• facebook
  • whatsapp
  • telegram

సునామీ

సముద్ర తీరంలో రాకాసి!

  ఆ విపత్తు విరుచుకుపడితే ఆహ్లాదాన్ని అందించే అలలు అసాధారణంగా రాకాసి రూపాన్ని సంతరించుకుంటాయి. భారీ ఎత్తున ఎగసిపడే కెరటాలు తీరాన్ని కబళించే కరాళకేళి విపరీత విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఏం జరిగిందో గ్రహించేలోగా అంతా సముద్ర గర్భంలో కలిసిపోతుంది. అంతులేని విషాదం వేలమైళ్లు విస్తరిస్తుంది. ఇంతకీ ఆ రాక్షస తరంగాలు ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి? వాటి ప్రభావం జీవరాశిపై ఏ విధంగా ఉంటుంది? ఈ అంశాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.

 

  మహాసముద్రాలు, పెద్ద జలాశయాలు, సరస్సుల్లోని నీరు పరిమాణంలో పెద్ద ఎత్తున స్థానభ్రంశం చెందడం వల్ల సంభవించే భారీ నీటి తరంగాల వరసను సునామీ అంటారు. ఆంగ్లంలో సునామీ ్బగి(్య-్చ్ఝi్శ అనే పదం జపాన్‌ భాషలోని స్బుగి(్య్శ అంటే హార్బర్, నామి ్బ-్చ్ఝi్శ అంటే కెరటం అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. సునామీని తెలుగులో ‘రాకాసి అలలు’ అని, తమిళంలో ‘ఆఝి పెరలై’ అని అంటారు. ఇలా ప్రాంతీయ పేర్లు అనేకం ఉండటం వల్ల 1963లో అమెరికాలోని హవాయి దీవుల్లో జరిగిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహాసభ ‘సునామీ’ అనే పదాన్ని సార్వతిక పదంగా నిర్ణయించింది.



కారణాలు

సునామీ ఏర్పడటానికి మూడు భౌగోళిక కారణాలు, ఒక అంతరిక్ష కారణం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

 

భూపాతాలు: సముద్రం లోపల లేదా కడలికి దగ్గర భూపాతం అంటే కొండచరియలు విరిగి సముద్రంలోకి జారిపడినప్పుడు నీటి కదలికలు ఏర్పడి సునామీగా మారవచ్చు.

ఉదా: 1958లో అలస్కాలోని లిటుయాబే ప్రాంతంలో భూపాతం కారణంగా సునామీ ఏర్పడి 50-150 మీటర్ల ఎత్తులో సముద్ర తరంగాలు ఎగసిపడ్డాయి. 14% సునామీలు భూపాతాల వల్ల జరుగుతున్నాయని అంచనా.

 

అగ్నిపర్వత విస్ఫోటాలు: తీరానికి సమీపంలో లేదా సముద్రం లోపల ఉన్న అగ్నిపర్వతాలు విస్ఫోటం చెందినప్పుడు నేల సాధారణంగా పైకి ఎగబాకడమో, కుంగిపోవడమో జరుగుతుంది. దాంతో సముద్ర నీరు పెద్ద ఎత్తున కదలి సునామీగా మారవచ్చు.

ఉదా: 1983లో ఇండోనేషియాలోని క్రాకటోవా అగ్నిపర్వతం విస్ఫోటం చెంది 40 మీటర్ల ఎత్తులో సునామీ కెరటాలు ఏర్పడ్డాయి. 2% సునామీలు ఈ కారణంగా వస్తున్నాయని అంచనా.

 

భూకంపాలు: సునామీలకు అత్యంత సర్వసాధారణ, ప్రధాన కారణం భూకంపాలు. సముద్ర భూతలం కింద లేదా మహాసముద్రం సమీపంలో సంభవించే భూకంపాల కారణంగా సముద్ర భూతలం కదలి సునామీకి దారితీస్తుంది. ఇలా వచ్చే సునామీ తరంగాలు గంటకు వందలాది కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. భూకంపం వచ్చిన నిమిషాల నుంచి కొన్ని గంటల వ్యవధిలో తీరాన్ని తాకుతాయి. సాధారణంగా సముద్ర గర్భంలో రిక్టర్‌ స్కేలుపై 7.5 పాయింట్లు తీవ్రత ఉన్న భూకంపాలు జరిగినప్పుడే సునామీలు సంభవిస్తాయి. 84% సునామీలు భూకంపాల వల్లే ఏర్పడుతున్నాయి.

 

ఉల్కాపాతాలు: సునామీలు ఏర్పడేందుకు కారణాల్లో ఇది చాలా అరుదైంది. ఉల్కలు, గ్రహశకలాలు లాంటివి భూమి వైపు దూసుకొచ్చినప్పుడు సముద్రాలపై ప్రభావం చూపి సునామీలు రావచ్చు.

ఉదా: 6.5 కోట్ల ఏళ్ల కిందట ఒక పెద్ద గ్రహశకలం భూమిని తాకడం వల్ల అప్పట్లో జీవిస్తున్న డైనోసార్లు, కొన్ని జీవరాశులు చనిపోయినట్లు శాస్త్రీయ ఆధారాలున్నాయి. మానవుడు భూమి మీద అవతరించిన తర్వాత ఉల్కాపాతం వల్ల ఒక్క సునామీ కూడా ఏర్పడలేదు.

 

సామర్థ్యం

సునామీలు గంటకు 800 కి.మీ. అత్యధిక వేగంతో సముద్ర తీరాన్ని తాకగలిగిన అవకాశం ఉంది.

ఉదా: అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌ వద్ద ప్రారంభమైన సునామీ జెట్‌ వేగం కంటే అధిక వేగంతో జపాన్‌లోని టోక్యో నగరాన్ని తాకే ప్రమాదం ఉంది. అంటే ఇక్కడి సునామీ కెరటాలు మధ్యదరా సముద్రంతోపాటు అన్ని మహాసముద్రాలకు విస్తరించవచ్చు.

* సునామీ ప్రారంభమైనప్పుడు తక్కువ డోలన పరిమితి, సుదీర్ఘ తరంగదైర్ఘం ఉంటుంది. తీరానికి చేరే కొద్దీ డోలన పరిమితి ఎక్కువై, తరంగదైర్ఘ్యం తగ్గిపోతూ ఉంటుంది. స్వల్ప వ్యవధిలోనే కెరటాలు గరిష్ఠ ఎత్తుకు పెరుగుతాయి.

* సునామీల ప్రారంభ ప్రాంతంలో సముద్రం లోపల కెరటాల ఎత్తు 30-40 సెం.మీ. మాత్రమే ఉంటుంది. అవే తీరానికి చేరినప్పుడు 30 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతాయి.

* సునామీ కేంద్రం నుంచి 30 నిమిషాల్లో తీరాన్ని తాకే సునామీలు పెనువిధ్వంసం సృష్టిస్తాయి.

* తీరాన్ని చేరేటప్పుడు సునామీ వేగం తగ్గుతూ, కెరటాల ఎత్తు పెరుగుతూ తీరాన్ని చేరుతుంది. దీన్ని షోలింగ్‌ ప్రభావం అంటారు.

* సునామీ ఒకే ఒక పెద్ద తరంగం కాదు. ఒక సునామీ 10 లేదా అంతకంటే ఎక్కువ తరంగాలను కలిగి ఉంటుంది. వాటిని సునామీ తరంగ రైలు బండి అంటారు.

* ఒక తరంగం తీరాన్ని తాకిన తరువాత 5 నుంచి 90 నిమిషాల వ్యవధిలో మరో తరంగం తీరాన్ని తాకుతుంది.

* సునామీ కెరటం తీరాన్ని తాకిన తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తే వేగం కంటే కొన్ని రెట్లు వేగంగా అంటే గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. అంటే పరుగెత్తే మనుషులను కూడా కబళించగలిగిన సామర్థ్యం కలిగి ఉంటుంది.

* సునామీ అలలు చాలా దూరం తీరం భూభాగాన్ని ముంచేస్తాయి. ఈ దూరాన్ని రన్‌అప్‌ అంటారు. పెద్ద సునామీలు తీరం నుంచి 1.5 కి.మీ. వరకూ వ్యాపిస్తాయి.

* కొన్నిసార్లు సముద్ర గర్భంలో భూకంపం సంభవించినప్పుడు సముద్రంలో నేల కిందికి కుంగిపోవడం వల్ల తీరం వద్ద నీరు వెనక్కు తగ్గి మహాసముద్ర భూతలం బయటకు కనిపిస్తుంది. దీన్ని సహజసిద్ధమైన సునామీ హెచ్చరికగా భావించి జాగ్రత్తలు తీసుకోవాలి.

 

ప్రభావం

* సునామీలు ఇసుక తీరాన్ని ఖండఖండాలుగా చేస్తాయి. తీరప్రాంతంలోని వృక్షజాతులను విచ్ఛిన్నం చేస్తాయి. కట్టడాలు ధ్వంసమవుతాయి.

* సునామీ కెరటాలు పురోగమించేటప్పుడు మార్గంలో అడ్డంగా ఉన్న ప్రతిదాన్ని కూల్చివేస్తాయి. అవే కెరటాలు తిరోగమనంలో అన్నింటిని కబళించి సముద్రంలోకి తీసుకెళ్లి పోతుంది. ఇది సునామీ విధ్వంసక స్వభావానికి ప్రతీక.

* సునామీతో వచ్చే వరద ప్రభావం వల్ల మానవ ఆవాసాలు, రోడ్లు, ఓడరేవులు, మౌలిక వసతులకు అపార నష్టం కలుగుతుంది. జనజీవనం అస్తవ్యస్తమవుతుంది.

* నీరు ఇళ్లలోకి పెద్ద ఎత్తున చేరడంతో ప్రజలు అందులో మునిగిపోయి మరణిస్తారు. అనేకమంది సముద్రంలోకి కొట్టుకుపోతారు. తరంగాలతోపాటు కొట్టుకొచ్చే వ్యర్థాలు, పెద్దపెద్ద వస్తువుల కింద ఇరుక్కుని మరికొందరు మరణించే ప్రమాదం ఉంది.

* బావులు, ఇతర భూగర్భ జలవనరుల్లో ఉప్పు నీరు, మురుగు నీరు, వ్యర్థాలు చేరి కలుషితమవుతాయి.

* వరదతో పంట నష్టం జరుగుతుంది. పడవలు, వలలు కొట్టుకుపోయి మత్సకారుల జీవనోపాధి దెబ్బతింటుంది. పర్యావరణానికీ అపార నష్టం కలుగుతుంది.

 

సునామీల వ్యాప్తి

* పసిఫిక్‌ మహాసముద్రం - 73%

* మధ్యదరా సముద్రం, నల్ల సముద్రం వంటి భూపరివేష్టిత సముద్రాలు - 16%

* కరేబియన్‌ సముద్రం, అట్లాంటిక్‌ మహాసముద్రాలు - 6%

* హిందూ మహాసముద్రం - 5%

 

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 10-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌