• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - రుతుపవన పద్ధతి

* భారతదేశంలోని రుతుపవన వ్యవస్థను అనుసరించి, ప్రధానంగా మూడు కాలాల్లో పంటలు పండిస్తున్నారు. అవి: ఖరీఫ్‌ పంట కాలం, రబీ పంటకాలం, జాయద్‌ పంట కాలం

ఖరీఫ్‌ పంట కాలం: నైరుతి రుతుపవనాలు మొదలైన వెంటనే భూమిని దున్ని, విత్తనాలు చల్లి, శీతాకాలానికి ముందే పంటను కోసి నిల్వ చేస్తారు. ఇందులో వర్షాలపై ఆధారపడి పంటసాగు చేస్తారు. దీని కాలం జూన్‌ - అక్టోబరు మధ్య ఉంటుంది. ఖరీఫ్‌లో ప్రధానంగా వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, పప్పుధాన్యాలను సాగు చేస్తారు.

రబీ పంట కాలం: శీతాకాలంలో పండించే పంటలు రబీ పంట కాలం కిందకి వస్తాయి. ప్రధానంగా వర్షం, తేమపై ఆధారపడి పంట సాగు ఉంటుంది. 

* శీతాకాలం చివర్లో విత్తనాలను చల్లితే, వేసవి వచ్చే సమయానికి పంట చేతికి అందుతుంది. 

* పంట కాలం నవంబరు - మార్చి మధ్యలో ఉంటుంది. రబీలో గోధుమ, బార్లీ, బఠానీ, ఆవాలు, ధనియాలు, నూనె గింజలు మొదలైనవి పండిస్తారు.

జాయద్‌ పంట కాలం: రబీ, ఖరీఫ్‌ మధ్య సాగు చేసే పంటలు జాయద్‌ పంట కాలం కిందికి వస్తాయి. ఇది వేసవి కాలంలో మార్చి - జూన్‌ మధ్య ఉంటుంది. ఇందులో స్వల్పకాలిక పంటలు పండిస్తారు.

* నీటి పారుదల వసతి ఎక్కువగా ఉన్నచోట పండ్లు, కూరగాయలు, పశుగ్రాసం, కర్బూజ, పుచ్చకాయలు, కొన్ని రకాలైన పప్పుధాన్యాలను పండిస్తారు.

సాగుచేసే పద్ధతులు

మనదేశంలో వివిధ రకాల సాగు పద్ధతులు అమల్లో ఉన్నాయి. విభిన్న శీతోష్ణస్థితులు - మృత్తికలు; ఇతర భౌతిక, సాంఘిక, ఆర్థిక అంశాల కారణంగా ఇవి ఆచరణలోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి.

తేమ సాగు: ఇది 100200 సెం.మీ. వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఉంది. పశ్చిమ తీర ప్రాంతం, పశ్చిమ్‌ బంగా, బిహార్, ఉత్తర్‌ ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ఈ పద్ధతి చూడొచ్చు. 

* వరి, చెరకు, జనపనార మొదలైన పంటలను తేమ సాగులో పండిస్తారు.

విస్తాపన సాగు: ఇది ప్రాథమిక వ్యవసాయ పద్ధతి. గిరిజనులు అడవులను నరికి, ఆ ప్రాంతాన్ని కాల్చి, వర్షాకాలంలో పంట సాగు చేస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లి మళ్లీ ఇదే పద్ధతిని అవలంబిస్తారు. విస్తాపన సాగులో మొక్కజొన్న, తైదలు, కూరగాయలు, పెరటి తోటలు పండిస్తారు. 

సాంద్రత సాగు: దీన్నే జీవనాధార వ్యవసాయం అంటారు. ఈ విధానంలో భూమిని నాగలితో దున్ని పంట సాగు చేస్తారు. జనాభా, జనసాంద్రత, శ్రామిక శక్తి ఎక్కువగా ఉన్న చోట ప్రణాళికాబద్ధంగా పంటలు పండిస్తారు. ఈ విధానం భారత్, యూరోపియన్‌ దేశాల్లో అమల్లో ఉంది.

తోట సాగు: ఇందులో ఒకే పంటను ఏళ్ల తరబడి సాగు చేస్తారు. దీన్నే ఎస్టేట్ల రూపంలో పండించే పద్ధతి అంటారు. ఈ విధానంలో ఫలసాయం (దిగుబడి) 5 నుంచి 35 ఏళ్ల వరకు ఉంటుంది.

ఉదా: అసోం, పశ్చిమ్‌ బంగాలో పండించే తేయాకు; కర్ణాటక, తమిళనాడులో సాగుచేసే కాఫీ తోటలు, కేరళలోని రబ్బరు తోటలు, ఆంధ్రప్రదేశ్‌లో పెంచే జీడిమామిడి తోటలు.

పంటమార్పిడి సాగు: ఏటా ఒకే రకం పంటను వేయడం వల్ల మృత్తికల్లో ఉండే భూసారం తగ్గిపోతుంది. దీన్ని నివారించేందుకు వివిధ రకాల పంటలను ఒకదాని తర్వాత మరొకటి పండిస్తారు. 

* ఈ పద్ధతి ద్వారా కలుపు మొక్కలను నివారించి, తెగుళ్లు - వ్యాధులను నియంత్రించవచ్చు. 

మిశ్రమసాగు: ఈ పద్ధతిలో మృత్తికలను కేవలం పంటల కోసమే కాకుంగా ఇతర అవసరాలకు ఉపయోగిస్తారు. ఉదా: పౌల్ట్రీ ఫారాలు, సెరికల్చర్‌ ద్వారా పట్టు పురుగుల పెంపకం, ఎపికల్చర్‌ ద్వారా తేనెటీగలు పెంచడం మొదలైనవి.

వ్యవసాయ విప్లవాలు

భారతదేశంలో స్వాతంత్య్రానంతరం ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు అనేక చర్యలు చేపట్టారు. వివిధ ప్రణాళికల్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. 1960 దశకం మధ్యలో మనదేశంలో అనేక వ్యవసాయ విప్లవాలు ప్రారంభమయ్యాయి. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆమె వీటిని మరింత ప్రోత్సహించారు. అందుకే ఆమెను ‘భారతదేశ వ్యవసాయ విప్లవాల మాత’ అంటారు.

హరిత విప్లవం: 

* 1960వ దశకంలో హరిత విప్లవం ప్రారంభమైంది. దీని రూపకర్త అమెరికా శాస్త్రవేత్త డాక్టర్‌ విలియం ఎస్‌ గాండే. అధిక దిగుబడి వంగడాలను ఉపయోగించి ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం దీని లక్ష్యం. 

* దీన్ని మొదట నార్మన్‌ బోర్లాగ్‌ భారత్‌లో ప్రవేశపెట్టగా, ఎం.ఎస్‌.స్వామినాథన్‌ అభివృద్ధి చేశారు. అందుకే స్వామినాథన్‌ను  హరితవిప్లవ పితామహుడిగా పేర్కొంటారు. 

* హరిత విప్లవంలో అధిక దిగుబడి వంగడాలను వేసి, ఎరువుల వినియోగాన్ని పెంచి, నీటిపారుదలను అభివృద్ధి చేసి, శాస్త్రీయ పద్ధతులను అమలు చేస్తారు.

వ్యవసాయ అనుబంధ కల్చర్స్‌

సిల్వికల్చర్‌: అటవీ మొక్కల సాగు, పెంపొందించడం

సెరికల్చర్‌: పట్టు పరుగుల ఉత్పత్తిని పెంచడం

హార్టీకల్చర్‌: ఉద్యాన పంటలు ్బపండ్లు, పూలు, కూరగాయలు) పెంచడం

పిసికల్చర్‌: చేపల సాగు

ఎపికల్చర్‌: తేనెటీగల పెంపకం

ఓలేరికల్చర్‌ (Oleri): కలప రహిత, కూరగాయ  మొక్కలు సాగు చేయడం

విటికల్చర్‌: ద్రాక్ష సాగు, అధ్యయనం

ఫ్లోరికల్చర్‌: పూల మొక్కలు పెంచడం

ఏరోపోనిక్‌ కల్చర్‌: వాతావరణంలోని గాలి/ తేమలో మొక్కలు పెంచడం

హైడ్రోపోనిక్‌ కల్చర్‌: పోషకాలున్న నీటిలో మొక్కలు పెంచడం

జియోపోనిక్‌ కల్చర్‌: ప్రత్యేక మట్టిలో మొక్కలు పెంచడం

టిష్యూకల్చర్‌: మొక్క కణాల సాగు, దాని విడిభాగాలను పెంచడం

వర్మీకల్చర్‌: వానపాముల పెంపకం

ఆక్వాకల్చర్‌: రొయ్యల పెంపకం

పాలీకల్చర్‌: దీన్ని హైటెక్‌ కల్చర్‌ అంటారు. ఇది ఆధునిక సాంకేతిక పద్ధతి. ఇందులో ఒకే స్థలంలో, ఒకే సమయంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తారు.

* వ్యవసాయం చాలా పురాతనమైంది. క్రీ.పూ.10 వేల సంవత్సరాల క్రితమే మానవుడు సాగు చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మనదేశంలో ఎంతోమంది ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఇది దేశ ఆర్థికాభివృద్ధిలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

* భారతదేశంలో పంటసాగుకు వర్షాలే మూలాధారం. ఇది పూర్తిగా రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. వర్షాభావం, అధిక వర్షాలు, పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడం మొదలైనవన్నీ వ్యవసాయానికి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. 

* మనదేశంలో సుమారు 1/3వ వంతు పంట భూములకు శాశ్వత ప్రాతిపదికన నీటిపారుదల సౌకర్యాలను కల్పించారు. ఇంకా 2/3వ వంతు భూములకు ఈ సదుపాయం లేదు. వీటిలో కేవలం రుతుపవనాలపై ఆధారపడే వ్యవసాయాన్ని చేస్తున్నారు.

Posted Date : 21-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌