ఏర్పాటు చేయడం.
* 2022 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 20 మిలియన్ల సోలార్‌ దీపాలను ఏర్పాటు చేయడం.


నిధులు:
* 100 GW సౌర విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యానికి అయ్యే ఖర్చు సుమారు రూ.ఆరు లక్షల కోట్లు. మొదటి దశలో భారత ప్రభుత్వం 15,050 కోట్ల రూపాయలను సబ్సిడీగా అందిస్తుంది.
* 90,000 కోట్ల రూపాయల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులను నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (NTPC) సహాయంతో అభివృద్ధి చేయనున్నారు.
* పెద్ద తరహా పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్స్‌  (PSU’s), ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్స్‌ (IPP’s) నుంచి మరిన్ని నిధులు పొందనున్నారు.


చేరుకున్న లక్ష్యాలు (Achievements): 
* 2010, మార్చి 31 నాటికి స్థాపిత సోలార్‌ కెపాసిటీ 161  MW. ఇది 2015, మార్చి 31 నాటికి 3,746  MW.
* సోలార్‌ ప్లాంట్‌లకు తగిన స్థలాన్ని ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 42 సోలార్‌ పార్క్‌లను ఏర్పాటుచేసింది. 2020 మార్చి 31 నాటికి దశాబ్ద కాలంలో సోలార్‌ సామర్థ్యం 161  MW నుంచి 37,627  MWకి పెరిగింది.
* డాబాలపై అమర్చిన సోలార్‌ ప్యానళ్ల సోలార్‌ విద్యుత్‌ సామర్థ్యం 2.1 GW.
* గ్రిడ్‌కు అనుసంధానమైన పెద్ద తరహా సోలార్‌ ఫొటో వోల్టాయిక్‌ ప్లాంట్‌లతో పాటు ప్రాంతీయ విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు ఆఫ్‌-గ్రిడ్‌ (Off-grid) చిన్నతరహా సోలార్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేశారు.
* 2015 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ఒక మిలియన్‌ సోలార్‌ విద్యుత్‌ దీపాలను విక్రయించారు.1,18,700 సోలార్‌ గృహ దీపాలను, 46,655 సోలార్‌ వీధిదీపాలను, 1.4 మిలియన్ల సోలార్‌ కుక్కర్లను పంపిణీ చేశారు.
* భారత్‌ ప్రతిపాదించిన ‘‘ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌’ (ISA) ప్రధాన కేంద్రం గురుగ్రామ్‌లో ఉంది. ఇందులో భారత్‌ ‘‘ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచ స్థాయి గ్రిడ్‌’’ అనే భావనను ప్రతిపాదించింది.


నేషనల్‌ సోలార్‌ మిషన్‌ లక్ష్యాలు 

లక్ష్యం సోలార్‌ కలెక్టర్స్‌ ఆఫ్‌-గ్రిడ్‌ సోలార్‌ అనువర్తనాలు గ్రిడ్‌ అనుసంధానిత సోలార్‌ సామర్థ్యం
మొదటి దశ(2010-13)   7 మిలియన్‌ చ.మీ. 200 MW 1000-2000 MW
రెండో దశ (2013-17)  15 మిలియన్‌ చ.మీ. 1000 MW 4000 -10,000 MW
మూడో దశ (2017-22) 20 మిలియన్‌ చ.మీ. 2000 MW 20,000 MW

 

భారత్‌లోని సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలు
శిలాజ ఇంధనాలపై అధికంగా ఆధారపడకుండా, 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని భారత్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో 38 శాతం విద్యుత్‌ను భారత్‌ సౌర విద్యుత్‌ నుంచే పొందుతోంది. మన దేశంలో సుమారు నలభైకి పైగా సౌర విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పాదన జరుగుతోంది. అందులో ప్రధానమైనవి.

 

భాడ్లా సోలార్‌ పార్క్‌: ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ ప్లాంట్‌. దీన్ని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జిల్లా - భాడ్లా గ్రామంలో 14 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ పవర్‌ ప్లాంట్‌ స్థాపిత సామర్థ్యం 2,250 MW. ఇందులో అభివృద్ధి చేసిన 16 ప్రాజెక్ట్‌లు నిర్ధారిత విద్యుత్‌ సామర్థ్య లక్ష్యాన్ని సంయుక్తంగా చేరుకున్నాయి.


శక్తి స్థల్‌ (పావగడ) సోలార్‌ ప్రాజెక్ట్‌: కర్ణాటకలోని తుమకూర్‌ జిల్లా - పావగడ ప్రాంతంలో  13 వేల ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచం (భారత్‌)లోని రెండో అతిపెద్ద సోలార్‌ పార్క్‌. దీని విద్యుత్‌ ఉత్పాదక సామర్థ్యం 2,050  MW. 


కర్నూలు అల్ట్రా మెగా సోలార్‌ పార్క్‌: ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ మరో రెండు సంస్థలతో కలిసి రెండేళ్ల కాలవ్యవధిలో దీన్ని ఏర్పాటు చేసింది. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. దీని స్థాపిత సామర్థ్యం 1000 MW. 5,932 ఎకరాల విస్తీర్ణంలో ఒకే ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది భారత్‌లోని మూడో అతిపెద్ద సోలార్‌ పార్క్‌. 


రేవా సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌: దీన్ని 750  MW సోలార్‌ ఉత్పాదక సామర్థ్యంతో, 1590 ఎకరాల విస్తీర్ణంలో మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. ఇది దిల్లీ మెట్రో రైల్వేకి విద్యుత్‌ను సరఫరా చేస్తోంది.


కాముతి సోలార్‌ పవర్‌ ప్లాంట్‌: ఇది తమిళనాడులోని రామాంతపురం జిల్లాలో ఉంది. దీని ఉత్పాదక సామర్థ్యం 684  MW. 2500 ఎకరాల విస్తీర్ణంలో, 2.5 మిలియన్ల సోలార్‌ ప్యానెళ్లతో దీన్ని నిర్మించారు. ఇది 2,65,000 గృహాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తోంది.


నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంట్లు (Floating Solar Power Plants) 
నీటిపై తేలియాడే ఫొటో వోల్టాయిక్‌  (PV) సోలార్‌ ప్యానెళ్ల ద్వారా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. ఇవి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించవు. జలాశయాల్లో ఆవిరయ్యే నీటి పరిమాణాన్ని తగ్గిస్తాయి. నీటి కాలుష్యాన్ని నిరోధిస్తాయి. వీటిని సులభంగా స్థాపించవచ్చు. PVలను సహజంగా చల్లార్చవచ్చు. భారత్‌ ఈ తరహా సోలార్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పాదక సామర్థ్యంతో తేలియాడే ప్రాజెక్టులను నిర్మిస్తోంది.


రామగుండం సోలార్‌ ప్లాంట్‌: దీన్ని తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని నెలల్లో దీని నిర్మాణం పూర్తికానుంది. ఇది భారత్‌లో తొలి అతిపెద్ద తేలియాడే సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌. దీని ఉత్పాదక సామర్థ్యం 100 MW. దీన్ని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (NTPC) తన విద్యుత్కేంద్ర జలాశయంపై నాలుగున్నర లక్షల ఫొటో వోల్టాయిక్‌ ప్యానెళ్లతో నిర్మిస్తోంది.


ఓంకారేశ్వర్‌ సోలార్‌ ప్లాంట్‌: దీన్ని మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదిపై ఉన్న ఓంకారేశ్వర్‌ రిజర్వాయర్‌పై నిర్మిస్తున్నారు. ఉత్పాదక సామర్థ్యం 600 లీజూ. దీని నిర్మాణాన్ని 2022-23 నాటికి  పూర్తిచేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు. దీని నిర్మాణానికి రూ.3000 కోట్లు అవుతుందని అంచనా. ఈ వ్యయాన్ని వరల్డ్‌ బ్యాంక్, పవర్‌ గ్రిడ్‌ సంయుక్తంగా భరిస్తాయి.


తొలి సోలార్‌ ఎయిర్‌పోర్ట్‌ 
ప్రపంచంలోనే తొలి సోలార్‌ ఎయిర్‌పోర్ట్‌గా కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు సృష్టించింది. 2013లో 400 సోలార్‌ ప్యానెళ్లతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. 2015 నాటికి 12 MW సామర్థ్యంతో, 46,150 సోలార్‌ ఫొటో వోల్టాయిక్‌ ప్యానెళ్లను ఏర్పాటుచేశారు. కేవలం 5 నుంచి 6 గంటల్లోనే విమానాశ్రయం ఒకరోజు నిర్వహణకు కావాల్సిన విద్యుత్‌ను ఇది ఉత్పత్తి చేస్తోంది. మిగులు విద్యుత్‌ను కేరళ ప్రభుత్వ విద్యుత్‌ బోర్డుకు విక్రయిస్తోంది. ఎయిర్‌పోర్ట్‌ గోల్ఫ్‌కోర్ట్‌ వద్ద ఏర్పాటుచేసిన 12 కృత్రిమ సరస్సులపై తేలియాడే 1300 సోలార్‌ ప్యానెళ్లను నిర్మించారు. దీంతో 2021 జనవరి 21 నాటికి సోలార్‌ విద్యుత్‌ సామర్థ్యం 40 మెగావాట్లకు పెరిగింది. దీని నుంచి ఒకరోజులో 452 కిలోవాట్‌ గంటల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. కొచ్చిన్‌ ఎయిర్‌పోర్ట్‌ రానున్న 25 ఏళ్లలో 9 లక్షల మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడమే కాక, 9 మిలియన్ల చెట్లను నాటడం ద్వారా పొందే లాభాన్ని కూడా కలిగించనుంది. భారత ప్రభుత్వం మరో 38 ఎయిర్‌పోర్టుల్లో రూఫ్‌టాప్‌ లేదా గ్రౌండ్‌ మౌంటెడ్‌ సోలార్‌ వ్యవస్థలు ఏర్పాటుచేసింది. ఇందులో కొన్ని పనిచేయడం కూడా ప్రారంభించాయి. వీటి మొత్తం సామర్థ్యం సుమారు 125 MW. ఇందులో ఇప్పటివరకు సాధించిన సామర్థ్యం సుమారు 78 MW.


పవన శక్తి  (Wind Energy)
వేగంగా వీచే గాలికి ఉండే గతిజశక్తిని టరైర్బైన్ల సాయంతో విద్యుత్‌ శక్తిగా మార్చడాన్ని పవన శక్తి లేదా పవన విద్యుత్‌ అంటారు. పవనాలు వీచేందుకు ప్రధాన కారణం సౌరశక్తి. వాతావరణంలో ఉష్ణోగ్రతల వ్యత్యాసం, భూమి ఉపరితలంలోని ఎత్తు - పల్లాలు, భూ భ్రమణం, కొండలు, నీటి వనరులు తదితరాలు గాలి వీచేందుకు కారణాలు. పవన శక్తి, వాయువు వడి ఘనానికి (cube) అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి పవన విద్యుత్‌ కేంద్రాలను గాలివేగంగా వీచే ఎత్తయిన ప్రదేశాల్లో, సముద్రాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. 2020, డిసెంబరు 31 నాటికి భారత్‌లో స్థాపిత పవన విద్యుత్‌ సామర్థ్యం 38.62 గిగావాట్లు. ఈ సామర్థ్యంలో భారత్‌ ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్‌లో పవన విద్యుత్, మొత్తం స్థాపిత విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యంలో పది శాతంగా ఉంది.
         భారతదేశానికి మూడువైపులా సుమారు 7,600 km సముద్రతీరం ఉంది. ఇది పవన విద్యుత్‌ ఉత్పాదనకు ఎంతో ఉపయోగకరమైన ప్రాంతం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 2015, అక్టోబరు 6న నేషనల్‌ ఆఫ్‌షోర్‌ విండ్‌ ఎనర్జీ పాలసీ విడుదల చేసింది. గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎనిమిది పవన విద్యుత్‌ అనుకూల జోన్లను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నికరంగా 70 GW పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంచనా. 2022 నాటికి 5 GW, 2030 నాటికి 30 GW సముద్ర ప్రాంత పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 


2020, డిసెంబరు 31 నాటికి అధిక స్థాపిత పవన శక్తిని కలిగి ఉన్న మొదటి అయిదు రాష్ట్రాలు 
1. తమిళనాడు (9428.44 MW) 
2. గుజరాత్‌ (8192.52 MW) 
3. మహారాష్ట్ర (5000.33 MW) 
4. కర్ణాటక (4868.-80 MW) 
5. రాజస్థాన్‌ (4326.-82 MW) 


విండ్‌ (పవన) - సోలార్‌ (సౌర) హైబ్రిడ్‌ ప్రాజెక్ట్‌లు
పవన, సౌరశక్తి వనరులను సంపూర్ణంగా వినియోగించి అధిక మొత్తంలో గ్రిడ్‌ అనుసంధానిత విద్యుత్‌ను పొందేందుకు 2018, మే 14న భారత ప్రభుత్వం నేషనల్‌ విండ్‌ - సోలార్‌ హైబ్రిడ్‌ పాలసీని ప్రకటించింది. నూతన టెక్నాలజీలు, పద్ధతులను ఉపయోగించి ఒకే చోట సోలార్, పవన విద్యుత్‌లను ఏకకాలంలో ఉత్పత్తి చేయడం దీని లక్ష్యం. ఇప్పటికే స్థాపించిన సౌర విద్యుత్‌ కేంద్రంలో పవన విద్యుత్‌ కేంద్రాన్ని లేదా పవన విద్యుత్‌ కేంద్రంలో సౌర విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకదాని కెపాసిటీ, మరో తరహా విద్యుత్‌ కేంద్ర కెపాసిటీలో కనీసం 25% ఉంటే దాన్ని హైబ్రిడ్‌ విద్యుత్‌ కేంద్రంగా గుర్తిస్తారు.


భారత్‌లోని తొలి అయిదు పవన శక్తి విద్యుత్‌ కేంద్రాలు

పేరు - రాష్ట్రం సామర్థ్యం ప్రాముఖ్యత
ముప్పండాల్‌ విండ్‌ ఫాం (తమిళనాడు) 1500 MW దేశంలోని అతిపెద్ద సముద్రతీర పవన విద్యుత్‌ కేంద్రం
జైసల్మేర్‌ విండ్‌ పార్క్‌ (రాజస్థాన్‌) 1064 MW రెండో అతిపెద్ద పవన విద్యుత్‌ కేంద్రం (అతిపెద్ద విండ్‌ పార్క్‌)
బ్రహ్మన్‌నెల్‌ విండ్‌ ఫాం (మహారాష్ట్ర) 528 MW -
కయతార్‌ విండ్‌ ఫాం (తమిళనాడు) 300 MW -
ధాల్గాన్‌ విండ్‌ ఫాం (మహారాష్ట్ర) 278 MW -
Posted Date : 25-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు