• facebook
  • whatsapp
  • telegram

భార‌త ర‌క్ష‌క‌ద‌ళంలో సోనార్‌, రాడార్‌, వైడార్ పాత్ర‌

* సోనార్, రాడార్, లైడార్
* రక్షణ రంగంలో కీలకం

 

  భారత త్రివిధ దళాలకు ఉపకరించే అనేక రకాల అధునాతన పరికరాలు, యుద్ధ ట్యాంకులు, వాహనాల రూపకల్పనలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఎంతో కీలకం. గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదించడం.. ప్రత్యర్థుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడం.. శత్రు వ్యూహాలను సమర్ధంగా తిప్పికొట్టడం.. తదితర రక్షణాత్మక ప్రక్రియలన్నింటికీ అధునాతన సాంకేతిక విజ్ఞానం తోడ్పడుతోంది. ఇందులో భాగమైన సోనార్, రాడార్, లైడార్ వ్యవస్థలు.. భారత యుద్ధ ట్యాంకులు, వాహనాలు.. తదితర వివరాలతో అధ్యయన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..
ఆధునిక యుద్ధ వ్యూహాల్లో భాగంగా శత్రు సైన్యాల కదలికలను మరింత వేగంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆయుధ సామగ్రి, విమానాలు, నౌకలు, జలాంతర్గాములను సమకూర్చుకోవడంతోపాటు అధునాతన సాంకేతికతను ఉపయోగించాలి. సైనికుడి అంచనాలు గురితప్పకుండా చేసే పరికరాల్లో సోనార్, రాడార్, లైడార్ ప్రధానమైనవి. వీటితోపాటు టెలిస్కోప్, బైనాక్యులర్స్, పెరిస్కోప్ సైనికులకు ఎంతగానో తోడ్పడే పరికరాలు.

 

ప్రతి'ధ్వని' సూత్రం

పురాతన కోట గోడకు కొంత దూరంలో నిల్చొని చప్పట్లు కొడితే వాటి ప్రతిధ్వని కొన్ని క్షణాల తర్వాత మనకు వినిపిస్తుంది. ఇలా ధ్వని తిరిగి వెనక్కి వినిపించే ఈ సూత్రం ఆధారంగానే సోనార్, రాడార్, లైడార్లు పనిచేస్తాయి. వీటిన్నింటిలో తరంగాలు పరావర్తనం చెందుతాయి. సోనార్ (సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్)లో ధ్వని తరంగాలు, రాడార్ (రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్)లో రేడియో తరంగాలు, లైడార్(లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్)లో కాంతి లేదా లేజర్‌కాంతి పరావర్తనం చెందుతాయి.

 

భారత రక్షక దళంలోని సోనార్‌లు

 

హెచ్‌యూఎంఎస్ఏ

నౌకల్లో ఉపయోగించగల దేశీయ సోనార్ హెచ్‌యూఎంఎస్ఏ (హల్ మౌంటెడ్ సోనార్ అర్రె)ను కోచిలోని నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ ల్యాబోరేటరీ రూపొందించింది. వీటిని బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది. వీటిని నావికాదళానికి చెందిన నౌకల్లో బిగించారు. వచ్చే తరానికి (నెక్ట్స్ జనరేషన్) చెందిన సోనార్ వ్యవస్థలను హెచ్‌యూఎంఎస్ఏ-ఎన్‌జీ పేరుతో మరింత అభివృద్ధి పరిచారు. వీటిలో తక్కువ పౌనఃపున్యంలోని ట్రాన్స్‌డ్యూజర్లు, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రాసెసర్లను, SHARC సిగ్నల్ ప్రాసెసింగ్ బోర్డులను ఉపయోగించారు.
హెచ్‌యూఎమ్ఎస్ఏ సోనార్లను కొంత ఆధునీకరించి హెచ్ఎమ్ఎస్-ఎక్స్ సోనార్‌లుగా మయన్మార్‌కు ఎగుమతి చేస్తున్నారు.

 

పంచేద్రియ సోనార్

ఇది భారతదేశం తయారుచేసిన మొదటి సబ్‌మెరైన్ సోనార్. దీన్ని కూడా డీఆర్‌డీవో అనుబంధ సంస్థ అయిన నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ ల్యాబోరేటరీ (ఎన్‌పీవోఎల్) అభివృద్ధి చేసింది. వీటిని సింధుఘోష్, వేల, కిలో-క్లాస్ రకానికి చెందిన సబ్‌మెరైన్‌లలో; అరిహంత్ రకపు సబ్‌మెరైన్‌లలో ఉపయోగించారు.

 

యూఎస్‌హెచ్‌యూఎస్

ఇది శత్రువుల జలాంతర్గాములు, నౌకలు, టార్పెడోలను గుర్తించే అధునాతన ఏకీకృత సోనార్ వ్యవస్థ. దీన్ని భారత తొలి అణుశక్తి చోదక సబ్‌మెరైన్ అరిహంత్‌లో ఉపయోగించనున్నారు. ఇది సబ్‌మెరైన్ రకానికి చెందిన సోనార్.

 

ఎమ్ఐహెచ్ఐఆర్

ఇది హెలికాప్టర్ రకానికి చెందిన సోనార్. వీటిని అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్)లో బిగించనున్నారు. ఇది నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ ల్యాబోరేటరీ (ఎన్‌పీవోఎల్) తయారుచేసిన తక్కువ పౌనఃపున్య డంకింగ్ సోనార్ (ఎల్ఎఫ్‌డీఎస్). ఇది హెలికాప్టర్ నుంచి కేబుల్ ద్వారా నీట మునిగి శత్రువుల సబ్‌మెరైన్‌లను గుర్తిస్తుంది.

 

టాడ్‌పోల్ సానబాయ్

తొడుగులో ఉండే చిన్న సోనార్ వ్యవస్థ. దీన్ని ఎన్‌పీవోఎల్ అభివృద్ధి చేసింది. 2000 సంవత్సరం నుంచి భారత నావికాదళంలో ఉపయోగిస్తున్నారు. ఇది పారాచ్యూట్ సహాయంతో సముద్ర ఉపరితలాన్ని చేరిన తర్వాత విచ్చుకుని తన పనిని ప్రారంభిస్తుంది. సేకరించిన సమాచారాన్ని రేడియో తరంగాల రూపంలో గ్రాహక వ్యవస్థకు పంపిస్తుంది. బెంగళూరుకు చెందిన టాటా పవర్ కన్సల్టెన్సీ లిమిటెడ్ సంస్థ దీన్ని రూపొందించింది.

 

భారతదేశంలో అభివృద్ధిపరిచిన రాడార్లు

 

ఇంద్ర

ఇంద్ర పూర్తి పేరు 'ఇండియన్ డాప్లర్ రాడార్'. ఇవి ద్విమితీయ(2డీ) రాడార్లు. వీటిని ప్రధానంగా తక్కువ ఎత్తులో ఎగిరే క్రూయిజ్ క్షిపణులు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలను గుర్తించేందుకు; వాటి గమనాన్ని తెలుసుకునేందుకు (ట్రాకింగ్) ఉపయోగిస్తారు. వీటిని డీఆర్‌డీవో అభివృద్ధి చేయగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తుంది. వీటిని వాహనాల్లో అమర్చవచ్చు. ఇంద్ర-1 రకాన్ని ఇండియన్ ఆర్మీ, ఇంద్ర-2 పీసీ రకాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉపయోగిస్తున్నాయి. 2డీలో ఒకటి దూరాన్ని, రెండోది కోణాన్ని (అజిమత్‌ని) సూచిస్తుంది.
* భారత్ ఇంద్ర శ్రేణి రాడార్లను ఎల్‌టీటీఈని ఎదుర్కోనేందుకు శ్రీలంకకు సరఫరా చేసింది.

 

బీఎఫ్ఎస్ఆర్-ఎస్ఆర్

బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ రాడార్ - షార్ట్‌రేంజ్‌కు సంక్షిప్త రూపమే బీఎఫ్ఎస్ఆర్-ఎస్ఆర్. యుద్ధభూమిలో నడిచే, పాకే సైనికులను; దళాలను, భారీ వాహనాలను గుర్తించడానికి ఉపయోగపడే తక్కువ వ్యాప్తిలో పనిచేసే రాడార్ ఇది. దీన్ని సులభంగా మోసుకుని వెళ్లి, 5 నిమిషాల్లో అమర్చవచ్చు. అన్ని పరిస్థితుల్లో, అన్నివేళలా పనిచేస్తుంది. దీన్ని భారతసైన్యం, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఉపయోగిస్తాయి.

 

రోహిణి

ఇది త్రిమితీయ (3డీ), మధ్యంతర వ్యాప్తి నిఘా రాడార్. ఎస్-బ్యాండ్‌లో పనిచేసే ఈ డాప్లర్ రాడార్‌ని ఉపయోగించి గగనతలంలోని లక్ష్యాలను అత్యంత విశ్వసనీయతతో గుర్తించవచ్చు. త్రీ డైమెన్షన్స్‌లో భాగంగా ఇది 360ళ కోణం(అజిమత్)తో 18 కి.మీ.ల ఎత్తులోని లక్ష్యాలను గుర్తించగలదు. దీన్ని విమానాలు, రైళ్లు, వాహనాలన్నింటి ద్వారా సులభంగా రవాణా చేయవచ్చు. దీన్ని ఇండియన్ ఏయిర్‌ఫోర్స్ కోసం అభివృద్ధి చేశారు.

 

రేవతి

గగనతలం; సముద్ర ఉపరితలంపై ఉండే లక్ష్యాలను గుర్తించేందుకు నౌకల్లో ఉపయోగించే మధ్యంతర వ్యాప్తి ఉన్న త్రిమితీయ నిఘా రాడార్. డీఆర్‌డీవో, బీఈఎల్, ఎల్ అండ్ టీ సంస్థల భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేశారు. భారత నావికాదళంలో ఉపయోగించేందుకు దీన్ని తయారుచేశారు.

 

భరణి

ఇది బ్యాటరీతో నడిచే, తక్కువ ఎత్తులో పనిచేసే అల్ప బరువున్న 2డీ రాడార్ (ఎల్ఎల్ఎల్ఆర్). పర్వత ప్రాంతాల్లోకి వచ్చే శత్రువుల మానవరహిత (యూఏవీ), దూరం నుంచి నియంత్రించగల ఆర్‌పీవీ (రిమోట్లీ పైలెటెడ్ వెహికల్) వైమానిక వాహనాలను గుర్తించేందుకు ఉపయోగపడే 'గ్యాప్ ఫిల్లర్' రకానికి చెందిన రాడార్. దీనిలో ఇంద్ర-2 సాంకేతికతను ఉపయోగించారు.
* త్రిమితీయ (3డీ) రకానికి చెందిన ఎల్ఎల్ఎల్ఆర్‌ని 'ఆశ్లేష (Aslesha)' అని పిలుస్తారు.

 

రాజేంద్ర

ఇది అధిక శక్తి ఉన్న పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్‌డ్ అర్రే రాడార్ (పీఈఎస్ఏ). ఇది తక్కువ నుంచి మధ్యంతర ఎత్తులో ఎగిరే శత్రు విమానాలపైకి 12 ఆకాశ్ క్షిపణులను ప్రయోగించే సత్తాని కలిగి ఉంటుంది. ఏకకాలంలో అనేక లక్ష్యాలను, క్షిపణులను గుర్తించి.. వాటిపైకి క్షిపణులను ప్రయోగిస్తుంది. 80 కి.మీ.ల దూరంలో, 18 కి.మీ.ల ఎత్తులోని 64 లక్ష్యాలను గుర్తించడమే కాకుండా, వాటిలోని 4 లక్ష్యాలపై ఒక్కొక్కదానిపై 3 చొప్పున మొత్తం 12 క్షిపణులను ప్రయోగించగలదు.
* భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ జ్ఞాపకార్థం దీనికి రాజేంద్ర అని పేరు పెట్టారు.
* రాజేంద్ర రాడార్‌ని టీ-72 యుద్ధ ట్యాంకులపై అమర్చారు.

 

స్వాతి

శత్రువుల ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రాకెట్ లాంచర్లను ఇది గుర్తిస్తుంది. రాజేంద్ర రాడార్ నుంచి ఈ 3డీ రాడార్‌ని అభివృద్ధి చేశారు. ఇది కోహెరెంట్, ఎలక్ట్రానికల్లీ స్కాన్‌డ్ సి-బ్యాండ్ పల్స్ డాప్లర్ రాడార్. దీన్నే వెపన్ లొకేటింగ్ రాడార్ (డబ్ల్యూఎల్ఆర్) అని కూడా పిలుస్తారు.

 

ఆరుద్ర

ఇది 300 కి.మీ.ల దూరంలోని చిన్న లక్ష్యాలను గుర్తించే చతుర్మితీయ(4-డైమెన్షనల్) మీడియం పవర్ రాడార్ (ఎమ్‌పీఆర్). దూరం, కోణం(అజిమత్), ఎత్తుతోపాటు లక్ష్యం, వేగానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. దీన్ని భారత వైమానిక దళం ఉపయోగించనుంది.
ఇదే తరహాకి చెందిన 4డీ - లో లెవల్ ట్రాన్స్‌పోర్టబుల్ రాడార్ (ఎల్ఎల్‌టీఆర్) ని 'అశ్విని' అని పిలుస్తారు. ఇది 200 కి.మీ.ల దూరంలోని చిన్న, ఎగిరే లక్ష్యాలను గుర్తిస్తుంది.

 

భారత యుద్ధ ట్యాంకులు, వాహనాలు

 

అర్జున్

ప్రధాన యుద్ధ ట్యాంకు(ఎమ్‌బీటీ). దీన్ని చెన్నైలోని సీవీఆర్‌డీఈ, డీఆర్‌డీవో సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

 

అభ‌య్

ఇన్‌ఫ్యాన్ట్రి కంబాట్ వెహికల్. డీఆర్‌డీవో నమూనాని అవడిలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది.

 

టీ-90ఎం భీష్మ

ప్రధాన యుద్ధ ట్యాంకు(ఎమ్‌బీటీ). దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు.

 

టాటా - కెస్ట్రల్

టాటామోటార్స్, డీఆర్‌డీవో సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. ఆధునిక యుద్ధాల్లో సైనికులను కాపాడేందుకు రాబోయే కాలంలో వాడే కవచం ఉన్న తేలికపాటి వాహనం.

 

స‌ర్వత్ర

యుద్ధట్యాంకులు, ఇతర వాహనాలను నదులు దాటించేందుకు ఉపయోగించే మొబైల్ బ్రిడ్జి లేయింగ్ సిస్టం. దీన్ని డీఆర్‌డీవో, భారత్ ఎర్త్ మూవర్స్ (బెంగళూరు) సంయుక్తంగా రూపొందించాయి.

 

ద‌క్ష్

రిమోట్ కంట్రోలర్ సహాయంతో నడిచే రోబోటిక్ వాహనం.
పేలుడు పదార్థాలను గుర్తించి, నిర్వీర్యం చేస్తుంది.

Posted Date : 24-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌