• facebook
  • whatsapp
  • telegram

శాస్త్ర సాంకేతిక రంగం - భారతదేశ ప్రణాళికలు

భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధిలో ప్రణాళికలు ప్రముఖ పాత్ర పోషించాయి. దేశ ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించారు.

* విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి కోసం పరిశోధనా-అభివృద్ధి (Research and Development) విభాగాన్ని ఏర్పాటు చేశారు.

* 1950లో ఏర్పడిన ప్రణాళికా సంఘం శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా దేశాభివృద్ధికి కావాల్సిన విధి విధానాలను రూపొందించింది. వీటి కోసం వివిధ శాస్త్రవేత్తలు, జాతీయ-ప్రయోగ సంస్థలు, విశ్వవిద్యాలయాల అధికారుల అభిప్రాయాలను తీసుకుంది.

* భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి దోహదపడుతున్న కీలకరంగాలను (Thrust areas) గుర్తించాలని పరిశోధనా సంస్థలను ఆదేశిస్తుంది. ఆయా రంగాలు వేగంగా అభివృద్ధి చెందేందుకు కావాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను రూపొందించాలని సూచిస్తుంది. 

* ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగాల మార్గదర్శకాల రూపకల్పనకు ప్రతీ విభాగం నుంచి సలహాలను స్వీకరించి, సమీక్షలు నిర్వహిస్తుంది.

 

పంచవర్ష ప్రణాళికలు - శాస్త్ర సాంకేతికరంగ అభివృద్ధి

 

మొదటి పంవచర్ష ప్రణాళిక (1951-56): 

* దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

* శాస్త్ర పరిశోధన సాయంతో మెరుగైన ఉత్పత్తులు సాధించాలని, ప్రయోగశాలల్లో పనిచేసే సిబ్బందికి కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇవ్వాలని, నూతన అన్వేషణల కోసం వనరులను అందించాలని నిర్దేశించారు.

 

రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61): 

పరిశోధనలకు అవసరమైన మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్దేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయి సంస్థల్లో జరుగుతున్న ప్రయోగాలు లేదా పరిశోధనా ఫలితాలను సమన్వయపరచి, ఆ పరిశోధనలకు కావాల్సిన సిబ్బందిని నియమించి వారికి శిక్షణను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిశోధనా ఫలితాలను పారిశ్రామిక రంగాలకు అన్వయించి మెరుగైన ఉత్పత్తిని పొందాలని భావించారు.

* ఈ ప్రణాళికా కాలంలోనే (1958లో) మన మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, హోమి జహంగీర్‌ బాబా ఆధ్వర్యంలో మొదటి సైంటిఫిక్‌ పాలసీ రూపొందింది.

 

మూడో పంచవర్ష ప్రణాళిక (1961-66):

* ఈ సమయంలో అప్పటివరకు ఏర్పాటు చేసిన పరిశోధనా సంస్థలను బలోపేతం చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. శాస్త్ర సాంకేతిక రంగాల మౌలిక అంశాల పరిశోధనకు, ఇంజినీరింగ్‌-టెక్నాలజీలో పరిశోధనకు అవసరమైన సౌకర్యాలను ప్రోత్సహించాలని సూచించారు. వీటికి కావాల్సిన మానవ వనరులను అభివృద్ధి చేయడానికి వారికి ఉపకారవేతనాలు, ఫెలోషిప్‌లను అందించాలని నిర్ణయించారు.

 

నాలుగో పంచవర్ష ప్రణాళిక (1969-74):

పరిశోధనా-అభివృద్ధి విభాగంలో ప్రాధాన్యత రంగాలుగా స్టీల్, రసాయనాలు, పరికరాల తయారీని గుర్తించారు. 

* ప్రయోగశాలలు, పరిశ్రమలు, ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీలకు కావాల్సిన సమాచారాన్ని అందించి వాటికి అవసరమైన నివేదికలు సమర్పించాలి. 

* ఈ ప్రణాళికా కాలంలో వివిధ ప్రయోగశాలల్లో జరుగుతున్న ఒకేరకమైన పరిశోధనలను (Duplication work) తగ్గించాలని నిర్ణయించారు. అంతరిక్ష పరిశోధనలపై దృష్టి సారించాలని భారత ప్రభుత్వం సూచించింది.

 

అయిదో పంచవర్ష ప్రణాళిక (1974-79):

అప్పటివరకు దేశంలో జరుగుతున్న వివిధ పరిశోధనలు; వాటి ఉపయోగాలు, అమలు, ప్రయోగాల తీరుతెన్నులు, వ్యయం మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని పునః సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

* వ్యవసాయంపై మరింత దృష్టి సారించాలని సూచించింది. పంట తెగుళ్ల నివారణ, కరవు ప్రాంతాల్లో వ్యవసాయం, అధునాతన వ్యవసాయ పనిముట్ల వాడకం మొదలైన వాటిపై పరిశోధనలు చేయాలని పేర్కొంది. 

* సహజ వనరుల లభ్యత, వాటి వినియోగంపై సర్వే చేయాలని నిర్దేశించారు. 

* శాస్త్ర సాంకేతిక విభాగం (Department of Science and Technolony) ఆధ్వర్యంలో శాస్త్ర సాంకేతికత కోసం జాతీయ సమాచార వ్యవస్థ (National Information System for Science & Technology - NISSAT)ను  ఏర్పాటుచేశారు. దీన్ని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించారు.

 

ఆరో పంచవర్ష ప్రణాళిక (1980-85): 

ఈ కాలంలో శాస్త్రీయ విజ్ఞానం, సాంకేతికత, విద్యారంగాల్లో సాధించిన వృద్ధిని పరస్పరం అనుసంధానించటం ద్వారా మరింత మెరుగైన ఫలితాలను సాధించవచ్చని పేర్కొన్నారు.

నూతన పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేసి శాస్త్ర విజ్ఞానంపై సైద్ధాంతికంగానే కాకుండా ఆచరణాత్మకంగా పరిశోధనలు చేయాలని భావించారు. ప్లాస్మా భౌతికశాస్త్రం (Plasma Physics), రోగనిరోధకశాస్త్రం (Immunology), అనువర్తిత మైక్రోబయాలజీ మొదలైన అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించింది.

* 1983లో ప్రభుత్వం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ ప్రకటించింది.

 

ఏడో పంచవర్ష ప్రణాళిక (1985-90): 

సామాజిక న్యాయం సమానత్వంతో కూడిన అభివృద్ధి (Equity with social justice), స్వయం సమృద్ధి (Self reliance) మొదలైనవాటి ద్వారా మెరుగైన ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

* ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం ద్వారా వేగవంతమైన అభివృద్ధిని సాధించాలని సూచించింది. మైక్రో ఎలక్ట్రానిక్స్, మెటీరియల్‌ సైన్స్, సముద్ర అధ్యయన శాస్త్రం, నూతన జీవశాస్త్రం (Modern Biology), భూ అధ్యయనశాస్త్రం (Earth Sciences), అంతరిక్ష విజ్ఞానశాస్త్రం (Space Science) మీద దృష్టి కేంద్రీకరించాలని ప్రభుత్వం భావించింది.

* శాస్త్ర సాంకేతిక అధ్యయనం, అనువర్తనాలను దేశాభివృద్ధికి అన్వయించే దిశగా భారత ప్రభుత్వం టెక్నాలజీ మిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

* ఇదే ప్రణాళికా కాలంలో 1986లో CAPART (Council for Advancement of Peoples Action and Rural Technology) అనే గ్రామీణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

 

ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక (1992-97):

శాస్త్ర సాంకేతికతను సామాజిక, ఆర్థిక రంగాలకు అనుసంధానించాలని భావించారు. 

* కొన్ని ముఖ్య రంగాలను గుర్తించి, వాటి ద్వారా ప్రాథమిక శాస్త్ర విజ్ఞాన (Basic Sciences) పరిశోధనలతో పాటు, వినూత్న ఆవిష్కరణలపై కూడా ప్రయోగాలు చేయాలని నిర్ణయించారు. వీటిని మారుమూల గ్రామాలకు విస్తరింపజేసి కనీస అవసరాలైన తాగునీరు, పోషకాహారం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నివాసం, శక్తివనరులు, ఉద్యోగిత లాంటి అవసరాలు తీర్చాలని సూచించారు.

 

తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక (1992-97):

ఇందులో ముఖ్యంగా భారత శాస్త్ర సాంకేతిక రంగం స్వయం సమృద్ధి గురించి ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సాంకేతిక ఉద్యమాన్ని తట్టుకునేలా మనదేశ శాస్త్రీయ రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 

* శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధికి భారత ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు ఫెసిలిటేటర్లుగా వ్యవహరించాలని సూచించింది. 

* శాస్త్ర సాంకేతిక రంగాల దృక్పథం, పరిశోధనా-అభివృద్ధి సంస్థల (R&D Institutions) ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాల వృద్ధి జరిగేలా ప్రణాళికలు లేదా పథకాలు రూపొందించాలని ప్రతిపాదించారు.

* ఈ కాలంలో పర్యావరణ హిత, శుద్ధ శక్తి వనరుల సాంకేతిక ఆవశ్యకతను ఉద్ఘాటించింది. అణుశక్తి, అంతరిక్ష సాంకేతికతల అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకుంది. అణుశక్తి, సముద్ర శాస్త్ర పరిశోధనలను ప్రాముఖ్య రంగాలుగా గుర్తించారు.

 

పదో పంచవర్ష ప్రణాళిక (1992n-97):

శాస్త్ర సాంకేతిక రంగాల అనువర్తనాలను, పరిశోధనా-అభివృద్ధి రంగాలను బలోపేతం చేయాలని; మానవ వనరుల అభివృద్ధితో పాటు, ఎక్కువ మంది విద్యార్థులు సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశం పొందేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. 

* పదో ప్రణాళిక ముఖ్య లక్ష్యం భారత టెక్నాలజీలపై దృష్టి కేంద్రీకరించటం. జాతీయ అభివృద్ధి కోసం సంప్రదాయ-ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని నిర్దేశించారు.

* విశ్వవిద్యాలయాల్లో బేసిక్‌ సైన్స్‌పై మరిన్ని పరిశోధనలు జరిగేలా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. సమాచార భావ ప్రసార సాంకేతికతను, జీవసాంకేతిక శాస్త్రాలను వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉపయోగించాలని సూచించారు. 

* Science and Technology Policy 2003 (STP2003)ని ప్రతిపాదించారు. దీని ద్వారా పరిశోధనా-అభివృద్ధి, మేధోసంపత్తి హక్కులు sIntellectual Property Rightsz, విపత్తు నిర్వహణలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

 

భారతీయుల ఆవిష్కరణలు

క్రీ.పూ.రెండో సహ్రసాబ్ది (millennium) నాటికే భారతీయులు ఇనుము వాడారు. గంగాలోయ ప్రాంత ప్రజలు దీన్ని విరివిగా ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.

* స్టీల్‌ వస్తువులకు తుప్పు పట్టకండా పూసే పూతను మనవారే కనిపెట్టారు. ఈ పద్ధతి చాలా కాలం ఇతర దేశాలకు తెలియదు. 

* స్వేదన ప్రక్రియ ద్వారా జింక్‌ను శుద్ధి చేశారు. లోహశాస్త్ర ప్రయోగాలకు ఇది ఎంతగానో తోడ్పడింది.

* హరప్పా నాగరికతను ప్రపంచవ్యాప్తంగా అధునాతన ప్రాచీన నాగరికతగా చరిత్రకారులు పేర్కొంటారు. నీటిని నిల్వ చేసే చెరువులు, డ్యాంల నిర్మాణం; డ్రైనేజీ వ్యవస్థ; బహుళ అంతస్థుల భవనాలు మొదలైనవి వీరి నిర్మాణ ప్రతిభను తెలుపుతున్నాయి.

* భారతీయ వస్త్రాలకు వివిధ దేశాల్లో విపరీతమైన ఆదరణ ఉండేది. అక్కడ వీటిని నాణ్యమైనవిగా, మన్నిక కలిగిన వాటిగా పరిగణించేవారు. వస్త్ర వ్యాపారం రోమన్‌ దేశాలతో ఎక్కువగా జరిగేది. బ్రిటిష్‌ వారు ముందుగా భారత్‌ నుంచి వస్త్ర పరిశ్రమను ఇంగ్లండ్‌కు తరలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 

* నౌకాయానంలో దిక్సూచిని వాడటం భారత్‌లోనే ప్రారంభమైది. తర్వాతే దీన్ని యూరోపియన్లు కనుక్కున్నారని చరిత్రకారులు విశ్లేషించారు. 

* ఆయుర్వేదం భారత్‌లోనే ఆవిర్భవించింది. ఇది క్రీ.పూ. 5వ శతాబ్దం నాటికి సంపూర్ణ శాస్త్రంగా రూపొందిందని ఆయుర్వేద పండితుల అభిప్రాయం.

* మిశ్రమ వ్యవసాయం, పంట మార్పిడి, నేల ఆధారంగా పంట ఎంపిక, జీవ ఆధారిత ఎరువులు, పురుగు మందుల వాడకం మొదలైనవన్నీ మనదేశం నుంచే మొదలయ్యాయి.

* సున్నా, దశాంశ పద్ధతి భారత్‌లోనే ఆవిర్భవించాయి. మన వేద గణితాన్ని (vedic maths) ఇప్పటికీ పాశ్చాత్యులు నేర్చుకుంటునే ఉన్నారు.


రచయిత: రేమల్లి సౌజన్య, విషయ నిపుణులు 

Posted Date : 21-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌