• facebook
  • whatsapp
  • telegram

నక్షత్రాలు - సౌర కుటుంబం

* అనేక వేల కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. సూర్యుడు అనే నక్షత్రం పాలపుంత లేదా ఆకాశగంగ అనే గెలాక్సీకి చెందింది.

* వేలకోట్ల గెలాక్సీలను కలిపి విశ్వం అంటారు.

* విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని కాస్మాలజీ అంటారు.

* భూమిపై నిట్టనిలువుగా ఉన్న వస్తువుకు ఏర్పడే నీడల్లో అతి తక్కువ పొడవు ఉన్న నీడ ఉత్తర, దక్షిణ దిశల్లో ఏర్పడుతుంది.

* ప్రాంతీయ మధ్యాహ్న వేళలోనే వస్తువుకు అతి తక్కువ పొడవు ఉన్న నీడ ఏర్పడుతుంది.

* ప్రాంతీయ మధ్యాహ్న వేళనే లోకల్ నూన్ టైం అంటారు.

* సూర్యోదయం రోజురోజుకు దక్షిణ దిక్కుగా కదులుతున్నట్లు అనిపిస్తే దాన్ని దక్షిణాయనం అంటారు.

* రోజు రోజుకు ఉత్తర దిక్కుకు కదులుతున్నట్లు అనిపిస్తే దాన్ని ఉత్తరాయణం అటారు.

* మన రాష్ట్రంలోని ఏకైక నీడ గడియారం తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉంది.

* చంద్రుడి ఆకారం ప్రతిరోజు మారుతూ ఉంటుంది. ఈ మార్పులను చంద్ర కళలు అంటారు.

* ఒక ప్రదేశంలో కనిపించిన చంద్రుడు మళ్లీ అదే ప్రదేశంలో కనిపించడానికి ఒకరోజు కంటే దాదాపు 50 నిమిషాల ఎక్కువ సమయం పడుతుంది. ఇదే చంద్రకళలు ఏర్పడటానికి కారణం.

* అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు భూమికి ఒకేవైపు ఉంటారు.

* పౌర్ణమి రోజున సూర్యుడు, చంద్రుడు భూమికి చెరోవైపు ఉంటారు.

* 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుపెట్టాడు.

* చంద్రుడి ఉపరితలం దుమ్మూ-ధూళితో ఎలాంటి జీవం లేకుండా ఉంది. అక్కడ అనేక లోయలు, పర్వతాలు ఉన్నాయి.

* 2008, అక్టోబరు 22న భారతదేశం చంద్రుడి గురించి పరిశోధనలకు చంద్రయాన్-I ను ప్రయోగించింది.


చంద్రయాన్ ముఖ్య విధులు:

     i) చంద్రుడిపై నీటి జాడ వెతకడం

     ii) చంద్రుడిపై పదార్థ మూలకాలను తెలుసుకోవడం

     iii) హీలియం-3ని వెతకడం

     iv) చంద్రుడి త్రిమితీయ (3D) అట్లాస్‌ను తయారు చేయడం

    v) సౌర వ్యవస్థ ఆవిర్భావానికి ఆధారాలు వెతకడం.


సూర్యగ్రహణం

* చంద్రుడి నీడ భూమిపై పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

* ఇది అమావాస్య రోజున ఏర్పడుతుంది.

* సూర్యగ్రహణం నాలుగు రకాలు

   1. సంపూర్ణ సూర్యగ్రహణం

   2. పాక్షిక సూర్యగ్రహణం

   3. వలయాకార సూర్యగ్రహణం  

    4. మిశ్రమ సూర్య గ్రహణం: వలయాకార గ్రహణం సంపూర్ణ గ్రహణంగా మారడం. ఇది అరుదుగా సంభవిస్తుంది.


చంద్రగ్రహణం:

* భూమి నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

* ఇది పౌర్ణమి రోజున సంభవిస్తుంది.

ఇది మూడు రకాలు:

    1. సంపూర్ణ చంద్రగ్రహణం

    2. పాక్షిక చంద్రగ్రహణం

    3. ప్రచ్ఛాయ/ ఉపచ్ఛాయ చంద్రగ్రహణం

* భూమి నీడ అంచుల్లో ఉండే పలుచని నీడ ప్రాంతం చంద్రుడిపై పడటం వల్ల ప్రచ్ఛాయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

* సంపూర్ణ సూర్యగ్రహణం 1980, ఫిబ్రవరి 16న ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో కొన్ని ప్రదేశాల్లో కనిపించింది.

* భూమి స్థానంతో పోలిస్తే స్థానభ్రంశం చెందకుండా స్థిరంగా ఉండే నక్షత్రాన్ని ధృవ నక్షత్రం అంటారు.

* ధృవ నక్షత్రాన్ని ఆంగ్లంలో పోలారిస్ అంటారు. ఇది భూమి ఉత్తర ధృవానికి ఎదురుగా ఉంది.

* ధృవ నక్షత్రాన్ని సప్తర్షి మండలం సహాయంతో తెలుసుకోవచ్చు. ఈ సప్తర్షి మండలం (Great Bear) నాగలి లేదా గాలిపటం ఆకారంలో ఉంటుంది.

* సప్తర్షి మండలం చలికాలంలో సూర్యోదయానికి కొద్ది గంటల ముందు ఆకాశంలో ఉదయిస్తుంది. (ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల నుంచి చూడొచ్చు)

* శర్మిష్ట రాశిలో ఆరు నక్షత్రాలు ఉంటాయి. ఇది 'm' ఆకారంలో ఉంటుంది.

* ధృవ నక్షత్రం చుట్టూ మిగిలిన నక్షత్రాలన్నీ ఒక చుట్టు తిరిగిరావడానికి 24 గంటల సమయం పడుతుంది.

* ధృవ నక్షత్రం భూభ్రమణాక్షంపై ఉంది కాబట్టి స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.


సౌర కుటుంబం:

       సూర్యుడు, దాని చుట్టూ తిరిగే అంతరిక్ష వస్తువులను అన్నింటినీ కలిపి సౌర కుటుంబం అని అంటారు.

        దీనిలో గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, ఆస్టరాయిడ్‌లు లాంటివి ఉంటాయి.


సూర్యుడు:

* మనకు దగ్గరలో ఉండే నక్షత్రం సూర్యుడు. ఇది అత్యంత ఉష్ణం, కాంతిని నిరంతరం వెదజల్లుతుంది.

* భూమిపై ఉన్న వివిధ గ్రహాలపై శక్తిరూపాలకు సూర్యుడు ప్రధాన వనరు.


గ్రహాలు:

* ఇవి నక్షత్రాల్లా కనిపిస్తాయి. కానీ వీటికి స్వయం ప్రకాశక శక్తి ఉండదు.

* ఇవి తమపై పడిన కాంతిని పరావర్తనం చేస్తాయి.

* ప్రతి గ్రహం సూర్యుడి చుట్టూ ప్రత్యేక మార్గంలో పరిభ్రమిస్తుంది. దీన్ని కక్ష్య అంటారు.

* ఒక గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టేకాలం పరిభ్రమణ కాలం అంటారు.

* సూర్యుడు నుంచి గ్రహాలకు ఉండే దూరం పెరుగుతున్న కొద్ది వాటి పరిభ్రమణ కాలం పెరుగుతుంది.

* గ్రహాలు తమ చుట్టూ తాము తిరగడాన్ని 'భ్రమణ కాలం' అంటారు.

* ఏ అంతరిక్ష వస్తువైనా మరొకదాని చుట్టూ తిరుగుతూ ఉంటే దాన్ని ఉపగ్రహం అంటారు.

* చంద్రుడు భూమికి ఉపగ్రహం. మానవ నిర్మిత ఉపగ్రహాలను 'కృత్రిమ ఉపగ్రహాలు' అంటారు.

 

బుధుడు:

* సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం, 'అతిచిన్న గ్రహం'.

* దీనికి ఉపగ్రహాలు లేవు.

* దీని పరిభ్రమణ కాలం 88 రోజులు.

 

శుక్రుడు:

* భూమికి దగ్గరగా ఉన్న గ్రహం, ఆకాశంలో కనిపించే గ్రహాల్లో ప్రకాశమంతమైంది.

* దీన్ని వేగుచుక్క, సాయంకాల చుక్క అని పిలుస్తారు.

* ఇది అపసవ్యదిశ (తూర్పు నుంచి పడమరకు)లో తిరుగుతుంది.

* దీనికి ఉపగ్రహాలు లేవు.

* దీని పరిభ్రమణ కాలం 225 రోజులు.


భూమి:

* సౌరకుటుంబంలోని గ్రహాలన్నింటిలోకి జీవరాశిని కలిగి ఉన్న గ్రహం.

* అంతరిక్షం నుంచి చూసినప్పుడు నీలి - ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. దీనికి కారణం నేల, చెట్లు, నీటి వల్ల కాంతి వక్రీభవనం.

* దీనికి ఉన్న ఏకైక ఉపగ్రహం - చంద్రుడు.

* దీని పరిభ్రమణ కాలం 365 రోజులు.


కుజుడు/ అంగారకుడు:

* భూకక్ష్యకు బయటి వైపు ఉన్న మొదటి గ్రహం.

* కొద్దిగా ఎరుపు రంగులో ఉండటం వల్ల దీనిని అరుణ గ్రహం అని పిలుస్తారు.

* దీనికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య: 2

* దీని పరిభ్రమణ కాలం: 687 రోజులు


గురుడు/ బృహస్పతి:

* సౌర కుటుంబంలోకెల్లా అతిపెద్ద గ్రహం.

* భూమి కంటే 1300 రెట్లు పెద్దది. దీని ద్రవ్యరాశి భూ ద్రవ్యరాశికి 318 రెట్లు ఎక్కువ.

* ఇది తనచుట్టూ తాను అతివేగంగా తిరుగుతుంది.

* దీనికి ఉన్న ఉపగ్రహాలు సంఖ్య: 50

* దీని పరిభ్రమణ కాలం: 12 సంవత్సరాలు; అతిపెద్ద ఉపగ్రహం: గనిమెడ


శని:

* ఇది పసుపు వర్ణంలో కనిపిస్తుంది.

* దీని చుట్టూ వలయాలు ఉంటాయి.

* దీనికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య: 53

* దీని పరిభ్రమణ కాలం: 29.5 సంవత్సరాలు; దీని ఉపగ్రహం టైటాన్ భూమిని పోలి ఉంటుంది.


యురేనస్:

* దీన్ని టెలిస్కోప్ సాయంతో మాత్రమే చూడగలం.

* ఇది శుక్రగ్రహం మాదిరి తూర్పు నుంచి పడమరకు పరిభ్రమిస్తుంది.

* దీని అక్షం అత్యధికంగా వంగి ఉంటుంది.

* దీని ఉపగ్రహాల సంఖ్య: 27; పరిభ్రమణ కాలం 84 ఏళ్లు.


నెప్ట్యూన్:

* ఇది సూర్యుడికి అత్యంత దూరంలో ఉంటుంది.

* దీని ఉపగ్రహాల సంఖ్య: 13

* దీని పరిభ్రమణకాలం: 165 సంవత్సరాలు


గ్రహాలు రెండు రకాలు

     1. అంతర గ్రహాలు (బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు)

     2. బాహ్య గ్రహాలు (బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్)

* సూర్యుడి వ్యాసం: 13,92,000 కి.మీ., భూమి వ్యాసం 12,756 కి.మీ.; చంద్రుడి వ్యాసం 3,474 కి.మీ.

* భూమికి, చంద్రుడికి మధ్యదూరం: 3,84,399 కి.మీ.

* భూమికి, సూర్యుడికి మధ్యదూరం 15 కోట్ల కి.మీ.

* 2006 ఆగస్టు 25న ఫ్లూటోను గ్రహం కాదు అని నిర్ణయించారు. కారణం (Clear the Neighbourhood) అనే నియమాన్ని ఉల్లంఘించడం.

* క్లియర్ ద నైబర్‌హుడ్ అంటే తోటి గ్రహాల కక్ష్యలకు ఆటంకం కలిగించరాదు.


ఆస్టరాయిడ్స్:

* చిన్న చిన్న గ్రహ శకలాలను ఆస్టరాయిడ్స్ అంటారు.

* ఇవి కుజుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉంటాయి.

* వీటిని టెలీస్కోప్ సహాయంతో మాత్రమే చూడగలం.


తోకచుక్కలు:

* ఇవి సూర్యుడి చుట్టూ అతి దీర్ఘవృత్తకార కక్ష్యల్లో పరిభ్రమిస్తుంటాయి.

* వీటి పరిభ్రమణ కాలం చాలా ఎక్కువ.

* తోకచుక్క సూర్యుడిని సమీపిస్తున్న కొద్ది దాని తోక పొడవు పెరుగుతుంది. దీని తోక ఎల్లపుడూ సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉంటుంది.

* హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. 1986లో కనిపించింది. తర్వాత 2062లో కనిపిస్తుంది.

* షుమేకర్ - లేవి IX అనే తోకచుక్క 1994లో బృహస్పతిని ఢీకొంది.


ఉల్కలు - ఉల్కాపాతాలు:

* అంతరిక్షం నుంచి జారిపడే ఖనిజాలను ఉల్కలు అంటారు.

* ఇవి భూవాతావరణంలోకి ఎక్కువ వేగంతో ప్రవేశిస్తాయి.

* ఇవి గాలిలో ఉండే ఘర్షణ వల్ల బాగా వేడెక్కి మండుతాయి.

* ఇవి భూమిని చేరి పెద్ద గొయ్యిని ఏర్పరుస్తాయి. దీన్ని 'ఉల్కాపాతం' అంటారు.

* సౌరకుటుంబం ఏయే పదార్థాలతో ఏర్పడిందో తెలుసుకోవడానికి ఉల్కాపాతం ఉపయోగపడుతుంది.


కృత్రిమ ఉపగ్రహాలు:

* మానవ నిర్మిత ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలు అంటారు.

* భారత్ మొదటగా ప్రయోగించిన ఉపగ్రహం 'ఆర్యభట్ట'.

* ఇన్‌శాట్, ఐఆర్ఎస్, కల్పన - I, ఎడ్యుశాట్ లాంటివి భారత్ ప్రయోగించిన ఉపగ్రహాలు.

* వాతావరణ అధ్యయనానికి, రేడియో, టెలివిజన్ ప్రసారాలకు; టెలీకమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ (నిర్ణీత దూరంలో ఉండి సమాచారం సేకరించడం), వైమానిక, సైనిక కార్యకలాపాలకు ఉపగ్రహాలను ఉపయోగిస్తారు.

నక్షత్ర రాశులు - రాశి చక్రం:

* నక్షత్ర వీధుల్లోని నక్షత్రాలను చిన్న చిన్న గుంపులుగా విభజించవచ్చు. ఈ చిన్న గుంపులను నక్షత్ర రాశులు అంటారు. వీటినే తారాగణం అని కూడా అంటారు.

* నక్షత్ర రాశులను వాటి ఆకారాలను బట్టి పన్నెండు పేర్లతో అనాదిగా పిలుస్తున్నారు. ఈ పన్నెండు రాశులను కలిపి 'రాశి చక్రం' అంటారు.
 

రాశులు - కనిపించే తేదీలు

    1. మేషం - మేక - మార్చి 21 - ఏప్రిల్ 19

    2. వృషభం - ఎద్దు - ఏప్రిల్ 20 - మే 20

    3. మిథునం - కవలలు - మే 21 - జూన్ 21

    4. కర్కాటకం - ఎండ్రకాయ - జూన్ 22 - జులై 22

    5. సింహం - సింహం - జులై 23 - ఆగస్టు 22

    6. కన్య - కన్య - ఆగస్టు 23 - సెప్టెంబరు 22

    7. తుల - త్రాసు - సెప్టెంబరు 23 - అక్టోబరు 23

    8. వృశ్చికం - తేలు - అక్టోబరు 24 - నవంబరు 21

    9. ధనస్సు - విల్లు - నవంబరు 22 - డిసెంబరు 21

    10. మకరం - మొసలి - డిసెంబరు 22 - జనవరి 21

    11. కుంభం - కుండ - జనవరి 22 - ఫిబ్రవరి 18

     12. మీనం - చేప - ఫిబ్రవరి 19 - మార్చి 20

 

అంతరిక్ష యానం

* రాకెట్‌లకు పలాయన వేగం, ఉపగ్రహానికి సమకూర్చడానికి 'బహుళ ప్రయోగ వ్యవస్థ' (Multistage Launching System) అనే ప్రక్రియను ఉపయోగిస్తారు.

* ఈ అంచెల పద్ధతిని 1903లో 'ద్సియోల్కల్ స్కి' అనే రష్యన్ ఉపాధ్యాయుడు సూచించాడు.

* మొదటిసారిగా రష్యన్ శాస్త్రవేత్తలు 1957, అక్టోబరు 4న స్పుత్నిక్ - I అనే మానవరహిత అంతరిక్ష నౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు.

* ఈ అంతరిక్ష నౌకను ఉపయోగించి విశ్వంలోని నక్షత్రాలు, సూర్యుడు, ఇతర విశ్వాంతరాలు, భూ వాతావరణం గురించి అధ్యయనం చేయడానికి ప్రయత్నించారు.

* 1957 నవంబరులో స్పుత్నిక్ - II అనే అంతరిక్ష నౌకలో ఒక కుక్క (లైకా)ను పంపారు.

* ఈ అంతరిక్ష నౌకలో కుక్కను పంపడం వల్ల అంతరిక్షంలో జంతువుల హృదయ స్పందన, ఉష్ణోగ్రత లాంటివి అధ్యయనం చేశారు.

* 1958, జనవరి 31లో అమెరికా ఎక్స్‌ప్లోరర్ - I ను అంతరిక్షంలోకి పంపి అంతరిక్షం వయసు, భూమి అయస్కాంత క్షేత్రాన్ని కనుక్కుంది.

* 1961, ఏప్రిల్ 12న రష్యా దేశస్థుడు కల్నల్ యూరీగగారిన్ 'వస్తోక్' అనే అంతరిక్ష నౌక ద్వారా భూమి చుట్టూ ఒకసారి 89.34 నిమిషాల్లో పరిభ్రమించాడు.

* యూరీగగారిన్ మొదటి అంతరిక్ష వ్యోమగామి. రష్యాలో ఆస్ట్రోనాట్‌ను కాస్మోనాట్ అని అంటారు.

* 1961, మే 5న 'మెర్క్యూరీ - 3' అనే అంతరిక్ష నౌకలో 'అలెన్ షెపార్డ్' అనే వ్యోమగామి కూడా అంతరిక్షయానం చేసి భూమి చుట్టూ 89.34 నిమిషాలు పరిభ్రమించాడు.

* 1962లో టెలిస్టార్ (Telstar) అనే సమాచార కృత్రిమ ఉపగ్రహం పంపారు.

* 1963, జూన్ 16న 'వస్తోల్ - 6' అనే అంతరిక్ష నౌకలో లెఫ్టినెంట్ కల్నల్ 'వాలెంటినా తెరిష్కోవా' అనే మహిళ ఇతర వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలో 2 రోజుల, 22 గంటల 42 నిమిషాల్లో భూమి చుట్టూ 48 సార్లు

ప్రదక్షిణ చేసింది.

* 1982, ఆగస్టు 19 రష్యన్ మహిళ ''స్వెత్లానా సవిత్‌స్కయా" సోయూజ్ టి.7లో; 1983, జూన్ 18న అమెరికన్ మహిళ 'స్యాలిరైడ్‌'లు అంతరిక్షయానం చేశారు.

* 1965 మార్చిలో 'అలెక్సి లియోహున్' 'వస్తోల్ - II' అనే రోదసీ నౌకలో పయనించి అంతరిక్షంలో కొద్దిసేపు నడిచాడు.

* 1965, జూన్ 3 'Gemini - 7' అంతరిక్ష నౌక ద్వారా అమెరికన్ వ్యోమగామి ఎడ్వర్డ్ హెచ్.వైట్ అంతరిక్ష నౌక నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలో స్వేచ్ఛగా 21 నిమిషాలు తేలియాడాడు.

* 1969, జులై 21న అమెరికన్ 'నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్', 'ఎడ్విన్ అల్డ్రిన్' అనే ఇద్దరు వ్యోమగాములు అపోలో - II అనే అంతరిక్ష వాహక నౌక ద్వారా మొదటిసారి చంద్రుడిపై కాలు మోపారు.

* 1971లో రష్యన్‌లు 'శాల్యూట్' (Salyut) అనే అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

* 1972లో అమెరికన్‌లు 'స్కైలాబ్' (Skylab) అనే అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇది విఫలమై 1979లో భూమిపై పడిపోయింది.

* 1975లో అమెరికాకు చెందిన 'లైకింగ్ - I', 'లైకింగ్ - II' అనే అంతరిక్ష నౌకల ద్వారా అంగారక గ్రహంపై జీవరాశి లేదని నిరూపించారు.

* 1984 ఏప్రిల్ 3న రష్యా సహకారంతో భారత పౌరుడు 'రాకేష్ శర్మ' సోయజ్ - T - 11 అనే రోదసీ నౌక ద్వారా అంతరిక్షయానం చేశాడు.

* రష్యన్‌లు 1986, ఫిబ్రవరి 20న ఒక కొత్త అంతరిక్ష ప్రయోగశాల 'మిర్' (Mir) ను 'బైకనూర్ కాస్మోడ్రాం' నుంచి ప్రయోగించి 1982లో ఏర్పరిచిన 'శాల్యూట్‌'తో కలిపారు. మిర్ అనేది 'మల్టీ మాడ్యులర్ స్టేషన్'. ఈ స్టేషన్ ఆరు

స్పేస్ క్రాఫ్ట్‌లను ఒకేసారి తన వద్ద ఉంచుకోగలుగుతుంది.

* 1986, మార్చి 13న సోయాజ్ T - 15 పై ఇద్దరు రష్యన్ వ్యోమగాములు 'మిర్‌'తో అనుసంధానమయ్యారు. ఈ అనుసంధానాన్ని ప్రపంచమంతటా దూరదర్శన్‌లో అప్పుడు ప్రసారం చేశారు. ఇది ప్రపంచ చరిత్రలో

అద్భుతమైన విషయం.

* 1986, మే 30న పదకొండు దేశాల బృందం 'యూరోపియన్ అంతరిక్ష సంస్థ' దూర సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.

* 1989 మార్చిలో అట్లాంటిస్‌ను 'శుక్ర గ్రహం' పైకి పంపారు.

* 1990 అక్టోబరులో 'హబుల్ అంతరిక్ష దూరదర్శిని' సహాయంతో శని, ఫ్లూటోకు సంబంధించిన ఎంతో విలువైన ఛాయా చిత్రాలను భూమిపైకి పంపారు.

* భారతదేశంలో 1970 - 80 దశాబ్దంలో అంతరిక్ష యుగం ప్రారంభమైంది.

* 1975, ఏప్రిల్ 19న 'ఆర్యభట్ట' అనే ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో పంపారు.

* రష్యా సహకారంతో తుంబా (కేరళ), శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్)ల వద్ద రాకెట్ లాంచింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు.

* ఆర్యభట్ట తర్వాత భాస్కర I, II రోహిణి, ఐఆర్ఎస్, ఆపెల్, ఇన్‌శాట్ 1A 1B 1C మొదలైనవాటిని పంపారు.

* పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఉపగ్రహ వాహక నౌక PSLV (Polar Satellite Launching Vehicle) ను 1994, అక్టోబరు 15న శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు.


గురుత్వాకర్షణ

* న్యూటన్ భూమి చుట్టూ చంద్రుని గమనాన్ని సమవృత్తాకార చలనం అనే భావన ఉపయోగించి వివరించాడు.

* ఏదైనా వస్తువు స్థిర వడితో వృత్తాకార మార్గంలో చలిస్తూ ఉంటే దాన్ని సమవృత్తాకార చలనం అంటారు.

* సమవృత్తాకార చలనంలో కోణీయ వేగం స్థిరం.

* వృత్తాకార చలనంలో వస్తుత్వరణం దాని వేగానికి లంబంగా ఉంటుంది.

* వేగ దిశలో మాత్రమే మార్పు తీసుకువచ్చే త్వరణాన్ని అభికేంద్ర త్వరణం అంటారు.

* కేంద్రం వైపు పనిచేసే ఫలిత బలాన్ని అభికేంద్రబలం అంటారు.

* వస్తువు వేగ దిశను మాత్రమే మార్చగల ఫలితబలాన్ని అభికేంద్ర బలం అంటారు.

ఉదా: సౌరకుటుంబంలో సూర్యునికి, భూమికి మధ్య ఉన్న ఆకర్షణ బలం.

 

న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతం

* న్యూటన్ ఆపిల్ చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు, ఆపిల్ చెట్టు పై నుంచి పడిందనే విషయం ద్వారా గురుత్వాకర్షణ అనే భావనను కనుక్కున్నారు.

* భూ కేంద్రం నుంచి చంద్రునికి మధ్య ఉన్న దూరం 3,84,440 కి.మీ.

* భూమి చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేసేందుకు చంద్రునికి 27.3 రోజులు లేదా 2.35 × 10 సెకన్లు పడుతుంది.

* భూ ఉపరితలానికి దగ్గరగా ఉండే వస్తువుల్లో త్వరణం 981 సెం.మీ./సెకన్‌ గా ఉంటుంది. దీన్ని గెలీలియో కునుక్కున్నారు.

* విశ్వంలో ప్రతి వస్తువు మరొక వస్తువును ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బలం ఆ రెండు వస్తువుల ద్రవవ్యరాశుల లబ్దానికి అనులోమానుపాతంలో, వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. దిన్నే విశ్వగురుత్వాకర్షణ నియమం అంటారు.

* అనుపాతస్థిరాంకం Gను విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం అంటారు.

* G విలువ 6.67 × 10-11 N.m2 /kg2 (లేదా) nm2 kg-2

* ఒక కిలో ద్రవ్యరాశి ఉన్న రెండు వస్తువులు ఒక మీటరు దూరంలో వేరు చేసి ఉన్నపుడు వాటి మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలం Gకు సమానం.

* భూమి ఉపరితలానికి దగ్గరగా భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో చలించే ఉపగ్రహం పూర్తి భ్రమణం చేయడానికి 1 గంట 24.7 నిమిషాలు పడుతుంది.

* స్వేచ్ఛాపతన వస్తువు త్వరణం దాని ద్రవ్యరాశిపై ఆధారపడదు.

* భూమి ఆకర్షణ బలం మాత్రమే పని చేసే వస్తువులు స్వేచ్ఛాపతన వస్తువులు. స్థిరాంకం

* వస్తువుకు భూమి ఆకర్షణ వల్ల కలిగే త్వరణాన్ని గురుత్వత్వరణం అంటారు.

* చంద్రునిపై గురుత్వత్వరణం 1.67 m/sec2

* సూర్యునిపై గురుత్వత్వరణం 27.4 m/sec2

* స్వేచ్ఛాపతన వస్తువు పథ సమీకరణాలు

v = u + at

s = ut +  at2

v2 - u2 = 2as

* వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరినప్పుడు అది చివరి సెకన్‌లో ప్రయాణించే దూరం ఎంత?

 s =  gt2

=  × 10 × 1 = 5 m

* ఊర్థ్వ దిశలో చలించే వస్తువు చివరి సెకనులో ప్రయాణించే దూరం = అథో దిశలో మొదటి సెకనులో ప్రయాణించే దూరం.

* 'u' వడితో నిట్టనిలువుగా భూ ఉపరితలం నుంచి పైకి విసిరిన వస్తువు భూమిని తిరిగి చేరడానికి పట్టే సమయం T = అవుతుంది. దీన్నే గమనకాలం అంటారు.


భారం (Weight)

* వస్తువుపై పనిచేసే భూమ్యాకర్షణ బలాన్ని 'భారం' అని అంటారు.

* దీన్ని న్యూటన్లలో కొలుస్తారు.

* ఒక కేజీ ద్రవ్యరాశి ఉన్న వస్తువు భారం - 9.8 న్యూటన్లు

* 2 కేజీల ద్రవ్యరాశి ఉన్న వస్తువు భారం - 19.6 న్యూటన్లు

* 10 కేజీల ద్రవ్యరాశి ఉన్న వస్తువు భారం - 98 న్యూటన్లు

* భారం ప్రదేశాన్ని బట్టి మారుతుంది.

* ద్రవ్యరాశి విశ్వంలో ఎక్కడైనా స్థిరంగా ఉంటుంది.

* భారం W = mg అవుతుంది.


గురుత్వకేంద్రం

* ఒక వస్తువు భారం మొత్తం ఏ బిందువు ద్వారా పనిచేస్తుందో ఆ బిందువును గురుత్వకేంద్రం అంటారు.

* గురుత్వకేంద్ర స్థానం వస్తువు భారం ఏ విధంగా వితరణ చెంది ఉందో దానిపైన ఆధారపడి ఉంటుంది.  

* గురుత్వకేంద్రం వద్ద ద్రవ్యరాశి ఉండనవసరం లేదు.


స్థిరత్వం

* ఒక వస్తువు స్థిరత్వం దాని గురుత్వకేంద్రంపై ఆధారపడి ఉంటుంది.

* వస్తువు గురుత్వకేంద్రం ఎత్తు తక్కువగానూ, ఆధార వైశాల్యం ఎక్కువగా ఉంటే వస్తు స్థిరత్వం అధికంగా ఉంటుంది.

* వస్తువు గురుత్వకేంద్రం నుంచి గీసిన క్షితిజ లంబం దాని ఆధార వైశాల్యం ద్వారా వెళ్లినప్పుడు వస్తు స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది.

* ఓడలు స్థిరత్వం అనే సూత్రం పై ఆధారపడి పనిచేస్తాయి.

Posted Date : 02-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌