• facebook
  • whatsapp
  • telegram

శాస్త్ర సాంకేతిక రంగాల ఆవిర్భావం - నిర్వచనం

శాస్త్ర సాంకేతిక రంగం మానవ జీవితంలో ఒక భాగంగా మారింది. దీని వల్లే మన రోజువారీ కార్యకలాపాలన్నీ సులభతరం అయ్యాయి. జీవుల మనుగడ ప్రారంభం నుంచి నేటి వరకు వైజ్ఞానిక రంగంలో ఎంతో అభివృద్ధి జరిగింది. సైన్స్‌పరంగా నూతన అన్వేషణలు, ఆవిష్కరణల దిశగా ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

* ‘సైన్స్‌ (సామాజికశాస్త్రం)’ అనే పదం సైన్షియా (Scientia) అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. దీని అర్థం జ్ఞానం.

* సైన్స్‌ ఆవిర్భావం నాటికి భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, తత్త్వశాస్త్రం, వేదాంతశాస్త్రం మొదలైన వాటన్నింటినీ కలిపి ‘సామాజికశాస్త్త్ర్రం’ లేదా ‘విజ్ఞానశాస్త్రం’గా పిలిచేవారు. తర్వాత సహజ, భౌతిక పరిసరాల అధ్యయనాన్ని సైన్స్‌గా పేర్కొన్నారు.

* సైన్స్‌ అనే అర్థంలో విస్తృతంగా పరిసరాల వివరణ, ప్రయోగ పరిశీలన, సిద్ధాంత అధ్యయనం, భౌతిక-జీవరాశుల ప్రవర్తన, వివిధ ప్రక్రియల అధ్యయనం మొదలైనవన్నీ భాగంగా ఉంటాయి.* టెక్నాలజీ లేదా సాంకేతికశాస్త్రాన్ని సైన్స్‌గా పరిగణించరు. దీన్ని మానవ అవసరాల కోసం ఉపయోగించే సైన్స్‌ అనువర్తనాలుగా నిర్వచించారు.

* సాంకేతికశాస్త్రం నిరంతర అన్వేషణల సమాహారం. దీన్ని మానవ అవసరాలు, సౌలభ్యం కోసం చేసిన ఆవిష్కరణగా చెప్పొచ్చు.

* సాంకేతికశాస్త్రం (Technology) టెక్నొలోజియా (Technologia) అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. సాంకేతికతను, సైన్స్‌ను ఉపయోగించి క్రమ పద్ధతిలో ప్రక్రియలు నిర్వహిస్తారు. 

* మనిషి మెరుగైన జీవనోపాధికి, సౌకర్యవంతమైన జీవనశైలి కోసం ఎప్పటికప్పుడు సాంకేతికతను ఆధునికీకరించి, మెరుగైన ఫలితాలను పొందేలా నిత్యాన్వేషణ చేస్తున్నాడు. 

ఉదా: ఇంజినీరింగ్‌ విద్యలో పుస్తక జ్ఞానాన్ని పొందడం సైన్స్‌గా అనుకుంటే, దాని అనువర్తనాలను పరికరాలకు అనుసంధానం చేసి మెరుగైన ఫలితాలను సాధించడం టెక్నాలజీగా భావించవచ్చు.

భారత్‌లో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి - చరిత్ర

నాగరికత: నాగరికత ప్రారంభం నుంచే మనదేశంలో ప్రజల జీవనశైలిపై శాస్త్ర సాంకేతిక రంగాల ప్రభావం ఉంది. క్రీ.పూ.2500లోనే భారతీయులు నాగరికత, నూతన పోకడలను అవలంబించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు.

* సింధూ నాగరికతకు చెందిన ప్రజలు చక్రం వాడారు. భూమిని నాగలితో దున్నారు. కొలిమి సాయంతో లోహాలను కరిగించారు. అగ్నిని నియంత్రించి, వరదలను తట్టుకునే కట్టడాలను నిర్మించారు. అద్భుతమైన భవనాలు, స్నానఘట్టాలు, ధాన్యాగారాలను కట్టారు. నిర్మాణాల్లో కాల్చిన ఇటుకలను వాడారు. డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. వీధులు క్రమపద్ధతిలో ఉండేవి. వీటన్నింటినీ సింధూ ప్రజల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఆనవాళ్లుగా చెప్పొచ్చు.

గణిత విజ్ఞానం: వైదిక కాలంలో సాంకేతికతపై మేధో విచారణ ప్రారంభమై, అనేక కొత్త ఆవిష్కరణలు జరిగాయి. ఈ కాలంలోనే  సుల్వ సూత్రాలను (Sulva sutras) కనుక్కున్నారు. బలిపీఠాల ఆకృతులు, నిర్మాణాల్లో రేఖాగణితాన్ని ఉపయోగించారు. ఈ కాలంలోనే వివిధ రకాల గణితశాస్త్ర ఆవిష్కరణలు జరిగాయి. ఇవన్నీ నేటితరం గణితశాస్త్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. 

* ‘సున్నా’ను కనుక్కున్నది భారతీయ శాస్త్రవేత్తలే అని చరిత్రకారుల అభిప్రాయం. 

* భారతీయులు కనిపెట్టిన అరబిక్‌ సంఖ్యలను అరబ్బులు ‘‘హింద్‌సా’’ (Hindsa)గా పిలిచేవారు. ఇవి హిందుస్థాన్‌ నుంచి ఉద్భవించాయి కాబట్టి ఆ పేరు పెట్టారు. 

* గణిత శాస్త్రవేత్తలైన ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, మహావీర, భాస్కర-II మొదలైన వారు కనుక్కున్న గణితశాస్త్ర సూత్రాలనే నేటికీ మనం వాడుతున్నాం. 

ఉదా: ఆర్యభట్ట 兀 విలువను 3.1416గా నిర్వచించారు. భాస్కర-II తన ‘సిద్ధాంత శిరోమణి’ గ్రంథంలో బీజగణితం (ఆల్జీబ్రా)ను మొదటిసారి ప్రతిపాదించారు.

ఖగోళశాస్త్రం: ఖగోళశాస్త్రంపైనా భారతీయులు పరిశోధనలు చేశారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతోందని మొదటిసారిగా పేర్కొన్న శాస్త్రవేత్త ఆర్యభట్ట. భూభ్రమణం, భూపరిభ్రమణం గురించి కచ్చితంగా చెప్పారు. 

* భారతదేశం నుంచి వెలువడిన ‘పంచ సిద్ధాంతం’, ‘సూర్య సిద్ధాంతం’ ఎంతో ప్రాచుర్యం పొందాయి.

* 18వ శతాబ్దంలో జైపూర్‌ రాజు అయిన రాజా సవాయ్‌ జైసింగ్‌-ఖిఖి ఉజ్జయిని, వారణాసి, మధుర, జైపూర్, ఢిల్లీల్లో ఖగోళశాస్త్ర అబ్జర్వేటరీలు ఏర్పాటు చేశారు. జైపూర్, ఢిల్లీల్లో ఉన్నవి నేటికీ తమ సేవలు అందిస్తున్నాయి.

రసాయనాలు - పరిశ్రమలు: రసాయనశాస్త్రం, మందుల తయారీలోనూ భారతదేశం ముందంజలో ఉంది. రంగుల అద్దకం, కాగితం ఉత్పత్తి అత్తర్ల తయారీ, పంచదార పరిశ్రమ, ఖనిజాల అన్వేషణ, కొత్త లోహాల మిశ్రమాల తయారీ మొదలైనవి మనదేశంలోనే ప్రారంభమయ్యాయి.

వ్యవసాయ రంగం: ప్రాచీన భారతీయులు వ్యవసాయ రంగంలోనూ నూతన ఆవిష్కరణలు చేశారు. ఆనకట్టల నిర్మాణం, కాలువలు తవ్వడం, నీటి మళ్లింపు లాంటి పనులు నిర్వహించారు.

* కొన్ని శతాబ్దాల క్రితమే ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతిని కనుక్కున్నారు. పచ్చళ్లు, ఒరుగులు, మురబ్బాలు, వెన్న, నెయ్యి తయారీ లాంటివి చేశారు. 
నిర్మాణాలు: రాతికట్టడాలు, ఏకశిలాలయాలు, వజ్రలేప (అత్యంత గట్టిగా ఉండే సిమెంటు)తో కట్టిన నిర్మాణాలు, లక్క కట్టడాలు మొదలైనవి భారత చరిత్ర, సంస్కృతికి నిదర్శనంగా ఉన్నాయి. 

* మధ్యయుగంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన కట్టడాలు హిందూ-ఇస్లామిక్‌ సంప్రదాయ రీతిలో కనిపిస్తాయి. 

* హైడ్రాలిక్స్‌ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన నిర్మాణాలు, వేడి-చల్లటి నీటిని విడిగా పంపే పంపులు మొదలైనవి భారతీయ వారసత్వంగా పేర్కొంటారు.

యుద్ధాలు: ప్రాచీన భారతీయులు శాస్త్ర సాంకేతికత ద్వారా తమ యుద్ధరీతిలో మెరుగైన ప్రతిభను కనబరిచారు. 16, 17వ శతాబ్దాల్లో అత్యాధునిక మర ఫిరంగులు, తుపాకులను వాడారు.

* 13వ శతాబ్దంలోనే నావికులు నావిగేషన్‌ పద్ధతిని అనుసరించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. యూరప్‌ ఖండానికి చెందిన ఓడలను సైతం భారత్‌లో నిర్మించినట్లు ఆధారాలున్నాయి.

సవాళ్లు

శాస్త్ర సాంకేతిక రంగం వల్ల అభివృద్ధితో పాటు వినాశనమూ సంభవించొచ్చు. భారత్‌ లాంటి అధిక జనాభా కలిగిన దేశాల్లో వీటి నియంత్రణ కష్టతరంగా మారింది. మనదేశంలో నేటికీ వెనుకబడిన వర్గాల ప్రజలకు కనీస అవసరాలైన  మంచినీరు, పారిశుద్ధ్యం, ఆహారం, వైద్యం, విద్య లాంటివి అందుబాటులోకి రాలేదు. ఈ అవసరాలను తీర్చడంతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల వృద్ధి వేగంగా జరిగినప్పుడే దేశం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుంది.

ఆరోగ్యరంగం

ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు ఆరోగ్య రంగం అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. అథర్వణవేదం భారతీయ వైద్యరంగ భాండాగారంగా ప్రసిద్ధి చెందింది.

* ప్రాచీన కాలంలో వ్యాధి లక్షణాలు, తీవ్రత బట్టి మూలికా వైద్యాన్ని అనుసరించేవారు. దీన్ని ఇప్పటికీ గ్రామాల్లో ఆచరిస్తున్నారు. 

* సుశ్రుతుడి సుశ్రుత సంహిత, చరకుడు నిక్షిప్తం చేసిన చరక సంహిత భారత ప్రాచీన ఆయుర్వేద వ్యవస్థకు మార్గదర్శకాలుగా పేర్కొంటారు. 

* శస్త్ర చికిత్సా నైపుణ్యాలు సైతం రెండు వేల సంవత్సరాలకు పూర్వమే భారతీయులకు తెలుసని, అవి భారత్‌ నుంచి మిగిలిన ఖండాలకు వ్యాపించాయని విశ్లేషకుల అభిప్రాయం.

శాస్త్ర సాంకేతిక రంగం ప్రగతి

* వలసవాద రాజ్యాలు, ముస్లిం దాడులు, బ్రిటిష్‌ ఆధిపత్యం కారణంగా భారత్‌లో శాస్త్ర సాంకేతిక రంగం మందగించింది. 

* బ్రిటిష్‌ వారు స్వదేశీ ఉత్పత్తిదారులను అణచివేసి, భారతీయులు విదేశీ వస్తువులకు అలవాటు పడేలా ప్రోత్సహించారు. 

* ఈ అణచివేత కారణంగా భారత్‌లోని యువత నూతన శాస్త్ర సాంకేతిక రంగం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది.

* సర్‌ విలియమ్‌ జోన్స్‌ 1784లో ‘ద ఫౌండేషన్‌ ఆఫ్‌ ఏషియాటిక్‌ సొసైటీ’ని స్థాపించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు వేసిన తొలి అడుగుగా దీన్ని పేర్కొంటారు. ఈ సొసైటీ ద్వారా 1866లో ‘ఇండియన్‌ మ్యూజియం ఆఫ్‌ కలకత్తా’ను ఏర్పాటు చేశారు.

* 1876లో డాక్టర్‌ మనేంద్ర సర్కార్‌ ‘ద ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద కల్టివేషన్‌ ఆఫ్‌ సైన్స్‌’ను నెలకొల్పారు. తర్వాత కలకత్తా, లఖ్‌నవూ, మద్రాస్, పుణె మొదలైన ప్రాంతాల్లో శాస్త్ర పరిశోధనా సొసైటీలను ఏర్పాటు చేశారు. అక్కడ వివిధ పరిశోధనలను ప్రయోగాత్మకంగా వివరించారు. అనేక రకాలైన పరిశోధనా పత్రాలు అచ్చు వేశారు.

* 1851లో జియాలజీ ప్రొఫెసర్‌ థామస్‌ ఓల్డ్‌హామ్‌ నేతృత్వంలో ‘జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ను ఏర్పాటు చేశారు. ఇది భూగర్భశాస్త్ర పరిశోధనలకు పునాది వేసింది.

* మనదేశంలో 1788లో ‘బొటానికల్‌ గార్డెన్‌’ ఏర్పాటైంది. అయితే భారత్‌లో మొక్కలపై అధ్యయనం కోసం పరిశోధన సంస్థ లేదు. డా.విలియం రాక్స్‌బెర్రీ ఆధ్వర్యంలో 1890లో ‘ద బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ను ఏర్పాటు చేశారు. 

* జాన్‌ అండర్‌సన్‌ కృషి ఫలితంగా 1916లో  ‘ఇండియన్‌ మ్యూజియం’ పేరును ‘జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’గా మార్చారు.

* పారిశ్రామిక పరిశోధనల కోసం 1942లో ‘ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ ఫండ్‌’ను నెలకొల్పారు. తర్వాతి దశలో కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)ను ఏర్పాటు చేశారు. ఇది స్వయం ప్రతిపత్తి సంస్థ.

* వ్యవసాయ పరిశోధనల కోసం 1929లో ‘ఇంపీరియల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌’ను స్థాపించారు.

19వ శతాబ్దంలో ఏర్పాటు చేసిన వివిధ శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థలు

* 1911 - ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, బెంగళూరు

* 1917 - ది బోస్‌ ఇన్‌స్టిట్యూట్, కలకత్తా

* 1934 - ది ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సెన్స్, బెంగళూరు.

* 1945 - టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌), ముంబయి

* 1947 - శ్రీరామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ 

భారత స్వాతంత్య్రానంతరం ఈ పరిశోధనా సంస్థలన్నీ ఉన్నత స్థాయి విశ్వవిద్యాలయాలుగా మారి, వివిధ స్థాయుల్లో అకడమిక్, పరిశోధన సంబంధ సేవలు అందిస్తున్నాయి.

పారిశ్రామికంగా వర్గీకరణ

* పరిశ్రమలు-ఉత్పత్తి రంగంలో సాంకేతిక

శాస్త్రాన్ని ప్రధానంగా మూడు భాగాలుగా వర్గీకరించారు. అవి:

i)  కనిష్ఠం       ii) తగినంత లేదా మధ్యస్థ      iii) గరిష్ఠం 

కనిష్ఠ సాంకేతికత: వివిధ శాస్త్రీయ పరికరాలను ఎలా వాడాలో దీని ద్వారా తెలుస్తుంది. ఈ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా శ్రామికులకు స్థాన చలనం ఉండదు. 

తగినంత లేదా మధ్యస్థ సాంకేతికత: టెక్నాలజీ సాయంతో మధ్యస్థ ఉత్పత్తులను వేగవంతంగా తయారు చేసి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతారు.

గరిష్ఠ సాంకేతికత: దీన్ని ఉపయోగించి కమ్యూనికేషన్, అంతరిక్ష, అణ్వస్త్ర రంగాల్లో పరిశోధనలు చేస్తున్నారు. గరిష్ఠ సాంకేతికత సాయంతో మానవుడు వెళ్లలేని ప్రదేశాల్లోనూ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. 

Posted Date : 02-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌