• facebook
  • whatsapp
  • telegram

సకశేరుకాలు

లోతైన సముద్రాల్లోనూ.. ఎత్తయిన పర్వతాలపైనా! 

   అవి అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన జీవులు. ఈ భూగ్రహంపై పర్యావరణంలో ప్రముఖపాత్ర పోషిస్తూ, అత్యధిక జీవవైవిధ్యాన్ని ప్రదర్శించే ప్రాణులు. లోతైన సముద్రాల నుంచి ఎత్తయిన పర్వతాల వరకు విభిన్న పర్యావరణ వ్యవస్థల్లోనూ జీవిస్తాయి. జీవావరణానికి వెన్నెముకగా వ్యవహరించే ఈ ఉన్నతస్థాయి జీవుల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

  

జంతు రాజ్యంలో సకశేరుకాలు అభివృద్ధి చెందిన జంతువులు. మనిషి సహా అనేక ఉన్నతస్థాయి జంతువులు సకశేరుకాలకు చెందినవే. వీటిలో మెదడు బాగా అభివృద్ధి చెందడంతో మేధస్సు పరంగా పురోగమించి ఉంటాయి. వెన్నెముక ఉన్న జంతువులను సకశేరుకాల్లో చేర్చారు. అభివృద్ధి చెందిన శరీర వ్యవస్థ ఉంటుంది. వీటిలో ముఖ్య విభాగాలు చేపలు, ఉభయచర జీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు.

 

చేపలు 

  వీటి అధ్యయనాన్ని ఇక్తియాలజీ (Ichthyology) అంటారు. ఇవి దవడలున్న మొదటి వెన్నెముక జంతువులు. వీటిలో ఒక కర్ణిక, ఒక జఠరికతో రెండు గదుల గుండె ఉంటుంది. ముఖ్య నత్రజని సంబంధ వ్యర్థ పదార్థం అమ్మోనియా. కానీ మృదులాస్థి చేపలు యూరియాను విసర్జిస్తాయి. శ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది. శరీరంపై ఉన్న పొలుసులు బాహ్య అస్థిపంజరంగా పనిచేస్తాయి. ఇవి శీతల రక్త జంతువులు. పరిసరాల ఉష్ణోగ్రతకు అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటాయి. చేపల్లో ఎక్కువశాతం అండోత్పాదకాలు, మరికొన్ని శిశోత్పాదకాలు. అంతర అస్థిపంజరం (అస్థి) ఎముక లేదా మృదులాస్థితో ఉంటుంది. అస్థి చేపలు (ఎముకలతో ఉండేవి) మంచినీటిలో, ఉప్పునీటిలో ఉంటాయి. మృదులాస్థి చేపలు సముద్రంలోనే ఉంటాయి. చేపలు నది నుంచి సముద్రంలోకి లేదా సముద్రం నుంచి నదుల్లోకి వలస వెళతాయి. ఈ వలస రెండు రకాలుగా జరుగుతుంది. 

 

1) అనాడ్రోమస్‌ వలస - సముద్రంలో నుంచి నదిలోకి వలస వెళ్లడం.

ఉదా: హిల్సా (Hilsa), సాల్‌మన్‌ చేపలు

 

2) కెటాడ్రోమస్‌ వలస - నదుల నుంచి సముద్రంలోకి వలస వెళ్లడం.

ఉదా: ఈల్‌ చేప

 

ఉదాహరణలు - ప్రత్యేకతలు: 

గాంబూసియా:  దీన్ని మస్కిటో ఫిష్‌ లేదా దోమలను నియంత్రించే చేప, వాహకాలను నియంత్రించే చేప అంటారు. ఇది దోమ లార్వాలను తింటుంది.

షార్క్‌: దీన్ని డాగ్‌ ఫిష్‌ అంటారు. మృదులాస్థి చేప. నేరుగా పిల్లలను కంటుంది.

ఎక్సోసీటస్‌: దీన్ని ఎగిరే చేప అంటారు. వాజాలు మార్పు చెందడం వల్ల నీటిలో ఎక్కువ దూరం దూకుతుంది.

ప్రోటోప్టెరిస్‌ (Protoptrus): ఆఫ్రికా ఊపిరితిత్తి చేప అంటారు. దీని శ్వాస అవయవాలు ఊపిరితిత్తులు. చేపలకు, ఉభయచర జీవులకు సంధానకర్తగా దీన్ని భావిస్తారు.

హిప్పోకాంపస్‌: దీన్ని సీహార్స్‌ (సముద్రపు గుర్రం) అంటారు. మగ జీవికి ఉదరంలో కోశం ఉంటుంది. ఆడ జీవి వదిలిన గుడ్లను మగజీవి పొదుగుతుంది.

స్టోన్‌ ఫిష్‌ - విషపూరిత చేప

సెయిల్‌ ఫిష్‌ - వేగంగా ఈదే చేప

టార్ఫిడో - ఎలక్ట్రిక్‌ రే ఫిష్‌

 

ఉభయచర జీవులు 

  నీటిలో, నేలపైనా నివసించగలిగిన జంతువులు. ఇవి మొదట భూచర సకశేరుకాలు. కానీ ప్రత్యుత్పత్తి, లార్వా అభివృద్ధి కోసం తిరిగి నీటిపై ఆధారపడతాయి. రెండు కర్ణికలు, ఒక జఠరికతో మూడు గదుల గుండె ఉంటుంది. శ్వాసక్రియ లార్వా దశలో మొప్పలతో, తర్వాత ఊపిరితిత్తులు, చర్మం ద్వారా జరుగుతుంది. ముఖ్య నత్రజని విసర్జక పదార్థం యూరియా.

 

ఉదాహరణలు - ప్రత్యేకతలు:

కప్ప - కప్ప లార్వాను టాడ్‌పోల్‌ అంటారు. ఇది తోక, మొప్పలను కలిగి చేపను పోలి ఉంటుంది. టాడ్‌పోల్‌ రూపవిక్రియ చెంది కప్పగా మారుతుంది.

గోదురుకప్ప - దీన్ని టోడ్‌ అంటారు, నిశాచరి. చర్మం పొడిగా, గరుకుగా ఉంటుంది.

రాకోఫోరస్‌- ఎగిరే కప్ప

హైలా - చెట్లపై ఉండే కప్ప 

ఇక్తియోఫిస్, గెగనోఫిస్‌ - ఈ కప్పలు సంతాన పాలనను చూపిస్తాయి.

ఇంకా సాలమాండర్‌లు, న్యూట్‌లు, సిసీలియన్‌లు లాంటి జీవులు ఉభయచర జీవులకు ఉదాహరణ.

 

సరీసృపాలు

  ఇవి మొదటి నిజమైన భూచర జంతువులు. అండోత్పాదక జీవులు. శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. అసంపూర్తిగా విభజన చెందిన నాలుగు గదుల గుండె ఉంటుంది. గుండెలో పూర్తిగా విభజన చెందిన కర్ణికలతోపాటు, అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక ఉంటుంది. ముఖ్య నత్రజని సంబంధ విసర్జక పదార్థం యూరికామ్లం. సరీసృపాలైన బల్లుల అధ్యయనాన్ని సారాలజీ అని, పాముల అధ్యయనాన్ని ఒఫియాలజీ లేదా సర్పెంటాలజీ అంటారు.

 

విషపూరిత సర్పాలు, ప్రత్యేకతలు: 

కింగ్‌ కోబ్రా - రాచ నాగు అంటారు. అతిపెద్ద విషపూరిత సర్పం. తన గుడ్లను ఉంచడానికి గూడు కట్టుకుంటుంది. నాగుపాము విషాన్ని కోబ్రడిన్‌ అంటారు. ఇది నాడీవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

రక్తపింజర - దీని విషాన్ని వైపరిడిన్‌ అంటారు. ఇది రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

కట్ల పాము - దీని విషం నాగుపాము విషం కంటే అనేక రెట్లు అధిక ప్రభావం కలిగిస్తుంది. ఈ విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

సముద్ర సర్పాలు - ఇవి శిశోత్పాదకాలు. వీటి విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

విషరహిత సర్పాలు - పైతాన్‌ (కొండచిలువ), గుడ్డిపాము (టిప్లోప్స్‌), ర్యాట్‌ స్నేక్, ఎరిక్స్‌ జాని (Eryx Johni), పసరిక పాము, నీటి పాము.

 

సరీసృపాల ప్రత్యేకతలు: 

డ్రాకో - ఎగిరే బల్లి అంటారు.

హీలోడర్మా - విషపు బల్లి

వెరానస్‌ (ఉడుము) - అతిపెద్ద బల్లి, మానిటర్‌ లిజర్డ్‌ అంటారు.

మొసలి - పూర్తిగా విభజితమైన నాలుగు గదుల గుండె ఉంటుంది.

రాక్షస బల్లులు (డైనోసార్‌లు) - శిలాజ సరీసృపాలు

ఊసరవెల్లి (కెమిలియాన్‌)- శరీర రంగులను మార్చుకుంటుంది.

టెస్టుడో ఎలిగెన్స్‌ - నక్షత్ర తాబేలు

ఎరిక్స్‌ జాని (శాండ్‌ బోవా) - దీని తోక మొద్దులా ఉండటం వల్ల రెండు తలల పాము అంటారు.

 

పక్షులు

వీటి అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు. ఇవి స్థిరోష్ణ జీవులు. అంటే పరిసరాల ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా తమ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకుంటాయి. ఊపిరితిత్తులు శ్వాసక్రియ అవయవాలు. నాలుగు గదుల గుండె ఉంటుంది. ముఖ్య నత్రజని విసర్జక పదార్థం యూరికామ్లం. శరీరంపై తోక భాగంలో ప్రీన్‌ గ్రంథి లేదా యూరోపైజియల్‌ గ్రంథి ఉంటుంది. ఇది నూనెను ఉత్పత్తి చేస్తుంది.

పక్షుల్లో ఉన్న అనుకూలనాలు, ప్రత్యేకతలు: పక్షులు ఎగరడానికి, శరీర బరువు తగ్గించుకోవడానికి అనేక అనుకూలనాలు, ప్రత్యేకతలను చూపిస్తాయి. అవి 

* శరీరం పడవ ఆకారంలో ఉండటం.

* పూర్వాంగాలు రెక్కలుగా మార్పు చెందుతాయి.

* మూత్రాశయం ఉండదు.

* గాలితో నిండిన ఎముకలుంటాయి.

* ఒకే స్త్రీ బీజ వాహిక, స్త్రీ బీజకోశం ఉంటుంది.

* శబ్దం చేయడానికి స్వరపేటిక కాకుండా శబ్దిని (syrine)  అనే నిర్మాణం ఉంటుంది.

* సూర్యకాంతి నుంచి రక్షించేందుకు కంట్లో దువ్వెన లాంటి పెక్టిన్‌ అనే నిర్మాణం ఉంటుంది. 

 

ఉదాహరణలు - ప్రత్యేకతలు:

ఆస్ట్రిచ్‌ - అతిపెద్ద పక్షి. వేగంగా పరిగెత్తుతుంది. అతిపెద్ద అండాలు (గుడ్లు) పెట్టే పక్షి. ఇది ఎగరలేదు.

హమ్మింగ్‌ బర్డ్‌ - అతి చిన్న పక్షి

స్విఫ్ట్‌ - అతి వేగంగా ఎగిరే పక్షి

ఆర్కిటిక్‌ టెర్న్‌ - అతి ఎక్కువ దూరం వలసపోయే పక్షి

ఆల్‌బెట్రాస్‌ - పొడవైన రెక్కలుండే పక్షి

గుడ్లగూబ (ఓల్‌) - రాత్రిపూట స్పష్టంగా చూడగలిగిన పక్షి

ఆర్కియోప్టెరిక్స్‌ - శిలాజ పక్షి. సరీసృపాలకు, పక్షులకు సంధానకర్తగా భావిస్తారు.

ఎగరలేని పక్షులకు ఉదాహరణ - ఆస్ట్రిచ్, ఈము, కివి, పెంగ్విన్, రియా కెసారియస్, టినామస్‌.

* పక్షి గూళ్ల అధ్యయనాన్ని నిడాలజీ అంటారు.

* పక్షుల అండాల అధ్యయనాన్ని ఊలజీ అంటారు.

 

క్షీరదాలు

 వీటి అధ్యయనాన్ని మమ్మాలజీ అంటారు. మానవుడితో సహా ఉన్నతస్థాయి జంతువులు, పెంపుడు జంతువులు క్షీరదాలకు చెందినవి. క్షీర గ్రంథులుండటం వీటి ముఖ్య లక్షణం. నాలుగు గదుల గుండె ఉంటుంది. ఊపిరితిత్తులు శ్వాసక్రియ అవయవాలు. ముఖ్య నత్రజని సంబంధ విసర్జక పదార్థం యూరియా. చర్మంపై సెబీషియస్‌ గ్రంథులు (నూనె), స్వేద గ్రంథులు ఉంటాయి.దవడ ఎముక గుంటల్లో దంతాలు అమరి ఉంటాయి.

 

ఉదాహరణలు - ప్రత్యేకతలు:

నీలి తిమింగలం - అతిపెద్ద క్షీరదం. పూర్వాంగాలు ఫ్లిప్పర్స్‌ (తెడ్లలా)గా మార్పు చెంది ఈదడానికి సహాయపడతాయి. చర్మం కింద రక్షణ కోసం బ్లబ్బర్‌ అనే కొవ్వు పొర ఉంటుంది.

ఏనుగు - నేలపై ఉండే అతిపెద్ద క్షీరదం. అతి ఎక్కువ గర్భావధి కాలం (600 రోజులు) ఉన్న జంతువు. దీనిని జాతీయ వారసత్వ జంతువు (national heritage animal) గా ప్రకటించారు.

డాల్ఫిన్‌ - మానవుడి తరువాత రెండో తెలివైన జంతువు. సముద్రంలో, మంచి నీటిలో ఉంటాయి. గంగా, దాని ఉపనదుల్లోని మంచినీటి డాల్ఫిన్‌ను జాతీయ జలచర జంతువు (National Aquatic Animal) గా ప్రకటించారు.

గబ్బిలం - దీన్ని ఎగిరే క్షీరదం, ఎగిరే నక్క, గుడ్డి క్షీరదం లాంటి పేర్లతో పిలుస్తారు. అతిధ్వనులను ఉత్పత్తి చేస్తుంది. ఎకోలొకేషన్‌ సూత్రం ఆధారంగా ఎగురుతుంది.

డక్‌ బిల్డ్‌ ప్లాటిపస్, ఎఖిడ్నా - ఈ జీవులు, గుడ్డు పెట్టే క్షీరదాలు. ఆడజీవులతోపాటుగా మగ జీవులకు కూడా క్రియాపూరిత క్షీర గ్రంథులు ఉంటాయి. వీటిని సరీసృపాలకు, క్షీరదాలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు.

ఒంటె, లామా -  అన్ని క్షీరదాల్లో ఎర్రరక్త కణాలు కేంద్రక రహితం, కాని వీటిలో కేంద్రకయుతం.

సీల్, వాల్‌రస్‌ - ఇవి సముద్ర మాంసాహార జంతువులు.

ష్రూ (shrew) - అతిచిన్న క్షీరదం

గొరిల్లా - అతిపెద్ద ఏప్‌

పంగోలిన్‌ (scaly ant eater) - బంతిలా ముడుచుకుంటుంది.

చింపాంజి - తెలివైన ఏప్‌.

 

మాదిరి ప్రశ్నలు

 

1. అన్ని చేపలు అమ్మోనియాను ముఖ్య నత్రజని విసర్జక పదార్థంగా విడుదల చేస్తాయి. కానీ కింది ఏ చేప యూరియాను విసర్జిస్తుంది? 

1) షార్క్‌    2) రోహు   3) గాంబూసియా   4) ఈల్‌

జ: షార్క్‌    

 

2. సముద్రంలో నుంచి నదుల్లోకి వలస పోయే చేప- 

1) ఎక్సోసీటస్‌  2) హిల్సా  3) మ్రిగాల్‌  4) కట్లా

జ: హిల్సా  

 

3. గుండెలో మూడు గదులున్న జీవులు- 

1) చేపలు    2) పక్షులు   3) ఉభయచర జీవులు   4) క్షీరదాలు

జ: ఉభయచర జీవులు

 

4. గుడ్లను పొదగడానికి గూడును నిర్మించుకునే పాము-

1) కట్లపాము   2) కొండచిలువ  3) రక్తపింజర   4) రాచనాగు

జ: రాచనాగు

 

5. కింది ఏ క్షీరదం ఎర్రరక్త కణాలు కేంద్రకయుతంగా ఉంటాయి? 

1) ఏనుగు  2) తిమింగలం   3) ఒంటె  4) గుర్రం

జ: ఒంటె  

రచయిత: డాక్టర్‌ బి.నరేష్‌ 

Posted Date : 21-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌