• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ 18వ శతాబ్దపు స్థితిగతులు

భారతదేశ చరిత్రలో 18వ శతాబ్దానికి ప్రాధాన్యం ఉంది. అప్పట్లో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులు ఎలా ఉండేవనేది తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ అంశంపై అడిగే ప్రశ్నలకు సులువుగా జవాబులు గుర్తించవచ్చు. ఆనాటి ఆచార వ్యవహారాలు - కట్టుబాట్లు, విద్యా వ్యవస్థ, గ్రామీణ - పట్టణ ప్రాంతాల పరిస్థితులు, ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులు.. ఆర్థిక వ్యవస్థపై వీటి ప్రభావం.. తదితర ఆసక్తికరమైన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం.  భారతదేశంలో క్రీ.శ. 18వ శతాబ్దంలో రాజకీయ అస్థిరత నెలకొన్నప్పటికీ కొన్ని మార్పులతో సమాజంలోని సంప్రదాయ లక్షణాలు కొనసాగుతూనే ఉండేవి.

సాంఘిక అసమానతలు
సమాజంలో ఉన్నత వర్గాలకు చెందిన చక్రవర్తి, అధికార వర్గం విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. వీరు మద్యం, స్త్రీ, సంగీతానికి బానిసలుగా తయారయ్యారు. దిగువ స్థాయిలో గ్రామీణ పేద వ్యవసాయదారులు, చేతివృత్తులవారు ఉండేవారు. ఈ రెండు వర్గాలకు మధ్యలో చిన్న వ్యాపారులు, దిగువ తరగతి ఉద్యోగులు, పట్టణ ప్రాంతాల్లోని చేతి వృత్తులవారు ఉండేవారు. సమకాలీన ఆధారాలు లేకపోవడం, వివిధ ప్రాంతాల్లో ఆదాయం, ధరల్లో వ్యత్యాసం ఉండటంతో ప్రజల జీవన ప్రమాణాన్ని పోల్చడం సాధ్యపడటంలేదు. ఆ కాలంనాటి హిందూ సమాజంలోని కుల వ్యవస్థ ప్రత్యేకతను సంతరించుకుంది. వివాహం, దుస్తులు, ఆహారం, వృత్తుల ఎంపికలో కుల నియమాలు తప్పక పాటించేవారు. అయితే ఆర్థిక ఒత్తిడులు, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన పరిపాలనాపరమైన ఆవిష్కరణల ఫలితంగా కొందరు తమ పూర్వీకుల వృత్తులను విడిచి కొత్త వృత్తులను చేపట్టారు.

స్త్రీల జీవనం
స్త్రీలకు ఇళ్లలో గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించినా సమానత్వాన్ని మాత్రం ఇవ్వలేకపోయారు. మలబార్, కొన్ని వెనుకబడిన ప్రాంతాలు మినహా మిగతా దేశంలో పితృస్వామిక సమాజం అమల్లో ఉండేది. తండ్రి లేదా పెద్ద కుమారుడ్ని కుటుంబ పెద్దగా వ్యవహరించేవారు. రాజకీయాలు, పరిపాలన విషయాల్లో కొందరు హిందూ, ముస్లిం స్త్రీలు ప్రముఖ పాత్ర వహించినప్పటికీ సాధారణ స్త్రీలకు సమాజంలో సముచిత స్థానం లభించలేదు. స్త్రీలు పరదా విధానాన్ని అవలంబించేవారు. పేద స్త్రీలు మాత్రం ఈ విధానాన్ని పాటించలేదు.
* బాల్యవివాహాలు సర్వసాధారణం. రాజకుమారులు, పెద్ద జమిందార్లు, ధనవంతుల్లో బహు భార్యత్వం ఉండేది. ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్‌కు చెందిన ధనిక వర్గాల్లో ఈ ఆచారం ఎక్కువ. ధనిక వర్గాల్లో వరకట్నం తీసుకోవడం సంప్రదాయం. వితంతు పునర్వివాహాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగేవి. పీష్వాలు వితంతు పునర్వివాహాలపై 'పట్టం అనే పన్ను విధించేవారు. పీష్వాలు తమ భూభాగంలో సతీసహగమనాన్ని రూపుమాపడంలో కొంత విజయం సాధించారు.

రెండు విధాల బానిసత్వం
బానిసలను ఇంటి పని, పొలం పని చేసేవారు.. ఇలా రెండు తరగతులుగా విభజించారు. యజమాని భూమిని అమ్మినప్పుడు ఆ పొలాల్లో పనిచేసే బానిసలు కొత్త యజమాని కింద పనిచేయాల్సి వచ్చేది. భారతదేశంలో బానిసత్వం ఎక్కువగా అమల్లో ఉన్నట్లు ఐరోపాకు చెందిన యాత్రికులు, పరిపాలకులు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, కరవు, ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను కొంత ధరకు అమ్మేవారు. రాజపుత్రులు, ఖాత్రీలు, కయస్థ కులానికి చెందినవారు తమ ఇళ్లలో బానిస స్త్రీలను వినియోగించుకునేవారు. అమెరికా, ఐరోపా దేశాల్లోని బానిసలతో పోలిస్తే భారతదేశంలో బానిసల పరిస్థితి మెరుగ్గా ఉండేది. బానిసలను కుటుంబానికి చెందిన వారసత్వ సేవకులుగా పరిగణించేవారు. వారికి వివాహం చేసుకునే హక్కు ఉండేది. బానిసల పిల్లలను స్వేచ్ఛా పౌరులుగా గుర్తించేవారు. ఐరోపావారి రాకతో బానిసత్వం, బానిసల వ్యాపారం కొత్త పుంతలు తొక్కింది. ఐరోపాకు చెందిన వర్తక కంపెనీలు 10 సంవత్సరాల బాలికను 5 నుంచి 15 రూపాయలకు, 16 ఏళ్ల బాలుడిని 16 రూపాయలకు, వయోజనుడైన బానిసను 15 నుంచి 20 రూపాయిలకు.. బెంగాల్, అసోం, బిహార్ మార్కెట్లలో కొని, వారిని ఐరోపా, అమెరికా మార్కెట్లలో అమ్మేవారు. ఐరోపావారు సూరత్, మద్రాసు, కోల్‌కతాల్లో అబిసీనియన్ బానిసలను కొని, ఇంటిపనికి వినియోగించినట్లు తెలుస్తోంది. క్రీ.శ. 1789 లో బానిస రవాణాను నిషేధించారు. అయితే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బానిసత్వం కొనసాగుతోంది.

విద్యకు ప్రాధాన్యం
హిందూ, ముస్లింలు విద్య నేర్చుకోవడానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. వీరు విద్యను మతంతో అనుసంధానం చేశారు. నాడియ, బెనారస్(కాశి), తీర్హుట్(మిథిల), ఉత్కల(ఒడిశా)లు సంస్కృత విద్యకు పేరుపొందిన కేంద్రాలు. ఎంతోమంది సంస్కృతంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి కాశీకి వచ్చేవారు. అరబిక్, పర్షియన్ భాషల్లో ఉన్నత విద్యా కేంద్రాలను మద్రసాలని పిలిచేవారు. పర్షియన్ రాజభాష కావడంతో హిందూ, ముస్లింలు దీన్ని నేర్చుకునేవారు. ఖురాన్ అధ్యయనం చేయాలనుకునేవారు అరబిక్ భాషలో ప్రావీణ్యం సాధించేవారు. ప్రాథమిక విద్య ఎక్కువగా విస్తరించింది. హిందువుల ప్రాథమిక విద్యా కేంద్రాలను పాఠశాలలని, ముస్లిం ప్రాథమిక పాఠశాలలను మక్తబ్‌లనీ పిలిచేవారు. పాఠశాలలు, దేవాలయాలు, మసీదులకు అనుబంధంగా ఉండేవి. పాఠశాలలో విద్యార్థులు చదవడం, రాయడం, అంకగణితాలను నేర్చుకునేవారు. సత్యం, నిజాయతీ, తల్లిదండ్రులపై విధేయత, మతం పట్ల విశ్వాసం మొదలైనవి పాఠశాలల్లో నేర్పించే ముఖ్యమైన విషయాలు. ఉన్నత కులాలకు చెందినవారు ఎక్కువగా చదువుకున్నప్పటికీ, తక్కువ కులాలకు చెందినవారి పిల్లలు కూడా పాఠశాలలకు హాజరయ్యేవారు. అయితే బాలికల విద్యకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

కళలు - సాహిత్యం
కళలు, సాహిత్యానికి దిల్లీలో ఆదరణ లేకపోవడంతో కవులు, కళాకారులు కొత్తగా స్థాపించిన రాజ్యాల రాజధానులైన హైదరాబాద్, లఖ్‌నవూ(లక్నో), ముర్షీదాబాద్, జైపూర్ తదితర ప్రాంతాలకు తరలి వెళ్లేవారు. క్రీ.శ. 1784లో లఖ్‌నవూలో అసఫ్ ఉద్దౌలా మొహరం పండుగ జరుపుకోవడానికి వీలుగా గొప్ప ఇమంబరను నిర్మించాడు. ఈ భవన నిర్మాణంలో స్తంభాలు లేకపోవడం విశేషం. మహారాజ రంజిత్ సింగ్ అమృత్‌సర్‌లోని సిక్కుల దేవాలయాన్ని పునరుద్ధరించాడు. 1725లో ఈ దేవాలయంలోని కింది సగభాగాన్ని పాలరాతితో, పై భాగాన్ని రాగితో నిర్మించి, పలుచటి బంగారంతో తాపడం చేయించాడు. అందుకే దీన్ని స్వర్ణదేవాలయంగా పిలుస్తున్నారు. భరత్‌పూర్ రాజధాని దిగ్‌లో సూరజ్‌మల్ ప్రాసాదం, ఆగ్రాలోని రాజ ప్రాసాదాలకంటే మిన్నగా స్వర్ణదేవాలయ పునర్‌నిర్మాణాన్ని ప్రారంభించినా.. దాన్ని పూర్తి చేయలేదు. ప్రాంతీయ భాషలైన ఉర్దూ, హిందీ, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, మరాఠీ, తెలుగు, తమిళం అభివృద్ధి చెందాయి. క్రీ.శ. 18వ శతాబ్దంలో క్రైస్తవ మిషనరీలు ముద్రణ యంత్రాలను స్థాపించాయి. బైబిల్‌ను ప్రాంతీయ భాషల్లో ముద్రించాయి. బెంగాల్‌లో విలియం కేరి, వార్డ్, మార్ష్‌మాన్ లాంటి క్రైస్తవ మిషనరీలు సెరాంపూర్‌లో ముద్రణ యంత్రాన్ని స్థాపించి బెంగాలీ భాషలో బైబిల్‌ను ప్రచురించాయి.

ఆర్థిక వ్యవస్థ
క్రీ.శ. 18వ శతాబ్దం ప్రారంభంలో భారత ఆర్థిక వ్యవస్థలో గ్రామాలు సొంత పరిపాలనా వ్యవస్థను కలిగి ఉండి, స్వయం సమృద్ధితో ఉండేవి. గ్రామానికి కావాల్సిన అన్ని వస్తువులను స్వయంగా ఉత్పత్తి చేసుకునేవి. ఇవి రాజ్యానికి భూమిశిస్తును చెల్లించేవి. పాలకులు, రాజవంశాలు మారినా గ్రామీణ వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ పరిస్థితులు ఐరోపా పరిశీలకుల దృష్టిని ఆసియా గ్రామీణ వ్యవస్థ వైపు ఆకర్షించాయి. భారతదేశంలో పట్టణ చేతివృత్తులు బాగా అభివృద్ధి చెంది, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లను ఆకర్షించాయి. అప్పట్లో భారతదేశంలోని ఢాకా, అహ్మదాబాద్, మచిలీపట్నం ప్రాంతాలు నూలు ఉత్పత్తులకు; ముర్షిదాబాద్, ఆగ్రా, లాహోర్, గుజరాత్‌లోని పలు ప్రాంతాలు పట్టు వస్త్రాలకు; లాహోర్, ఆగ్రా, కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్నితో చేసిన కార్పెట్లు, శాలువాలు, బంగారు, వెండితో చేసిన ఆభరణాలు, లోహపాత్రలు, ఆయుధాలకు విదేశాల్లో ఎక్కువ గిరాకీ ఉండేది. అంతర్గత, విదేశీ వ్యాపారం అభివృద్ధి చెందడంతో వర్తక పెట్టుబడిదారీ వ్యవస్థ అమల్లోకి రావడంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఉత్తర భారతదేశంలో జగత్‌షేర్‌లు, నగర్‌షేర్‌లు దక్షిణ భారతదేశంలో చెట్టియార్లు ఆవిర్భవించడంతో వర్తక, వాణిజ్యాలు మరింత అభివృద్ధి చెందాయి. క్రీ.శ. 17, 18 శతాబ్దాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు పెట్టుబడిదారీ వ్యవస్థ త్వరగా అభివృద్ధి చెందడానికి అవసరమైన పరిస్థితులను కల్పించాయి. రైతుల నుంచి దోచుకున్న సంపదను భూస్వాములు తమ ఆడంబరాల కోసం వృథా చేసేవారు. ప్రభు వర్గానికి చెందినవారు మరణిస్తే వారి ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పించే చట్టాలు.. ప్రజల్లో సరైన మార్గంలో పొదుపు చేసే అలవాటు లేకపోవడం.. పొదుపు చేసిన సొమ్మును ఉత్పాదన కోసం వినియోగించక పోవడం.. రాజకీయ స్థిరత్వం లేకపోవడం.. అభివృద్ధి కాంక్ష, ముందు చూపులేని రాజ్యం.. ఇవన్నీ అభివృద్ధికి నిరోధకాలుగా ఉన్నాయి. క్రీ.శ. 18వ శతాబ్దంలో ఐరోపా వర్తక సంఘాలు భారతదేశంలో రాజకీయం, ఆర్థిక ఆసక్తితో బలంగా ఉండటం కూడా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం వైపు మళ్లడానికి కారణమైంది.

ముఖ్యాంశాలు
సతీసహగమన దురాచారాన్ని ఎక్కువగా బెంగాల్, మధ్య భారతదేశం, రాజస్థాన్‌లలో కొన్ని ఉన్నత కులాలకు చెందినవారు మాత్రమే పాటించేవారు.
బెంగాల్, బిహార్‌లలో సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేసే ఉన్నత విద్యా కేంద్రాలను 'చటుస్పతి అని పిలిచేవారు.
* బెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు కాశీని 'భారతదేశ ఏథెన్స్‌గా వర్ణించాడు.
* అజిమాబాద్(పాట్నా) తూర్పు భారతదేశంలో గొప్ప పర్షియన్ విద్యా కేంద్రంగా ఉండేది.
పింక్ సిటీగా పేరుపొందిన జైపూర్‌ను సవాయి జైసింగ్ నిర్మించాడు. దీంతో సహా అయిదు నగరాల్లో ఖగోళ పరిశీలన కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాడు.
డెన్మార్క్‌కు చెందిన జీజెన్‌బెల్గ్ తమిళ వ్యాకరణాన్ని రచించడంతోపాటు బైబిల్‌ను తమిళంలోకి అనువదించాడు.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు