• facebook
  • whatsapp
  • telegram

జలవనరులు

సమస్త జీవులకు సర్వాధారం!


ప్రకృతి వనరుల్లో ప్రధానమైంది, ప్రాణికోటి జీవనానికి అత్యంత అవసరమైంది జలం. జీవుల ఆవిర్భావం నుంచి నాగరికతా వికాసం వరకు అన్నింటికీ నీరే ప్రధానం. దేశంలో వ్యవసాయ ప్రగతి, నగరీకరణ విస్తరణ అంతా ఆ వనరుపైనే ఆధారపడి సాగుతోంది. అందుకే అతి విలువైన నీటి లభ్యత, వినియోగం, నిర్వహణ తీరుతెన్నులను పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.


 

విశ్వంలో ఇప్పటివరకు గుర్తించిన నీరున్న గ్రహం భూమి మాత్రమే. మొత్తం భూవైశాల్యం 510 మిలియన్ల చ.కి.మీ. ఉంటే అందులో సుమారు 361 మిలియన్ల చ.కి.మీ (70.7%) జలం ఆవరించి ఉంది. భూమిపై పర్యావరణ సమతౌల్యానికి ప్రధాన కారణం నీరే. ఒక జాతి ఆర్థికాభివృద్ధి, సామాజిక, సాంఘిక, రాజకీయ స్థితిగతులు అక్కడి నీటివనరులతో ముడిపడి ఉంటాయి. భూమి మీద ఉన్న జలావరణంలో అత్యధిక జలం (97.25%) మహా సముద్రాల్లో ఉప్పునీటి రూపంలో ఉంది. మిగిలిన మంచినీరులో మంచు, హిమానీనదాల రూపంలో 2.05%, భూగర్భ జలంగా 0.68%, సరస్సుల్లో 0.01%, నదుల్లో ప్రవాహ నీరుగా 0.0001% మేర విస్తరించి ఉంది. ప్రపంచంలో బ్రెజిల్, రష్యా, చైనా, కెనడా, ఇండొనేసియా, అమెరికా, భారత్, కొలంబియా, కాంగో లాంటి దేశాల్లో 60% నీటి లభ్యత ఉండగా, మిగిలిన దేశాలన్నింటిలో 40% నీటి లభ్యత ఉంది.


యునెస్కో విడుదల చేసిన ‘యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌’ నివేదిక 2022 ప్రకారం ప్రపంచంలోని పట్టణ ప్రజల్లో 50% మంది భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 69% వ్యవసాయం భూగర్భ జలాలపైనే సాగుతోంది. 22% గృహావసరాల కోసం భూగర్భ జలాలనే వినియోగిస్తున్నారు. 9% పారిశ్రామిక రంగ అవసరాలకు భూగర్భ జలాలు ఉపయోగపడుతున్నాయి.

 

భారత్‌లో లభ్యత

నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ (NCIWRD) ప్రకారం.. 329 మిలియన్ల హెక్టార్లున్న దేశ భూభాగంపై సాలీనా జలచక్రం ద్వారా 4 వేల బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (బీసీఎం) నీరు లభిస్తోంది. ఇందులో 40% (1600 బీసీఎం) ఆవిరైపోగా, 9% (360 బీసీఎం) నేలలో తేమ రూపంలో, 10% (400 బీసీఎం) భూగర్భజలంగా ఉంటుంది. మిగిలిన 41% (1640 బీసీఎం) నదులు, చెరువులు, సరస్సుల్లో ఉపరితల జలంగా నిల్వ ఉంటుంది.

* దేశంలో ఉపరితల, భూగర్భ జలాలుగా ఉన్న మొత్తం 2040 బీసీఎం నీరు.. దేశ వ్యవసాయ, గృహ, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతోంది.

ప్రపంచ జనాభాలో భారత్‌లో 17.5% ఉంది. అలాగే ప్రపంచ పశు జనాభాలో 15% ఇక్కడ ఉంది. కానీ ప్రపంచ నీటి లభ్యతలో భారత్‌ వాటా 4% మాత్రమే. జలవనరులు దేశమంతటా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా అందుబాటులో లేవు. భూగర్భజలాల పరంగా చూస్తే అవక్షేప శిలలతో, నిక్షేపణ పదార్థాలతో నిండిన ఉత్తర మైదానంలోని గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ నీరు లభ్యమవుతోంది. దీనికి భిన్నంగా ద్వీపకల్ప పీఠభూమి కఠిన శిలలతో ఉండటంతో నీటి లభ్యత తక్కువ ఉంటుంది.


ఆసియాలోనే అత్యధిక వ్యవసాయ భూమి ఉన్న దేశం భారతదేశమే. ఇక్కడి నీటిలో 93.37% వ్యవసాయానికి, 3.73% గృహావసరాలకు వినియోగమవుతోంది. పరివాహక ప్రాంతాల్లో నీటి ఉపరితల లభ్యత ఆధారంగా చూస్తే అయిదు అతి పెద్ద నదుల్లోనే 60% నీరు చేరుతోంది. మిగిలిన 250 నదుల్లో 40% ఉపరితల జలాలు అందుబాటులో ఉన్నాయి.


దేశంలో నైరుతి రుతుపవన కాలంలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు తక్కువ కాలంలోనే 75% వర్షం కురుస్తుంది. దీంతో అధికభాగం నీరు  వరదల రూపంలో నదుల ద్వారా సముద్రాల్లో కలిసిపోతుంది.


నిర్వహణ చర్యలు

జాతీయ జలవిధానం: నీటి సంరక్షణ, సక్రమ పంపిణీ, క్రమబద్ధీకరణ లాంటి ఆశయాలతో మొదటి జాతీయ జల విధానాన్ని 1987లో తీసుకొచ్చారు. దీని తర్వాత 2002, 2012తో కలిపి ఇప్పటివరకూ మూడు జాతీయ జల విధానాలు వచ్చాయి.


అమృత్‌ పథకం: 500 నగరాల్లో గృహ వినియోగానికి నీరు అందించే ఈ పథకాన్ని కేంద్రం నిర్వహిస్తోంది.


జలక్రాంతి అభియాన్‌: జలవనరుల నిర్వహణ, సంరక్షణ దృష్ట్యా నీటి సరఫరాను మరింత సమర్థంగా అమలుచేసేందుకు 2015 - 16లో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు.


జల్‌ జీవన్‌ మిషన్‌: ప్రతి గ్రామంలో ఇంటింటికీ కొళాయి ద్వారా నీరు అందించే కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక ఇది. రూ.3.60 లక్షల కోట్లతో ఈ పథకాన్ని అమలుచేస్తోంది.


వేగవంతమైన నీటిపారుదల ప్రయోజన పథకం (ఏఐబీపీ): కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఇప్పటివరకు అనుమతించిన ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయాలనే లక్ష్యంతో 1996 - 97లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.


ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం: సమగ్ర వరద  నిర్వహణ కోసం 11వ ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.


నమామి గంగే కార్యక్రమం: గంగా నది కాలుష్యాన్ని 2020 నాటికి పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన కార్యక్రమం.


ప్రధానమంత్రి కృషి సించాయి యోజన: పంట పొలాలకు నీటి లభ్యతను పెంచి దేశంలో సాగునీటి సదుపాయం ద్వారా సాగు విస్తీర్ణం పెంచాలన్న లక్ష్యంతో 2015 - 16లో హర్‌ ఖేత్‌ కో పానీ (ప్రతి పొలానికి నీరు) నినాదంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.


కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్, వాటర్‌  మేనేజ్‌మెంట్‌: నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా వ్యవసాయ దిగుబడిని పెంచి రైతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్రం 1974 - 75లో దీన్ని అమలు చేసింది. 2015-16 నుంచి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకంలో భాగంగా అమలు చేస్తున్నారు.


అంతరాష్ట్రీయ నదీ జలాల చట్టం: రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకంలో వివాదాల పరిష్కారానికి 1956లో ఈ చట్టం తీసుకొచ్చారు.


నదుల అనుసంధానం: ఉత్తర భారతదేశంలో వరదల నియంత్రణ, దక్షిణ భారతదేశంలో కరవు నివారణ కోసం ఉత్తర భారతంలోని 16 నదులను, దక్షిణ భాగంలో 14 నదులను కాల్వల ద్వారా అనుసంధానించాలని 2002లో కేంద్రం నిర్ణయించింది. 

 

 

మాదిరి ప్రశ్నలు


1. గంగానదీ జల కాలుష్య నిర్మూలన కోసం భారత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమం ఏది?

1) నమస్తే గంగా     2) నమామి గంగే     3) పవిత్ర గంగ     4) మిషన్‌ గంగ


2. నీటి సంరక్షణ, సక్రమ పంపిణీ కోసం మొదటి జాతీయ జల విధానాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

1) 1987     2) 1978      3) 1952      4) 1990


3. జలకాలుష్య నివారణ, నియంత్రణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

1) 1980      2) 1974      3) 1950     4) 1998


4. జల వనరులను అభిలషణీయ స్థాయిలో వినియోగించుకోవడానికి నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1982      2) 1999    3) 1965       4) 1986


5. ప్రపంచ నీటిలభ్యతలో భారతదేశ వాటా ఎంత?

1) 10%      2) 20%     3) 4%     4) 15%


6. మన దేశంలో ఏ నదీ పరివాహక ప్రాంతంలో వార్షిక నీటిలభ్యత అధికంగా ఉంది?

1) గంగా      2) గోదావరి     3) సింధూ     4) బ్రహ్మపుత్ర 


7. ఏ నది నీరు సముద్రంలో అత్యధికంగా కలిసిపోతుంది?

1) బ్రహ్మపుత్ర     2) గంగ    3) మహానది, గోదావరి     4) నర్మద, తపతి 


8. దేశంలో ప్రతి గ్రామీణ గృహానికి కొళాయి ద్వారా నీరు అందించే కార్యక్రమం పేరేంటి?

1) అమృత్‌ పథకం     2) జల్‌ జీవన్‌ మిషన్‌    3) జలక్రాంతి అభియాన్‌    4) అమృత్‌ జల క్రాంతి


9. భారతదేశ భూ విస్తీర్ణం 329 మి.హెక్టార్లలో జలచక్రం ద్వారా లభిస్తున్న నీరు ఎంత?

1) 1000 బి.సి.ఎం.    2) 4000 బి.సి.ఎం.   3) 3000 బి.సి.ఎం.   4) 400 బి.సి.ఎం.


10. భారతదేశంలో లభిస్తున్న అన్ని జలవనరుల్లో వ్యవసాయ రంగానికి వినియోగిస్తున్న నీటి శాతం ఎంత?

1) 90%     2) 93%    3) 50%      4) 60%

 

సమాధానాలు: 1-2, 2-1, 3-2, 4-1, 5-3, 6-4, 7-1, 8-2, 9-2, 10-2.

రచయిత: జల్లు సద్గుణరావు


 

 

 

 

Posted Date : 17-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌