• facebook
  • whatsapp
  • telegram

కృష్ణానది

సహ్యాద్రిలో పుట్టి... తెలంగాణను చుట్టి!

 

కృష్ణానది తెలంగాణకు అతి ముఖ్యమైన నది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో పుట్టి రాష్ట్రాన్ని చుట్టి బంగాళాఖాతం వైపు వెళ్లిపోతుంది. నీటిపారుదల, తాగునీరు, వ్యవసాయం, జలవిద్యుత్తు, అనేక ప్రాజెక్టులు ప్రధానంగా ఈ నదిపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే పరీక్షార్థులు తెలంగాణలో కృష్ణానది విస్తరించి ఉన్న విధానాన్ని స్పష్టంగా తెలుసుకుంటే, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై పరీక్షల కోణంలో అవగాహన పెంచుకోడం తేలికవుతుంది. 

  తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతం దాదాపు 68.5% విస్తరించి ఉంది. భీమా, దిండి, మూసీ, పాలేరు, మున్నేరు దీని ఉపనదులు. గోదావరి, కృష్ణా నదులతో పాటు ఎక్కువ నదులు తూర్పు దిశగా పయనించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. పశ్చిమానికి ప్రవహించే ఏకైక నది కాగ్నా నది. ఇది వికారాబాద్‌ అనంతగిరి కొండల్లో జన్మించి పశ్చిమవైపు వెళ్లి భీమానదిలో కలుస్తుంది. తెలంగాణలో పాకాల, రామప్ప, లక్నవరం, బయ్యారం లాంటి చెరువులు/సరస్సులు కాకతీయ రాజులు నిర్మించిన వాటిలో ముఖ్యమైనవి.  

 

జన్మస్థానం: కృష్ణా నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లోని సహ్యాద్రి శ్రేణిలో ఉన్న సతారా జిల్లా మహాబలేశ్వరం వద్ద సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తులో జన్మించింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే వరకు సుమారు 1401 కి.మీ. పొడవు ఉంటుంది. ఇది మహారాష్ట్రలో 306 కి.మీ., కర్ణాటకలో 383 కి.మీ., తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ల్లో సుమారు 712 కి.మీ., ఒక్క తెలంగాణలో 489 కి.మీ. ప్రవహిస్తుంది. 

  కృష్ణా నది నారాయణ పేట జిల్లాలోని మక్తల్‌ మండలం తంగేడి గ్రామం వద్ద తెలంగాణలో ప్రవేశించి గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యపేట జిల్లాల నుంచి పయనిస్తుంది. దీనికి కుడి ఒడ్డున యొన్న, కొయానా, వర్ణ, పంచగంగా, దూద్‌గంగా, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర; ఎడమ ఒడ్డున భీమా, మూల, పెద్దవాగు, దిండి, హలియా, మూసీ, పాలేరు, మున్నేరు ముఖ్యమైన ఉపనదులు. 

 

కృష్ణా నది - ఉపనదులు

 

తుంగభద్ర: ఇది కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న వరహ పర్వతాల్లో తుంగ, భద్రావతి నదులుగా జన్మించి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి తెలంగాణలోని గద్వాల జిల్లా మీదుగా ప్రవహించి సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. దీన్నే పంపా నది అని కూడా అంటారు. ఇది కృష్ణా నదికి పరిమాణంలో అతిపెద్ద ఉపనది. తుంగభద్ర నది ఒడ్డున గద్వాలలోని అలంపూర్‌ వద్ద 5వ శక్తి పీఠం జోగులాంబ, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. ఈ నదిపై కర్ణాటకలో తుంగభద్ర ప్రాజెక్టు, కర్నూలులో సుంకేశుల బ్యారేజి ఉన్నాయి. కర్నూలు, రాయచూర్, గద్వాల జిల్లాల సరిహద్దుల్లో రాజోలిబండ మళ్లింపు పథకం వివాదస్పదమైంది.

 

దిండి నది: దీన్ని మీనాంబరం నది అని కూడా అంటారు. మహబూబ్‌నగర్‌ - నాగర్‌కర్నూల్‌ జిల్లా సరిహద్దులోని షాబాద్‌ కొండల్లో జన్మించి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో ఉన్న ఏలేశ్వరం వరకు 153 కి.మీ. ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. ఈ నదిపై నల్లగొండ జిల్లాలో ఆర్‌.విద్యాసాగర్‌ రావు ఎత్తిపోతల పథకం ఉంది.

 

భీమా నది: ఇది కృష్ణా నదికి అత్యంత పొడవైన ఉపనది. దీని మొత్తం పొడవు 861 కి.మీ. ఇది మహారాష్ట్రలోని భీమేశ్వర కొండల్లో జన్మించి కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల నుంచి ప్రవహిస్తూ రాయచూర్‌ సమీపంలో కృష్ణా నదిలో విలీనమవుతుంది. దీనిపై భీమా ఎత్తిపోతల పథకం ఉంది.

 

మూసీనది: దీన్ని పూర్వం ముచుకుంద నది అని పిలిచేవారు. ఈ నది ఒడ్డున రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం ఉంది. మూసీనది వికారాబాద్‌ జిల్లాలోని శివారెడ్డి పేట వద్ద అనంతగిరి కొండల్లో జన్మించి హైదరాబాద్‌ నగరం నుంచి యాదాద్రి మీదుగా ప్రవహిస్తూ నల్లగొండలోని మిర్యాలగూడ సమీపంలో వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. మూసీ ప్రధాన ఉపనది ఆలేరు. ఇది యాదాద్రి జిల్లా చింతలూర్‌ వద్ద మూసీలో కలుస్తుంది. ఈసా, సత్యవతి అనేవి మూసీ ఉపనదులు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ ప్రజలకు తాగునీరు అందించడానికి మూసీనదిపై గండిపేట వద్ద ఉస్మాన్‌ సాగర్‌ ఆనకట్టను నిర్మించారు. హైదరాబాద్‌లో మూసీనదికి హుస్సేన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్‌ అనే ప్రధాన రిజర్వాయర్‌లు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌ నగరంలో కర్మాగారాల నుంచి వెలువడిన వ్యర్థాలు, మురికి నీటి వల్ల మూసీనది తీవ్రమైన కాలుష్యకోరల్లో చిక్కుకొని దేశంలో 6వ కాలుష్య నదిగా మారింది. 

 

పాలేరు నది: ఇది జనగాం జిల్లాలోని చెన్నాపురం వద్ద ప్రారంభమై మహబూబాబాద్‌ - సూర్యపేట జిల్లాల సరిహద్దు నుంచి ఖమ్మం  మీదుగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో కృష్ణా నదిలో విలీనమవుతుంది. ఖమ్మంలోని కుసుమంచి - నాయకిని గూడెం మధ్య పాలేరు నదిపై పాలేరు రిజర్వాయర్‌ ఉంది. దీనిపై ఇటీవల భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.

 

మున్నేరు నది: ఇది మూడు వాగుల కలయిక ద్వారా ఏర్పడింది. వరంగల్‌ జిల్లా నుంచి ఆకేరు వాగు, మహబూబాబాద్‌ జిల్లా సరిహద్దు నుంచి పాకాల వాగు, ఖమ్మం జిల్లా నుంచి వైరా వాగు జన్మించి ఖమ్మం సమీపంలోని మున్నేరు నదిగా మారింది. ఇది ఖమ్మం నగరం మీదుగా ప్రవహిస్తూ కృష్ణా జిల్లాలోని నందిగామ సమీపంలో ఎటూరు వద్ద కృష్ణా నదిలో విలీనమవుతుంది. ఇది మొత్తం 192 కి.మీ. ప్రవహిస్తుంది.

 

తెలంగాణ ప్రధాన జిల్లాలు - నదుల విస్తరణ  

* నిర్మల్‌ - గోదావరి, కడెం 

* నిజామాబాద్‌ - గోదావరి, వారిద్ర, మంజీర 

* ఆదిలాబాద్‌ - పెద్దవాగు నది, పెన్‌గంగా 

* అసిఫాబాద్‌ - ప్రాణహిత, వైన్‌గంగా, వార్థా 

* భూపాలపల్లి - గోదావరి, ఇంద్రావతి, ప్రాణహిత, సరస్వతి

* ములుగు - గోదావరి, జంపన్నవాగు, చికువాగు నది, లక్నవరం 

* భద్రాద్రి - గోదావరి, కిన్నెరసాని, శబరి, తాలిపేరు

* ఖమ్మం - వైరా వాగు, మున్నేరు, పాలేరు నది 

* కరీంనగర్‌ - మానేరు 

* హైదరాబాద్‌ - మూసీ, ఈసా నది 

* యాదాద్రి - మూసీ, ఆలేరు నది

* నల్లగొండ - కృష్ణా, దిండి, హలియా, మూసీ 

* గద్వాల - కృష్ణా, తుంగభద్ర 

* నాగర్‌కర్నూలు - కృష్ణా 

* వికారాబాద్‌ - మూసీ, కాగ్నా 

 

మాదిరి ప్రశ్నలు

 

1. ఈసా, సత్యవతి నదులు ఏ నదికి ఉపనదులు? 

1) మూసీ    2) కృష్ణా    3) భీమా   4) ఏదీకాదు 

 

2. పంపానది అని కిందివాటిలో ఏ నదికి పేరు?

1) దిండి   2) తుంగభద్ర   3) మూసీ   4) పాలేరు

 

3. దిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పేరును ఏ విధంగా మార్చారు?

1) అలీసాగర్‌    2) విద్యాసాగర్‌ రావు    3) పి.వి.నరసింహారావు    4) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

 

4. ఏ నదీ జలాల వివాదంపై ఆర్‌.ఎస్‌.బచావత్‌ ట్రైబ్యునల్‌ను ఏర్పాటుచేశారు?  

1) గోదావరి    2) కృష్ణా    3) పెరియార్‌    4) 1, 2

 

5. కిందివాటిలో కృష్ణా నదికి ఉపనది కానిది? 

1) కొయానా 2) తుంగభద్ర 3) భీమా 4) ప్రవర

 

సమాధానాలు

1-1,    2-2,    3-2,    4-4,    5-4.

 

రచయిత: కొత్త గోవర్ధన్‌ రెడ్డి


 

Posted Date : 21-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌