• facebook
  • whatsapp
  • telegram

 ప్రత్యేక హార్మోన్లు -  విధులు 

తినాలనే కోరికను తగ్గించే రసాయనం! 


అత్యంత సంక్షిష్ట, సహజ యంత్రమైన మానవ శరీరంలో జీవక్రియల సమతౌల్యతకు దోహదపడే రసాయనాలే హార్మోన్లు. ఇవి ఒక్కోటి ఒక్కో అవయవంపై ప్రభావం చూపుతుంటాయి. సాధారణంగా అంతస్స్రావ గ్రంథులు వీటిని స్రవిస్తాయి. ఈ గ్రంథులే కాకుండా శరీరంలోని ఇతర భాగాలు, కణజాలాలు కూడా ప్రత్యేక హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి అనేక శారీరక, మానసిక నియంత్రణ విధులను నిర్వహిస్తాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు వీటి గురించి తెలుసుకోవాలి. శరీరంలోని ఏ అవయవం, భాగం నుంచి ఏ ప్రత్యేక హార్మోను ఉత్పత్తి అవుతుంది, దాని ఉపయోగాలు, లోపం వల్ల కలిగే నష్టాలు, వచ్చే వ్యాధులు, చికిత్స విధానాలపై అవగాహన పెంచుకోవాలి.


   


మన శరీరంలో నియంత్రణ, సమన్వయాన్ని హార్మోన్లు నిర్వహిస్తాయి. వీటిని రసాయన వార్తా వాహకాలు (chemical messengers) అంటారు. ఇవి తక్కువ మోతాదులో ఉత్పత్తి అయ్యి నిర్ణీత కణజాలంపై పనిచేస్తాయి. పిట్యూటరీ, థైరాయిడ్, పారాథైరాయిడ్, అడ్రినల్‌ గ్రంథులు; క్లోమం, బీజకోశాలు మన శరీరంలో అంతఃస్రావ గ్రంథులు. ఇవి హార్మోన్లను స్రవిస్తాయి. ఇవేకాకుండా థైమస్, పీనియల్‌ గ్రంథులు; ప్లాసెంటా, హైపోథలామస్‌ లాంటివి అంతఃస్రావ వ్యవస్థలో భాగం కాకపోయినా హార్మోన్లను స్రవిస్తాయి. ఇవి ప్రత్యేక విధులు నిర్వహిస్తాయి.


థైమస్‌ గ్రంథి: ఇది గుండెకు పైభాగంలో ఉంటుంది. పిల్లల్లో పరిమాణంలో పెద్దదిగా, క్రియాశీలకంగా ఉంటుంది. ఈ గ్రంథి థైమిక్‌ హార్మోన్‌ అయిన థైమోసిన్‌ను స్రవిస్తుంది. దీనివల్ల T - లింఫోసైట్ల చర్య, కణవిభజన వేగవంతమవుతుంది. థైమోసిన్‌ హార్మోన్‌ అధిక స్రావం వల్ల మయోసిస్థీమియా గ్రేవిస్‌ (myosisthemia gravis)  అనే వ్యాధి కలుగుతుంది.


పీనియల్‌ గ్రంథి: దీనినే పీనియల్‌ దేహం అంటారు. ఇది నాడీ వ్యవస్థలో ఒక భాగం. ఇది మెలటోనిన్‌ హార్మోన్‌ను స్రవిస్తుంది. ఈ భాగాన్ని అంతఃస్రావ వ్యవస్థ, నాడీ వ్యవస్థ రెండింటికీ సంబంధించిన భాగంగా పరిగణిస్తారు. మెలటోనిన్‌ హార్మోన్‌ను ‘హార్మోన్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’ అంటారు. ఇది రాత్రిపూట (చీకటిలో) ఎక్కువగా విడుదలవుతుంది. మన శరీరంలో జీవ గడియారాన్ని (Biological clock), జీవన లయలను (sarcadian rythym)  నియంత్రిస్తుంది. నిద్రపోవడం, మెలకువ రావడం, సరైన సమయానికి ఆహారం తీసుకోవాలనుకోవడం లాంటివి వీటికి ఉదాహరణ.


ప్లాసెంటా: గర్భిణుల్లో పిండానికి, గర్భాశయానికి మధ్య ఏర్పడే కణజాలాన్ని ప్లాసెంటా అంటారు. తొలి దశలో పిండం ప్లాసెంటా ద్వారా పోషణను గ్రహిస్తుంది. ప్లాసెంటా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, హ్యూమన్‌ కోరియానిక్‌ గొనడోట్రోపిన్‌ (HCG) అనే హార్మోన్లను స్రవిస్తుంది. గర్భిణుల మూత్రంలో కనిపించే హార్మోన్‌ (HCG). దీనిని పరీక్షించి స్త్రీలలో గర్భధారణను నిర్ధారించవచ్చు. ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ పిండ ప్రతిస్థాపనకు ఉపయోగపడుతుంది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌ ఎక్కువగా ఉండటం వల్ల గర్భధారణ సమయంలో తాత్కాలికంగా రుతుచక్రం ఆగిపోతుంది.


హైపోథలామస్‌: ఇది మెదడులోని భాగం. దీనిలోని న్యూరోసెక్రటరీ కణాలు న్యూరోహార్మోనులను స్రవిస్తాయి. వీటిలో కొన్ని పిట్యూటరీ గ్రంథి నుంచి హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి, తగ్గిస్తాయి. అందుకే వీటిని రిలీజింగ్‌ ఫాక్టర్స్, ఇన్‌హిబిటింగ్‌ ఫ్యాక్టర్స్‌ అంటారు.


రిలీజింగ్‌ ఫ్యాక్టర్స్‌:


1) TRH  - థైరోట్రోపిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ - ఇది పిట్యూటరీ గ్రంథి నుంచి థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ స్రవించడాన్ని ప్రేరేపిస్తుంది.


2) ACTHRF -  అడ్రినో కార్టికో ట్రోపిక్‌ హార్మోన్‌ రిలీజింగ్‌ ఫ్యాక్టర్‌ - ఇది పిట్యూటరీ గ్రంథి నుంచి అడ్రినో కార్టికో ట్రోపిక్‌ హార్మోన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.


3) GHRH -  గ్రోత్‌ హార్మోన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ - ఇది పిట్యూటరీ గ్రంథి స్రవించే పెరుగుదల హార్మోన్‌ లేదా సోమాటో ట్రోఫిక్‌ హార్మోన్‌ (STH)  విడుదలను ప్రేరేపిస్తుంది.


4) PRH -ప్రొలాక్టిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ - పిట్యూటరీ గ్రంథి నుంచి ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.


5) GTHRF- గొనాడో ట్రోఫిక్‌ హార్మోన్స్‌ రిలీజింగ్‌ ఫ్యాక్టర్‌ - పిట్యూటరీ గ్రంథి నుంచి ఫాలిక్యులార్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (FSH), ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ (LH), ఇంటర్‌స్టీషియల్‌ సెల్‌స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (ICSH) లాంటి హార్మోన్లు స్రవించడాన్ని ప్రేరేపిస్తుంది.


ఇన్‌హిబిటింగ్‌ ఫ్యాక్టర్స్‌: ఇవి పిట్యూటరీ గ్రంథి స్రవించే ప్రొలాక్టిన్‌ ల్యూటినైజింగ్‌ హార్మోన్, ఫాలిక్యులార్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్, థైరాయిడ్‌ స్టిమ్యూలేటింగ్‌ హార్మోన్‌ ్బగిళీబ్శీ లాంటి హార్మోన్ల ఉత్పత్తిని నిరోధిస్తాయి.


సొమాటోస్టాటిన్‌: దీన్ని గ్రోత్‌ హార్మోన్‌ ఇన్‌హిబిటింగ్‌ హార్మోన్‌(GHIH) లేదా సొమాటో ట్రోపిన్‌ రిలీజింగ్‌ ఇన్‌హిబిటింగ్‌ ఫ్యాక్టర్‌ (GHIH) అంటారు. ఇది మన శరీరంలో మెదడు, జీర్ణవ్యవస్థ, క్లోమం లాంటి వాటి నుంచి వస్తుంది. శరీర పెరుగుదలను నియంత్రిస్తుంది.


గాస్ట్రో - ఇంటస్టైనల్‌ హార్మోన్స్‌: వీటినే స్థానిక హార్మోన్లు అంటారు. ఇవి జీర్ణాశయం, చిన్నపేగు లాంటి వాటి నుంచి స్రావితమై జీర్ణ వ్యవస్థకు సంబంధించిన పనులు నిర్వహిస్తాయి.


గాస్ట్రిక్‌: ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడే వివిధ జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.


ఎంటిరో గాస్టిరాన్‌: జీర్ణ ఎంజైమ్‌లు స్రవించడాన్ని నిరోధిస్తుంది.


సెక్రిటిన్‌: క్లోమం నుంచి సోడియం బైకార్బొనేట్‌ ఉన్న ద్రవం స్రవించడాన్ని ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణాశయం నుంచి వచ్చిన ఆమ్లయుత పదార్థాన్ని చిన్నపేగులో తటస్థం చేస్తుంది.


ప్రాంకియో జైమిన్‌: ఇది క్లోమం నుంచి ఎంజైమ్‌ల స్రావితాన్ని ప్రేరేపిస్తుంది.


CCK  హార్మోన్‌: ఇది పిత్తాశయాన్ని సంకోచింపజేసి పైత్యరస విడుదలను ప్రేరేపిస్తుంది. క్లోమం నుంచి జీర్ణరస ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.


డ్యుయోక్రైనిన్‌: ఇది బ్రన్నర్‌ గ్రంథుల నుంచి జిగురు (మ్యూకస్‌) స్రవించడాన్ని ప్రేరేపిస్తుంది.


విల్లికైనిన్‌: ఇది చిన్నపేగులో ఉన్న చూషకాల (విల్లి) కదలికను, పనితీరును ప్రేరేపిస్తుంది.


గ్రెలిన్‌: ఈ హార్మోను జీర్ణాశయం నుంచి స్రావితమై ఆకలిని పెంచుతుంది.


లెప్టిన్‌: ఇది ఆకలిని తగ్గిస్తుంది.


PYY హార్మోన్‌: ఈ హార్మోన్‌ తినాలనే కోరికను (appetite) తగ్గిస్తుంది.


మూత్రపిండాలు: వీటి నుంచి స్రావితమయ్యే రెనిన్‌ అనే రసాయనం ద్రవాభిసరణ క్రమతను నియంత్రిస్తుంది. ఎరిథ్రోపాయిటిన్‌ (హోమోపాయిటిన్‌) అనేది ఎముక మజ్జలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.


గుండె: కర్ణికల గోడల నుంచి ఎట్రియల్‌ కాట్రియూరిటిక్‌ ఫ్యాక్టర్‌ (ANF) ను స్రవిస్తుంది. దీనినే ఎట్రియల్‌ నేట్రియూరిటిక్‌ పెప్టైడ్‌ అంటారు. ఇది రక్త పరిమాణాన్ని, రక్తపోటును నియంత్రిస్తుంది, రక్తనాళాల వ్యాకోచాన్ని పెంచుతుంది.

 

క్లోమం: ఇది జీర్ణాశయం కింది భాగంలో ఉంటుంది. దీనినే హెటిరోక్రైన్‌ గ్లాండ్, మిశ్రమ గ్రంథి అంటారు. ఇది జీర్ణక్రియకు సంబంధించిన ఎంజైమ్‌లను, వివిధ జీవక్రియలను నియంత్రించే హార్మోన్లను స్రవిస్తుంది. క్లోమంలోని అంతఃస్రావ భాగంలో లాంగర్‌హాన్స్‌ పుటికలు ఉంటాయి. వీటిలో ఆల్ఫా, బీటా, డెల్టా, ఎప్సిలాన్‌ లాంటి కణాలుంటాయి.


ఆల్ఫా కణాలు: ఇవి గ్లూకాగాన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. దీనినే హైపర్‌ గ్లైసిమిక్‌ హార్మోన్, డయాబెటోజెనిక్‌ హార్మోన్‌ అంటారు. ఇది గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఈ ప్రక్రియను గ్లైకోజెనియోలైసిస్‌ అంటారు.


బీటా కణాలు: ఇవి ఇన్సులిన్‌ అనే హార్మోనును స్రవిస్తాయి. దీనినే హైపోగ్లైసిమిక్‌ హార్మోన్, యాంటీడయాబెటిక్‌ ఫ్యాక్టర్‌ అంటారు. ఇది గ్లూకోజ్‌ను గ్లైకోజెన్‌గా మారుస్తుంది. ఈ ప్రక్రియను గ్లెకోజెనిసిస్‌ అంటారు. ఇన్సులిన్‌ లోపం వల్ల డయాబెటిస్‌ మిల్లిటస్‌ అనే వ్యాధి కలుగుతుంది.


డెల్టా కణాలు: ఇవి సోమాటోస్టాటిన్‌ అనే హార్మోనును స్రవిస్తాయి.


ఎప్సిలాన్‌ కణాలు: ఇవి గ్రెలిన్‌ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి.


శిశి కణాలు: ఇవి పాంక్రియాటిక్‌ పాలిపెప్టైడ్‌ను స్రవిస్తాయి.

డయాబెటిస్‌ రకాలు: మధుమేహం లేదా డయాబెటిస్‌ 2 రకాలుగా ఉంటుంది. 


1) డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్‌ - ఇది పిట్యూటరీ గ్రంథి స్రవించే వాసోప్రెస్సిన్‌ హార్మోన్‌ లోపం వల్ల కలుగుతుంది.


2) డయాబెటిస్‌ మిల్లిటస్‌- దీనికి ఇన్సులిన్‌ హార్మోన్‌తో సంబంధం ఉంటుంది. ఇది మళ్లీ 3 రకాలు.

1) టైప్‌ - I డయాబెటిస్‌ 

2) టైప్‌ - II డయాబెటిస్‌  

3) జెస్టేషనల్‌ డయాబెటిస్‌


టైప్‌-I డయాబెటిస్‌: దీనినే జువనైల్‌ డయాబెటిస్‌ లేదా ఇన్సులిన్‌ డిపెండెంట్‌ డయాబెటిస్‌ మిల్లిటస్‌(IDDM) అంటారు. ఇది చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో క్లోమం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. వీరు జీవితాంతం ఇన్సులిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.


టైప్‌-II డయాబెటిస్‌: దీన్ని అడల్డ్‌ డయాబెటిస్‌ లేదా నాన్‌-ఇన్సులిన్‌ డిపెండెంట్‌ డయాబెటిస్‌ మిల్లిటస్‌(NIDDM) అంటారు. ఇది పెద్దవారిలో కనిపిస్తుంది. సర్వసాధారణంగా ఎక్కువమందిలో కనిపించే మధుమేహం ఈ రకానికి చెందింది.


జెస్టేషనల్‌ డయాబెటిస్‌: స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు వారిలో కనిపించే మధుమేహాన్ని జెస్టేషనల్‌ డయాబెటిస్‌ అంటారు. శిశు జననం తర్వాత వీరు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.



మాదిరి ప్రశ్నలు
 

1. గుండెకు పైభాగంలో ఉండే ఏ గ్రంథి హార్మోను T - లింఫోసైటు కణాల చర్యను నియంత్రిస్తుంది?

1) థైమస్‌ గ్రంథి  2) ప్లీహం   3) క్లోమం   4) కాలేయం

 


2. కింది ఏ హార్మోనును ‘హార్మోన్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’ అంటారు?

1) మెలనిన్‌   2) మెలటోనిన్‌   3) థైమోసిన్‌   4) విల్లికైనిన్‌

 


3. పీనియల్‌ గ్రంథి నుంచి స్రావితమయ్యే మెలటోనిన్‌ హార్మోన్‌ విధి?

1) లింఫోసైట్‌ల వృద్ధి   2) ప్లాసెంటా వృద్ధి   3) జీవగడియారాన్ని నియంత్రించడం   4) ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ తయారీ



4. గర్భిణుల్లో పిండానికి, గర్భాశయానికి మధ్య ఏర్పడిన ప్లాసెంటా నుంచి విడుదలయ్యే హార్మోన్లు?

1) ఈస్ట్రోజెన్‌     2) ప్రొజెస్టిరాన్‌     3) హ్యూమన్‌ కోరియానిక్‌ గొనడో ట్రోపిన్‌     4) పైవన్నీ



5. స్త్రీల మూత్రంలో ఏ హార్మోనును పరిశీలించి గర్భధారణను నిర్ధారించవచ్చు?

1) హ్యూమన్‌ కోరియానిక్‌ గొనడో ట్రోపిన్‌   2) అడ్రినాలిన్‌   3) సొమాటోట్రోపిన్‌   4) ఇన్సులిన్‌



6. కింది ఏ హార్మోన్‌ను ‘గ్రోత్‌హార్మోన్‌ ఇన్‌హిబిటింగ్‌ హార్మోన్‌’ అంటారు?

1) గాస్ట్రిన్‌   2) సెక్రిటిన్‌   3) సొమాటోస్టాటిన్‌   4) ఎంటిరోగాస్టిరాన్‌


 

7. మెదడులోని ఏ భాగం న్యూరో హార్మోన్లను స్రవిస్తుంది? 

1) చిన్న మెదడు   2) హైపోథలామస్‌   3) సెరిబ్రమ్‌  4) సెరిబెల్లమ్‌



సమాధానాలు: 1-1; 2-2; 3-3; 4-4; 5-1; 6-3; 7-2.

 

 


రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌

 

 

Posted Date : 17-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌