• facebook
  • whatsapp
  • telegram

విటమిన్లు

  విటమిన్లు శరీరానికి అత్యంత ఆవశ్యకమైన పోషకాలు. సూక్ష్మ మోతాదులో తీసుకున్నప్పటికీ స్థూల ప్రయోజనాలను కలిగిస్తాయి. జీవక్రియలు సక్రమంగా జరగడానికి తోడ్పడటమే కాకుండా పలు రకాల వ్యాధుల బారి నుంచి కూడా కాపాడతాయి. జనరల్ సైన్స్‌లోని బయాలజీ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వీటి గురించి తెలుసుకోవాలి. విటమిన్ల రసాయన నామాలు, అవి లభించే ఆహారపదార్థాలు, లోపిస్తే కలిగే వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి.

  విటమిన్లు శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు. కణాల్లో జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఇవి చాలా అవసరం. విటమిన్‌లకు ఆ పేరుపెట్టిన శాస్త్రవేత్త ఫంక్. కరిగే విధానాన్ని బట్టి విటమిన్‌లను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి

 

1) నీటిలో కరిగే విటమిన్‌లు
ఉదా: విటమిన్- బి, సి

 

2) కొవ్వుల్లో కరిగే విటమిన్‌లు
ఉదా: విటమిన్- ఎ, డి, ఇ, కె

 

విటమిన్- ఎ

* దీని రసాయనిక నామం రెటినాల్.

 

విటమిన్-ఎ జీవక్రియలు
* కంటిలోని రెటీనాలో ఉన్న దండ కణాలు పనిచేయడానికి ఇది అవసరం.
* చర్మ మృదుత్వానికి, చర్మవ్యాధులు రాకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
* పంటిలో ఎనామిల్ తయారుచేసే అమైలోబ్లాస్ట్ కణాలకు ఇది చాలా ముఖ్యం.
* వ్యాధి నిరోధక వ్యవస్థ సరిగా పనిచేయడానికి దోహదపడుతుంది.
* ఇది అస్థిమజ్జలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియకు ఇనుమును చేరవేసి హిమోగ్లోబిన్ సంశ్లేషణను ప్రోత్సహిస్తుంది.

 

లోపిస్తే... రేచీకటి: దీన్ని నిక్టలోపియా అని అంటారు. విటమిన్-ఎ లోపం వల్ల రెటీనాలోని దండకణాల్లో రొడాప్సిన్ ఏర్పడదు. దీంతో రేచీకటి వస్తుంది.

 

గ్జీరాఫ్తాల్మియా: దీన్నే కార్నియల్ గ్జీరోసిస్ అంటారు. విటమిన్-ఎ లోపం వల్ల కంటి నీరు స్రవించడం తగ్గి ఈ వ్యాధి వస్తుంది.

 

కార్నియా మెత్తపడటం:దీన్నే కార్నియల్ అల్సరేషన్ అంటారు. కంటిలోని కార్నియాపై వ్రణాలు ఏర్పడి అది పగిలిపోతుంది. ఫలితంగా అంధత్వం కలుగుతుంది.

 

లభించే ఆహారం : క్యారెట్లు, బొప్పాయి, పండిన గుమ్మడి పండు, మునగ, బచ్చలి,పుచ్చకాయల్లో విటమిన్-ఎ లభిస్తుంది. ఆవు పాలు, కాలేయం, వెన్న, కోడిగుడ్డు పచ్చసొన, చేప కాలేయపు నూనెలో కూడా ఇది ఉంటుంది.

 

ఎక్కువైతే కలిగే ప్రభావాలు: విటమిన్-ఎ శరీరానికి ఎక్కువైతే చర్మ వ్యాధులు, ఎముకల్లో నొప్పి, తలనొప్పి, వాంతి లాంటి సమస్యలు వస్తాయి. రక్తస్కంధనం త్వరగా జరగకపోవడంతో గాయాలైనప్పుడు అధిక రక్తస్రావమవుతుంది.

 

విటమిన్-బి

  విటమిన్-బిలో అనేక రకాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి బి-కాంప్లెక్స్ విటమిన్‌లు అంటారు. అవి బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, బి12.

 

విటమిన్-బి1

  దీని రసాయనిక నామం థయామిన్. దీని లోపం వల్ల వచ్చే మార్పులు నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి. అందుకే దీన్ని యాంటీన్యూరిటిక్ విటమిన్ అంటారు.

  లోపిస్తే... థయామిన్ లోపం వల్ల పక్షుల్లో పాలిన్యూరైటిస్, మనిషిలో బెరిబెరి వ్యాధులు కలుగుతాయి. ఈ విటమిన్ లోపం తీవ్రంగా ఉన్నప్పుడు వెర్నిక్స్ సిండ్రోమ్ అనే వ్యాధి కలుగుతుంది.

 

లభించే ఆహారం: విత్తనాల బాహ్య పొరల్లో, తవుడు, ఎండు బఠాణీలు, చిక్కుడు, దంపుడు బియ్యం లాంటి వాటిలో థయామిన్ ఎక్కువగా ఉంటుంది.

 

విటమిన్ బి2

దీని రసానిక నామం రైబోఫ్లావిన్. ఈ విటమిన్‌ను లాక్టోఫ్లావిన్, ఓవో ఫ్లావిన్, ఎల్లో ఎంజైమ్, హెపటోఫ్లావిన్, వెరిడోఫ్లావిన్, విటమిన్-జి అనే పేర్లతో కూడా పిలుస్తారు.

 

లోపిస్తే...
* కీలోసిస్- నోటి మూలల్లోని కణాలు చీలి ఉంటాయి.
* గ్లాసైటిస్- నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది.
* సెబోరిక్ డెర్మటైటిస్- ముక్కు, పైపెదవి మధ్య చర్మం సొరచేప చర్మంలా గరుకుగా మారుతుంది.

 

లభించే ఆహారం : పాలు, కాలేయం, గుడ్లు, వెన్న, వేరుశనగ, చిక్కుడు, ఈస్ట్ లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది.

 

విటమిన్-బి3

దీని రసానిక నామం నియాసిన్.

 

లోపిస్తే... ఈ విటమిన్ లోపం వల్ల పెల్లగ్రా అనే వ్యాధి వస్తుంది. ఇటాలియన్ భాషలో పెల్లగ్రా అంటే 'గరుకు చర్మం' అని అర్థం. పెల్లగ్రాలో విరేచనాలు, చర్మం దురదపెట్టడం, మతి భ్రమణం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి దీన్నే త్రీడీ వ్యాధి అంటారు. ఈ లక్షణాలు ఎక్కువైతే చివరకు మరణిస్తారు. ఇటీవల ఈ వ్యాధిని ఫోర్‌డీ వ్యాధి అని కూడా పిలుస్తున్నారు. నియాసిన్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

 

లభించే ఆహారం : మాంసం, కాలేయం, చేపలు, ఎండిన చిక్కుళ్లు, బియ్యం తవుడు, బఠాణీలు, గోధుమ, లేత బీజాల్లో ఎక్కువగా లభిస్తుంది.

 

విటమిన్-బి5

దీని రసాయనిక నామం పాంటోథెనిక్ ఆమ్లం.

 

లోపిస్తే... ఈ విటమిన్ లోపం వల్ల అలసట, తలనొప్పి, కండరాలు పట్టివేయడం, జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్ల స్రావం తగ్గడం, కాళ్లలో మంట వంటి లక్షణాలు కలుగుతాయి. ఈ విటమిన్ పక్షులకు అవసరం. ఇది ముఖ్యంగా కోళ్లలో చర్మ వ్యాధిని నిర్మూలిస్తుంది. కాబట్టి దీన్ని చిక్ యాంటీ డెర్మటైటిక్ ఫాక్టర్ అంటారు.

 

లభించే ఆహారం: పాంటోథెనిక్ ఆమ్లం మనం తినే ప్రతి ఆహారంలో కొద్దిగా ఉంటుంది. కాబట్టి దీని లోపం సాధారణంగా రాదు. మన పేగులోని బాక్టీరియా ఈ విటమిన్‌ను కొంత వరకు సంశ్లేసిస్తుంది. ఈస్టు, కాలేయం, కోడిగుడ్లు, పాలలో లభ్యమవుతుంది.

 

విటమిన్-బి6

దీని రసాయనిక నామం పైరిడాక్సిన్. ఈ విటమిన్ గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి, న్యూరోట్రాన్స్‌మిటర్ల సంశ్లేషణలో, ఎర్రరక్తకణాలోని హిమోగ్లోబిన్ సంశ్లేషణకు, వ్యాధి నిరోధక శక్తి నిర్వహణకు అవసరం. క్షయవ్యాధికి, ఆస్తమాకు, అధిక రక్తపీడనానికి వాడే కొన్ని ఔషధాలను తీసకొంటున్నప్పుడు విటమిన్- బి6ను అదనంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి విటమిన్-బి6కు వ్యతిరేకంగా పనిచేస్తాయి.

 

లోపిస్తే... ఈ విటమిన్ లోపం వల్ల రక్తహీనత, అధిక స్ల్కీరోసిస్, మూత్రపిండంలో రాళ్లు, వ్యాధి నిరోధక వ్యవస్థ దెబ్బతినడం, పెరుగుదల కుంటుపడటం, మానసికంగా కుంగిపోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి.

 

లభించే ఆహారం: విటమిన్-బి6 పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం, పాలు, కోడిగుడ్డు పచ్చసొనలో ఉంటుంది.

 

విటమిన్-బి7

దీని రసాయనిక నామం బయోటిన్. దీన్ని విటమిన్-హెచ్ అని కూడా అంటారు. చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి బయోటిన్ అవసరం. కాబట్టి ఈ విటమిన్‌ను షాంపూల్లో, కండిషనర్‌లలో మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా వాడతారు. ఈ విటమిన్ పచ్చి కోడిగుడ్డులో ఉండే పదార్థం బారినుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. కాబట్టి దీన్ని యాంటీ ఎగ్ వైట్ ఇంజ్యూరీ ఫ్యాక్టర్ అంటారు.

 

లోపిస్తే... ఈ విటమిన్ లోపం వల్ల ఆకలి మందగించడం, అలసట, మానసికంగా కుంగి పోవడం, వికారం, కండరాల నొప్పులు కలుగుతాయి.

 

లభించే ఆహారం: బయోటిన్ పేగులోని సూక్ష్మజీవుల ద్వారా మనకు కొంత వరకు లభ్యమవుతుంది. కాలేయం, ఈస్ట్, కోడిగుడ్డు, కూరగాయలు, విత్తనాల వంటి వాటిలో ఈ విటమిన్ లభిస్తుంది.

 

విటమిన్-బి9

దీని రసాయనిక నామం ఫోలిక్ ఆమ్లం. దీన్ని విటమిన్-ఎమ్ అని కూడా అంటారు. ఇది డీఎన్ఏ సంశ్లేషణకు, కణవిభజన జరగడానికి అవసరం. రక్తకణ ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది.

 

లోపిస్తే... ఫోలిక్ ఆమ్లం గర్భిణి స్త్రీలకు ఎక్కువగా అవసరం. గర్భస్థశిశువుకు నాడీకణాలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. గర్భిణులకు ఫోలిక్ ఆమ్లం అందకపోతే నాడీ సంబంధ వ్యాధులైన స్పైనా బిఫిడా, ఎనెన్‌సెఫాలి కలుగుతాయి. సాధారణ వ్యక్తుల్లో ఈ విటమిన్ లోపం వల్ల మాక్రోసైటిక్ అనీమియా, మెగాలో బ్లాస్టిక్ అనీమియా అనే వ్యాధులు వస్తాయి.

 

లభించే ఆహారం: కాలేయం, ఆకుకూరలు, పాలు, మాంసం, గోధుమ గింజల నూనెలో ఉంటుంది.

 

విటమిన్- బి12

దీని రసాయనిక నామం కోబాలమైన్ లేదా సైనకోబాలమైన్. దీనిలో కోబాల్ట్ మూలకం ఉండటం వల్ల ఈ పేరు పెట్టారు. ఈ విటమిన్ మెదడు, నాడీవ్యవస్థ అభివృద్ధిలో, రక్తకణ ఉత్పాదన, డీఎన్ఏ తయారీలో అవసరం. ఇది కాలేయంలో వివిధ రూపాల్లో నిల్వ ఉంటుంది. ఈ విటమిన్‌నే ఎనిమల్ ప్రొటీన్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు.

లోపిస్తే ... ఈ విటమిన్ లోపం వల్ల పెరినీషియస్ అనీమియా, హోమోసిస్టీనిమియా లాంటి వ్యాధులు కలుగుతాయి. అంతేకాకుండా అలసట, జ్ఞాపక శక్తి క్షీణత, ఎర్రరక్తకణాల అభివృద్ధి కుంటుపడుతుంది.

లభించే ఆహారం: విటమిన్- బి12 మొక్కల నుంచి అరుదుగా లభిస్తుంది. పాలు, మాంసం, గుడ్డు, కాలేయం లాంటి వాటి ద్వారా ఎక్కువగా దొరుకుతుంది. మనిషి జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా దీన్ని కొంత వరకు సంశ్లేషణం చెందిస్తుంది.

 

ముఖ్యాంశాలు

* విటమిన్లకు ఆపేరు పెట్టిన శాస్త్రవేత్త ఫంక్.
* ఇవి రెండు రకాలు. నీటిలో కరిగేవి, కొవ్వులో కరిగేవి.
* విటమిన్-ఎ లోపిస్తే రేచీకటి వస్తుంది.
* పెల్లగ్రా అంటే గరుకు చర్మం అని అర్థం. దీన్ని త్రీడీ వ్యాధి అని కూడా అంటారు.
* నియాసిన్(బి3) రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
* పాంటోథెనిక్ (బి5) మనం తినే ప్రతి ఆహారంలో దాదాపు ఉంటుంది.
* విటమిన్ బి7ను విటమిన్-హెచ్ అని కూడా అంటారు. దీన్ని కండిషనర్లలో మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా ఉపయోగిస్తారు.
* కొన్ని రకాల విటమిన్ల లోపం వల్ల మనుషుల్లో మానసిక కుంగుబాటు కలుగుతుంది.
* విటమిన్ బి12 కాలేయంలో వివిధ రూపాల్లో నిల్వ ఉంటుంది.

 

విటమిన్-సి

విటమిన్-సి రసాయనిక నామం ఆస్కార్బిక్ ఆమ్లం. ఇది వేడికి తొందరగా విచ్ఛిన్నమవుతుంది.

 

ఎందుకు అవసరం?

విటమిన్-సి శక్తిమంతమైన ప్రతిఆక్సీకరణి(యాంటీ ఆక్సిడెంట్)గా వ్యవహరిస్తుంది. కొల్లేజన్ అనే ప్రొటీన్ పోగుల తయారికీ ఇది చాలా అవసరం. జలుబును తగ్గించడం, అంటువ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను నిరోధించడంలో విటమిన్-సి ప్రధానపాత్ర వహిస్తుంది. తెల్లరక్తకణాలు తమ విధిని నిర్వహించడానికి ఈ విటమిన్‌ను వాడుకుంటాయి. చిన్నపేగులో నుంచి ఇనుము శోషణకు, ఇనుమును మన శరీరం వాడుకోవడానికి కూడా ఇది చాలా అవసరం. గాయాలు మానడానికి, ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి వచ్చే అథిరోస్ల్కీరోసిస్‌ను నివారించడానికి కూడా విటమిన్-సి అవసరం.

 

లోపిస్తే..?

విటమిన్-సి లోపం అధికంగా ఉన్నప్పుడు స్కర్వీ వ్యాధి వస్తుంది. వివిధ ప్రాంతాల్లో రక్తస్రావం కావడం, దంతాలు కదలడం, కీళ్లలో వాపు, నొప్పి లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

 

లభించే పదార్థాలు

విటమిన్-సి జంతు సంబంధ పదార్థాల్లో తక్కువగా, వృక్ష సంబంధ పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. రోజ్‌హిప్ పళ్లలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత అత్యధికంగా ఉసిరిలో ఉంటుంది. నిమ్మజాతి ఫలాలు, పుల్లని పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది.

 

విటమిన్-డి

అనేక రూపాల్లో ఇది లభ్యమవుతుంది. అవి డి1, డి2, డి3, డి4, డి5. వీటిలో డి2, డి3 రూపాలు ముఖ్యమైనవి. డి2ను ఎర్గోకాల్సిఫెరాల్, డి3ను కోల్‌కాల్సిఫెరాల్ అంటారు. ఈ రెండింటిని కలిపి కాల్సిఫెరాల్స్ అంటారు. ఈమేరకు విటమిన్-డి రసాయనిక నామం కాల్సిఫెరాల్.
మన చర్మంలోని 7-డి హైడ్రోకొలెస్ట్రాల్ సూర్యరశ్మికి గురైనప్పుడు వివిధ చర్యల ద్వారా చివరకు మూత్రపిండాల్లో కాల్సిట్రయాల్ ఏర్పడుతుంది. విటమిన్-డి చేసే పనులన్నింటిని ఇది నిర్వహిస్తుంది. కాల్సిట్రయాల్‌ను చైతన్యవంత విటమిన్-డి3 అంటారు.

 

ఎందుకు అవసరం?

పేగుల్లో నుంచి కాల్షియం శోషణకు, ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫేట్ లవణాలను స్థిరీకరించడానికి విటమిన్-డి అవసరం. పిండాభివృద్ధి, యవ్వన దశల్లో దేహకణాల సంఖ్యను పెంచడానికి ఈ విటమిన్ అవసరం. దెబ్బలు తగిలినప్పుడు, గాయాలైనప్పుడు కలిగే కణవాపును విటమిన్-డి తగ్గిస్తుంది.

 

లోపిస్తే..?

పిల్లల్లో రికెట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధిలో కాళ్లు వంగినట్లు, ధనస్సు ఆకారంలో ఉంటాయి. పెద్దవారిలో ఆస్టియోమలాసియా వస్తుంది. ఎముకలు మెత్తబడటం ఈ వ్యాధి ముఖ్యలక్షణం. వృద్ధుల్లో ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఈ వ్యాధి లక్షణం.. ఎముకల్లో కాల్షియం తగ్గి బలహీనంగా మారి తొందరగా విరిగిపోవడం.

 

లభించే పదార్ధాలు

చేపలు, వెన్న, కాలేయం, కోడిగుడ్డు నుంచి ఈ విటమిన్ లభిస్తుంది. కాడ్‌చేప కాలేయపు నూనెలో ఎక్కువగా ఉంటుంది. ధాన్యాలు, కూరగాయల్లో చాలా తక్కువగా ఉంటుంది.

 

విటమిన్-ఇ

దీని రసాయనిక నామం టోకోఫెరాల్. విటమిన్-ఇ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా టోకోఫెరాల్స్ రూపంలో లభ్యమవుతుంది. వీటిలో ఆల్ఫాటోకోఫెరాల్ జీవశాస్త్రపరంగా ఎక్కువ చైతన్యవంతమైంది.

 

ఎందుకు అవసరం?

ఈ విటమిన్ శక్తిమంతమైన ఆక్సీకరణి. ఇది శరీరాన్ని అనేక విషప్రభావాల బారి నుంచి రక్షిస్తుంది. ఇది విటమిన్-ఎ, విటమిన్-సి, సెలీనియం లాంటి వాటితో కలిసి పనిచేస్తుంది. ఆక్సీకరణిగా పనిచేయడం వల్ల కణత్వచాలను కాపాడి తొందరగా వృద్ధాప్యం రాకుండా చూస్తుంది. సంతానోత్పత్తికి ఇది దోహదపడుతుంది. దీన్ని వంధ్యత్వ ప్రతికారక విటమిన్ (యాంటీస్టెరిలిటీ విటమిన్) అని కూడా అంటారు. ఈ విటమిన్‌ను చర్మ సౌందర్య లేపనాల్లో ఉపయోగిస్తారు. నాడీకణాలను కాపాడటంలో, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రత్యేకపాత్ర వహిస్తుంది. బాగా వ్యాయామం చేసేవారికి, ఈతగాళ్లకు, పరుగు పందెంలో పాల్గొనే క్రీడాకారులకు విటమిన్-ఇ అవసరమెక్కువ.

 

లోపిస్తే..?

సాధారణంగా విటమిన్-ఇ లోపం రావడం అరుదు. కొన్ని సందర్భాల్లో ఈ విటమిన్ లోపం వల్ల కింది సమస్యలు ఏర్పడతాయి.
* వ్యాధి నిరోధక శక్తి తగ్గడం
* రెటినోపతి
* రేఖిత కండర మయోపతి
* ఎర్రరక్త కణాలు పగిలిపోవడం
* రక్తహీనత

 

లభించే పదార్థాలు

కోడిగుడ్లు, మాంసం, కాలేయం, సోయాబీన్స్, పొద్దుతిరుగుడు, వేరుశనగ, కుసుమ లాంటి నూనెల్లో ఈ విటమిన్ ఉంటుంది. ధాన్యాలు.. జంతువుల కొవ్వుల్లో కూడా ఉంటుంది. గోధుమ బీజనూనెలో ఎక్కువగా ఉంటుంది.

 

విటమిన్-కె

విటమిన్-కె సహజంగా రెండు రకాలుగా లభ్యమవుతుంది. మొక్కల నుంచి లభ్యమయ్యేది విటమిన్-కె1. దీని రసాయనిక నామం ఫిల్లోక్వినోన్. జంతుకణాలు, బ్యాక్టీరియాల నుంచి లభ్యమయ్యేది విటమిన్-కె2. దీని రసాయనిక నామం మెనక్వినోన్.

 

ఎందుకు అవసరం?

మన శరీరంలో విటమిన్-కె వల్ల రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రొత్రాంబిన్, ఫ్యాక్టర్-VII, IX, X తయారవడం, పిల్లల్లో ఎముకలు సక్రమంగా పెరగడానికి విటమిన్-డి తో పాటు విటమిన్-కె కూడా అవసరం.

 

లోపిస్తే..?

విటమిన్-కె లోపం వల్ల రక్తం తొందరగా గడ్డకట్టదు. కొందరిలో రక్తహీనత, దవడలు, ముక్కు నుంచి రక్తస్రావం, కరోనరి గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టిన పిల్లల్లో రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. కాబట్టి, పుట్టిన వెంటనే పిల్లలకు విటమిన్-కె ఇస్తారు.

 

లభించే పదార్థాలు

విటమిన్-కె దాదాపుగా అన్ని ఆహార పదార్థాల్లో కొద్ది మోతాదులోనైనా ఉంటుంది. దీన్ని మనపేగులోని బ్యాక్టీరియా సంశ్లేషిస్తుంది. ముఖ్యంగా పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, సోయాబీన్, గోధుమ, కాలేయం లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది.

 

కోలిన్

ఈ రసాయనాన్ని బి-కాంప్లెక్స్ విటమిన్లలో భాగంగా పరిగణిస్తారు. నాడీమండలం సరిగా పనిచేయడానికి, గుండె స్పందనలకు, కాలేయ నిర్వహణకు, థైమస్ గ్రంథి ఆరోగ్యంగా ఉండటానికి ఇది అవసరం. గర్భంలో పెరుగుతున్న పిండానికి నాడీవ్యవస్థలో ఇది అసిటైల్ కోలిన్ రూపంలో కీలకపాత్ర వహిస్తుంది.

 

లోపిస్తే..?

కోలిన్ లోపం వల్ల రక్తపీడనం పెరుగుతుంది. పక్షవాతం, గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కండర కణాలు విధ్వంసానికి గురవుతాయి. మహిళలకు గర్భధారణ సమయంలో కోలిన్ లోపం వల్ల నెలలు నిండకముందే శిశువులు జన్మించడం, తక్కువ బరువున్న పిల్లలు పుట్టడం వంటి వాటికి అవకాశం ఉంది.

 

లభ్యమయ్యే పదార్థాలు

కోలిన్ జంతువులు, మొక్కల్లో విస్తారంగా ఉంటుంది. మన శరీరంలో కొంతవరకు తయారవుతుంది. ఈస్ట్, కాలేయం, చేపలు, గోధుమ బీజ నూనె, కోడిగుడ్డులోని పచ్చసొన లాంటి వాటిలో ఉంటుంది.

 

ఇనాసిటాల్

ఇనాసిటాల్ విటమిన్-బి8 గా పరిగణిస్తున్నారు. దీన్ని కండరపు చక్కెర అంటారు. ఇది వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడుతుంది. కణాంతర కాల్షియం నియంత్రణకు అవసరం. కణ సంశ్లేషణ, జన్యు సంకేతాలు వ్యక్తపరచడం, కణ సమాచారం చేరవేయడం లాంటి వాటిలో కీలకపాత్ర వహిస్తుంది. న్యూరో ట్రాన్స్‌మీటర్ల సంశ్లేషణలో పాల్గొంటుంది.

 

లోపిస్తే..?

ఇనాసిటాల్ లోపం వల్ల కేశ నష్టం, జ్ఞాపకశక్తి లోపించడం, మలబద్దకం, రక్తంలో చెడ్డకొలెస్ట్రాల్ పెరగడం, అథెరోస్ల్కీరోసిస్, గర్భస్థ శిశువులో నాడీనాళం లోపం ఏర్పడవచ్చు.

 

లభించే పదార్థాలు

ధాన్యాలు, చిక్కుడుజాతి కూరగాయలు, ఆకుకూరలు, అరటి, నారింజ, బత్తాయి, కోడిగుడ్డులోని పచ్చసొన

 

ఖనిజ లవణాలు

ఇవి సూక్ష్మ పోషక పదార్థాలు. మనకు తక్కువ మోతాదులో అవసరం. మన శరీరంలో వివిధ జీవక్రియలు జరగడానికి, ఎముకలు, దంతాలు వంటివి ఏర్పడానికి ఖనిజ లవణాలు చాలా అవసరం. మన శరీరంలో ముఖ్యంగా సోడియం, పొటాషియం, క్లోరిన్, కాల్షియం, ఫాస్ఫరస్, సల్ఫర్, రాగి, ఇనుము, జింక్, అయోడిన్, ఫ్లోరిన్ లాంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో కొన్నింటిని తప్పనిసరిగా ఆహారం ద్వారా తీసుకోవాలి. లేకపోతే వీటిలోపం వల్ల అనేక వ్యాధులు కలుగుతాయి. ఇవే కాకుండా మన శరీరంలో క్రోమియం, మాంగనీస్, సెలీనియం, కోబాల్ట్, మెలిబ్డినం, నికెల్, టిన్, సిలికాన్, వెనడియం లాంటి ఖనిజాలు అతి తక్కువ మోతాదులో ఉంటాయి.

 

సోడియం

కణబాహ్య ద్రవ్యమైన ప్లాస్మా, ఇతర ద్రవాల్లో ఉండే ముఖ్య ధనావేశ అయాన్. ఇది రక్తం పీహెచ్ స్థాయిని క్రమపరచడానికి, నాడీ ప్రచోదనాలకు అవసరం. ఎర్ర రక్తకణాల్లో ఆక్సిజన్, కార్బన్‌డైఆక్సైడ్ రవాణాకు, శరీరంలో నీటిని క్రమపరచడానికి ఉపయోగపడుతుంది. ఒక ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తుంది. ఆహారం ద్వారా దీన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు సాధారణంగా మూత్రం ద్వారా విసర్జితమవుతుంది.

 

లభించే పదార్థాలు

ఇది దాదాపుగా అన్ని కూరగాయలు, పండ్లలో ఉంటుంది. పాలు, గుడ్డు, మాంసం నుంచి లభిస్తుంది. మనం రోజూ ఆహార పదార్థాల్లో వాడే సోడియంక్లోరైడ్ (ఉప్పు) ద్వారా మనకు సోడియం లభిస్తుంది.

 

లోపిస్తే..?

రక్తంలో సోడియం లోపం వల్ల కలిగే స్థితిని హైపోనేట్రిమియా అంటారు.

 

పొటాషియం

మన దేహంలోని కణాంతస్థ ద్రవాల్లో (ఇంట్రా సెల్యూలార్ ఫ్లూయిడ్స్) ఉండే ముఖ్యమైన ధనావేశ అయాన్ పొటాషియం. మన శరీరంలో జరిగే అనేక జీవరసాయన చర్యలకు ఇది అవసరం. శరీరంలో ఆమ్ల, క్షార, నీటి క్రమతలకు కూడా ఇది ముఖ్యం. నాడీ ప్రచోదనాలు సరిగా జరగడానికి, శరీరంలో వాయువుల రవాణాకు, శ్వాసక్రియలో ఉండే గ్త్లెకాలిసిస్‌లోని అనేక ఎంజైములకు అవసరమవుతుంది.

 

లోపిస్తే..?

పోటాషియం లోపం వల్ల కలిగే స్థితిని హైపోకలీమియా అంటారు. కండరాలు బలహీనపడటం, పక్షవాత లక్షణాలు, మానసిక తత్తరపాటు లాంటివి కలుగుతాయి.

 

లభించే పదార్థాలు

సాధారణంగా ఇది పండ్లు, కూరగాయల నుంచి లభిస్తుంది. అరటి, స్ట్రాబెరీస్, బంగాళాదుంప, ఆకుకూరలు, చేపలు లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది.

 

క్లోరిన్

కణబాహ్య ద్రవమైన (ఎక్స్‌ట్రా సెల్యూలార్ ఫ్లూయిడ్) ప్లాస్మా, ఇతర ద్రవాల్లో క్లోరిన్ ప్రధాన రుణావేశ అయాన్‌గా ఉంటుంది. ఇది ఒక ఎలక్ట్రోలైట్‌గా ఉంటూ ద్రవాభిసరణను క్రమపరచడానికి, నాడీ ప్రచోదనాలకు ఉపయోగపడుతుంది. శరీరంలో ఆమ్ల-క్షార క్రమతకు, జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం తయారుకావడానికి అవసరం. దేహంలోని అధిక క్లోరిన్ మూత్రం, చెమట ద్వారా బయటకు వెళుతుంది.
* ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప దాదాపుగా క్లోరిన్ లోపం ఉండదు. ఒకవేళ ఉంటే పైన పేర్కొన్న క్రియలకు విఘాతం ఏర్పడుతుంది. క్లోరిన్ అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు లాంటి వాటిలో ఉంటుంది.

 

కాల్షియం

మన దేహంలో కాల్షియం ఎక్కువగా ఎముకల్లో ఉంటుంది. దంతాల్లోని డెంటైన్‌లో కొద్ది పరిమాణంలో ఉంటుంది. కాల్షియం, ఫాస్ఫరస్‌తో కలిసి కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఎముకలు, దంతాలు ఏర్పడటానికి అవసరమవుతుంది. రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రించే హార్మోన్లు కాల్సిటోనిన్, పారాథార్మోన్. కాల్షియం అధికంగా లభ్యమవుతున్నప్పుడు రక్తం నుంచి ఎముకలకు చేరి వాటిలో నిల్వ ఉంటుంది. రక్తంలో దీని పరిమాణం తగ్గినప్పుడు తిరిగి ఎముకల నుంచి రక్తంలోకి చేరుతుంది.

 

దోహదపడుతుందిలా..

* ఎముకలు, దంతాలు సక్రమంగా ఏర్పడటానికి..
* కండర సంకోచానికి, నాడీ ప్రచోదనాలకు..
* రక్తం గడ్డకట్టే ప్రక్రియకు..
* కండరాలకు గాయాలైనప్పుడు వాటిని మరమ్మతు చేయడానికి..

 

లోపిస్తే ఏమవుతుందంటే..

ఎముకలకు సంబంధించిన ఆస్టియోమలాసియా, ఆస్టియోపోరోసిస్ (వృద్ధుల్లో) వ్యాధులు వస్తాయి.

 

ఏయే ఆహార పదార్థాల్లో..

పాలు, గుడ్లు, పాల పదార్థాలు, చేపలు, ఆకుకూరలు, బెల్లం లాంటి వాటిలో కాల్షియం ఉంటుంది. మనకు రోజూ కావాల్సిన కాల్షియం పాలు, పాలపదార్థాల ద్వారా లభిస్తుంది. ధాన్యాల్లో ముఖ్యంగా రాగుల్లో కాల్షియం ఎక్కువ.

 

ఫాస్ఫరస్

ఇది కాల్షియంతో కలిసి ఎముకలు, దంతాలను ఏర్పరుస్తుంది. కేంద్రకామ్లాల(డీఎన్ఏ, ఆర్ఎన్ఏ)లో ఇది ఫాస్ఫారిక్ ఆమ్ల రూపంలో ఉంటుంది.
* సాధారణంగా దీని లోపం ఏర్పడదు.

 

దోహదపడుతుందిలా..

* ఏటీపీ (అడినోసైన్ ట్రై ఫాస్ఫేట్) తయారీకి ఇది అవసరం.
* జీవక్రియలు సక్రమంగా జరగడానికి, ఎంజైమ్‌ల ఉత్తేజానికి..

 

ఏయే ఆహార పదార్థాల్లో..

ఫాస్ఫరస్ ఎక్కువగా వేరుశనగ, బాదం, చిక్కుడు జాతి విత్తనాలు, వెన్న, ధాన్యాలు, కోడి మాంసం లాంటి వాటిలో ఉంటుంది.

 

సల్ఫర్

సిస్టీన్, మిథియోనైన్ అనే అమైనో ఆమ్లాల్లో సల్ఫర్ ఉంటుంది. ఇన్సులిన్‌లో కూడా ఉంటుంది. థయామిన్ (విటమిన్ బి1)లో సల్ఫర్ ఉంటుంది.

 

దోహదపడుతుందిలా..

* జీవ రసాయన చర్యల్లో అనేక ముఖ్య ధాతువులు ఏర్పడటానికి..

 

ఏయే ఆహార పదార్థాల్లో..

బఠాణీలు, మాంసం, గుడ్లు, ఉల్లి, వెల్లుల్లి, ధాన్యాల్లో సల్ఫర్ ఉంటుంది.

 

జింక్

జింక్ మన శరీరంలో ఉండే అనేక ఎంజైమ్‌ల్లో కో-ఫ్యాక్టరుగా ఉండి వాటిని ఉత్తేజితం చేస్తుంది. వాణిజ్యపరంగా తయారుచేసే ఇన్సులిన్‌లో జింక్ ఉంటుంది.

 

దోహదపడుతుందిలా..

* దేహం పెరుగుదలకు..
* ప్రత్యుత్పత్తికి..
* గాయాలు మానడానికి సహాయకారిగా..

 

లోపిస్తే ఏమవుతుందంటే..

* వెంట్రుకలు రాలిపోతాయి
* చర్మ వ్యాధులు
* విరేచనాలు
* ఆకలి తగ్గడం
* మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవడం
* స్త్రీలలో రుతుక్రమం దెబ్బతినడం

 

ఏయే ఆహార పదార్థాల్లో..

కాలేయం, పాలు, ధాన్యాలు, మాంసం, పాలకూర, గుడ్లు, పప్పుధాన్యాలు లాంటి వాటి ద్వారా జింక్ లభ్యమవుతుంది.

 

మాంగనీస్

శరీరంలో అనేక ఎంజైమ్‌ల ఉత్తేజానికి మాంగనీస్ అవసరం. బయోటిన్, థయామిన్, ఆస్కార్బిక్ ఆమ్లం లాంటి విటమిన్ల జీవక్రియలకు కూడా ఇది చాలా అవసరం.

 

దోహదపడుతుందిలా..

* ఎముకల పెరుగుదల, నిర్వహణకు..
* కొవ్వు ఆమ్లాల తయారీకి..
* థైరాక్సిన్ సంశ్లేషణలో జ్ఞాపకశక్తి క్షీణించకుండా ఉండటానికి..

 

లోపిస్తే ఏమవుతుందంటే..

* ఎముకలు సరిగా అభివృద్ధి చెందవు.
* గోళ్లు, వెంట్రుకల పెరుగుదల మందగించడం
* కండరాల మధ్య సమన్వయ లోపం

 

ఏయే ఆహార పదార్థాల్లో..

ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, వేరుశనగ, బాదంపప్పు.

 

కోబాల్ట్

ఇది అనేక ఎంజైమ్‌ల్లో కో-ఫ్యాక్టర్‌గా ఉంటుంది. విటమిన్-బి12లో కోబాల్ట్ భాగంగా ఉంటుంది.

 

దోహదపడుతుందిలా..

* ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి..

 

లోపిస్తే ఏమవుతుందంటే..

* రక్తహీనత, నాడీ సంబంధ సమస్యలు

 

ఏయే ఆహార పదార్థాల్లో..

ఆకుకూరలు, కాలేయం నుంచి లభిస్తుంది.

 

మాలిబ్డినమ్

రాగిని మన శరీరం వినియోగించుకోవడానికి ఈ మూలకం అవసరం. ఇది అనేక ఎంజైమ్‌లలో అంతర్భాగంగా ఉంటూ వాటిని ఉత్తేజపరుస్తుంది. మాలిబ్డినమ్ శరీరంలో ఎక్కువైతే 'మాలిబ్డినోసిస్' అనే వ్యాధి వస్తుంది.

 

ఏయే ఆహార పదార్థాల్లో..

ధాన్యాలు, విత్తనాలు, క్యాబేజి, క్యారెట్, బంగాళాదుంప, చిక్కుడు జాతి విత్తనాల్లో ఉంటుంది.

 

ఇనుము

ఇనుము ఒక ముఖ్యమైన మూలకం. మన శరీరంలో ఇది 2-6 గ్రాముల వరకు ఉంటుంది. దీనిలో ఎక్కువభాగం హిమోగ్లోబిన్ రూపంలో ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే ఇనుము శోషణను టీ, కాఫీలలో ఉండే టానిన్లు అడ్డగిస్తాయి. కాబట్టి ఆహారం తీసుకున్న తర్వాత వీటిని సేవించడం శ్రేయస్కరం కాదు. ఆహారంలో ఆస్కార్బిక్ ఆమ్లం, చక్కెర లాంటివి ఉన్నప్పుడు ఇనుము శోషణం ఎక్కువగా జరుగుతుంది. మన శరీరంలో ఉన్న ఇనుము మలం, మూత్రం, స్వేదం లాంటి ప్రక్రియల ద్వారా బయటకు వెళుతుంది. స్త్రీలలో రుతుచక్రం సమయంలో, గర్భాధారణ సమయంలో, శిశువుకు పాలిచ్చే తల్లుల్లో ఇనుము శరీరం నుంచి బయటకు వెళుతుంది. కాబట్టి ఇలాంటి వారు ఆహారం ద్వారా ఇనుమును తప్పనిసరిగా తీసుకోవాలి.

 

దోహదపడుతుందిలా..

* ఆక్సిజన్ రవాణాలో ప్రముఖపాత్ర..
* ఎలక్ట్రాన్-రవాణా ప్రక్రియలో ప్రధాన పాత్ర..
* డీఎన్ఏ తయారీకి..

 

లోపిస్తే ఏమవుతుందంటే..

రక్తహీనత ఏర్పడుతుంది. దీన్నే ఇనుము లోపం వల్ల కలిగే రక్తహీనత (ఐరన్ డెఫిషియన్సీ అనీమియా) అంటారు. రక్తహీనత రకాల్లో ఇనుము సంబంధ రక్తహీనత సర్వసాధారణం. రక్తహీనత వల్ల అలసట, తలనొప్పి, గుండెదడ, బలహీనంగా ఉండటం లాంటి లక్షణాలు కలుగుతాయి.
ఏయే ఆహార పదార్థాల్లో..

మాంసం, చేపలు, కాలేయం, రాగులు, తోటకూర, కాలిఫ్లవర్, బెల్లం, కొత్తిమీర, ఆవాలు లాంటి వాటిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. వృక్షసంబంధ పదార్థాల కంటే జంతు సంబంధ ఆహార పదార్థాల్లోని ఇనుమునే మన శరీరం ఎక్కువగా శోషించుకుంటుంది.

 

రాగి

  హిమోగ్లోబిన్ తయారీకి రాగి అవసరం. మన శరీరంలో ఫాస్ఫోలిపిడ్‌లు, మెలనిన్, కొల్లాజన్ తయారీకి కూడా ఇది అవసరం. రాగి టైరోసినేజ్, సైటోక్రోమ్ ఆక్సిడేజ్ లాంటి అనేక ఎంజైమ్‌ల్లో భాగంగా ఉంటుంది. ఎర్రరక్త కణాల్లో ఉండే ఎరిథ్రోక్యుప్రిన్ ప్రొటీన్, మెదడులో ఉండే సెరిబ్రోక్యుప్రిన్ ప్రొటీన్, కాలేయంలో ఉండే హెపటోక్యుప్రిన్ ప్రొటీన్‌లలో రాగి ఉంటుంది. సాధారణంగా రాగి లోపం ఏర్పడటం అరుదు.

 

దోహదపడుతుందిలా..

* హిమోగ్లోబిన్ తయారీలో..
* ఎముక ఏర్పడటానికి సహాయకారిగా..

 

లోపిస్తే ఏమవుతుందంటే..

రాగి లోపం ఉన్నట్లయితే రక్తహీనత కలుగుతుంది. చర్మవ్యాధులు కూడా వస్తాయి.

 

ఏయే ఆహార పదార్థాల్లో..

కాలేయం, చేపలు, ఎండిన చిక్కుళ్లు, జీడిపప్పు లాంటి వాటిలో ఇది ఉంటుంది.

 

అయోడిన్

మానవుడికి తప్పనిసరిగా అవసరమయ్యే మూలకాల్లో అయోడిన్ ఒకటి. అయోడిన్ థైరాయిడ్ గ్రంథి స్రవంచే థైరాక్సిన్ హార్మోన్‌లో భాగంగా ఉంటుంది.
దోహదపడుతుందిలా..

* శరీరంలో జీవక్రియలు జరగడానికి (పరోక్షంగా)..

 

లోపిస్తే ఏమవుతుందంటే..

అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథికి సరిగా అయోడిన్ అందక విపరీతంగా ఉబ్బుతుంది. దీన్నే సరళ గాయిటర్ వ్యాధి అంటారు. సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాలు, ఎత్తయిన ప్రాంతాల్లో అయోడిన్ లోపం వల్ల అక్కడ ఉండే ప్రజల్లో సర్వసాధారణంగా గాయిటర్ వ్యాధి కనిపిస్తుంది. దీన్నే ఎండమిక్ గాయిటర్ అంటారు. అయోడిన్ లోపం వల్ల పిల్లలు మందకొడిగా ఉంటారు, వారిలో పెరుగుదల లోపిస్తుంది.

 

ఏయే ఆహార పదార్థాల్లో..

అయోడిన్ నేల లోపలిభాగంలో ఉంటుంది. కాబట్టి లోతైన బావుల్లోని నీరు తాగేవారికి అయోడిన్ తగినంతగా లభిస్తుంది. ఇది మనం రోజు తినే పండ్లు, కూరగాయల్లో ఉంటుంది. సముద్ర ఉత్పత్తులైన చేపలు, పీతలు, రొయ్యలు, సముద్రపు శైవలాల్లో అయోడిన్ తగినంతగా ఉంటుంది. వీటిని తగినంతగా తీసుకునేవారికి అయోడిన్ లోపం తక్కువ. ప్రస్తుతం మనం అయోడిన్ కలిపిన ఉప్పును ఉపయోగిస్తున్నాం. దీని ద్వారా మనకు అయోడిన్ లభిస్తుంది.

 

మెగ్నీషియం

కార్బోహైడ్రేట్‌లు, లిపిడ్‌లు, ప్రొటీన్‌ల సంశ్లేషణలో పాల్గొనే ఎంజైమ్‌ల జీవక్రియలకు మెగ్నీషియం అవసరం.

 

దోహదపడుతుందిలా..

* కండరాలు పనిచేయడానికి..
* నాడీ ప్రచోదనాలకు..

 

లోపిస్తే ఏమవుతుందంటే..

కండరాల పనితీరులో మార్పు వస్తుంది. కండరాలకు తగినంతగా సమాచారం అందదు.

 

ఏయే ఆహార పదార్థాల్లో..

పండ్లు, కూరగాయల నుంచి ఇది మనకు లభిస్తుంది.

 

సిలికాన్

ఇది మన శరీరంలో చాలా తక్కువగా ఉంటుంది. కాల్షియం లవణాలను ఎముకలోకి చేరవేయడానికి ఇది అవసరం.

 

దోహదపడుతుందిలా..

* ఎముకలను పటిష్టంగా ఉంచడానికి..
* కొల్లాజన్ అనే ప్రొటీను తయారీకి..
* రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండటానికి..
* చర్మాన్ని మృదువుగా ఉంచడానికి..

 

ఏయే ఆహార పదార్థాల్లో..

వరి, గోధుమ, సజ్జ, జొన్న లాంటి ధాన్యాలు, నిమ్మజాతి ఫలాల్లో ఉంటుంది.

 

క్రోమియం

క్రోమియంను ఒక గ్లూకోజ్ టోలరెన్స్ ఫ్యాక్టర్ అంటారు. ఈ మూలకం స్థూలపోషక పదార్థాలైన కార్బోహైడ్రేట్, ప్రొటీన్, లిపిడ్‌ల జీవక్రియలకు అవసరం.

 

దోహదపడుతుందిలా..

* ఇన్సులిన్ హార్మోనుకు సహాయం చేసి, గ్లూకోజ్ కణంలోకి వెళ్లడానికి తోడ్పడుతుంది.

 

ఏయే ఆహార పదార్థాల్లో..

ధాన్యాలు, మాంసం, పాలు, కాలేయం, ఆపిల్, బంగాళదుంపలు, కోడిగుడ్డులో ఉంటుంది.

 

సెలీనియం

మైటోకాండ్రియాలో ఏటీపీ సంశ్లేషణకు సెలీనియం అవసరం. సాధారణంగా దీని వినియోగం అత్యల్పం. దీని లోపం వల్ల ప్రత్యేకంగా ఏ వ్యాధి రాదు. రంగులు, పింగాణి, గాజు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారుచేసే పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కాలుష్యం వల్ల దేహంలో సెలీనియం మోతాదుకు మించి ఉండి విషప్రభావాన్ని కలగజేస్తుంది.

 

దోహదపడుతుందిలా..

* యాంటీ ఆక్సిడెంట్‌గా..
* వ్యాధినిరోధక శక్తి సరిగా పనిచేయడానికి..
* శుక్రకణాల కదలికకు..
* థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో..

 

ఏయే ఆహార పదార్థాల్లో..

మాంసం, ధాన్యాలు, పాల ఉత్పత్తులు, సముద్ర ఆహార ఉత్పత్తుల నుంచి ఇది లభ్యమవుతుంది.

 

ఫ్లోరిన్

ఇది మనకు తాగునీటి ద్వారా ఎక్కువగా లభ్యమవుతుంది. దీని లోపం చాలా అరుదు. తాగేనీటిలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఫ్లోరిన్ దంతాల్లో పేరుకుపోయి వాటిపై మచ్చలను ఏర్పరుస్తుంది. దీన్నే డెంటల్ ఫ్లోరోసిన్ అంటారు. మన శరీరంలోకి చేరే ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్నప్పుడు అది ఎముకల్లో కాల్షియం స్థానంలో చేరిపోతుంది. దీనివల్ల ఎముకలు మెత్తగా తయారై వంకరగా తయారవుతాయి లేదా కాల్షియం తగ్గిపోయి పెళుసుగా మారి సులభంగా విరిగిపోతాయి. కీళ్ల మధ్య ఫ్లోరిన్ చేరడం వల్ల కీళ్ల కదలిక తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని స్కెలిటల్ ఫ్లోరోసిస్ అంటారు. ఫ్లోరిన్ మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే పొరల్లో పేరుకుపోవడం వల్ల అవి గట్టిపడిపోతాయి. దీనివల్ల వెన్నుపాము ఒత్తిడికి గురవుతుంది. ఈ పరిస్థితిని నాడీసంబంధ ఫ్లోరోసిస్ అంటారు.
* భూగర్భ జలాలను లేదా లోతయిన గొట్టపు బావుల నీటిని తాగునీటిగా వినియోగించే వారికి 'ఫ్లోరోసిస్' వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి తాగేనీటిలో ఫ్లోరిన్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

 

దోహదపడుతుందిలా..

* దంతాలపై ఉండే ఎనామిల్ తయారు కావడానికి ఫ్లోరిన్ అవసరం.
* దంతాలు, ఎముకలు ఏర్పడటానికి ఇది కొద్దిమొత్తంలో అవసరం.

 

లోపిస్తే ఏమవుతుందంటే..

ఫ్లోరిన్ పూర్తిగా లభ్యం కాకపోతే ఎముకల సంబంధ సమస్యలు వస్తాయి

Posted Date : 24-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌