• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ ప్రభుత్వ విధానాలు

సంక్షేమ రంగం - ప్రభుత్వ విధానం
ఒక రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అంటే సంక్షేమ రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం అభివృద్ధి కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలను రాష్ట్ర విధానాలు అంటారు. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల గురించి క్లుప్తంగా..

సమాజ సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆసరా (సామాజిక భద్రతా పింఛన్ల కార్యక్రమం), ఆహార భద్రత, మిషన్‌ 
భగీరథ (వాటర్‌ గ్రిడ్‌), గృహ వసతి (డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు) లాంటి సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకు చేరువయ్యేలా చేయడానికి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది.


సమగ్ర కుటుంబ సర్వే - 2014
* తెలంగాణ ప్రభుత్వం 2014 ఆగస్టు 19న రాష్ట్రమంతటా సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఇంటింటి సర్వేని నిర్వహించింది.
* రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సంబంధించి ఒక పటిష్టమైన గణాంక సమాచార నిధిని సిద్ధం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం.
* దీని ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారి వ్యక్తిగత అవసరాలు తీర్చే లక్ష్యంతో అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి వీలుపడుతుంది.
* ఈ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం 101.83 లక్షల కుటుంబాలు ఉన్నాయి.
* రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 16.56 లక్షల కుటుంబాలు ఉండగా, నిజామాబాద్‌లో అత్యల్పంగా 6.97 లక్షల కుటుంబాలు ఉన్నాయి.

ఆసరా పింఛన్లు
* ‘ఆసరా’ అనేది సామాజిక భద్రతా పింఛన్ల కార్యక్రమం.
* వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేతపనివారు, కల్లుగీత కార్మికులు, హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ రోగులకు సామాజిక భద్రత కల్పించడం దీని ఉద్దేశం. వారి రోజువారి జీవితానికి కావాల్సిన కనీస అవసరాలను తీర్చుకోవడంలో అండగా ఉండటానికి ఆసరా పింఛన్ల కార్యక్రమాన్ని 2014 అక్టోబరు 1 నుంచి అమలయ్యేలా ప్రారంభించారు.
* ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు 2014 నవంబరు 8న మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరులో ‘ఆసరా’ పథకాన్ని ప్రారంభించారు.
* పాత పింఛన్‌ పథకంలో వృద్ధులు, వితంతువులు, నేతపనివారు, కల్లుగీత కార్మికులు, హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ రోగులకు నెలకు రూ.200 చొప్పున అందించేవారు. నూతన పథకంలో దీన్ని రూ.1000 కి పెంచారు. వికలాంగులకు గతంలో రూ.500 ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.1500 కు పెంచారు.
* 2015 మార్చి నుంచి బీడీ కార్మికులకు కూడా ‘ఆసరా’ పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా వీరికి కూడా రూ.1000 జీవన భృతి కల్పిస్తున్నారు.
* ‘ఆసరా’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సుమారు 35.74 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని అంచనా.
* 2016  17 బడ్జెట్‌లో ఆసరా పింఛన్ల కింద ఆర్థిక సహాయం అందించడానికి రూ.4,693 కోట్లు కేటాయించారు.

ఆహార భద్రత
* ఆహార భద్రతా కార్డులు పొందడానికి అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు 2015 జనవరి నుంచి రూపాయికి కిలో చొప్పున మనిషికి 6  కిలోల బియ్యం సరఫరా చేస్తున్నారు.
* ఈ పథకంలో భాగంగా ప్రస్తుతం కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నప్పటికీ, ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ఇస్తారు. (గతంలో మనిషికి 4 కిలోల చొప్పున, కుటుంబానికి 20 కిలోలకు మించి బియ్యం ఇవ్వరాదనే నిబంధన ఉండేది.)
* అంత్యోదయ అన్నయోజన కుటుంబాలకు రూపాయికి కిలో చొప్పున 35 కిలోల బియ్యం ఇస్తారు.
* ఆహార భద్రత కింద లబ్ధిదారులను గుర్తించడానికి వీలుగా ప్రభుత్వం ఆదాయ పరిమితిని పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితిని రూ.60 వేల నుంచి రూ.1.50 లక్షలకు, పట్టణ ప్రాంతంలో రూ.75 వేల నుంచి రూ.2 లక్షల రూపాయలకు పెంచింది. ఈ పరిమితిలోపు ఆదాయం ఉన్నవారు ఆహారభద్రతా కార్డు కింద లబ్ధి పొందడానికి అర్హులు.
* కుటుంబ కమతం పరిమితిని మాగాణి భూమి అయితే 2.5 ఎకరాల నుంచి 3.5 ఎకరాలకు, మెట్టభూమి అయితే 5 ఎకరాల నుంచి 7.5 ఎకరాలకు పెంచారు. ఈ పెంచిన కుటుంబ కమతంలోపు ఉన్నవారు ఆహార భద్రతా కార్డు పొందడానికి అర్హులు.
* 2015 జనవరి నాటికి ఆహార భద్రతా కార్డులకు అర్హులుగా 87.57 లక్షల కుటుంబాలను, అంత్యోదయ అన్నయోజన ్బతిత్త్శ్రి కార్డులకు 49 వేల మందిని గుర్తించారు.
* ఈ పథకం కింద 2.8 కోట్లమంది లబ్ధిపొందుతున్నారు.
* 2015  16 బడ్జెట్‌లో ప్రభుత్వం ఆహార భద్రత, సబ్సిడీ కోసం 2,200 కోట్లు కేటాయించింది.
చౌక ధరల దుకాణాల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో ముఖ్యమైనవి...
* కార్డుదారుకు, చౌక ధరల దుకాణం మధ్య దూరం 3 కి.మీ. మించి ఉండకూడదు. అలాగే ఇది గిరిజన ప్రాంతాల్లో 1 కి.మీ.కు మించకూడదు.
* ప్రాంతాలవారీగా ఒక్కో చౌక దుకాణానికి కార్డుల సంఖ్యను కింది విధంగా అనుసంధానిస్తారు.        



సన్నబియ్యం: వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు, మధ్యాహ్న భోజనం పథకం కింద లబ్ధిపొందుతున్న విద్యార్థులకు పుష్టికరమైన, మంచి నాణ్యమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని 2015 జనవరి 1 నుంచి ప్రారంభించింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం సన్నబియ్యం (సూపర్‌ ఫైన్‌ రకం) సరఫరా చేస్తుంది.
* ఈ కార్యక్రమం ద్వారా సుమారు 35 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.
* జాతీయ ఆహార భద్రతా చట్టం  2013 కు అనుగుణంగా తెలంగాణ ఆహార భద్రతా నియమాలు (రూల్స్‌)  2015 ను రూపొందించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 25న ఉత్తర్వులు జారీ చేసింది.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ పథకం

* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ పథకానికి 2015 అక్టోబరు 22న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నల్గొండ జిల్లా సూర్యాపేట; మెదక్‌ జిల్లా ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాల్లో శంకుస్థాపన చేశారు.
* ఈ పథకం కింద తొలి దశలో 2015  16 సంవత్సరానికి 60 వేల ఇళ్లు నిర్మించనున్నారు ్బ2016  17లో 2 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు 2016  17 బడ్జెట్‌లో పేర్కొన్నారు). మొత్తం 60 వేల ఇళ్లలో 36 వేలు గ్రామీణ ప్రాంతాల్లో, 24 వేలు పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తారు.
* 2015  16లో ఒక్కో నియోజకవర్గంలో 400 ఇళ్ల చొప్పున నిర్మిస్తారు.
* ‘డబుల్‌ బెడ్‌రూమ్‌’ ఇళ్ల నిర్మాణ పథకం కింద 560 చదరపు అడుగుల్లో నిర్మించే ఒక్కో ఇంట్లో రెండు పడక గదులు, ఒక హాల్, కిచెన్, రెండు టాయిలెట్లు ఉంటాయి.

ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు

* లబ్ధి పొందే కుటుంబం దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి. యజమాని/ అతడి భార్య పేరున ఆహార భద్రతా కార్డు ఉండటం తప్పనిసరి.
* లబ్ధి పొందే కుటుంబాలు ప్రస్తుతం గుడిసె, కచ్చా ఇళ్లు లేదా అద్దె ఇళ్లలో నివసిస్తూ ఉండాలి.
* మొత్తం ఇళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, అల్పసంఖ్యాక వర్గాలకు 7 శాతం, మిగిలిన 43 శాతం ఇతర అణగారిన వర్గాలకు కేటాయిస్తారు.
* అలాగే పట్టణ ప్రాంతాల్లో ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6 శాతం, అల్పసంఖ్యాక వర్గాలవారికి 12 శాతం, మిగిలిన 65 శాతం ఇతర అణగారిన వర్గాలకు కేటాయిస్తారు.
* ఇంటిని ఇల్లాలి పేరిట మంజూరు చేస్తారు.
* గ్రామీణ ప్రాంతాల్లో 125 చదరపు గజాల స్థలంలో ఒక్కో ఇంటి నిర్మాణం చేపడతారు. మేజర్‌ పంచాయతీల్లో భూమి కొరత ఉంటే బ్ఘి1 ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇస్తారు. పట్టణ ప్రాంతాల్లో బ్ఘి ఇళ్ల నిర్మాణం చేపడతారు.
* పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు వ్యయం చేస్తారు.

లబ్ధిదారుల ఎంపిక కమిటీ
2015 నవంబరులో ప్రభుత్వం విడుదల చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా మంత్రి ఛైర్మన్‌గా జిల్లాలోని ఎమ్మెల్యేలతో జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. జిల్లా కలెక్టర్‌ ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉంటారు.
* ఈ కమిటీ రిజర్వేషన్లకు అనుగుణంగా గ్రామ పంచాయతీలు/ పట్టణ స్థానిక సంస్థల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.
* గ్రామసభల్లో కమిటీ ఎంపిక చేసిన జాబితాను పరిశీలిస్తారు. తదుపరి తహసీల్దార్‌ తుది జాబితాను సిద్ధం చేసి, ఆమోదం కోసం మళ్లీ జిల్లా స్థాయి కమిటీ ముందు ఉంచుతారు. అనంతరం కలెక్టర్‌ ఆమోదిత ఉత్తర్వులను అందజేస్తారు.
* డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో భాగంగా హైదరాబాద్‌లోని బోయగూడ ‘ఐడీహెచ్‌ కాలనీ’లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2015 నవంబరు 16న ప్రారంభించారు.

 

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌