• facebook
  • whatsapp
  • telegram

నదులు

దేశానికి జీవనాడులు

  దేశంలో వందలాది చిన్న, పెద్ద నదులు, వాటి ఉపనదులు ఉన్నాయి. ఇవి ఆర్థిక, సాంస్కృతిక జీవన విధానంలో విడదీయలేని భాగమయ్యాయి. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు  ప్రధానాధారంగా మారి జీవనాడులుగా నిలిచాయి. జాగ్రఫీ అధ్యయనంలో నదులు, వాటి జన్మస్థానాలు, ప్రవాహ మార్గాలు, పరీవాహక ప్రాంతాల గురించి  పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 

  నదులు దేశానికి అతిముఖ్యమైన సహజవనరులు. నీటిపారుదల, పరిశ్రమలు, గృహావసరాలు, తాగునీరు, జలవిద్యుత్తు శక్తికి నదులే ఆధారం.  దేశంలో ప్రధాన పంటలు పండే భూములన్నీ నదుల ఒండ్రుమట్టి నిక్షేపిత ప్రాంతాలే. ఇప్పటికీ చాలా నదులు అంతఃస్థలీయ జల రవాణా మార్గాలుగా ఉన్నాయి. దేశంలో ప్రవహించే నదుల్లో 90% బంగాళాఖాతంలో కలుస్తుండగా, మిగిలిన 10% అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి.

 

మూడు రకాలు

  పరీవాహక ప్రాంతాల ఆధారంగా నదులను మూడు రకాలుగా విభజించారు.

 

ప్రధాన నదీ పరీవాహక ప్రాంతం: ఇది సుమారు 20,000 చ.కి.మీ., అంతకంటే ఎక్కువ పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. ఈ పరీవాహక  ప్రాంతం దేశంలో 85% ఉంది.

 

మధ్యస్థ నదీ పరీవాహక ప్రాంతం: ఇది సుమారు 2000 నుంచి 20,000 చ.కి.మీ. పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. ఈ పరీవాహక  ప్రాంతం దేశంలో 7% ఉంది.

 

చిన్న నదీ పరీవాహక ప్రాంతం: 2000 చ.కి.మీ. కంటే తక్కువ పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. ఇది దేశంలో 8% ఉంది.

 

  నదులు సముద్రంలో కలిసే విధానం ఆధారంగా రెండు రకాలుగా విభజించవచ్చు.

 

బంగాళాఖాతంలో కలిసే నదులు: గంగ, బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి, కృష్ణా, కావేరి. ఇవన్నీ పెద్ద డెల్టాలను ఏర్పరిచాయి.

 

అరేబియా సముద్రంలో కలిసే నదులు: నర్మద, తపతి, సబర్మతి, మహి, సింధు. వీటిలో సింధూ నదికి మాత్రమే డెల్టా ఉంది.

నది పుట్టుక ఆధారంగా వాటిని హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు అని విభజించారు. 

 

హిమాలయ నదులు: ఇవి జీవనదులు. వీటి వయసు తక్కువ. వీటి ప్రవాహ మార్గంలో నదీ వక్రతలు ఉంటాయి. హిమానీనదాలు కరగడం,  వర్షం వల్ల ఈ నదుల్లో ఎల్లప్పుడూ నీరు ఉంటుంది. ఇవి లోతైన ‘U’ ఆకారపు  గార్జ్‌లను ఏర్పరుస్తాయి. ఎక్కువగా మైదాన ప్రాంతాల్లో ప్రవహిస్తూ నౌకాయానానికి అనుకూలంగా ఉంటాయి. ఈ నదులకు దేశంలో 77% పరీవాహక ప్రాంతం ఉంది. హిమాలయ నదుల్లో సింధు, గంగ, బ్రహ్మపుత్ర, వాటి ఉపనదులు ప్రధానమైనవి.

 

ద్వీపకల్ప నదులు: ఇవి ఎక్కువగా రుతుపవనాల/వర్షాధార నదులు. కఠిన శిలల ద్వారా సాధారణ వేగంతో ప్రవహించి ‘V’ ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి. వీటి పొడవు, పరీవాహక ప్రాంతం తక్కువ. ఇవి పురాతనమైన నదులు. నదీ వక్రతలు తక్కువ. ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి నౌకాయానానికి అనుకూలంగా ఉండవు. ఈ నదులకు దేశంలో 23% పరీవాహక ప్రాంతం ఉంది. ద్వీపకల్ప నదుల్లో గోదావరి, కృష్ణా, మహానది, కావేరి, నర్మద, తపతి, వాటి ఉపనదులు ముఖ్యమైనవి.

 

అంతర్‌ భూభాగ నదులు: ఇవి వర్షాభావ ప్రాంతాల్లో పుట్టి, కొంతదూరం ప్రవహించి తర్వాత మార్గమధ్యలో అంతరించిపోతాయి. ఈ నదులు రాజస్థాన్, లద్దాఖ్‌ ప్రాంతాల్లో కనిపిస్తాయి. 

ఉదా: లూని, బాణి, ఘగ్గర్‌ నదులు 

 

పరస్థానీయ నదీ వ్యవస్థ: అధిక వర్షపాతం, నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో జన్మించి, ఎడారి ప్రాంతాల ద్వారా ప్రవహిస్తూ అక్కడి పంటలకు సాగునీరు అందిస్తున్న నదులు. 

ఉదా: సింధూ నది.

 

గంగానదీ వ్యవస్థ: ఈ నది భాగీరథీ, అలకనంద అనే రెండు నదుల కలయికతో (దేవప్రయాగ వద్ద) ఏర్పడుతుంది. భాగీరథీ నది కంటే అలకనంద నది పెద్దది. కానీ భాగీరథీ నది జన్మస్థానాన్ని గంగానది జన్మస్థానంగా భావిస్తారు. ఇది కేదార్‌నాథ్‌ సమీపంలో గోముఖ్‌ వద్ద గంగోత్రి హిమానీనదం నుంచి ఉద్భవిస్తుంది. అలకనంద బద్రీనాథ్‌ సమీపంలోని సతోపత్‌ అనే హిమానీనదం నుంచి ఉద్భవిస్తుంది. గంగానది పొడవు 2,525 కి.మీ. ఇది హరిద్వార్‌ వద్ద మైదానంలోకి ప్రవేశించి ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ఈ నది మధ్యలో రెండుగా చీలి ఒక శాఖ ‘పద్మ’ నదిగా బంగ్లాదేశ్‌లో, మరో శాఖ ‘హుగ్లీ’గా పశ్చిమ బెంగాల్‌లో ప్రవహిస్తుంది. భారత్‌లో అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతం గంగానదిదే. ప్రస్తుతం దేశంలో అత్యంత కాలుష్యానికి గురయ్యే నది కూడా ఇదే. గంగానది ప్రక్షాళన కోసం 1986లో గంగా కార్యాచరణ ప్రణాళికను తయారుచేశారు. దీనికోసం 2014లో కేంద్ర ప్రభుత్వం ‘నమామి గంగ’ ప్రాజెక్టును ప్రారంభించింది. గంగానది ఉపనదులను మూడు భాగాలుగా విభజించారు. 

 

1) హిమాలయాల్లో జన్మించి దక్షిణ దిశగా ప్రవహిస్తూ ఎడమవైపు నుంచి గంగానదిలో కలిసేవి. 

ఉదా: శారదా, రామ్‌గంగా, గంఢక్, ఘాగ్రా, కోసి, భాగమతి, మహానందా 

 

2) ద్వీపకల్ప భాగంలో జన్మించి ఉత్తర దిశగా ప్రవహించి కుడివైపు నుంచి గంగానదిలో కలిసేవి. 

ఉదా: చంబల్, బెట్వాకెన్, సోన్, దామోదర్, టాన్స్‌

 

3) హిమాలయాల్లో జన్మించి దక్షిణ దిశగా ప్రవహించి కుడివైపు నుంచి గంగానదిలో కలిసేవి. 

ఉదా: యమున

 

సింధూనది వ్యవస్థ: ఈ నది టిబెట్‌లోని కైలాస్‌ కొండల్లో మానస సరోవరం వద్ద గుర్తాంగ్‌ చూ/బోఖార్‌ చూ అనే హిమానీనదం వద్ద జన్మిస్తుంది. టిబెట్‌లో సింధూనదిని ‘సింగి జాంగ్‌ బో’ అనే పేరుతో పిలుస్తారు. ఈ నది భారత్‌లో థాంచోక్‌ అనే ప్రదేశంలో ప్రవేశించి టిబెట్, భారత్, పాకిస్థాన్‌లలో మొత్తంగా 2,900 కి.మీ. ప్రవహిస్తుంది. భారత్‌లో లేహ్, లద్దాఖ్‌ల మీదుగా ప్రవహించి పాకిస్థాన్‌లోని కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్‌. లద్దాఖ్‌లో సింధూనదిలో కలిసే ఉపనదులు ష్యోక్, శిగర్, హంజ, జస్కార్‌. కాబూల్‌ నది అఫ్గానిస్థాన్‌ నుంచి ప్రవహించి అటోక్‌ వద్ద సింధూనదిలో కలుస్తుంది.

 

బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ: ఈ నది టిబెట్‌లోని కైలాస్‌ కొండల వరుసలో మానససరోవరం సమీపంలోని చామ్‌యంగ్‌డమ్‌ హిమానీనదం వద్ద జన్మిస్తుంది. టిబెట్, భారత్, బంగ్లాదేశ్‌లలో 2,900 కి.మీ. ప్రవహిస్తుంది. అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర సరిహద్దులోని నామ్చాబార్వా శిఖరం సమీపంగా  ‘జిదోలో’ వద్ద భారత్‌లోకి ప్రవేశిస్తుంది. బ్రహ్మపుత్రను టిబెట్‌లో త్సాంగ్‌ పో, చైనాలో యార్లాంగ్‌ త్సాంగో పో, అరుణాచల్‌ప్రదేశ్‌లో దిహంగ్‌/ సియాంగ్, అసోంలో సైడాంగ్, బంగ్లాదేశ్‌లో జమున అని పిలుస్తారు. ఈ నది భారత్‌లో 916 కి.మీ. ప్రవహిస్తుంది. మానస్, సంకోష్, తీస్తా, బారక్, దెబాంగ్, లోహిత్, దన్‌సిరి, సుర్మా, కామెంగ్, సుబన్‌సిరి బ్రహ్మపుత్ర ఉపనదులు. 

 

ముఖ్యాంశాలు

* జాతీయ నదుల పరిరక్షణ ప్రణాళికలో ప్రస్తుతం 34 నదులను చేర్చారు.

* దేశంలో అత్యంత కాలుష్యానికి గురవుతున్న నది గంగానది. తర్వాతి స్థానంలో యమున, సబర్మతి ఉన్నాయి. గంగానదిని ప్రపంచంలో 7వ అత్యంత కలుషిత నదిగా డ‌బ్ల్యూడ‌బ్ల్యూఎఫ్‌ (WWF) నివేదిక పేర్కొంది.  

* దామోదర్‌ నదిని బెంగాల్‌ దుఃఖదాయిని, కోసీ నదిని బిహార్‌ దుఃఖదాయిని అంటారు.

* గంగా నదిని బంగ్లాదేశ్‌లో పద్మా అని, బ్రహ్మపుత్ర నదిలో కలిసిన తర్వాత మేఘన నది అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్‌లో  ప్రవేశించగానే జమున అని పిలుస్తారు.

* ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి 22న, ప్రపంచ నదుల దినోత్సవాన్ని సెప్టెంబరు నెల చివరి ఆదివారం నిర్వహిస్తారు.

* భారతదేశ నదుల వారం -  నవంబరు 24 - 27.

* అసోంలోని సదియ నుంచి దుబ్రి వరకు అంతఃస్థలీయ జలరవాణాకు ఉపయోగించడం వల్ల ఆ మార్గాన్ని జాతీయ జలమార్గం - 2 గా గుర్తించారు.

* బ్రహ్మపుత్ర నది అసోంలో మజూలీ అనే దీవిని ఏర్పరిచింది. ఇది ప్రపంచంలో అతిపెద్ద నదీ ఆధారిత దీవి.

 

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌