• facebook
  • whatsapp
  • telegram

సామాజిక ఉద్యమాలు

సామాజిక ఉద్యమాల ప్రధాన లక్ష్యం మార్పు. అంటే.. ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి మార్పును ఆశించడం. మన దేశంలో ఇలాంటి సామాజిక ఉద్యమాల పరిధి విస్తృతం. దానికి ప్రధాన కారణం మన దేశ సామాజిక వ్యవస్థ స్వభావం. ప్రపంచంలోని చాలా దేశాల కంటే భిన్నమైన సామాజిక నిర్మాణం మనది.
1960వ దశకం నుంచి అమెరికా, యూరప్ దేశాల్లో కొత్త తరహా ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ కాలంలో వచ్చిన పర్యావరణ, శాంతి, స్త్రీవాద ఉద్యమాలను నూతన ఉద్యమాలుగా వర్గీకరించవచ్చు. భారతదేశంలో తలెత్తిన దళిత, ఆదివాసీ, స్త్రీవాద, మానవ హక్కుల, పర్యావరణ ఉద్యమాలను కూడా 'నూతన సామాజిక ఉద్యమాలు'గానే పేర్కొనవచ్చు. అయితే ఈ ఉద్యమాల లక్ష్యం రాజ్యాధికారం కాదు.

 

పర్యావరణం - సంవేదన దశ

భారతదేశంలో అనేక సామాజిక ఉద్యమాలు పర్యావరణ సమస్యలను తమ అజెండాలో చేర్చాయి. పర్యావరణ అంశాలు సామాజిక ఉద్యమాల్లో 20వ శతాబ్దపు రెండోభాగంలో.. 1970 దశకం తర్వాత వచ్చినప్పటికీ, వాటి మూలాలు వలస పాలన కాలంలోనే ఉన్నాయి.
* అడవులు - అటవీ ఉత్పత్తులు, సముద్ర సంపదపై హక్కులు..
* చేపల చెరువుల పెంపకం, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, పెద్ద ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకించడం..
* అణు విద్యుత్తు, అణుశక్తి కేంద్రాల ఏర్పాటు, అణుయుద్ధాలను వ్యతిరేకించడం..
ఇలాంటి పర్యావరణ అంశాలను వివిధ సామాజిక ఉద్యమాలు తమ అజెండాలో చేర్చాయి. సామాజిక ఉద్యమాలైన గిరిజన, మహిళ, పౌరహక్కుల, రైతుల, కార్మిక ఉద్యమాల అజెండాలో పర్యావరణ అంశాలు కనిపిస్తాయి.

 

అటవీ హక్కుల కోసం..

గిరిజన ఉద్యమాల్లో చిప్కో, అప్పికో ముఖ్యమైనవి. గిరిజనుల అవసరాలు, మనుగడ.. అటవీ ఉత్పత్తులు, అటవీ సంపదపై ఆధారపడి ఉన్నందున గిరిజనులకు వాటిపై హక్కులు ఉండాలని ఈ ఉద్యమాలు పేర్కొన్నాయి.

 

చిప్కో ఉద్యమం

చారిత్రక నేపథ్యం: చిప్కో ఉద్యమం ప్రాచీన భారతీయ సంస్కృతి నుంచి ఉద్భవించింది. చారిత్రకంగా, తాత్వికంగా గాంధేయ సత్యాగ్రహ విధానాల్లోనే నడిచినందున ఈ ఉద్యమాన్ని ఆ రోజుల్లో 'అడవి సత్యాగ్రహం అని పిలిచేవారు. గిరిజనులు అడవులను రక్షించుకోవాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం మొదలైంది. మొదట చెట్లను రక్షించే ఉద్యమంగా, తర్వాత ఆర్థిక ఉద్యమంగా మారి చివరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. బ్రిటిష్ పరిపాలనలో 1927లోని అటవీ చట్టం వల్ల గ్రామ ప్రజల హక్కులను నిరాకరించడం, గ్రామీణ జీవనోపాధి లేకపోవడం, వాణిజ్యం కోసం అడవులను కొల్లగొట్టడంతో దేశమంతటా ఈ ఉద్యమం వ్యాపించింది.

 

చిప్కో అంటే.. : చిప్కో అనే పదం హిందీ నుంచి వచ్చింది. ఇది ఆలింగనం చేసుకోవడం/హత్తుకుపోవడం అనే అర్థాన్ని ఇస్తుంది. ప్రస్తుత ఉత్తరాఖండ్ అడవుల్లో నివసించే బిష్నోయ్ తెగకు చెందిన గిరిజన మహిళలు అక్కడి అడవులను నరకకుండా వాటిని రక్షించుకోవడానికి చేపట్టిన ఉద్యమమే చిప్కో ఉద్యమం. వృక్ష ఆలింగన పద్ధతి ద్వారా చెట్లను హత్తుకుని వాటిని నరకకుండా కాపాడుకున్నారు.

 

స్వాతంత్య్రానంతరం: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చిప్కో ఉద్యమం గాంధేయ విధానంతో 'మీరా బెహన్, సరళ బెహన్' లాంటి గాంధేయవాదులతో సాగింది. వీరు మొదలుపెట్టిన పర్యావరణ ఉద్యమాలు ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండల్లో వ్యాపించాయి. తర్వాత కాలంలో చండీ ప్రసాద్ భట్, సుందర్‌లాల్ బహుగుణ ద్వారా ఈ ఉద్యమం విస్తృతమై ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది.

 

సర్వోదయ మండల్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గిరిజనులు సరళ బెహన్ ఆధ్వర్యంలో 1961లో 'ఉత్తరాఖండ్ సర్వోదయ మండల్‌'ను నెలకొల్పారు. తర్వాత గోపేశ్వర్ జిల్లాలోని 'దషోలి' గ్రామంలో చండీ ప్రసాద్ భట్ నాయకత్వంలో 'దషోలి గ్రామ్ స్వరాజ్ మండల్' అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. వీరు పర్యావరణ పరిరక్షణ కోసం శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. హిమాలయాల్లోని వివిధ అటవీ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం, అక్కడి వృక్షాలను నరకడాన్ని వ్యతిరేకిస్తూ చిప్కో పద్ధతిని చేపట్టారు. ఈ విషయంపై 1972, 1973లో విస్తృత ఉద్యమాలు సాగాయి.

 

సుందర్‌లాల్ బహుగుణ: 1973లో ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో గోపేశ్వర్ గ్రామంలో చండీప్రసాద్ భట్ నాయకత్వంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 1989లో కర్ణ ప్రయోగ్ దగ్గర అడవుల్లో చెట్లను కొట్టివేసి 'ఫైన్' చెట్లను పెంచుదామని ప్రభుత్వ అధికారులు ప్రయత్నించినప్పుడు అక్కడి ప్రజలతో కలిసి సుందర్‌లాల్ బహుగుణ ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా నిరోధించగలిగారు. ఇలా బహుగుణ నేతృత్వంలో ఈ ఉద్యమం ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంతటా వ్యాపించింది. అంతకు ముందు పర్యావరణవేత్తగా ఉన్న ఆయన 1981 నుంచి 1983 దాకా హిమాలయ ప్రాంతంలో దాదాపు 5000 కి.మీ.ల మేర పాదయాత్ర చేశారు. చివరకు దిల్లీ చేరి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి అటవీ వినియోగ పద్ధతులు మార్చాలని కోరారు. ఫలితంగా ప్రధాని ఆజ్ఞానుసారం అప్పటి నుంచి 15 సంవత్సరాల దాకా హిమాలయ ప్రాంతాల్లో చెట్లు కొట్టడాన్ని నిషేధించారు.

 

కర్ణాటకలో అప్పికో

1983 సెప్టెంబరులో కర్ణాటక రాష్ట్రంలో చిప్కో ఉద్యమానికి బదులు 'అప్పికో' ఉద్యమంగా ప్రారంభమైంది. ఈ ఉద్యమకారులు కూడా చెట్లను కౌగిలించుకుని చెట్టుని నరికే ప్రయత్నాన్ని ఆపు చేశారు.

 

'చిప్కో' విజయాలు

* ప్రజల హక్కులను కాపాడి, అడవులకు ప్రకృతికి ఉన్న తాత్విక సామీప్యాన్ని రక్షించి శాస్త్రీయంగా వీటికి కొత్త రచన చేయడమే చిప్కో ఉద్యమ లక్ష్యం.
* ఈ ఉద్యమం గిరిజనుల ఐక్యతను చాటిచెప్పి ఇతర రాష్ట్రాల ప్రజలకు మార్గదర్శకంగా నిలిచింది.
* ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాలయాలతోపాటు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక వరకు ఈ ఉద్యమం వ్యాపించింది.
* నిరక్షరాస్యులైన గిరిజనులు నడిపిన ఉద్యమ స్ఫూర్తి అక్షరాస్యులు, నగరవాసులతోపాటు ప్రజలందరిలో పర్యావరణ జాగృతిని కలిగించింది.

 

నర్మదా బచావో

  పర్యావరణ పరిరక్షణ కోసం.. వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన ఉద్యమాలన్నింటిలోకి 'నర్మదా బచావో ఆందోళన్ తలమానికమైంది.

  1961లో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నర్మద, దాని ఉపనదులపైన సుమారు 3000 చిన్న, 135 మధ్య తరహా, 30 పెద్దతరహా ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించారు. వీటన్నింటిని కలిపి 'సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్' అంటారు. ఇందులో భాగంగా గుజరాత్, దక్షిణ రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 1964లోనే కేంద్ర ప్రభుత్వం నర్మదానదిపై 'సర్దార్ సరోవర్ పేరుతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే క్షామ ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని ప్రభుత్వం భావించింది. అలాగే తాగునీరు, సాగునీరుతో పాటు 12,200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పిత్తి జరుగుతుందని భావించి నర్మదానదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. 1969లో కేంద్రం మూడు రాష్ట్రాలకు నదీ జలాల వినియోగం అంటే పంపిణీ నిమిత్తం 'నర్మద జలవివాద న్యాయ ట్రైబ్యునల్‌'ను నియమించింది.

  1987లో ప్రపంచ బ్యాంకు ఈ భారీ ప్రాజెక్టుకు 450 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేయడంతో డ్యామ్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ఆనకట్ట నిర్మాణాన్ని నిలిపి వేయాలని 1988లో ప్రముఖ పర్యావరణవేత్త మేధా పాట్కర్ నాయకత్వలో 'నర్మదా బచావో ఆందోళన్' అనే పర్యావరణ పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో మేధా పాట్కర్‌తోపాటు సుందర్‌లాల్ బహుగుణ, బాబా ఆమ్టే (ప్రముఖ సంఘ సేవకులు), అరుంధతీ రాయ్ (ప్రముఖ రచయిత్రి) ఉన్నారు.

 

'ఆందోళన్' ఎందుకంటే..?

* పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని అడవులు నశించిపోతాయి.
* భూకంపాలు సంభవించవచ్చు.
* నదీ పరివాహక ప్రాంతాల్లో జీవావరణం దెబ్బతిని నేల నాణ్యత తగ్గిపోతుంది.
* లక్షల మంది ఆదివాసులు నిరాశ్రయులవుతారు.
ఈ దుష్ఫలితాలను వివరిస్తూ 1989 నాటికి వీరు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. దీంతో ప్రపంచ బ్యాంకు రుణ మొత్తాన్ని ఇవ్వకుండా వెనక్కి తీసుకుంది.

 

ప్రముఖుల మద్దతు

* 1989లో హర్యుద్ నగరంలో మేధాపాట్కర్, బాబా ఆమ్టే, సుందర్ లాల్ బహుగుణ ఆధ్వర్యంలో నర్మదా ఆనకట్ట నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
* 1990, డిసెంబరు 25న బాబా ఆమ్టే ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌గాట్ నగరం నుంచి గుజరాత్ సరిహద్దుల్లోని ఫెర్కునా గ్రామం (సర్దార్ సరోవర్ డ్యామ్) వరకు 250 కి.మీ. మార్గంలో 'సంఘర్ష్ యాత్ర' పేరుతో పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు.
* 1991 జనవరిలో మేధాపాట్కర్, ఆమ్టే అమరణ నిరాహార దీక్ష తలపెట్టారు. అయితే ఆరోగ్య దృష్ట్యా దీక్షను 1991, జనవరి 28న విరమింపజేశారు.
* 1991లో స్వీడన్ దేశం మేధా పాట్కర్ సేవలకు గుర్తింపుగా 'రైట్ లైవ్లీహుడ్ అవార్డ్' అనే అత్యున్నత పురస్కారంతో గౌరవించింది.
* 'ది ఫ్రెండ్స్ ఆఫ్ రివర్ నర్మదా' అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది.
* ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ 'ది గ్రేటర్ కామన్ గుడ్' అనే తన పుస్తకం ద్వారా మద్దతు పలికి, భారీ ఆనకట్టల వల్ల కలిగే నష్టాలు, విధ్వంసాల గురించి ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు.
* డ్యామ్ ఎత్తును 122 మీటర్లకు పెంచాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 2006 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఆనకట్ట ఎత్తును 90 మీటర్ల కంటే ఎక్కువ పెంచరాదని తీర్పునిచ్చింది.
* 2006 సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా గుజరాత్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ప్రాజెక్టు ప్రారంభించింది.

 

తెహ్రీ డ్యామ్ ఉద్యమం

ఉత్తరాఖండ్‌లోని గడ్వాల్ జిల్లా తెహ్రీ గ్రామానికి సమీపంలో భగీరథ, భిలాం గంగా నదులపై రష్యా సాంకేతిక సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా డ్యామ్ నిర్మాణానికి తలపెట్టాయి. ఇది భూకంప జోన్ పరిధిలో ఉంది. దీని ఎత్తు 260.5 మీటర్లు. ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్దది. 1988 జులైలో రష్యా ఆర్థిక సహకారం (రూ. 3000 కోట్లు)తో 'తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీహెచ్‌డీసీ)' నెలకొల్పింది. ఈ డ్యామ్ వల్ల 2,70,000 హెక్టార్ల భూమికి సాగునీరు.. 346 మెగావాట్ల విద్యుత్తు.. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు తాగునీటిని సమకూర్చవచ్చని అంచనా వేశారు. చేపల పెంపకం, వలస పక్షులకు కూడా కేంద్రమవుతుంది.
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సుందర్‌లాల్ బహుగుణ నాయకత్వంలో 'తెహ్రీ బాంధ్ విరోధి సంఘర్ష్ సమితి' ఆధ్వర్యంలో తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని ఆపాలని ఉద్యమం నడిపిస్తున్నప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెహ్రీ గ్రామంతోపాటు 96 గ్రామాలు పాక్షికంగా మునిగిపోతాయని, 85 వేల మంది ప్రజలు నిర్వాసితులవుతారని అంచనా వేశారు.

 

నిశ్శబ్ద లోయ ఉద్యమం

కేరళలోని పశ్చిమ కనుమల్లోని నీలగిరి పర్వతాల్లో నిశ్శబ్ద లోయ (Silent Valley) ఆవరించి ఉంది. ఈ ప్రాంతంలో కీచురాళ్లు లేకపోవడం వల్ల నిశ్శబ్దంగా ఉంటుంది. అందువల్ల దీనికి నిశ్శబ్దలోయ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్నవి సతత హరిత వనాలు. వేల సంవత్సరాల నుంచి ఈ అడవులు అరుదైన, అతి విలువైన జంతు, వృక్ష జాతులకు నిలయంగా ఉన్నాయి. దేశంలోనే అపురూప సంపదగా ఈ లోయను భావిస్తారు.
1976లో కేరళ ప్రభుత్వం 240 మెగావాట్ల జల విద్యుత్తు కేంద్రాన్ని నీలగిరి పర్వతాల సమీపంలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిర్మాణం వల్ల 1000 హెక్టార్ల అరణ్యం నశించిపోతుందని, దీనివల్ల పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలుగుతుందని, అరుదైన వృక్ష సంపద నశించి పోతుందని, అరణ్య సంపదను నాశనం చేసుకోవడం సమర్థనీయం కాదని కేరళ ప్రజలు 'శాస్త్ర సాహిత్య పరిషత్' అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో పెద్ద ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేరళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేసింది. అంతేకాకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ లోయను జాతీయపార్కుగా ప్రకటించారు.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌