• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచ విపత్తుల స్థితి

తగ్గించి.. తట్టుకొని నిలబడి!

  ఆధునిక కాలంలో విస్తృత ప్రగతితోపాటు విపత్తులూ పెరిగాయి. ఆపగలిగేంత శక్తిని పూర్తిగా సంతరించుకోలేకపోయినా వాటి తీవ్రతను, ప్రాణనష్టాన్నీ తగ్గించగలుగుతున్నారు. తట్టుకొని నిలబడగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో విపత్తులు ఎన్ని రకాలు, ఎలాంటి నష్టాన్ని కలిగిస్తున్నాయి, ఏయే నివేదికలు, సమావేశాలు ఏం చెబుతున్నాయి? ఏవిధమైన నిర్దేశాలు చేస్తున్నాయనే అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

  మానవుడు ఎంత అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ అనేక సహజ, మానవ కారణాల వల్ల విపత్తుల సంఖ్య కాలంతో పాటు పెరుగుతూనే ఉంది. 1994 నుంచి 1998 మధ్య ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి సగటున 428 విపత్తులు సంభవిస్తే 1999 నుంచి 2003 మధ్య సగటున 707 విపత్తులు నమోదయ్యాయి. అంటే నాలుగేళ్ల వ్యవధిలో సగటున సంవత్సరానికి 60 శాతం విపత్తులు పెరిగాయి. వీటిలో మానవాభివృద్ధి అల్పంగా ఉన్న దేశాల్లో సగటున 142 శాతం పెరిగాయి. కాలానుగుణంగా విపత్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ముందుగానే సంసిద్ధంగా ఉండటం, తీవ్రత తగ్గించడం లాంటి చర్యలను చేపట్టడంతో ప్రాణ నష్టం తగ్గించగలుగుతున్నాం. కానీ విపత్తుల కారణంగా ఆర్థిక నష్టం పెరుగుతూనే ఉంది. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం విపత్తుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా సగటున 880 బిలియన్‌ డాలర్ల నష్టం జరుగుతుంది.

 

సహజ వైపరీత్యాల పరంగా ప్రపంచ విపత్తుల తీరు

వరదలు            - 30%

తుపాన్‌లు            - 21%

కరవు              - 19%

మహమ్మారి వ్యాధులు   - 15%

భూకంపాలు, సునామీలు - 8%

భూపాతాలు (కొండచరియలు విరిగిపడటం) - 4%

హిమపాతాలు         - 1%

అగ్నిపర్వత విస్ఫోటనాలు  - 1%

కీటక దాడులు         - 1%


                    ========

                      100%

                    ========


ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అన్నిరకాల విపత్తుల్లో ప్రాణ నష్టం తీరు

కరవు, దుర్బిక్షం    - 45%

వరదలు         - 16%

పారిశ్రామిక పేలుళ్లు, రోడ్డు ప్రమాదాలు లాంటి సాంకేతికపరమైన విపత్తులు   - 14%

భూకంపాలు           - 12%

తుపాన్‌లు            - 10%

ఇతర విపత్తులు     - 3%


            ===================

                     100%

          ====================

 

సహజ విపత్తులు

 

జల, వాతావరణ సంబంధ విపత్తులు: అత్యధికంగా ఆసియా, తర్వాత వరుసగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, ఓషియానియా (ఆస్ట్రేలియా) ఖండాల్లో సంభవిస్తున్నాయి.

 

భౌగోళిక విపత్తులు: అత్యధికంగా ఆసియా, తర్వాత ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఓషియానియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లో  సంభవిస్తున్నాయి.

 

జైవిక విపత్తులు: అత్యధికంగా ఆఫ్రికా, తర్వాత ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఓషియానియా ఖండాల్లో  సంభవిస్తున్నాయి.

* ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితిల నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం విస్తరించిన విపత్తులు వరదలు, తుపాన్‌లు. ఆఫ్రికా దేశాల్లో మాత్రం తరచూ కరవు సంభవిస్తోంది. ఎల్లప్పుడూ కరవు, వరదలతో సతమతమవుతున్న దేశాలను ప్రపంచంలోనే అత్యంత ఆకలి దేశాలుగా పిలుస్తున్నారు.

* ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌క్రాస్‌ అండ్‌ రెడ్‌క్రెసెంట్‌ సొసైటీ (ఐఎఫ్‌ఆర్‌సీ, జెనీవా) ప్రచురించిన ప్రపంచ విపత్తుల నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా విపత్తుల ప్రభావానికి గురయ్యే వారిలో 85% ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాలకు చెందినవారే ఉంటున్నారు.

* యుఎన్‌ఐఎస్‌డీఆర్‌ గ్లోబల్‌ అసెస్‌మెంట్‌ రిపోర్ట్‌ (జీఏఆర్‌ - 2019) ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం విపత్తు మరణాల్లో 90% అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోనే జరుగుతున్నాయి. విపత్తుల్లో నాశనమవుతున్న గృహాల్లో 2/3వ వంతు జల, వాతావరణ వైపరీత్యాల వల్లే జరుగుతున్నాయి.

 

జీఏఆర్‌ - 2022 ప్రకారం

* గత 20 ఏళ్లలో ఏటా పెద్ద, మధ్య తరహా విపత్తులు 350 నుంచి 500 వరకు సంభవించాయి. 2030 నాటికి ఏటా సగటున 560 సహజ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

* గత పదేళ్లలో సంవత్సరానికి సరాసరిగా సహజ విపత్తుల వల్ల ప్రపంచం మొత్తం 170 బిలియన్‌ డాలర్ల నష్టం జరిగింది.

* విపత్తుల వల్ల అల్ప, మధ్య ఆదాయ దేశాలు ఏటా తమ జీడీపీలో 1% ఆదాయాన్ని కోల్పోతున్నాయి.

* అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ నష్టం 0.1% నుంచి 0.2% వరకు మాత్రమే ఉంటుంది.

* విపత్తులు, వాతావరణ మార్పుల వల్ల 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మయన్మార్, వియత్నాం, పాకిస్థాన్‌ లాంటి దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

 

అంతర్జాతీయ సమావేశాలు

విపత్తు ముప్పు కుదింపు కోసం ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ సమావేశాలు జరిగాయి.

 

సురక్షిత ప్రపంచం కోసం యొకహోమా సమావేశం (1994): ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు జపాన్‌లోని యొకహోమా నగరంలో 1994 మే 23 నుంచి 27 వరకు అయిదు రోజులు సమావేశమయ్యాయి. ఈ సమావేశాన్ని ‘ప్రకృతి విపత్తుల తగ్గింపు కోసం ప్రపంచ సమావేశం’ అని వ్యాఖ్యానించారు. ఇది విపత్తుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడుతున్న ప్రాణ నష్టం, పర్యావరణ హానిని అరికట్టి సుస్థిరŸ అభివృద్ధి సాధించడం కోసం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది.

 

హ్యోగో కార్యచట్రం (2005 - 2015): ఇది జపాన్‌లోని హ్యోగో నగరంలోని కోబెలో 2005 జనవరి 18 నుంచి 22 వరకు జరిగింది. ఈ సమావేశంలో విపత్తుల ప్రభావాన్ని తట్టుకొని తిరిగి నిలబడగలిగే సామర్థ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో  పెంపొందించేందుకు అనుసరించాల్సిన వ్యూహం, విధాన మార్గదర్శకాలు, కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు.

 

విపత్తు కుదింపు కోసం సెండాయ్‌ కార్యాచరణ (2015 - 2030): హ్యోగో కార్యచట్రానికి కొనసాగింపుగా 2015 మార్చి 14 నుంచి 18 వరకు జపాన్‌లోని సెండాయ్‌ నగరంలో ఈ సమావేశం జరిగింది. హ్యోగో కార్యాచరణ అమల్లో ఉన్న 10 సంవత్సరాల కాలంలోనే విపత్తుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ సమావేశంలో కొన్ని ప్రపంచ లక్ష్యాలు నిర్ణయించారు.

* 2020 - 30 నాటికి ప్రపంచవ్యాప్త మరణాల సంఖ్య లక్ష లోపు ఉండేలా చర్యలు తీసుకోవాలి.

* 2020 - 30 నాటికి విపత్తుల బాధితులను లక్ష లోపు పరిమితం చేయాలి.

* 2030 నాటికి విపత్తుల నష్టాన్ని ప్రపంచ వ్యాప్తంగా జీడీపీలో గణనీయంగా తగ్గించాలి.

* 2030 నాటికి అవస్థాపనా సౌకర్యాలు, విద్య, ఆరోగ్య లాంటి అంశాల్లో నష్టాన్ని గణనీయంగా తగ్గించాలి.

* 2020 నాటికి అన్ని దేశాలు ప్రాంతీయంగా, జాతీయంగా విపత్తు కుదింపు వ్యూహాలను సమర్థంగా పెంచుకోవాలి.

* అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవాన్ని ఏటా అక్టోబరు 13న నిర్వహిస్తారు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. ప్రపంచ విపత్తులు, మరణాలు, ప్రభావితమైన వారిలో అత్యధిక శాతం వాటా ఏ ఖండంలో ఉంది?

1) ఆసియా   2) ఆఫ్రికా   3) ఐరోపా    4) ఓషియానియ

 

2. UNISDR ప్రకారం ప్రపంచ సహజ విపత్తుల్లో అత్యధికం దేనివల్ల సంభవిస్తున్నాయి?

1) కరవు     2) తుపాన్లు      3) వరదలు     4) సునామీలు

 

3. ప్రపంచవ్యాప్త విపత్తు మరణాల్లో అత్యధిక మరణాలకు కారణమయ్యే విపత్తు?

1) భూకంపాలు     2) కరవు    3) వరదలు    4) తుపాన్లు  


4. ప్రపంచవ్యాప్త జైవిక విపత్తుల్లో అత్యధిక శాతం ఏ ఖండంలో జరుగుతున్నాయి?

1) ఆఫ్రికా  2) ఆసియా   3) ఓషియానియా  4) ఐరోపా

 

5. ‘ప్రాకృతిక విపత్తు అనేది ఏదీ లేదు, కేవలం ప్రాకృతిక అపాయం తప్ప’ అనే వాక్యం?

1) సత్యం   2) అసత్యం    3) సత్యం కావచ్చు, అసత్యం కావచ్చు  4) అర్థరహితం

 

6. ప్రపంచ వ్యాప్తంగా విపత్తుల ప్రభావానికి గురైన వారిలో 85% ఏ ప్రాంతానికి చెందినవారు?

1) ఆసియా, పసిఫిక్‌    2) ఆసియా, ఆఫ్రికా     3) దక్షిణాసియా   4) ఉత్తర ఆసియా

 

7. ఎప్పుడూ కరవు, వరదలతో పీడించబడుతున్న దేశాలు?

1) అత్యంత పేద దేశాలు    2) అత్యంత ఆకలి దేశాలు    

3) అత్యంత పీడిత దేశాలు   4) అత్యంత పౌరుష దేశాలు

 

8. విపత్తుల కుదింపు కోసం సెండాయ్‌లో మూడో అంతర్జాతీయ సమావేశం ఎప్పుడు జరిగింది?

1) 2015 మార్చి     2) 2015 జనవరి    3) 2017 మార్చి     4) 2018 మే

 

9. అంతర్జాతీయ విపత్తుల కుదింపు దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) మార్చి 21     2) అక్టోబరు 13    3) నవంబరు 10   4) మే 22

 

10. సెండాయ్‌ సమావేశం లక్ష్యం?

1) 2020 - 30 నాటికి ప్రపంచ విపత్తు మరణాలు లక్షకి తగ్గించాలి.

2) 2020 - 30 నాటికి ప్రపంచ విపత్తు మరణాలు 5 లక్షలకు కుదించాలి.

3) 2020 - 30 నాటికి ప్రపంచ విపత్తు మరణాలు 50 వేలకు తగ్గించాలి.

4) ఏదీకాదు

 

సమాధానాలు

1-1; 2-3; 3-2; 4-1; 5-1; 6-1; 7-2; 8-1; 9-2; 10-1.

 

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 10-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌