• facebook
  • whatsapp
  • telegram

అగ్నిపర్వతాలు

విస్ఫోటమై.. విరజిమ్ముతూ!

  అక్కడ పుట్టిన అత్యంత వేడితో కఠిన శిలలు కరుగుతాయి. ద్రవాల నిల్వలుగా పేరుకుపోయి ఒక్కసారిగా నిప్పులు కక్కుకుంటూ విస్ఫోటం చెందుతాయి. చీలికలు, బీటల నుంచి చొచ్చుకొని వచ్చి భూమిపైకి విరజిమ్ముతాయి. తర్వాత ఘనీభవించి లావాగా మారి, పొరలుగా పెరిగి పర్వతాలుగా పరిణామం చెందుతాయి. రకరకాలుగా జరిగే ఆ ప్రక్రియలపై పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. ప్రాథమికాంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

  భూ అంతర్భాగంలో ఆవిర్భవించే అంతర్జనిత శక్తుల్లో ఏదైనా మార్పు ఏర్పడితే అక్కడ ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాంతో భూపటలానికి కొంత లోతులోని శిలలు కరిగి ద్రవరూపాన్ని పొందుతాయి. దీన్నే శిలాద్రవం (మాగ్మా) అంటారు. ఆ శిలాద్రవం విదరాలు (ఫిస్యూర్స్‌ - చీలిక, బీట) లేదా కుహరం (వెంట్‌) ద్వారా భూఉపరితలాన్ని చేరి విదర ముఖద్వారం చుట్టూ చల్లారి శంకువు ఆకారంలో ఘనీభవిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల అగ్నిపర్వతాలు ఏర్పడతాయి.

అగ్నిపర్వతం అంటే భూగర్భంలోని శిలాద్రవం ఉపరితలం చేరడానికి ఉపయోగపడే నాళం లాంటి మార్గం. దీన్నే అగ్నిపర్వత నాళం అంటారు. ఈ మార్గానికి కింద భాగంలో శిలాద్రవపు నిల్వ (మాగ్మా ఛాంబర్‌), పైభాగంలో భూమి ఉపరితలంపై కుహరం ఉంటాయి. ఈ కుహరం ద్వారా శిలాద్రవం, వేడి వాయువులు, రాతి ముక్కలు విస్ఫోటం (ఎరప్షన్‌) చెందుతాయి. ఇవి కుహరం చుట్టూ శంకు లేదా కలశ ఆకారంలో ఘనీభవిస్తే దాన్ని అగ్నిపర్వతం అంటారు.

 

అగ్నిపర్వత నిర్మాణంలో మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి.

 

జ్వాలా బిలం (క్రాటర్‌): అగ్నిపర్వత శీర్ష భాగంలో పళ్లెం/ గరాటు/ గౌర ఆకారంలో ఉన్న ఒక బిలం లేదా గుంతలాంటి భాగం. అగ్నిపర్వత విస్ఫోటాలు జరిగినప్పుడు ఈ జ్వాలా బిలం పేలిపోవడం వల్ల ఆ ప్రాంతంలో విశాలమైన, లోతైన గుంతలు ఏర్పడతాయి. కాలక్రమంలో వీటిలోకి నీరు చేరడం వల్ల అవి సరస్సులుగా మారతాయి. వీటినే జ్వాలా బిల సరస్సులు లేదా క్రాటర్‌ సరస్సులు అని పిలుస్తారు. ఉదాహరణకు భారతదేశంలో అతిపెద్ద క్రాటర్‌ సరస్సు మహారాష్ట్రలోని ‘లూనార్‌’ కాగా, ప్రపంచంలో అతిపెద్ద క్రాటర్‌ సరస్సు అమెరికాలోని ఏలూషియన్‌ దీవుల్లో ఉన్న ‘బుల్డన్‌’. క్రాటర్‌ సరస్సులు పరిమాణంలో పెద్దవిగా ఉంటే వాటిని ‘కాల్దేరాలు’ అని పిలుస్తారు.

 

పీఠం (బేస్‌): అగ్నిపర్వత అడుగు భాగాన్నే పీఠం అంటారు. ఇందులో శిలాద్రవం నిల్వ ఉంటుంది. దీన్ని శిలాద్రవ నిల్వ అని కూడా పిలుస్తారు.

 

అగ్నిపర్వత గ్రీవాలు (నెక్‌/వెంట్‌): అగ్నిపర్వతంలోని పైపు లాంటి మార్గాన్ని అగ్నిపర్వత గ్రీవం లేదా కంఠం లేదా కుహరం  అంటారు. దీని ద్వారా శిలాద్రవం భూఉపరితలాన్ని చేరుతుంది.

 

లావా అంటే?

అగ్నిపర్వతాలు సాధారణంగా పలకల అంచులు, పగులు లోయ, ముడుత పర్వత శ్రేణుల శృంఖలాల వెంబడి; సముద్రపు రిడ్జ్‌ల వెంట ఉంటాయి. మాగ్మా అంటే వాయువులతో కూడిన భూ అంతర్భాగంలో ఉండే శిలాద్రవం. లావా అంటే భూ ఉపరితలానికి చేరిన తర్వాత అందులోని వాయువులను పోగొట్టుకున్న శిలాద్రవం

 

ఆమ్ల లావా: లావాలో సిలికా 65 శాతం కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఆమ్ల లావా అంటారు. ఇది జిగురుగా, చిక్కగా ఉండి భూ ఉపరితలంపై తక్కువ దూరం ప్రయాణిస్తుంది. అగ్నిపర్వత ప్రక్రియలో ఈ లావా విడుదలైనప్పుడు భూఉపరితలంపై పర్వతాలను పోలిన భూస్వరూపాలు ఏర్పడతాయి.

 

క్షారలావా లేదా మౌలిక లావా: లావాలో సిలికా 45 శాతం కంటే తక్కువగా ఉంటే దాన్ని మౌలిక లావా అంటారు. ఇది పలుచగా ఉండి ఎక్కువ వేగంతో చాలాదూరం ప్రయాణిస్తుంది. అగ్నిపర్వత ప్రక్రియలో ఈ లావా విడుదలైనప్పుడు భూఉపరితలంపై పీఠభూములు, మైదానాలను పోలిన భూస్వరూపాలు ఏర్పడతాయి.

 

అగ్నిపర్వత విస్ఫోటం: అధిక ఉష్ణోగ్రత వద్ద లావా కరిగి దాంతోపాటు అందులోని వాయువులు, ఆవిరి లావా కుహరాన్ని చేరగానే పెద్ద శబ్దంతో విస్ఫోటం చెంది వాతావరణంలోకి విడుదలవుతాయి. ఇందులోని ముఖ్య వాయువులు సల్ఫర్‌ డై ఆక్సైడ్, హైడ్రోజన్, హైడ్రోజన్‌ సల్ఫైడ్, కార్బన్‌ డై ఆక్సైడ్, హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం.

 

మూడు రకాలు

అగ్ని పర్వతాలను వాటి క్రియాశీలత (Activity) లేదా ఉద్భేదనా విరామాలు, వాటి విస్ఫోటన తీవ్రత (Intensity) ఆధారంగా మూడు రకాలుగా రకాలుగా విభజించవచ్చు.

 

క్రియాశీల అగ్నిపర్వతాలు: చారిత్రక యుగంలో అప్పుడప్పుడు త్వరితగతిన ఉద్భేదనం చెందే అగ్నిపర్వతాలను క్రియాశీల అగ్నిపర్వతాలు అంటారు. 

ఉదా: వేసూనియస్‌ (ఇటలీ), క్రాకటోవా (ఇండోనేషియా - ఇప్పటివరకు జరిగిన అగ్ని పర్వత ఉద్భేదనాల్లో అతిపెద్దది), మానలోవా (హవాయి - ప్రపంచంలోని అగ్ని పర్వతాల్లో అతిపెద్దది), బారన్‌ (ఇండియా), స్ట్రంబోలి (సిసిలి - లైట్‌ హౌస్‌ ఆఫ్‌ ది మెడిటరేనియస్‌ అంటారు).

 

నిద్రాణ అగ్నిపర్వతాలు: చారిత్రక యుగంలో ఒకసారి విస్ఫోటం చెంది చాలాకాలం ఏ విధమైన చలనం లేకుండా ఉండి, ఆ తర్వాత మళ్లీ విస్ఫోటం చెందే అగ్నిపర్వతాలను నిద్రాణ అగ్నిపర్వతాలంటారు.

ఉదా: ప్యూజియామా (జపాన్‌), హేల్యాకోలా (హవాయి)

 

విలుప్త అగ్నిపర్వతాలు: చారిత్రక యుగంలో విస్ఫోటం చెందని అగ్నిపర్వతాలను విలుప్త అగ్ని పర్వతాలు అంటారు. 

ఉదా: కిలిమంజరో (టాంజానియా), నార్కండామ్‌ (ఇండియా), అకాంగువా (అర్జెంటీనా)

 

ఉద్భేదనాన్ని అనుసరించి..

అగ్నిపర్వత ఉద్భేదనాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. 

 

విదర ఉద్భేదనం (Fissure Eruption): అగ్నిపర్వత నిర్మాణంలో ఒకటి కంటే ఎక్కువ అగ్నిపర్వత కుహరాలు లేదా విదరాలు (బీటలు) ఉన్నచోట ఈ ఉద్భేదనం జరుగుతుంది. విదర ఉద్భేదనం సంభవించిన ప్రదేశాల్లో లావా విశాలంగా వ్యాపించి ఒకదానిపై ఒకటి క్షితిజ సమాంతర పటలాలుగా ఘనీభవిస్తుంది. ఈ పటలాలు పొరలుగా పోగు పడటంతో లావా పీఠభూములు ఏర్పడతాయి. ఇవి బసాల్ట్‌ శిలాపదార్థంతో ఏర్పడి ఉంటాయి.

ఉదా: భారత ద్వీపకల్ప భాగంలో దక్కన్‌ నాపలు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కొలంబియా పీఠభూమి, ఈశాన్య ఐర్లాండ్‌లోని ఏంట్రిమ్‌ పీఠభూమి ఈ విధంగా ఏర్పడినవే.

 

మధ్య లేదా కేంద్ర ఉద్భేదనం (Central Eruption): అగ్నిపర్వత నిర్మాణంలో ఒకేఒక కుహరం లేదా విదరం ఉన్నప్పుడు ఈ ఉద్భేదనం జరుగుతుంది. మధ్య ఉద్భేదనం వల్ల శంకు ఆకారంలో లేదా జ్వాలాబిలం రూపంలో అగ్నిపర్వతం ఏర్పడుతుంది. ఈ రకమైన అగ్నిపర్వత ప్రక్రియలో తీవ్రమైన విస్ఫోటం జరుగుతుంది.  

 

అగ్నిపర్వతాల విస్తరణ 

భౌమ చరిత్రలో అగ్నిపర్వత ప్రక్రియ అనేకసార్లు జరుగుతూనే ఉంది. ఖండాలపై, సముద్ర గర్భాల్లో వేలకొద్దీ విలుప్త అగ్నిపర్వతాలున్నాయి. క్రియాశీల అగ్నిపర్వతాలు సుమారు 500 వరకు ఉండవచ్చు.

* దాదాపు 80% అగ్నిపర్వతాలు పసిఫిక్‌ మహాసముద్రం చుట్టూ మేఖలలో ఉన్నాయి. దీన్ని పసిఫిక్‌ అగ్నివలయం అంటారు. ఈ అగ్నిపర్వతాలు నవీన వళి పర్వత శ్రేణులున్న ఉత్తర, దక్షిణ అమెరికాలో, ఆసియా తూర్పుతీరంలోని ద్వీపాల వక్రాల్లో ఉన్నాయి.

* ఆఫ్రికాలోని భ్రంశలోయా ప్రాంతం, మధ్యదరా సముద్ర ప్రాంతంలోని ఆల్ప్స్‌ పర్వత శ్రేణుల సమీపంలో కూడా అగ్నిపర్వతాలున్నాయి.

* భారతదేశంలో రెండు అగ్నిపర్వత దీవులున్నాయి. ఒకటి అండమాన్‌ దీవులకు ఈశాన్యంగా ఉన్న విలుప్త అగ్నిపర్వతం నార్కండమ్‌. రెండోది మధ్య అండమాన్‌కు ఈశాన్య దిశలో ఉన్న క్రియాశీలక అగ్నిపర్వతం బారన్‌.

 

 క్షీణ దశలో స్వరూపాలు

 

వేడినీటి బుగ్గలు (హాట్‌ స్ప్రింగ్స్ ): అగ్నిపర్వత ప్రక్రియ ఉన్న ప్రాంతాల్లో వేడినీటి బుగ్గలు సహజంగా ఉంటాయి. భూగర్భ జలాలు అధిక ఉష్ణోగ్రత ఉన్న (37 డిగ్రీల సెంటిగ్రేడ్‌ కంటే ఎక్కువ) మాగ్మా పదార్థంలో కలవడం వల్ల అధిక ఉష్ణోగ్రతను సంతరించుకుంటాయి. ఈ వేడి నీరు అగ్నిపర్వత ప్రక్రియతో ఉపరితలం మీదకు వస్తుంది. వీటినే వేడినీటి బుగ్గలు అంటారు. భారతదేశంలో లద్దాఖ్, మనాలి, సోనా, రాజ్‌గిరి, రాజ్‌మహల్‌ ప్రాంతాల్లో; ఐస్‌లాండ్, న్యూజిలాండ్‌లో ఈ వేడినీటి బుగ్గలు ఉన్నాయి.

 

ఉష్ణద్రవ నిర్ఘరాలు (గేసెర్‌): నిర్దిష్ట విరామంలో వేడి నీటిని, నీటిఆవిరిని విరజిమ్మే వేడి నీటిబుగ్గలను ఉష్ణద్రవ నిర్ఘరాలు అంటారు. 

ఉదా: ఐస్‌లాండ్, న్యూజిలాండ్, అమెరికాలోని ఎల్లోస్టోన్, నేషనల్‌ పార్క్‌లోని ఉష్ణద్రవ నిర్ఘరాలు.

 

ఎల్లోస్టోన్‌ నేషనల్‌ పార్క్‌లోని ఉష్ణద్రవ నిర్ఘరం ప్రతి 66 నిమిషాలకి వేడినీటిని విరజిమ్ముతుంది.

 

ఫ్యుమరోల్స్‌: వేడినీటిని నిరంతరంగా వెదజల్లే బుగ్గలను ఫ్యుమరోల్స్‌ అంటారు. ఇలాంటి ఫ్యుమరోల్స్‌ నుంచి వెలువడే వేడినీటిలో సల్ఫర్‌ సంబంధిత పదార్థాలు ఉంటాయి.

 

ప్లగ్‌ డోమ్‌లు: అగ్నిపర్వతం చుట్టూ ఘనీభవించిన శిలాద్రవం పేరుకొని అది బోర్లించిన హరివాణం (వెడల్పాటి పాత్ర)లా కనిపించే స్వరూపాన్ని ప్లగ్‌ డోమ్‌ అంటారు. అగ్నిపర్వతం విస్ఫోటం చెందినప్పుడు వేడి నీటితోపాటు బురద కూడా ప్రవహిస్తే వాటిని పంకాగ్ని అగ్నిపర్వతం అంటారు. ఇవి సిసిలీ, ఉత్తర న్యూజిలాండ్‌ ప్రాంతంలో ఉన్నాయి.

 

ముఖ్యాంశాలు

* ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న అగ్నిపర్వతం: కోటాపాక్సి (ఈక్వెడార్‌ - 5,800 మీ).

* హవాయి దీవుల్లోని మౌనలోవా అగ్నిపర్వతం షీల్డ్‌ అగ్నిపర్వతానికి ఉదాహరణ.

* అగ్నిపర్వత ఉద్భేదనం తీవ్రంగా ఉన్నప్పుడు అగ్నిపర్వత ముఖం (క్రేటర్‌) పేలిపోయి దాని స్థానంలో పెద్ద పెద్ద గుంటలు ఏర్పడతాయి. కాలక్రమేణా వీటిలో నీరు చేరడం వల్ల సరస్సులుగా మారతాయి. వీటినే కాల్దేరా సరస్సులు లేదా జ్వాలాబిల సరస్సులు అంటారు. ఉదా: మహారాష్ట్రలోని లూనార్‌ సరస్సు.

* కాల్దేరా అంటే విశాలమైన అగ్నిపర్వత జ్వాలా బిలాలు (క్రేటర్‌).

* అగ్నిపర్వత సంబంధ ప్రక్రియ వల్ల ఏర్పడే వేడినీటి బుగ్గలను గేసర్లు అంటారు. 

ఉదా: అమెరికాలోని ఎల్లోస్టోన్‌ నేషనల్‌ పార్కులోని ఓల్డ్‌ ఫెయిత్‌ ఫుల్‌ గేసర్‌.

* పసిఫిక్‌ మహాసముద్రం చుట్టూ ఉన్న మేఖలలు అగ్నిపర్వతాలకు నిలయాలు. అందుకే దీనికి పసిఫిక్‌ అగ్నివలయం అనిపేరు వచ్చింది.

* ప్రపంచంలో అగ్నిపర్వతాలు సంభవించని ప్రాంతం ఆస్ట్రేలియా.

 

రచయిత: సక్కరి జయకర్‌

Posted Date : 29-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌