• facebook
  • whatsapp
  • telegram

ట్రాన్స్‌జెండర్ల సమస్యలు

మనతో సమానమే మూడో వ్యక్తి!

 

  ఆడ కాదు.. మగ కాదు.. వీడు తేడా అంటూ సమాజం అవహేళన చేసింది. కుంగిపోతుంటే అండగా నిలవాల్సిన కుటుంబం పట్టించుకోకుండా వెలివేసింది. విద్య లేదు. ఉద్యోగం రాదు. కనీస మానవ హక్కులు లేవు. మొన్నటి వరకు జనాభా లెక్కల్లో లేనేలేరు. అక్రమ రవాణా, భౌతిక దాడులతో బతుకు భారమైపోయింది. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితులు మారుతున్నాయి. చట్టాలు వస్తున్నాయి. మూడో వ్యక్తి కూడా మనవాడే, మనతో సమానమే అనే స్పృహ అందరిలోనూ పెరుగుతోంది. సామాజిక మినహాయింపు, హక్కులు అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. 

 

 

భారతీయ సమాజంలో టాన్స్‌జెండర్లు (విషమ లింగీయులు లేదా లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులు) ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. లింగ (జెండర్‌) వివక్షకు గురవుతున్నారు. స్త్రీ, పురుషుల్లా కాకుండా రూపురేఖలు, లక్షణాలు, ఆహార్యంలో విభిన్నంగా ఉండటంతో తోటివారు, సహచరులు వీరిని దూరం పెడుతున్నారు. జెండర్లు ఎన్ని అని అడిగితే కేవలం ఆడ, మగ అని మాత్రమే చెబుతున్నారు. మూడో వర్గాన్ని విస్మరిస్తున్నారు. వారికి సమాన అవకాశాలు, హక్కులు ఇవ్వడం లేదు. దీంతో ట్రాన్స్‌జెండర్‌లు వెలికి, బహిష్కరణకు గురవుతున్నారు.

ట్రాన్స్‌జెండర్‌: లింగమార్పిడి వ్యక్తులు/విషమ లింగీయులను ఆంగ్లంలో ట్రాన్స్‌జెండర్‌ అని పిలుస్తారు. ‘ట్రాన్స్‌జెండర్‌’ పదాన్ని 1965లో కొలంబియా విశ్వవిదాలయానికి చెందిన జాన్‌.ఎఫ్‌.ఒలివెన్‌ అనే మానసికవేత్త సృష్టించాడు. భారతీయ సమాజంలో ట్రాన్స్‌జెండర్‌కు సమానార్థకంగా ‘హిజ్రా’ అనే పదాన్ని ఉపయోగిస్తారు. హిజ్ర్‌ అనే అరబిక్‌ పదం నుంచి హిజ్రా అనే పదం ఆవిర్భవించింది. అంటే ‘తెగను వదిలిపెట్టిన వ్యక్తి’ అని అర్థం. భారతీయ వేద సాహిత్యాలు వీరిని ‘నపుంసకులు’ అని పేర్కొంటున్నాయి. అంటే పునరుత్పత్తి సామర్థ్యం లేనివారు అని అర్థం. వీరి దీవెనల వల్ల మంచి జరుగుతుందని చాలామంది భావిస్తారు.

జనాభా వివరాలు: భారతదేశంలో 2011 నుంచే ట్రాన్స్‌జెండర్ల జనాభా వివరాల సేకరణ ప్రారంభమైంది. అప్పటివరకు జరిగిన జనాభా లెక్కల్లో కనీసం వీరి వివరాలు సేకరించలేదంటే ఎంతటి వివక్షకు, బహిష్కరణకు గురయ్యారో అర్థం చేసుకోవచ్చు.

2011 లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం ట్రాన్స్‌జెండర్‌ల సంఖ్య 4.88 లక్షలు. వీరు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ (1.37 లక్షలు). తర్వాత వరుసగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్‌లోనూ పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. వాస్తవానికి ఈ లెక్క ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వారి వివరాలను కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచడం వల్ల జనాభా సేకరణ విభాగానికి పూర్తి వివరాలు అందలేదనే భావన ఉంది.

 

ప్రతిభ చాటిన మొదటి ట్రాన్స్‌జెండర్లు

* తొలి లింగమార్పిడి పోలీసు అధికారి - ప్రీతిక యాషిని (తమిళనాడు)

* ఎలక్షన్‌ అంబాసిడర్‌ - గౌరీ సావంత్‌ (మహారాష్ట్ర)

* న్యాయవాది - సత్యశ్రీ షర్మిల (పుదుచ్చేరి బార్‌ కౌన్సిల్, తమిళనాడు)

* కళాశాల ప్రిన్సిపల్‌ - డాక్టర్‌ మనాబి బందోపాధ్యాయ (పశ్చిమ బెంగాల్‌)

* న్యాయమూర్తి - జోయితా మండల్‌ (పశ్చిమ బెంగాల్‌)

* ఎమ్మెల్యే - షబ్నం మౌసి (మధ్యప్రదేశ్‌)

* సైనికుడు - షబి (నేవీ)

* టీవీ యాంకర్‌ - పద్మినీ ప్రకాశ్‌ (కోయంబత్తూర్‌)

* ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఆసియా పసిఫిక్‌ సమావేశంలో మన దేశం నుంచి పాల్గొన్న ట్రాన్స్‌జెండర్‌ లక్ష్మీనారాయణ త్రిపాఠి (2008)

 

అడుగడుగునా ఇబ్బందులు

సామాజిక వెలి: పలు రకాల అపోహలతో సమాజం ట్రాన్స్‌జెండర్‌లను వెలి వేస్తోంది. దీంతో సామాజిక - సాంస్కృతిక జీవనానికి దూరమవుతున్నారు. ఆర్థిక, ఉద్యోగ, విద్యా హక్కుల పరంగా వివక్షకు గురవుతున్నారు. కుటుంబపరంగానే సమస్యలు ఎదురవుతుండటంతో కనీస ప్రాథమిక హక్కులు కూడా పొందలేకపోతున్నారు. వివాహం చేసుకునే, ఎన్నికల్లో ఓటు వినియోగించుకునే హక్కులను కోల్పోతున్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు (ఆర్టికల్స్‌ 14, 15, 16, 21) దూరమవుతున్నారు. 

ఆర్టికల్‌ 14 - చట్టం ముందు అందరూ సమానులే 

ఆర్టికల్‌ 15 - కులం, మతం, లింగం, జాతి, ప్రాంతీయ వివక్షల నుంచి రక్షణ పొందే హక్కు

ఆర్టికల్‌ 16 - పౌరులందరికీ ప్రభుత్వ ఉద్యోగ్యాల్లో సమాన అవకాశాలు

ఆర్టికల్‌ 21 - జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ 

ఈ హక్కులు దక్కకపోగా, సమాజం వెలివేయడంతో యాచకులుగా, దిగువస్థాయి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.

కుటుంబ తిరస్కరణ: భిన్నమైన ప్రవర్తన, లక్షణాలను ప్రదర్శిస్తుండటంతో సొంత కుటుంబసభ్యులే వీరిని తిరస్కరిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఇంటి నుంచి వీరిని బయటకు పంపించేస్తున్నారు. బాధలు భరించలేక ఇంటి నుంచి పారిపోయిన వారూ ఉన్నారు. జైవిక కుటుంబమే తిరస్కరించడంతో ఇతరులను చేరి రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ఇళ్ల నుంచి వెలికి గురైనవారంతా ఒక కుటుంబంగా జీవిస్తున్నారు. వివాహ సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కుటుంబ జీవనానికి దూరంగా గడుపుతూ, వృద్ధాప్యంలో ఆదరించేవారు లేక ఒంటరితనానికి గురవుతున్నారు.

సామాజిక వేధింపులు: బహిరంగ ప్రదేశాలు, హోటళ్లు, ఆసుపత్రులు, విద్యాలయాలు, సభలు - సమావేశాలు, సామాజిక వేడుకల వంటి ప్రదేశాల్లో వీరికి ప్రవేశాన్ని నిరాకరిస్తున్నారు. తమకంటే చిన్నవయసు వారి నుంచి కూడా వేధింపులు ఎదురవుతున్నాయి. సరైన గౌరవ మర్యాదలు లభించవు. రోడ్లపై తిరుగుతున్నప్పుడు అందరి దృష్టి వీరిపైనే ఉంటుంది.

విద్య, ఉద్యోగావకాశాల్లో నిరాదరణ: ట్రాన్స్‌జెండర్‌లు ఇతర విద్యార్థుల మాదిరి చదువుకోలేరు. తోటి విద్యార్థులు అవహేళన చేస్తుంటారు. ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దరఖాస్తుల్లో కూడా చాలా సంవత్సరాల వరకు వీరిని తృతీయ లింగంగా గుర్తించలేదు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల దరఖాస్తులో ట్రాన్స్‌జెండర్‌గా పేర్కొనే అవకాశం కల్పించిన మొదటి రాష్ట్రం అసోం.

అక్రమ రవాణా - భౌతికహింస - వ్యభిచారం: కుటుంబ రక్షణ కోల్పోయిన వీరు అక్రమ రవాణాకు, భౌతిక హింసకు గురవుతున్నారు. జీవనోపాధి లేక వ్యభిచార వృత్తిలోకి ప్రవేశిస్తున్నారు. హెచ్‌ఐవి ఎయిడ్స్‌ లాంటి సుఖవ్యాధుల బారిన పడుతున్నారు.

మానవహక్కుల ఉల్లంఘన: కనీస అవకాశాలు, హక్కుల నిరాకరణ ఇవన్నీ మానవహక్కుల ఉల్లంఘన కిందకి వస్తాయి. 2011కు ముందు జనాభా లెక్కల్లో వీరి వివరాలు లేవు. అంటే కనీసం పౌరులుగా కూడా ప్రభుత్వం, సమాజం గుర్తించడం లేదు.

సామాజిక గుర్తింపు, ఇతర సమస్యలు: లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం - 2019ను ప్రభుత్వం ఆమోదించినప్పటికీ, నేటికీ వీరికి పూర్తిస్థాయిలో సామాజిక గుర్తింపు దక్కలేదు. తరచూ ఆస్తి, వారసత్వం/దత్తత విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి పరంగా తీవ్ర వివక్షకు గురవుతున్నారు.

 

ఎల్‌జీబీటీఐక్యూ (LGBTIQ - లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌-సెక్స్, క్వీర్‌): స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఐర్లాండ్‌. 2007లో నేపాల్‌లో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేశారు. భారతదేశంలో ఇటీవల కాలంలో వీరి హక్కులకు రక్షణ పెరుగుతోంది. సుప్రీంకోర్టు కూడా స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పు ఇచ్చింది. దీనికి అనుగుణంగా కేంద్రం ప్రభుత్వం 2019లో లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల రక్షణ) చట్టం చేసింది. లింగమార్పిడి వ్యక్తి అంటే పుట్టినప్పుడు ఉన్న లింగంతో సరిపోలని వ్యక్తులు అని అర్థం. 

* 2018లో నవతేజ్‌ సింగ్‌ జోహర్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో స్వలింగ సంపర్కాన్ని సుప్రీంకోర్టు నేరంగా పరిగణించింది.


నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ (ఎన్‌సీటీపీ): ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం - 2019 ప్రకారం 2020, ఆగస్టు 21న ఏర్పాటుచేశారు. ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది. ఈ సంఘం అధ్యక్షుడిగా ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ సభ్యులుగా లక్ష్మీనారాయణ్‌ త్రిపాఠి, గోపిశంకర్‌ మధురై, మీరా పరీదా, జైనాబ్‌ జావిద్‌ పటేల్, కాక్‌చింగ్తాబమ్‌ శ్యామ్‌కంద్‌ శర్మ ఉన్నారు. ఈ సభ్యుల పదవీకాలం 3 సంవత్సరాలు.


విధులు: * లింగమార్పిడి వ్యక్తులకు సంబంధించిన విధానాలు, కార్యక్రమాలు, చట్టాలు, వివిధ ప్రాజెక్ట్‌ల రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది.

* లింగమార్పిడి వ్యక్తుల కోసం రూపొందించిన వివిధ విధానాలు, కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ మూల్యాంకనం చేస్తుంది.

* లింగమార్పిడి వ్యక్తుల ఫిర్యాదులను పరిష్కరిస్తుంది.

* అన్నిశాఖల విధులు, కార్యకలాపాలను సమీక్షిస్తూ, సమన్వయం చేస్తుంది.

* కేంద్రం నిర్దేశించిన ఇతర విధులు నిర్వర్తిస్తుంది.

 

గరిమ గృహ పథకం: కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్‌ల కోసం ప్రారంభించిన ఒక ఆశ్రయ గృహ పథకం. ఈ షెల్టర్‌ గృహాలను మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బిహార్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, ఒడిశాల్లో ప్రారంభించారు. వాటిలో వీరికి ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహారం, వైద్య సదుపాయాలు, వినోదం, నైపుణ్యాల అభివృద్ధి - నిర్మాణం లాంటి సౌకర్యాలు కల్పిస్తారు.


ప్రధానమంత్రి - దక్ష్: ఇది ట్రాన్స్‌జెండర్‌ లబ్ధిదారుల కోసం ఏర్పాటుచేసిన ఒక నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ పథకం.

 ట్రాన్స్‌జెండర్లను సమాజం గుర్తించి సమానాకాశాలు కల్పించాలి. సామాజిక కార్యకలాపాల్లో భాగస్వాములను చేయాలి. హక్కులను రక్షిస్తూ గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించాలి. వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారమే కీలకం.


పోరాడి.. సర్కారీ కొలువు సాధించి!

భారతదేశంలో మొదటి ట్రాన్స్‌జెండర్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ ప్రీతిక యాషిని. తమిళనాడు యూనిఫార్మ్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన ఎస్‌ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే తిరస్కరించారు. ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడంతో 2015లో మద్రాస్‌ హైకోర్టు ప్రీతికకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో 2017లో చెన్నై పోలీస్‌ కమిషనర్‌ నుంచి ప్రీతిక నియామక ఉత్తర్వులు అందుకుని, ధర్మపురి జిల్లాలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరారు. రాజ్యాంగంలోని అధికరణ 14, 15, 21లను ఆధారంగా చేసుకొని పోరాడి ప్రభుత్వ కొలువు సాధించిన ప్రీతిక ఎందరో ట్రాన్స్‌జెండర్లకు ఆదర్శంగా నిలిచారు.


 

హిజ్రాలకు ఉన్న వివిధ పేర్లు
భాష     పేర్లు  
హిందీ, మైధిలి, డోగ్రి హిజాడా
బెంగాలీ హిజడ
తెలుగు నపుంసకులు
ఉర్దూ ఖ్వాజాసారా
మలయాళం సాండన్‌
కన్నడ చక్క
ఇంగ్లిష్‌ ట్రాన్స్‌జెండర్‌

 

లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల రక్షణ) చట్టం - 2019

లింగమార్పిడి వ్యక్తులపై వివక్షలను ఈ చట్టం నిషేధిస్తోంది. కింది హక్కులకు రక్షణ కల్పిస్తుంది.

నివాస హక్కు: ప్రతి లింగమార్పిడి వ్యక్తికి కుటుంబంలో నివసించే హక్కు ఉంటుంది. సొంత కుటుంబ సభ్యులు లింగమార్పిడి వ్యక్తులను నిరాకరించినప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో వారిని పునరావాస కేంద్రంలో ఉంచవచ్చు.

ఉపాధి: రిక్రూట్‌మెంట్, నియామకాల విషయంలో లింగమార్పిడి వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా రక్షణ కల్పిస్తుంది. వీరి ఫిర్యాదు పరిష్కారానికి ఒక అధికారిని నియమించాలి.

విద్య: లింగమార్పిడి వ్యక్తులపై విద్యాసంస్థల్లో వివక్ష లేకుండా విద్య, క్రీడలు, వినోద సౌకర్యాలు అందజేయాలి.

ఆరోగ్య సంరక్షణ: ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులకు ప్రత్యేక హెచ్‌ఐవీ నిఘా కేంద్రాలు, లింగమార్పిడి శస్త్రచికిత్సలతో సహా వివిధ ఆరోగ్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

గుర్తింపు పత్రం జారీ: లింగమార్పిడి వ్యక్తులు తమ ధ్రువీకరణ పత్రం కోసం జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వారు లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటే సవరించిన ధ్రువపత్రాన్ని పొందవచ్చు.

సంక్షేమ చర్యలు: సమాజంలో ట్రాన్స్‌జెండర్లను పూర్తిస్థాయిలో సమ్మిళితం చేయడానికి, వారి భాగస్వామ్యం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ చట్టం పేర్కొంటోంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం పెంచాలని నిర్దేశించింది. 


మాదిరి ప్రశ్నలు


1. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ట్రాన్స్‌జెండర్‌ల జనాభా ఎంత? 

1) 4.53 లక్షలు     2) 4.88 లక్షలు     3) 4.98 లక్షలు    4) 4.23 లక్షలు

జ: 2


2. ట్రాన్స్‌జెండర్‌ అనే పదాన్ని సృష్టించిన మానసిక శాస్త్రవేత్త ఎవరు?

1) జాన్‌.ఎఫ్‌.ఒలివెన్‌    2) ఎడ్వర్డ్‌ బర్న్‌లీ    3) రీన్‌ లెనోయర్‌    4) గెయిల్‌ ఒమెట్‌

జ: 1


3. ‘హిజ్రా’ ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించింది?

1) హిజర్‌ అనే రష్యన్‌ పదం      2) హిజ్ర్‌ అనే అరబిక్‌ పదం

3) హిజ్రా అనే స్పానిష్‌ పదం     4) హిజర్‌ అనే లాటిన్‌ పదం

జ: 2


4. కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రారంభించిన షెల్టర్‌ హోమ్‌లను ఏమని పిలుస్తారు?

1) పరిమళ గృహ్‌       2) సేవా సదన్‌  

3) గరిమ గృహ పథకం  4) పునరావాస గృహ పథకం  

జ: 3


5. పీఏం - దక్ష్ అనేది ఒక?

1) న్యాయ సలహా సంస్థ     2) ట్రాన్స్‌జెండర్‌ల నైపుణ్యాల అభివృద్ధి పథకం  

3) ట్రాన్స్‌జెండర్‌ల ఆర్థికాభివృద్ధి పథకం    4) ట్రాన్స్‌జెండర్‌ల వివాద పరిష్కార సంస్థ

జ: 2


6. దేశంలో మొదటి ట్రాన్స్‌జెండర్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఎన్నికైన ప్రీతిక యాషిని ఏ రాష్ట్రానికి చెందినవారు?

1) కేరళ      2) కర్ణాటక       3) గోవా       4) తమిళనాడు

జ: 4


7. ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం చేసిన సంవత్సరం?

1) 2016      2) 2017      3) 2019      4) 2020

జ: 3


8. ట్రాన్స్‌జెండర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?

1) ఉత్తర్‌ప్రదేశ్‌      2) తమిళనాడు     3) పశ్చిమ బెంగాల్‌     4) కేరళ  

జ: 1


9. యూఎన్‌ ఆసియా పసిఫిక్‌ సమావేశంలో పాల్గొన్న లింగమార్పిడి వ్యక్తి?

1) లక్ష్మీనారాయణ్‌ త్రిపాఠి    2) జోయితా మండల్‌

3) షబ్నయ్‌ మౌసి      4) ప్రీతిక యాషిని

జ: 1

రచయిత: మేజర్‌ శ్రీనివాస్‌

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  కుటుంబ వ్యవస్థ

‣  మాజ నిర్మితి

‣ విలక్షణ భారతం

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 20-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌