• facebook
  • whatsapp
  • telegram

కాలుష్య రకాలు - ఘన వ్యర్థాల నిర్వహణ

క్రిమి సంహారక మందుల సమస్యలపై ‘సైలెంట్‌ స్ప్రింగ్‌’

 


 రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తుంటారు. పనికిరాని వస్తువులను పడేస్తుంటారు. అవి నేలలోకి చేరడం వల్ల సారం దెబ్బతింటుంది. పంట ఉత్పాదకత క్షీణిస్తుంది. భూగర్భజలాల నాణ్యత తగ్గిపోతుంది. తద్వారా అనేక విపరిణామాలు సంభవిస్తుంటాయి. అందుకే కాలుష్య నియంత్రణకు, పర్యావరణ ఆరోగ్యానికి ఘన వ్యర్థాల నిర్వహణ అత్యంత అవసరం. ఇందులో వ్యర్థాల సేకరణ, రవాణా, రీసైక్లింగ్‌ తదితర ఎన్నో అంశాలు ఉంటాయి. వాటితోపాటు ఈ నిర్వహణ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. బాధ్యతాయుతంగా వ్యర్థాలను పడేసే పద్ధతులను నేర్పిస్తారు. వీటన్నింటిపై పోటీ పరీక్షార్థులు కనీస అవగాహన పెంపొందించుకోవాలి. 

 

‣    ఏవైనా పదార్థాలు కొత్తగా నేలలోకి చేరడం వల్ల లేదా దానిలో ఉండే కొన్ని పదార్థాలను తొలగించడం వల్ల నేల ఉత్పాదక సామర్థ్యం, మొక్కల, భూగర్భజలాల నాణ్యతను తగ్గించే పరిస్థితులు ఏర్పడటాన్ని నేల కాలుష్యం అంటారు.

    కంపించే వస్తువుల ఉపరితలం నుంచి వెలువడే యాంత్రిక శక్తిని ‘ధ్వని’ అంటారు. వినసొంపుగా లేని, క్రమరాహిత్యమైన ధ్వనులను ‘శబ్దం’ అంటారు. శబ్దాన్ని ఇంగ్లిష్‌లో noise అంటారు. ఈ పదం nausea అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది.

    రేడియోధార్మిక పదార్థాల వల్ల గాలి, నీటితో పాటు ఇతర ప్రాంతాలు కలుషితమవడాన్ని రేడియోధార్మిక కాలుష్యం అంటారు.


  ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలు: అణువిద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు; యురేనియం, థోరియం లాంటి ఖనిజాల నిష్కర్షణ/వెలికితీత; అణువ్యర్థాల రవాణా; రేడియోధార్మిక రసాయనాలు వెదజల్లడం.

    సముద్ర ఆవరణ వ్యవస్థలో మైక్రోప్లాస్టిక్‌ కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 5 mm కంటే తక్కువ పరిమాణం ఉన్న ప్లాస్టిక్‌ ముక్కలను మైక్రోప్లాస్టిక్‌ అంటారు. వీటివల్ల కలిగే కాలుష్యాన్ని ‘మైక్రోప్లాస్టిక్‌ కాలుష్యం’ అంటారు. 

    థర్మల్, న్యూక్లియర్‌ రియాక్టర్స్‌ లాంటి విద్యుత్తు కేంద్రాల్లో యంత్రాలను చల్లబరచడానికి వాడిన నీరు దగ్గరిలోని జలాశయాలకు చేరడం వల్ల అక్కడి ఆవరణ వ్యవస్థపై కనపడే ప్రతికూల ప్రభావాన్ని ‘ఉష్ణ కాలుష్యం’ అంటారు.

    ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానం-2000 ప్రకారం సహజంగా లేదా మానవుడి ప్రమేయం వల్ల పర్యావరణంలో విడుదలయ్యే ఘన/పాక్షిక వ్యర్థమే సాలిడ్‌ వేస్ట్‌. 

  ఘన వ్యర్థాల ఉత్పత్తికి ప్రధాన కారణాలు: సునామీ, భూకంపాలు, వరదలు లాంటి సహజ విపత్తులు; మానవుడి విలాసవంతమైన జీవన విధానం; మతపరమైన కార్యక్రమాల నిర్వహణ; జనాభా పెరుగుదల, జనసాంద్రత; సేకరణ, పౌనఃపున్యం; రుతు సంబంధ కారకాలు.మాదిరి ప్రశ్నలు1.     51 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ల ఉత్పత్తి, వాడకాన్ని ఇటీవల నిషేధించిన ప్రాంతం ఏది?    

1) తమిళనాడు          2) ఒడిశా     

3) పుదుచ్చేరి         4) దిల్లీ


2.     ఘన వ్యర్థాల సమస్యను తగ్గించడానికి కిందివాటిలో మెరుగైన పద్ధతి?

1) చెత్త గుట్టల వద్ద తగలపెట్టడం          2) పునర్వినియోగం (పునఃచక్రీయం)

3) సముద్రంలో పారవేయడం          4) ఒత్తిడి ద్వారా కుదించడం


3.     రాబందులను కాపాడేందుకు పశువైద్యంలో నిషేధించిన మందు?

1) ఆస్పిరిన్‌        2) డైక్లోఫెనాక్‌   

3) టెట్రాసైక్లిన్‌       4) రాంటిడిన్‌


4.     ఏ రకమైన దున్నే పద్ధతి నీటి ప్రవాహం వల్ల జరిగే భూ క్షయాన్ని అరికడుతుంది?

1) పైకి, కిందికి దున్నే పద్ధతి       2) కాంటూర్‌ పద్ధతి  

3) రేఖీయ పద్ధతి      4) వంకర టింకర పద్ధతి 


5.     పంజాబ్‌లో నేల క్షయానికి ప్రధాన కారణం?

1) నీటి పారుదల ఎక్కువ కావడం        2) ధూళి తుపాన్లు     

3) మేత కోసం ఎక్కువ భూవినియోగం   4) అడవుల నిర్మూలన


6.     భారత్‌లో పట్టణాల్లోని ఇళ్లలో చెత్తను ఎక్కువగా ఎక్కడికి పంపిస్తారు?

1) కంపోస్ట్‌ తయారీకి    2) చెత్త గుట్టల వద్దకు (ల్యాండ్‌ఫిల్)     

3) పునర్వినియోగానికి      4) భస్మీకరణకు


7.     ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల సేకరణకు పూర్తిగా బాధ్యత వహించేది?

1) పంపిణీదారుడు     2) వినియోగదారుడు  

3) చిల్లర వర్తకుడు     4) ఉత్పత్తిదారుడు


8.     సముద్రాల్లో మైక్రో ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని బాగా తగ్గించే పద్ధతులు?

1) చేపలు పట్టడానికి కేవలం వస్త్రాన్ని మాత్రమే ఉపయోగించడం

2) ఇళ్లలో ప్లాస్టిక్‌ బకెట్లు వాడకుండా ఉండటం

3) ఇళ్లు, కార్యాలయాల్లో కలప ఫర్నిచర్‌ను ఉపయోగించడం

4) సహజ రబ్బరుతోనే టైర్లను తయారు చేయడం


9.     కాలుష్య నివారణకు అతి సమర్థవంతమైన సాధనం?

1) కాలుష్య పన్ను         2) కాలుష్య ప్రోత్సాహం     

3) నైతికంగా నచ్చచెప్పడం       4) సామాన్య న్యాయం


10. పారవేసే ప్లాస్టిక్‌ కప్పులు, ప్లేట్లు, ఇతర ప్లాస్టిక్‌ గిన్నెల వాడకాన్ని నిషేధించిన మొదటి దేశం?

1) ఫ్రాన్స్‌       2) యునైటెడ్‌ కింగ్‌డమ్‌    

3) స్విట్జర్లాండ్‌        4) ఆస్ట్రేలియా


11. మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కింది ఏ పద్ధతులను ప్రోత్సహిస్తుంది?

ఎ) వ్యవసాయంపై ఒత్తిడి తగ్గించడం        బి) పంట మార్పిడి పద్ధతి     

సి) కాంటూర్‌ బండింగ్‌       డి) వనీకరణ

1) ఎ, బి   2) బి, సి   3) ఎ, డి   4) సి, డి


12. సాధారణంగా పురపాలక సాలిడ్‌ వేస్ట్‌ను దేనిని నివారించడానికి వాడతారు?

1) పరిశ్రమల్లోని చర్యల, నిర్మాణాలు; కూల్చిన ఇళ్ల చెత్త నుంచి వచ్చే వ్యర్థాలు

2) ఇళ్లు, వాణిజ్య సముదాయాలు; సంస్థల నుంచి వచ్చే వ్యర్థాలు

3) గనుల తవ్వకం నుంచి వచ్చే వ్యర్థాలు

4) వ్యవసాయ సంబంధ వ్యర్థాలు


13. జీవ సంబంధ వైద్య వ్యర్థాన్ని ‘బయోమెడికల్‌ వేస్ట్‌ నిర్వహణ నిబంధనలు - 2016’ ఎన్ని తరగతులుగా వర్గీకరించింది?

1) 5      2) 4      3) 3      4) 2


14. ఈ-వ్యర్థం అంటే?

1) పర్యావరణ అనుకూల వ్యర్థం       2) విష సంబంధ రసాయన పదార్థాలు     

3) 1, 2            4) వాడుకలో లేని ఎలక్ట్రానిక్‌ పరికరం


15. నిటారైన ఏటవాలులో నేల క్రమక్షయాన్ని నియంత్రించడానికి మేలైన పద్ధతి?

1) మల్చింగ్‌ (కప్పడం)   2) సరిహద్దుగా పెద్ద రాళ్లను ఉంచడం     

3) సోపాన వ్యవసాయం        4) ఏదీకాదు


16. కిందివాటిలో జీవ క్షయకర కర్బన రసాయనం/ఉత్పన్నం?

1) ప్లాస్టిక్‌       2) చమురు   

3) చెత్త         4) క్రిమిసంహారాలు


17. కిందివాటిలో అత్యధిక తేమగలది?

1) ఆసుపత్రి వ్యర్థాలు       2) చెత్త    

3) వ్యర్థ పదార్థాలు        4) వ్యవసాయ వ్యర్థాలు


18. ధ్వని కాలుష్యం ఎన్ని డెసిబెల్స్‌కి మించితే ప్రమాదకరం?

1) 80    2) 30     3) 100    4) 120


19. క్రిమి సంహారక మందుల వల్ల తలెత్తే సమస్యలను క్రోడీకరిస్తూ రాసిన మొదటి గ్రంథం ‘సైలెంట్ స్ప్రింగ్‌’. ఈ పుస్తక రచయిత ఎవరు?    

1) అల్డో లియోపోల్డ్‌    2) వందనా శివ

3) రేచల్‌ కార్సన్‌    4) జాక్యుస్‌ కౌస్ట్యూ


20. ‘ప్రస్తుత బీడు భూములు’ అంటే?

1) ఈ సంవత్సరంలో సాగు చేయని భూమి       2) రెండేళ్లుగా సాగు చేయని భూమి

3) ప్రస్తుత సంవత్సరం సాగులో ఉన్న భూమి       4) రెండేళ్లకు పైగా సాగులో లేని భూమి


21. నేల కాలుష్యానికి కారణమైన ప్రధాన పట్టణ ఘన వ్యర్థ పదార్థం ఏది?

1) బురద  2) మురుగు  3) చెత్త  4) హ్యూమస్‌


22. ఆసుపత్రుల వద్ద అనుమతించే శబ్ద స్థాయి ఏ    పరిధిలో ఉంటుంది?

1) 40-50 డిబి      2) 35-40 డిబి    

3) 50-60 డిబి        4) 60-65 డిబి


23. కిందివాటిలో రేడియో ధార్మిక కాలుష్యానికి కారకాలు ఏవి?

ఎ) అణుశక్తి ప్లాంట్లు  బి) బయో మెడికల్‌ వ్యర్థాలు

సి) యురేనియం ఖనిజాల వెలికితీత

డి) ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు  ఇ) అణువ్యర్థాల రవాణా

1) ఎ, బి, సి          2) ఎ, సి, ఇ            

3) ఎ, సి, డి           4) ఎ, బి, డి


24. కిందివాటిలో జీవక్షయం చెందని కాలుష్యకాలు ఏవి?

ఎ) క్లోరినేటెడ్‌ హైడ్రోకార్బన్‌ కీటకనాశకాలు

బి) పాలిఎథిలీన్‌ సంచులు

సి) మార్కెట్లో ఏర్పడే చెత్త, కుళ్లిన పండ్లు, కూరగాయలు

డి) మున్సిపల్‌ సీవేజ్‌

1) ఎ, బి   2) ఎ, సి   3) బి, సి  4) సి, డి


25. కిందివాటిలో జీవక్షయం చెందే కాలుష్యకాలు ఏవి?

ఎ) ప్లాస్టిక్‌ బాటిల్స్‌           బి) మురుగు

సి) పశువుల నుంచి వెలువడే వ్యర్థాలు    

డి) మార్కెట్‌ నుంచి విడుదలయ్యే చెత్త, కుళ్లిన పండ్లు, కూరగాయలు

1) ఎ, బి   2) ఎ, సి   3) బి, సి   4) సి, డి


26. మానవుడు వినగలిగిన, అభిలషణీయమైన ధ్వని తీవ్రత స్థాయి?

1) 90 డెసిబెల్స్‌         2) 60 డెసిబెల్స్‌         

3) 120 డెసిబెల్స్‌         4) 80 డెసిబెల్స్‌


27. కిందివాటిలో క్రమక్షయానికి ఎక్కువగా ప్రభావితం అయ్యే ప్రాంతం?

1) మాల్వా పీఠభూమి    2) ఉత్తర్‌ప్రదేశ్‌లోని టెరాయ్‌ ప్రాంతం

3) ఆంధ్రతీర ప్రాంతం   4) చంబల్‌ నదీలోయ ప్రాంతం


28. పారిశ్రామిక ప్రాంతాల్లో అనుమతించే ధ్వని తీవ్రత స్థాయి?

1) 40 డెసిబెల్స్‌       2) 75 డెసిబెల్స్‌    

3) 120 డెసిబెల్స్‌      4) 140 డెసిబెల్స్‌


29. నివాస ప్రాంతాల్లో అనుమతించే ధ్వని తీవ్రత స్థాయి?

1) 45 డెసిబెల్స్‌       2) 55 డెసిబెల్స్‌    

3) 75 డెసిబెల్స్‌        4) 80 డెసిబెల్స్‌


30. ‘సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు’ అందించిన వివరాల ప్రకారం దేశంలో ఘనవ్యర్థాలను అధికంగా ఉత్పత్తి చేస్తున్న నగరాల్లో దిల్లీ ప్రథమ స్థానంలో ఉండగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నో స్థానంలో ఉంది?

1) మొదటి       2) రెండో   

3) మూడో          4) నాలుగో 


31. కిందివాటిలో ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి పునశ్చక్రీకరణ, పునర్వినియోగ విధానంలో కార్యక్రమం కానిది?

1) కంపోస్టింగ్‌         2) వర్మీ కంపోస్టు    

3) ఇన్సినరేషన్‌          4) ల్యాండ్‌ ఫిల్లింగ్‌


32. ఈ - వేస్ట్‌కు సంబంధించి కిందివాటిలో గ్రే గూడ్స్‌ కానివి?

1) పాడైపోయిన కంప్యూటర్‌లు    2) పాడైపోయిన వాషింగ్‌ మిషన్లు, గ్రైండర్లు

3) పాడైపోయిన ఎలక్ట్రానిక్‌ స్కానర్లు, ప్రింటర్లు    4) పాడైపోయిన మొబైల్స్‌ 


33. ఈ - వేస్ట్‌కు సంబంధించి కిందివాటిలో వైట్‌ గూడ్స్‌ కానివి?

1) పాడైపోయిన కంప్యూటర్‌లు    2) పాడైపోయిన వాషింగ్‌ మిషన్లు, గ్రైండర్లు

3) పాడైపోయిన రిఫ్రిజిరేటర్లు    4) పాడైపోయిన కూలర్లు
సమాధానాలు

1-3; 2-2; 3-2; 4-2; 5-1; 6-2; 7-4; 8-4; 9-1; 10-1; 11-4; 12-2; 13-2; 14-4; 15-3; 16-4; 17-4; 18-1; 19-3; 20-1; 21-3; 22-1; 23-2; 24-1; 25-4; 26-2; 27-4; 28-2; 29-2; 30-4; 31-4; 32-2; 33-1. 
 

Posted Date : 04-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌