• facebook
  • whatsapp
  • telegram

సవన్నాలు

అదో వేటగాళ్ల స్వర్గం.. ఇదో రొట్టెల గంప!


గడ్డిపోచ అనగానే అల్పమైన పరిమాణంగా అందరూ అనుకుంటారు కానీ, అయిదు అంతస్తులు మించి కూడా అది పెరుగుతుందంటే అమితమైన ఆశ్చర్యానికి గురికాక తప్పదు. నిజమే! ఉష్ణ, సమశీతోష్ణ మండలాల్లో ఆరు నుంచి పదహారు మీటర్ల వరకు పెరిగే గడ్డి భూములు ఉంటాయి. ఒక చోట రకరకాల జంతుజాలాలు ఉంటే, మరో చోట గోధుమ విస్తృతంగా పండుతుంది. అందుకే సవన్నాలు వేటగాళ్లకు స్వర్గంగా నిలిస్తే, స్టెప్పీలు రొట్టెల గంపగా మారాయి. ఆ ప్రాంతాలు అలాంటి విశిష్ట లక్షణాలను కలిగి ఉండటానికి కారణాలను, ఇంకా ఇతర ఆసక్తికరమైన విశేషాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

 


భూమధ్యరేఖ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లేకొద్దీ వర్షపాతం తగ్గి అడవులు పలుచనై చివరకు గడ్డి మాత్రమే పెరుగుతుంది. ఇలాంటి ప్రాంతాలను సవన్నాలు/అయన రేఖా తృణ మండలాలు లేదా ఉష్ణమండల పచ్చిక బయళ్లు లేదా సూడాన్ క్లైమేట్‌ అంటారు. అతిపెద్ద సవన్నా ప్రాంతం ఆఫ్రికా ఖండంలో ఉంది.


ఉనికి: 5 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య సవన్నా ప్రాంతం విస్తరించి ఉంది. 1) దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, బొలీవియా, పరాగ్వే, అర్జెంటీనాల సరిహద్దు. 2) దక్షిణ అమెరికాలోని కొలంబియా, వెనుజువెలా దేశాల్లోని ఒరినాకో బేసిన్‌ ప్రాంతం. 3) ఆఫ్రికా ఖండంలో భూమధ్యరేఖకు ఇరువైపులా అర్ధ చంద్రాకృతిలో విస్తరించి ఉంది.


దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, బొలీవియా, పరాగ్వే, అర్జెంటీనాల్లో వీటిని ‘కాంపోలు’; కొలంబియా, వెనుజువెలా దేశాల్లో ‘లానోలు’; ఆఫ్రికా ఖండంలో సవన్నాలు/ పార్క్‌ లాండ్స్‌/ఉద్యానవన భూములు అని పిలుస్తారు. సవన్నా మండలం అధికంగా ఆఫ్రికాలో, అందులోనూ సూడాన్‌లో ఎక్కువగా విస్తరించింది.


శీతోష్ణస్థితి లక్షణాలు:

* వేసవిలో వర్షాలు పడటం, శీతాకాలంలో పొడిగా ఉండటం ఈ మండలం విశిష్ట లక్షణాలు. సంవత్సరంలో కొంతకాలమే వర్షం కురిసి, మిగిలిన కాలమంతా పొడిగా ఉంటుంది.

* ఆఫ్రికాలో ప్రసిద్ధి చెందిన విక్టోరియా జలపాతం ఈ మండలంలోని ‘జాంబేజి’ నదిపై ఉంది.  ప్రపంచంలో ఇప్పటివరకు అత్యధిక వర్షపాతం హవాయిలోని కౌవాయి ద్వీపంలో ఉన్న వయోలీలీ శిఖరంపై నమోదైంది. (1234 సెం.మీ.)


వృక్ష సంపద:  ఈ ప్రాంత భూభాగమంతా ఒకటి నుంచి ఆరు మీటర్ల ఎత్తు పెరిగే లావు గడ్డితో విస్తరించి ఉంటుంది. దీన్నే ఏనుగు గడ్డి అంటారు. దక్షిణ అమెరికాలో లావు గడ్డితో పాటు ‘క్వెబ్రాషో’ వృక్షాలు పెరుగుతాయి. వీటి నుంచి తయారుచేసే ‘టానిన్‌’ను జంతువుల చర్మాల శుద్ధిలో ఉపయోగిస్తారు.


జంతుసంపద: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా జంతువైవిధ్యం ఉన్న శీతోష్ణస్థితి ప్రాంతమిది. అందుకే ఈ ప్రాంతాలను ప్రపంచ వేటగాళ్ల స్వర్గం, సహజ జంతు ప్రదర్శనశాలగా పిలుస్తారు. ఇక్కడే కాసావారి అనే ప్రమాదకరమైన పక్షి ఉంటుంది. పచ్చ జ్వరానికి కారణమయ్యే సి.సి.ఈగ, ఆస్ట్రిచ్‌ పక్షి సంతతి ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి.


ఖనిజ సంపద: బాక్సైట్‌: జమైకా. కాపర్‌: జైరీలోని కటంగా ప్రాంతంలో అత్యధికంగా రాగి నిక్షేపాలు కేంద్రీకృతమై ఉన్నాయి.


ఆదిమ తెగలు: * కెన్యా, టాంజానియా సరిహద్దుల్లో ‘మసాయి’ అనే ఆదిమ తెగలుంటాయి. వీరి ప్రధాన వృత్తి పశుపోషణ. 

* కెన్యాలో వేట ప్రధానవృత్తిగా నివసించే ఆదిమతెగ ‘కికియు’. 

* నైజీరియాలో వేట ప్రధాన వృత్తిగా ‘హౌసా’ అనే ఆదిమ తెగ ఉంది. 

* వెనుజువెలాలో వేట ప్రధానవృత్తిగా ఉన్న ఆదిమ తెగ ‘లానెరో’.


ముఖ్యమైన అంశాలు:

* హవాయి ద్వీపం అనాస పండ్లకు ప్రసిద్ధి.

* ఆస్ట్రేలియాలోని సవన్నా ప్రాంతంలో కనిపించే విశిష్ట జంతువు కంగారు.

* సవన్నా గడ్డి భూముల్లో పండే ప్రధాన పంట చెరకు.

* సవన్నా ప్రాంతంలో నాణ్యమైన చుట్టల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన దేశం క్యూబా. ఇక్కడ తయారైన చుట్టలకు హవానా చుట్టలని పేరు.


స్టెప్పీ శీతోష్ణస్థితి


వర్షపాతం తగినంతగా లేకపోవడంతో ఈ మండలంలోని విశాలమైన ప్రాంతాలు గడ్డి భూములుగా మారాయి. వీటినే సమ శీతోష్ణ మండల పచ్చిక బయళ్లు అంటారు. ఇక్కడ పచ్చికే ప్రధాన వనరు. పశుపోషణ ప్రజల ప్రధాన వృత్తి. జనావాసాలు దూర దూరంగా ఒయాసిస్సుల వద్ద లేదా విలువైన ఖనిజాలు లభించే ప్రాంతాల్లో ఉన్నాయి. 


సమశీతోష్ణ మండల గడ్డి భూములను వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. వీటిని రష్యాలో స్టెప్పీలు, అర్జెంటీనాలో పంపాలు, దక్షిణాఫ్రికాలో వెల్డులు, ఉత్తర అమెరికాలో ప్రయరీలు, ఆస్ట్రేలియాలో డౌన్స్, హంగేరీలో పుస్తాజ్‌ అని పిలుస్తారు.


ఉనికి: 40 డిగ్రీల నుంచి 55 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఖండాంతర్గత ప్రాంతాల్లో ఈ భూములు విస్తరించి ఉన్నాయి. ఈ మండలంలో పచ్చిక బయళ్లు ప్రధానంగా విశాలమైన ఖండాంతర్గత ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లోని పర్వతాల వర్షచ్ఛాయా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.

* సమశీతోష్ణ మండల పచ్చిక బయళ్లు యురేషియాలోని ఉక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతం నుంచి కాస్పియన్‌ సముద్రం వరకు ఉన్నాయి. వాయవ్య చైనాలోని లోయస్‌ మెట్ట భూముల్లో, తుర్కియేలోని అనటోలియా పీఠభూమిలో, స్పెయిన్‌లోని స్పానిష్‌ మెసెటా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.

* ఉత్తర అమెరికా ఖండంలో ఈ సహజ మండలం తూర్పు వైపున 100 డిగ్రీల పశ్చిమ రేఖాంశం, పశ్చిమం వైపు ఇంటర్‌ మౌంటెయిన్‌ ప్రాంతాల మధ్య విస్తరించింది.

* దక్షిణ అమెరికాలో అర్జెంటీనాలో అండీస్‌ పర్వతాల వర్షచ్ఛాయా ప్రాంతంలోని ‘పెటగోనియా’ పీఠభూమి ప్రాంతంలో ఉన్నాయి.

* దక్షిణా ఆఫ్రికాలో బ్రాకెన్స్‌ బర్గ్‌ పర్వతాల పశ్చిమం వైపున ఉన్నాయి.

* ఆస్ట్రేలియాలో న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్రంలో ఈస్టర్‌ హైలాండ్స్‌ పర్వతాలకు పశ్చిమంగా విస్తరించి ఉన్నాయి. 


శీతోష్ణస్థితి:

* ఇవి అర్ధశుష్క ప్రాంతాలు. ఏడాది మొత్తం ఆర్ధ్రత తక్కువగా, వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం ఈ ప్రకృతి సిద్ధమండల విశిష్ట లక్షణం.

* వరుసగా కొన్ని సంవత్సరాలు వర్షపాతం సంభవించి, ఆ తర్వాత మరి కొన్నేళ్లపాటు కరవు పరిస్థితులు ఏర్పడతాయి.

* ఇక్కడి వర్షపాతం అయనరేఖా ప్రాంతాలకు దగ్గరలో సంవహన రీతిలోనూ, సమశీతల ప్రాంతాల్లో చక్రవాత రూపంలోనూ ఉంటుంది. 

* ప్రయరీలు ‘చినూక్‌’ అనే ఉష్ణపవనాల వల్ల వెచ్చగా ఉంటాయి.

* స్టెప్పీలు ‘బురాన్‌’ అనే శీతలపవనాల వల్ల శీతలంగా ఉంటాయి.

* వర్షపాతం  తగినంతగా లేకపోవడంతో ఇక్కడ సహజవృక్ష సంపద ఎక్కువగా ఉండదు. 1 నుంచి 16 మీటర్ల ఎత్తు పెరిగే ఆల్ఫా-ఆల్ఫా అనే పోషక విలువలతో కూడిన గడ్డి పెరుగుతుంది. అక్కడక్కడా చిట్టడవుల్లో పెరిగే వృక్షజాతుల వంటివి కనిపిస్తాయి.


వ్యవసాయ రంగం: ఈ ప్రాంతాల్లో ప్రజల ప్రధాన ఆర్థిక వృత్తి పశుపోషణ. ఇక్కడ పశువులకు కావాల్సిన పశుగ్రాసం చౌకగా, సమృద్ధిగా లభ్యమవుతుంది. గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఒంటెలను ఎక్కువగా పెంచుతుంటారు. ప్రపంచంలో గొర్రెల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది. నాణ్యమైన ఉన్ని ఇచ్చే  మెరీనో జాతి గొర్రెల ఉత్పత్తిలో ఆస్ట్రేలియా ప్రథమ స్థానంలో ఉంది. ఉన్ని ఉత్పత్తి, ఎగుమతుల్లో ఆస్ట్రేలియాదే అగ్రస్థానం.

* అర్జెంటీనాలో గొర్రెలను పెద్దపెద్ద ఎస్టేట్లలో పెంచుతారు. వీటినే ఎస్టాన్షియాలు అని పిలుస్తారు.

* యురేషియాలోని స్టెప్పీ ప్రాంతాల్లో గొర్రెలను పెంచే స్థలాలను రాంచీలని, గొర్రెల పెంపకదారులను రాంచర్లు అని పిలుస్తారు.

* అమెరికాలో నాణ్యమైన ఉన్నినిచ్చే అంగోరా జాతి మేకలను ఎక్కువగా పెంచుతారు. భారత్‌లో పష్మీనా జాతి మేకలను జమ్ము-కశ్మీర్‌లో పెంచుతారు.

* ఈ ప్రాంతంలో వ్యవసాయం ప్రజల ద్వితీయ వృత్తి. ప్రధానంగా సాగయ్యే పంట గోధుమ. ప్రపంచంలో గోధుమ ఎక్కువగా సమశీతోష్ణ మండల ప్రాంతాల్లోనే సాగు చేస్తారు. అందుకే ‘ప్రపంచ గోధుమ ధాన్యాగారాలు’అని ఈ ప్రాంతాలను పిలుస్తారు.

* ప్రపంచంలో గోధుమ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం చైనా. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే దేశం ఉక్రెయిన్‌. అందుకే దీన్ని ‘ప్రపంచ రొట్టెల గంప’ అంటారు.


మత్స్యసంపద: ఆసియా ఖండంలోని ఈ ప్రకృతి సిద్ధ మండల ప్రాంతాల్లోని నల్ల సముద్రం, ఎజోర్స, కాస్పియన్, అరల్‌ వంటి భూ పరివేష్టిత సముద్రాలతో పాటు సరస్సులు, నదుల్లో చేపల వేట సాగుతోంది. ప్రధానంగా కార్ప్, హెర్రింగ్, సాల్మన్, స్టర్జియాస్‌ రకాల చేపలు లభిస్తున్నాయి.


ఖనిజ సంపద: ఈ ప్రకృతిసిద్ధ మండలంలో శ్రేష్ఠమైన ఇనుప ఖనిజం, నేల బొగ్గు, మాంగనీసు, రాగి, బంగారం, వజ్రాలు తదితర ఖనిజాలు లభిస్తున్నాయి. బంగారు నిక్షేపాలకు ‘విట్‌ వాటర్స్‌ రాండ్‌’, వజ్రాల నిక్షేపాలకు ‘కింబర్లే’ ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి.


స్టెప్పీ ప్రాంతంలో ఆదిమ జాతులు: 1) ఏషియాటిక్‌ స్టెప్పీ ప్రాంతంలో నివసించేవారు. కిర్గిజ్లు, కజక్స్,  కాలముక్స్‌. కిర్గిజ్లు నిర్మించుకునే ఇళ్లను యర్ట్స్‌ అంటారు. కిర్గిజ్లకు మరొక పేరు తార్తార్లు. మంచి అశ్వికులుగా పేరు పొందారు. 2) ఉత్తర అమెరికాలోని ప్రయరీ ప్రాంతంలో నివసించేవారు రెడ్‌ ఇండియన్స్‌. 3) దక్షిణాఫ్రికాలోని వెల్డ్‌ ప్రాంతంలో నివసించే పశుపోషకులను హట్టేస్టాట్స్‌ అంటారు. వీరి నివాస గృహాలను ‘టుపిక్స్‌’ అని పిలుస్తారు.


ముఖ్యాంశాలు:

* సమశీతోష్ణ గడ్డి భూముల్లో అత్యధికంగా పండే పంట గోధుమ.

* ప్రపంచ మొక్కజొన్న ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం అమెరికా.  

* ప్రపంచంలోని అతిపెద్ద మాంసం ప్యాకింగ్‌ కేంద్రం షికాగో.

* సమశీతోష్ణ గడ్డి భూముల్లో పెరిగే అత్యంత పోషకాహార విలువలున్న గడ్డి ఆల్ఫా-ఆల్ఫా.

* ప్రపంచంలో గొర్రెల పెంపకానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం అర్జెంటీనాలోని పెటగోనియా.

* ప్రపంచ ప్రసిద్ధి చెందిన విట్‌ వాటర్స్‌ ర్యాండ్‌ బంగారు గనులకు ప్రసిద్ధి. ఇది దక్షిణాఫ్రికాలో ఉంది.

* కింబర్లే వజ్రాల గనులు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.

*అర్జెంటీనాలోని గొర్రెలను పెంచే పెద్దఎస్టేట్లు లేదా పశువుల రాంచీలను ‘ఎస్టాన్షియా’ అని పిలుస్తారు.

* రష్యాలోని ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలను కోల్కోజస్‌ అంటారు. ఇక్కడి ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాలకు ‘సాప్‌ కోజస్‌’అని పేరు.


రచయిత: సక్కరి జయకర్‌ 

Posted Date : 14-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌