• facebook
  • whatsapp
  • telegram

దుర్బలత్వం- వైపరీత్యాల సంభావ్యత

సంసిద్ధతే నష్ట నివారణ సూత్రం!

  విపత్తు సంభవిస్తే కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. దాని ప్రభావం నుంచి కొందరు వెంటనే తేరుకుంటారు. మరికొందరిపై ఆ తీవ్రత ఎక్కువ కాలం పనిచేస్తుంది.  అలాగే విపత్తు నిర్వహణను ప్రభుత్వాలు వివిధ స్థాయుల్లో చేపడతాయి. ఇవన్నీ ఎలా జరుగుతాయి, వీటికి సంబంధించి ఉపయోగించే సాంకేతిక పదజాలంపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 

  

భూకంపాలు, సునామీలు, చక్రవాతాల్లాంటి సహజ వైపరీత్యాలను నివారించడం మానవుడి వల్ల కావడం లేదు. వాటి కారణాలు తెలుసుకుని నష్టాన్ని నివారించే సామర్థ్యాన్ని పెంచుకుని, దుర్బలత్వాన్ని తగ్గించే చర్యలు మాత్రమే చేపట్టగలుగుతున్నాడు. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో సంసిద్ధంగా ఉండటం, తీవ్రతను తగ్గించడం, ప్రతిస్పందించి ఉపశమనం ఇవ్వడం లాంటి చర్యలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి ఉంది. 

 

దుర్బలత్వం: భౌతిక, ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రక్రియలతో కూడిన ఒక కమ్యూనిటీ వైపరీత్యాలకు గురయ్యేటప్పుడు నష్ట తీవ్రత పెరిగే స్థితి లేదా సున్నితత్వ‌ స్థితిని దుర్బలత్వం అంటారు. ఒక కమ్యూనిటీ లేదా నిర్మాణం లేదా భౌతిక ప్రాంతం, దాని నిర్మాణ స్వభావం, అది విపత్తు ప్రాంతానికి లేదా ప్రమాదకర భూభాగానికి ఎంత దూరంలో ఉంది అనే అంశాల ఆధారంగా విధ్వంసానికి లేదా అంతరాయానికి గురయ్యే అవకాశం ఉన్న పరిధిని దుర్బలత్వం అంటారు.

ఉదా: 2001లో గుజరాత్‌ భుజ్‌ భూకంపం వల్ల పట్టణ శివారులో నివసించే వారి కంటే ఇరుకైన రోడ్లు, ఎత్తయిన భవనాల వల్ల పాత నగరానికి చెందినవారే ఎక్కువగా మరణించారు. 

 

* దుర్బలత్వాన్ని రెండు రకాలుగా వర్గీకరించారు.  

 

భౌతిక దుర్బలత్వం: భూకంపాలు, వరదల్లాంటి ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయే వ్యక్తులతోపాటు, వనరులు దీని పరిధిలోకి వస్తాయి. ఇది ఎవరెవరు దెబ్బతిన్నారు, ఏం నాశనమయ్యాయి అనే భావనపై ఆధారపడి నష్టాన్ని తెలియజేస్తుంది.

 

సామాజిక ఆర్థిక దుర్బలత్వం: సముద్ర తీరంలో నివసించే పేదలకు భవనాలు నిర్మించుకోవడానికి అవసరమైన డబ్బులేకపోవడంతో ఎక్కువ నష్టపోతున్నారు. అందువల్ల ప్రజల సామాజిక ఆర్థిక స్థితి కూడా నష్టం తీవ్రతను నిర్ధారిస్తుంది.

 

అపాయం లేదా ముప్పు: యూఎన్‌డీపీ 2004లో ఇచ్చిన నిర్వచనం ప్రకారం వైపరీత్యాలు, దుర్బల పరిస్థితుల మధ్య పరస్పర చర్యల కారణంగా ఆర్థిక కార్యకలాపాల్లో అంతరాయం, పర్యావరణ క్షీణత, మరణాలు, గాయాలు లాంటి ఊహించ‌దగిన నష్టాలు జరిగే సంభావ్యతను అపాయం అంటారు.

  విపత్తు నిర్వహణ అంటేనే మౌలికంగా విపత్తు ముప్పు నిర్వహణ. విపత్తు వల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించాలంటే వైపరీత్యం లేదా దుర్బలత్వం ఎదుర్కొనే అంశాలనైనా తగ్గించాలి. అపాయం స్థాయి కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.

* వైపరీత్యం ప్రభావం

* వైపరీత్య ప్రభావానికి గురయ్యే అంశాల దుర్బలత్వం

* వైపరీత్యాలకు గురయ్యే ఆర్థిక విలువ 

విపత్తులను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండటం, తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయడంలోనే ముప్పు నివారణ సాధ్యమవుతుంది. 

 

సామర్థ్యం: వ్యక్తులు లేదా సమూహం విపత్తులను ఎదుర్కొని నిలబడగలిగే శక్తిని కలిగి ఉండటాన్ని సామర్థ్యం అంటారు.  వైపరీత్యాల వల్ల నష్టపోయిన ఆస్తులు, వనరులు, జీవనోపాధిని పునరుద్ధరించుకోగలిగిన నైపుణ్యాన్నీ సామర్థ్యంగా పేర్కొనవచ్చు. విపత్తుల సమయంలో సర్వం కోల్పోయినప్పుడు అక్కడి ప్రజలు ఉపాధి కోసం తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం లేదా అదే ప్రాంతంలో వేరే వృత్తిపై ఆధారపడి జీవించడాన్ని భౌతిక సామర్థ్యంగా భావించాలి. ధనవంతుడు విపత్తుల నుంచి వెంటనే తేరుకోవడం, దుర్బలత్వానికి దూరంగా ఇల్లు కట్టుకొని ఉండటం అనేది సామాజిక ఆర్థిక సామర్థ్యం కలిగి ఉండటాన్ని తెలియజేస్తుంది. 

 

నిర్వహణ దశలు

విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం విపత్తు నిర్వహణలో ప్రభుత్వం తీసుకునే చర్యలు మొదటి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రెండో స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, మూడో స్థాయిలో జిల్లా కేంద్రాలు చేపట్టాల్సిన సంస్థాగత నిర్మాణం, వాటి విధులు లాంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి. విపత్తు నిర్వహణ నాలుగు దశల్లో జరుగుతుంది. అవి:

ప్రతిస్పందన, ఉపశమనం: ఒక విపత్తు జరిగిన వెంటనే స్పందించి ప్రభుత్వాలు లేదా స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీవోలు), మత సంస్థలు అందించే తక్షణ చర్యలన్నీ ఇందులోకి వస్తాయి. ఫస్ట్‌ ఎయిడ్, ఆహారం, దుస్తులు, మందులు, ఆవాస సహాయక కేంద్రాల్లాంటి తక్షణం అందించే చర్యలు ఈ దశలో జరుగుతాయి. ఇవి విపత్తు జరిగిన వెంటనే అతి తక్కువ కాలంలో జరగాలి.

 

పునరావాసం, పునర్నిర్మాణం: ఉపశమనం అందిన తర్వాత కనీస జీవనోపాధికి అవసరమైన విద్యుత్, కమ్యూనికేషన్లను పునరుద్ధరించడం, రోడ్ల మరమ్మతుల్లాంటి పునరావాస చర్యలు ఈ దశలో జరుగుతాయి. వీటితోపాటు అన్ని రకాల సేవలను పూర్తిగా అందుబాటులోకి తేవడం, శాశ్వత ఇల్లు కట్టి ఇవ్వడం లాంటి పునర్నిర్మాణ చర్యలు కూడా ఇదే సమయంలో జరుగుతాయి. విపత్తు జరిగిన వారం లేదా నెల లోపు తీసుకున్న చర్యలు పునరావాస చర్యలుగానూ,  ఏడాది వరకు తీసుకున్న చర్యలను పునర్నిర్మాణ చర్యలుగా చెప్పొచ్చు.

 

తీవ్రతను తగ్గించడం: విపత్తులను తట్టుకునే భవనాలు నిర్మించడం, వరదలను ఆపడానికి దూరంగా గట్లు వేయడం లాంటి నిర్మాణాత్మక చర్యలు; విపత్తులపై అవగాహన కల్పించడం, హజార్డ్‌ మ్యాపింగ్‌ ఉంచడం, తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండటం లాంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టడాన్ని తీవ్రతను తగ్గించే చర్యలుగా భావించాలి. ఇవి ఏడాది కంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి.

 

సంసిద్ధత: వైపరీత్యాలున్న ప్రదేశాల్లో ముందుగా విపత్తు నష్టాన్ని అంచనా వేసి ప్రణాళికలు తయారు చేసుకోవడం, అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం, జనాన్ని తరలించడం లాంటి సన్నాహాలను సంఘటితం చేసి పునరావృత విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటాన్ని సంసిద్ధత అంటారు. ఇది ఒక విపత్తుకు, మరొక విపత్తుకు మధ్య సమయం మీద ఆధారపడి ఉంటుంది. 

 

విపత్తు నిర్వహణ వలయం 

విపత్తు నష్ట నివారణ అనేది అన్నిరకాల చర్యలు, కార్యకలాపాల సమాహారం. విపత్తు నిర్వహణ వలయాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు.

1. విపత్తు ముందస్తు చర్యలు: ఇవి విపత్కర వైపరీత్యాల వల్ల జరగబోయే ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను తెలియజేస్తాయి. ఇవి విపత్తు దశల్లోని తీవ్రతను తగ్గించడం, సంసిద్ధత అనే రెండు అంశాలతో ముడిపడి ఉంటాయి.

2. విపత్తు జరుగుతున్నప్పుడు చర్యలు: విపత్తు జరుగుతున్నప్పుడు దాని తీవ్రతని తగ్గించడానికి బాధితులకు అత్యవసరంగా అందించాల్సిన అవసరాలుంటాయి. ఇవి విపత్తు జరుగుతున్నప్పుడు అందించే ప్రతిస్పందన, ఉపశమనం అనే అంశాలకు చెందినవై ఉంటాయి. వీటిని ప్రభుత్వం, మతసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు లాంటివి అందిస్తుంటాయి.

3. విపత్తు తర్వాత చర్యలు: విపత్తు జరిగిపోయిన తర్వాత అక్కడి సమూహం తొందరగా కోలుకోవడానికి తీసుకున్న కార్యకలాపాలన్నీ విపత్తు తర్వాత చర్యలుగా భావించాలి. ఇవి పునరావాసం, పునర్నిర్మాణంపై ఆధారపడిన చర్యలు.

 

ఒక విపత్తు జరిగిన తర్వాత విపత్తు నిర్వహణా దశలు ఒకదాని తరువాత మరొకటి పైవిధంగా కొనసాగుతాయి.

 

 

రచయిత: జల్లు సద్గుణ రావు

Posted Date : 27-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌