• facebook
  • whatsapp
  • telegram

శిలలు - రకాలు

ఇలలపై అన్నీ శిలలే!

  రకరకాల నేలలు, రాళ్లు, గుట్టలు, కొండలు, పర్వతాల రూపంలో భూమి (ఇల) ఉపరితలం ఉంటుంది. వాటన్నింటి మూల నిర్మాణాలకు శిలలు ప్రదర్శించే వివిధ లక్షణాలే కారణం. అందుకే భూ స్వరూపాలను అర్థం చేసుకోవాలంటే ముందుగా శిలల గురించి తెలుసుకోవాలి. 

 

  భూపటలంలోని పదార్థమంతా శిలలతో నిర్మితమైంది. అంటే భూపటలంలో నిక్షేపితమైన ఘనపదార్థమంతా శిలా నిర్మితమే. కాబట్టి శిల, గ్రానైట్‌లా కఠినంగా లేదా ఒండ్రుమట్టిలా మృదువుగా ఉండవచ్చు. అదేవిధంగా శిల సుద్ధలా  సచ్ఛిద్రమైందిగా (రంధ్రాలు కలిగిన - porous) లేదా గ్రానైట్‌లా అచ్ఛిద్రమైందిగా (రంధ్రాలు లేని - non-porous) ఉంటుంది. సచ్ఛిద్రమైన శిలలకు నీటిని పీల్చే గుణం ఉంటుంది. అచ్ఛిద్ర శిలలకు ఉండదు. 

శిలలు ఒకటి కంటే ఎక్కువ ఖనిజాల సమూహం. అయితే భూ పటలంలో సామాన్యంగా లభ్యమయ్యే ఖనిజాల సంఖ్య 12. వాటినే శిలా రూపకర్తలు  అంటారు. వీటిలో ఆక్సిజన్, సిలికా, అల్యూమినియం, ఇనుము, కాల్షియం, సోడియం, భాస్వరం, మెగ్నీషియం ప్రధానమైనవి. ఇవి భూపటలంలోని పై పొరల నుంచి ఎక్కువ లోతు వరకు విస్తరించి భూపటలంలోని మొత్తం పదార్థంలో దాదాపు 99 శాతం ఆక్రమించి ఉంటాయి.

ఖనిజాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ రసాయనిక మూలకాల సంయోగం వల్ల ఏర్పడతాయి. ప్రకృతిలో ఇప్పటివరకు కనుక్కున్న రసాయనిక మూలకాల సంఖ్య 109. భూపటలంలో అధికంగా లభ్యమయ్యే మూలకం ఆక్సిజన్, సిలికాన్‌.

అన్ని రకాల శిలల నిర్మాణానికి మూలమైన పదార్థం మాగ్మా అనే ద్రవం. ఇది భూ అంతర్భాగంలº అనేక వేడి వాయువులతో ఉండే జిగురు పదార్థం. శిలలన్నీ ఒకే విధంగా ఉండవు. ఉద్భవ విధానం, భౌతిక, రసాయనిక లక్షణాలను అనుసరించి శిలలను ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు. 

1) అగ్ని శిలలు (Igneous Rocks)

2) అవక్షేప శిలలు (Sedimentary Rocks)

3) రూపాంతర శిలలు (Metamorphic Rocks)

 

అగ్నిశిలలు 


భూగర్భంలోని శిలాద్రవం ఉపరితలానికి ప్రవహించి చల్లారి, ఘనీభవిచడం వల్ల అగ్నిశిలలు ఏర్పడతాయి. భూమిపై మొదటగా ఏర్పడిన శిలలు ఇవే కాబట్టి వీటిని ప్రథమ శిలలు అంటారు. భూఉపరితలంలో 5% మాత్రమే ఉన్న అగ్నిశిలలు భూపటలంలో దాదాపు 95% వరకు ఉన్నాయి.

 

లక్షణాలు: * వీటిలో స్ఫటికాలు ఉంటాయి, శిలాజాలు ఉండవు.

* ఇవి కఠినమైనవి. అందువల్ల వీటి క్రమక్షయం మిగిలిన శిలల కంటే నెమ్మదిగా జరుగుతుంది.

* ఇవి ముద్దరూపంలో ఉంటాయి.

* వీటిలో పొరలు ఉండవు. కానీ అతుకులు, పగుళ్లు, బీటలు ఎక్కువగా ఉంటాయి. 

* ఇవి అచ్ఛిద్ర శిలలు.

అగ్ని శిలలు ఏర్పడిన తీరు, వాటిలోని రసాయనిక పదార్థాల సమ్మేళనం, అవి ఏర్పడిన లోతును బట్టి వీటిని ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. 

 

ఉద్గమ అగ్నిశిలలు: శిలాద్రవం విదరాలు (పగుళ్లు), అగ్నిపర్వత మార్గం ద్వారా భూఉపరితలంపైకి వచ్చి చల్లారి ఘనీభవించడం వల్ల ఏర్పడే శిలలను ఉద్గమ అగ్నిశిలలు అంటారు. వీటిని అగ్నిపర్వత శిలలు అని కూడా పిలుస్తారు. దక్కన్‌ పీఠభూమి లేదా దక్కన్‌ నాపలు ఈ శిలలతోనే ఏర్పడ్డాయి.  

ఉదా: బసాల్ట్, రియోలైట్, ఆండీసైట్, అబ్సీడియన్‌ 

 

అంతర్గమ అగ్నిశిలలు: శిలాద్రవం భూఉపరితలానికి కొంచెం దిగువన ఉన్న రాతి పొరల మధ్య చేరి చల్లారి ఘనీభవించడం వల్ల ఏర్పడిన శిలలను అంతర్గమ అగ్నిశిలలు అంటారు. ఉదా: గ్రానైట్, గాబ్రో, డోలరైట్‌ 

భూ ఉపరితలానికి దిగువన రాతి పొరల మధ్య ఏ ఆకారంలో ఘనీభవిస్తున్నాయి అనే దాన్ని అనుసరించి అంతర్గమ అగ్నిశిలలను కింది విధంగా వివరించవచ్చు.

 

డైక్‌: శిలాద్రవం ఉపరితలానికి ప్రవహించే మార్గం మధ్యలో సమతల రాతి మధ్య 90 డిగ్రీల కోణంలో అంటే నిట్టనిలువుగా ఘనీభవించడం వల్ల గోడలా నిటారుగా ఉండే శిలా స్వరూపం ఏర్పడుతుంది. దీన్నే డైక్‌ అని పిలుస్తారు. 

 

సిల్‌: శిలాద్రవం భూ అంతర్భాగంలోని రెండు పొరల మధ్య ప్రవహించి క్షితిజ సమాంతరంగా ఘనీభవించి ఒక పొరలా ఏర్పడుతుంది. దీన్నే సిల్‌ అంటారు. 

 

బాతోలిత్‌ శిలలు: భూపటలంలో ఎక్కువ లోతులో అధిక ఉష్ణం వల్ల ఏర్పడిన శిలాద్రవం చాలా ఎక్కువగా ఉపరితలం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా ప్రవహించినప్పుడు మార్గం మధ్యలో ఉన్న శిలలను కూడా తనలో కరిగించుకొని కలశ ఆకృతిలో ఘనీభవిస్తుంది. వీటినే బాతోలిత్‌ శిలలు అంటారు. ఇవి సాధారణంగా పర్వత ప్రాంతాల్లో కనిపిస్తాయి. అమెరికాలోని ఇదాహో (Idaho) ప్రపంచంలో పెద్దదైన బాతోలిత్‌ శిల. దక్షిణ అమెరికా పశ్చిమ భాగంలో ఈ శిలలు అధికంగా ఉన్నాయి.

 

అవక్షేప శిలలు 

వీటిని స్తరిత లేదా అనంతర శిలలు అంటారు. భూమిపై పనిచేసే బాహ్య ప్రక్రియల వల్ల పూర్వ శిలల నుంచి అవక్షేప శిలలు ఏర్పడతాయి. ఇవి అతి సూక్ష్మకణాలతో నిర్మితమై పొరలుగా ఏర్పడిన శిలాజాలను కలిగి ఉంటాయి. భూమిపై ఉన్న శిలలు వాతావరణ ప్రభావానికి లోనై శిథిలమవుతాయి. ఈ శిలా శిథిలాలను గాలి, నీరు లాంటి వికోషీకరణ కారకాలు రవాణా చేసి సముద్ర పరివాణం, సరస్సులు, నదీలోయల్లో నిక్షేపితం చేస్తాయి. ఈ నిక్షేపాలు పొరలుగా ఏర్పడతాయి. ఈ ప్రక్రియ ఎక్కువ కాలం కొనసాగితే నిక్షేపాలు కొన్ని వందల మీటర్ల మందంతో ఏర్పడతాయి. ఈ విధంగా నిక్షేపితమైన పొరలు గట్టిపడి స్తరిత రూపం దాల్చి అవక్షేప శిలలుగా ఏర్పడతాయి.  

అవక్షేప శిలలు ఏర్పడటానికి మూడు ముఖ్యమైన భూస్వరూప ప్రక్రియలు తోడ్పడతాయి. 

అవి 1) శైథిల్యం 2) క్రమక్షయం 3) నిక్షేపణం 

అవక్షేప శిలలు భూఉపరితలంపై ఉన్న మొత్తం శిలల్లో 75 శాతం ఉండగా భూపటలంలో 5 శాతం మాత్రమే ఆక్రమించి ఉన్నాయి.

 

లక్షణాలు:

* ఇవి అగ్నిశిలల కంటే తక్కువ కఠినంగా ఉంటాయి.

* ఇవి పొరలుగా ఉంటాయి. కాబట్టి వీటిలో శిలాజాలు ఉంటాయి.

* ఈ శిలాజాల సహాయంతో శిలలు ఎప్పుడు ఏర్పడ్డాయో తెలుసుకోవచ్చు. 

* నీటిలో ఏర్పడతాయి కాబట్టి ఈ శిలలపై నీటి కెరటాల గుర్తులు ఉంటాయి.

* ఇవి సచ్ఛిద్రాలు. 

 

రూపాంతర శిలలు 

అధిక పీడనం, ఉష్ణోగ్రత ప్రభావాల వల్ల అగ్నిశిలలు లేదా అవక్షేప శిలలు భౌతిక, రసాయనిక మార్పులకు గురై కొత్త ధర్మాలను పొందుతాయి. ఈ విధంగా మార్పు చెందిన శిలలను రూపాంతర శిలలు లేదా పరివర్తిత శిలలు అంటారు. అగ్నిశిలలు, అవక్షేప శిలలు నీస్, సిస్ట్‌గా రూపాంతరం చెందుతాయి. 

 

శిలల నుంచి ఏర్పడే రూపాంతర శిలలు 

లక్షణాలు: * ఇవి చాలా కఠినంగా ఉంటాయి.

* వీటిలో అతుకులు, పగుళ్లు ఎక్కువగా ఉంటాయి.

* ఈ శిలల్లో పెద్ద పరిమాణంలో ఉన్న స్ఫటికాలు ఒకదానిపై మరొకటి సమాంతరంగా ఏర్పడతాయి. ఈ అమరికను సదలత (ఆకుల దొంతర లాంటి నిర్మాణం -  Foliation) అంటారు. 

* సదలత అమరిక అసంపూర్తిగా అభివృద్ధి చెంది స్థూల రేణువులను కలిగి ఉన్న రూపాంతర శిలలను నీస్‌ అంటారు. నీస్‌ శిలల్లో పట్టీలు (Bands) ఉంటాయి.

* సదలత అమరిక సంపూర్ణంగా సమాంతర అమరిక కలిగి సూక్ష్మరేణువులతో ఉండే రూపాంతర శిలలను సిస్ట్‌ అంటారు. సిస్ట్‌ శిలల్లో పొరలు (Byers) ఉంటాయి. ఈ శిలలో ఏర్పడిన భూస్వరూపాలను షీల్డ్స్‌ అంటారు. ఇవి కఠినంగా ఉండటం వల్ల పీఠభూములుగా నిలిచిపోతాయి.

విస్తరణ: రూపాంతర శిలలు ఆదిమ యుగానికి చెందిన ప్రదేశాల్లో విస్తరించి ఉన్నాయి. మన దేశంలో ముఖ్యంగా ద్వీపకల్ప ప్రాంతంలో ఉన్నాయి. అధిక స్థాయి రూపాంతర ప్రాప్తి శిలలు తూర్పు కనుమల మేఖలల్లో వ్యాపించాయి. నీస్, సిస్ట్‌ శిలలు అసోం, పశ్చిమ్‌ బంగా, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఉన్నాయి. క్వార్ట్జ్‌ రాజస్థాన్, బిహార్, మధ్యప్రదేశ్‌లో; స్లేట్‌ హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్‌లో; గ్రాఫైట్‌ ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో లభిస్తాయి.

 

మరికొన్ని ముఖ్యాంశాలు

* శిలల భౌతిక, రసాయనిక ధర్మాల గురించి చర్చించే శాస్త్రాన్ని పెట్రాలజీ అంటారు. 

* శిలలు ఏర్పడే విధానాన్ని గురించి చర్చించే శాస్త్రాన్ని లిథాలజీ అంటారు. 

* భూపటలంలో అధికంగా ఉన్న ఖనిజ సమ్మేళనం సిలికా. శిలలో సిలికా శాతం హెచ్చుగా ఉంటే వాటిని ఆమ్ల శిలలు అంటారు. ఉదా: గ్రానైట్, రియోలైట్‌

* శిలల్లో సిలికా శాతం తక్కువగా ఉంటే వాటిని క్షార శిలలు లేదా మౌలిక శిలలు అంటారు. ఉదా: బసాల్ట్, గాబ్రో, డోలరైట్‌

* షెల్‌ శిలలను మృణ్మయ శిలలు అని కూడా అంటారు. ఇవి ఒండ్రుమట్టి లేదా బంకమట్టితో ఏర్పడతాయి. భూమిపై ఉండే అవక్షేప శిలల్లో అత్యధికంగా షెల్‌ (80%), ఇసుకరాయి (12%), సున్నపు రాయి (8%) లభిస్తాయి. 

 

రచయిత: సక్కరి జయకర్‌

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

ఆర్ద్రత - అవపాతం 

  ఖండచలన సిద్ధాంతం

భూమి అంతర్భాగం

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 03-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌