• facebook
  • whatsapp
  • telegram

సామాజిక మినహాయింపు - పరిచయం

అభివృద్ధికి అవరోధమైన అసమానతలు

సమాజం సమానంగా అభివృద్ధి చెందకపోవడానికి ఉన్న అనేక కారణాల్లో ప్రధానమైనదిగా సాంఘిక అసమానతలను పేర్కొంటారు. దీని వల్ల కొన్ని వర్గాల్లో అసంతృప్తులు తీవ్రమై సామాజిక అస్థిరతలకు దారితీస్తుంటాయి. వీటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులకు ఆ సమస్యల మూలాలపై అవగాహన ఉండాలి. అప్పుడే సరైన చర్యలు తీసుకోగలుగుతారు. ఈ లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల జనరల్‌ స్టడీస్‌లో ‘సామాజిక మినహాయింపు, హక్కులు, సమ్మిళిత విధానాలు’ చేర్చారు.  

  ఒక వ్యక్తి సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో అంటే ఇతర వ్యక్తులతో సమానంగా పాల్గొనలేని స్థితిని ‘సామాజిక మినహాయింపు (సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌)’గా పేర్కొనవచ్చు. అమెరికా వంటి అత్యంత అభివృద్ధి చెందిన దేశం సహా యూరప్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా పలు ఇతర  దేశాల్లోనూ ఈ ‘సామాజిక మినహాయింపు’ కనిపిస్తుంటుంది. పేదరికాన్ని దీనికి ప్రధాన కారణంగా పేర్కొంటారు. మన దేశంలో పేదరికంతోపాటు మతం, కులం, తెగ,  ప్రాంతీయ భేదాలు  వంటి సాంఘిక నిర్మాణాలు కూడా సామాజిక మినహాయింపు కొనసాగడానికి దోహదపడుతున్నాయి. 

  వ్యక్తులు తమ శక్తియుక్తులు ఉపయోగించుకొని సామాజికంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన హక్కులను సాంఘిక నిర్మాణం వల్ల పొందలేని స్థితిని కూడా ‘సామాజిక మినహాయింపు’గా నిర్వచిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు, అధికారం, సంపద-పంపిణీ తదితరాల వల్ల ఈ వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయి. ఇవే బలపడి సామాజిక సమస్యలుగా మారుతున్నాయి. 

  సామాజిక మినహాయింపు స్థూలంగా రెండు రకాలుగా కనిపిస్తుంటుంది. వ్యక్తులు తమ హక్కులు, రక్షణలను పూర్తిగా పొందకపోవడం మొదటి రకం. వలసలు వచ్చిన వారికి రాజకీయ, పౌర హక్కులు లేకపోవడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. పాక్షికంగా హక్కులు లేకపోవడం రెండో రకం. దీనికి పేదరికాన్ని ఉదాహరణగా పేర్కొనవచ్చు.పేదరికం నిర్వచనం మారితే కొందరికి కొన్ని హక్కులు అందకుండా పోతాయి. పేదరికం సవరణకు గురైనప్పుడు మళ్లీ ఆ హక్కులు అందే అవకాశం ఉంటుంది. 

  సామాజిక మినహాయింపు అనేది సామాజిక సమస్యగానే కాకుండా దేశాభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. సాంఘిక అసమానతల వల్ల మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి.పక్షపాతానికి, అణచివేతకు, దోపిడీకి గురైన వర్గాల్లో అసంతృప్తి ప్రబలుతోంది. దీంతో ఉద్యమాలు, తిరుగుబాట్లు జరిగి సామాజిక అస్థిరత, తద్వారా ఆర్థికాభివృద్ధికి అవరోధాలు ఏర్పడుతున్నాయి.పరిపాలనకు ఆటంకాలు కలుగుతున్నాయి. అంతర్జాతీయ జీవన ప్రమాణాలను అందుకోవడంలో వెనుకబాటుకు కారణమవుతున్నాయి.

  ప్రపంచ వ్యాప్తంగా సంక్షేమ రాజ్య భావనలు పెరిగిన తర్వాత ఇలా సామాజిక మినహాయింపులకు గురైన వారికి రక్షణలు కల్పించడం మొదలైంది. అవి సాంఘిక అసమానతలను తగ్గించడానికి దోహదపడ్డాయి. ఈ సందర్భంగా ‘సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌’ అనేది సామాజికంగా, రాజకీయంగా, పరిపాలనాపరంగా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశంగా మారిపోయింది.

 

బహురూపాల్లో మినహాయింపు!

సామాజిక మినహాయింపు బహురూపాల్లో కనిపిస్తోంది. ఒక్కో సమాజంలో ఒక్కో విధంగా ఉంటోంది. ఒక రకం ఒక వర్గంలో కనిపిస్తే, మరో రకం పలు వర్గాలకు విస్తరించి ఉంటోంది. సంస్కృతిపరమైన అంశాల్లో నిషేధం లేదా నియంత్రణ అనేక సమాజాల్లో భిన్న రూపాల్లో ఉంటుంది. దీన్ని సాంస్కృతిక మినహాయింపుగా పేర్కొంటారు. ఇది భిన్న కాలాల్లో విభిన్న రకాలుగా ఉండవచ్చు. కొన్ని రకాల ఆర్థిక ప్రక్రియలు లేదా సేవలు కొంతమందికే అందుబాటులో ఉండటాన్ని ఆర్థిక మినహాయింపు అంటారు. సామాజికంగా తగిన హోదాను, భాగస్వామ్యాన్ని అందరికీ సమానంగా కల్పించలేని స్థితిని సామాజిక మినహాయింపుగా అభివర్ణించారు. రాజకీయ హక్కులను హరించడాన్ని రాజకీయ మినహాయింపుగా చెబుతారు. స్థూలంగా ఈ నాలుగు విధానాల్లో మినహాయింపు కనిపిస్తుంటుంది. 

 

మరిన్ని అంశాలు... మీ కోసం!

సమాజ నిర్మితి

విలక్షణ భారతం

కర్ణాటక యుద్ధాలు

Posted Date : 19-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌