• facebook
  • whatsapp
  • telegram

మహిళా విధానాలు - పథకాలు

ఆమెకు అండ‌గా.. ప‌థ‌కాలు ఉండ‌గా!

  ఆడవారికి గౌరవం లభించిన చోట దేవతలు సంచరిస్తారు. సమస్త శుభాలను కలిగిస్తారంటూ ప్రాచీన కాలంలోనే మన సంస్కృతిలో మహిళలకు సమున్నత స్థానాన్ని ప్రకటించారు. సహస్రాబ్దుల కాలం కరిగిపోయినా ఇప్పటికీ వారికి సమానత్వం మాత్రం అందలేదు. అంతటా వివక్ష కొనసాగుతోంది. అకృత్యాలు, దాడులు, హింసలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మహిళల రక్షణ, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు చేశాయి. రకరకాల చట్టాలను, పథకాలను అమలు చేస్తున్నాయి. సామాజిక హక్కులలో భాగంగా పరీక్షల కోణంలో అభ్యర్థులు వాటిపై అవగాహన పెంచుకోవాలి. 

 

  భారతీయ సమాజంలో తొలివేద కాలంలో తప్ప మరే ఇతర కాలాల్లోనూ పురుషులతో పాటు మహిళలు సమాన అవకాశాలు పొందలేదు. ప్రస్తుతం లింగ అసమానతలను తొలగిస్తూ కొన్ని విధానాలు, చట్టాలు, పథకాలను రూపొందించారు. 

 

జాతీయ మహిళా సాధికారత విధానం

మహిళాభివృద్ధి, సాధికారత లక్ష్యంగా దీన్ని 2001లో రూపొందించారు. 

లక్ష్యాలు:

* సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగంలో పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు, ప్రాథమిక స్వాతంత్య్రాన్ని కల్పించడం.

* మహిళల సంపూర్ణాభివృద్ధికి సామాజిక, ఆర్థిక విధానాల ద్వారా సానుకూల వాతావరణాన్ని సృష్టించడం.

* మహిళలపై అన్నిరకాల వివక్షలను తొలగించేందుకు న్యాయవ్యవస్థను బలోపేతం చేయడం.

* ఆర్థిక, రాజకీయ, సామాజిక జీవనంలో మహిళా భాగస్వామ్యం, నిర్ణయాధికారం పొందే విధంగా చేయడం.

* అభివృద్ధి ప్రక్రియలో లింగ దృక్పథాన్ని తీసుకురావడం.

* పౌరసమాజంలో మహిళా సంస్థలను ఏర్పాటుచేసి వాటిని బలోపేతం చేయడం.

* మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసను నిర్మూలించడం.

* స్త్రీ, పురుషుల క్రియాశీలక భాగస్వామ్యం, వారి చొరవ పెరిగే విధంగా సామాజిక దృక్పథాలు, సాముదాయక విధానాలను మార్చడం.

* ఆరోగ్య రక్షణ, నాణ్యమైన విద్య, వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగిత, సమాన వేతనాలు, సాంఘిక భద్రతలో మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం.

 

జాతీయ మహిళా సాధికారత మిషన్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దీన్ని 2010, మార్చి 8న ప్రారంభించారు. జాతీయ మహిళా సాధికారత మిషన్‌కు మరోపేరు మిషన్‌ పూర్ణ శక్తి. దీనికి అనుబంధంగా రాష్ట్ర స్థాయుల్లో స్టేట్‌ మిషన్‌ అథారిటీ, రాష్ట్ర మహిళా వనరుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ మంత్రిత్వ శాఖల్లో మహిళా, శిశు అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

లక్ష్యాలు:

* మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడం.

* వారిపై జరిగే దాడులను నిషేధించడం.

* ఆరోగ్యం, విద్యా సదుపాయాలు కల్పించడం.

* మహిళా శిశు అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలపై జిల్లా, మండల స్థాయుల్లో అవగాహన, ప్రచారం కల్పించడం.

* సామాజిక సాధికారత కోసం కృషి చేయడం

 

మహిళల కోసం జాతీయ విధానం - 2016 ముసాయిదా

2001లో వచ్చిన మహిళా జాతీయ విధానాన్ని సవరించి, 2016లో మరో ముసాయిదా విధానాన్ని రూపొందించారు. 

లక్ష్యాలు:

* మహిళల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ హక్కులు పరిరక్షించడం.

* లింగ సమానత్వాన్ని అన్ని రంగాల్లో సాధించడం.

* ఆర్థిక అంశాల్లో మహిళలు పాల్గొనేలా చేయడం.

* అన్నిరకాల హింసల నుంచి కాపాడటం.

* లైంగిక వేధింపుల నుంచి రక్షించడం.

* అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడం.

* సార్వజనీన మహిళా విద్యను ప్రోత్సహించడం.

* మహిళలకు సంబంధించి అంతర్జాతీయంగా సాధికారతను కల్పించే విధంగా కృషి చేయడం.

* వారికి సంబంధించిన సమాచారాన్ని పర్యవేక్షించడం, మూల్యాంకనం చేయడం, ఆడిట్‌ చేయడం.

 

జాతీయ మహిళా కమిషన్‌ 

రాజ్యాంగం, చట్టపరంగా మహిళలకు కల్పించిన రక్షణలను పర్యవేక్షించడానికి 1992లో జాతీయ మహిళా కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. దీనికి సంబంధించిన చట్టాన్ని 1990లో రూపొందించారు.

నిర్మాణం: జాతీయ మహిళా కమిషన్‌లో ఛైర్‌పర్సన్, మెంబర్‌ సెక్రటరీ, అయిదుగురు సభ్యులు ఉంటారు. వీరిలో కనీసం ఒకరు షెడ్యూల్డ్‌ కులాలు, ఒకరు షెడ్యూల్డ్‌ తెగలకు చెందినవారై ఉండాలి. వీరి పదవీకాలం మూడేళ్లు. ఈ కమిషన్‌ మొదటి అధ్యక్షురాలు జయంతీ పట్నాయక్‌. ప్రస్తుత అధ్యక్షురాలు రేఖాశర్మ. ఈమె వరుసగా రెండోసారి నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డిని నియమించారు.

విధులు: * రాజ్యాంగ, చట్టపరంగా మహిళలకు కల్పించిన రక్షణలను పరిశీలించడం.

* మహిళల కోసం అమలవుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం.

* మహిళాభివృద్ధికి అవసరమైన సూచనలు చేయడం.

* అమల్లో ఉన్న రాజ్యాంగ, చట్టపర అంశాలను పరిశీలించి లోపాలు ఉంటే సవరించడానికి సూచనలు చేయడం.

* మహిళా హక్కులకు భంగం కలిగినప్పుడు సంబంధిత సంస్థల దృష్టికి తీసుకెళ్లడం.

 

వివిధ పథకాలు

లింగ అసమానత్వం తొలగించే దిశగా మహిళాభివృద్ధి, సాధికారత కోసం కొన్ని పథకాలను ప్రారంభించారు. 

 

జననీ సురక్షా యోజన: నిరుపేద గర్భిణులు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవం చేయించుకునే విధంగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2005, ఏప్రిల్‌ 12న జననీ సురక్షా యోజన పథకాన్ని ప్రారంభించింది. గతంలో ఈ పథకాన్ని జాతీయ మెటర్నిటీ బెనిఫిట్‌ స్కీమ్‌ (1995)గా పిలిచేవారు. దీని ద్వారా శిశు, మాతృ మరణాలు తగ్గించడం లక్ష్యం.

 

రాజీవ్‌ గాంధీ కౌమార బాలికల సాధికారత పథకం: ఈ పథకానికి మరో పేరు సబల. దీన్ని 2011, ఏప్రిల్‌ 1న ప్రారంభించారు. 11 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలకు పౌష్ఠికాహారం, ఆరోగ్య స్థాయి, గృహ, జీవన నైపుణ్యాలు మెరుగుపరచడం దీని లక్ష్యాలు. సమీకృత బాలల అభివృద్ధి పథకంలో భాగంగా అమలుచేస్తున్నారు. 2002లో ‘కౌమార బాలికల పోషకాహార పథకం’ అమల్లో ఉండేది. పోషకాహార లోపంతో బాధపడే కౌమార బాలికల కోసం ప్రభుత్వం నెలకు ఆరు కిలోల ఆహార పదార్థాలను అందించేది.

 

బేటి బచావో - బేటి పఢావో: హరియాణాలోని పానిపట్‌లో కేంద్ర ప్రభుత్వం 2015, జనవరి 22న ఈ పథకాన్ని ప్రారంభించింది. లింగ వివక్షను నిర్మూలించడం, బాలికల లింగ నిష్పత్తి పెంచడం దీని లక్ష్యం. మొదట్లో ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ వ్యవహరించారు. ఇప్పుడు సాక్షి మాలిక్‌ ప్రచారకర్తగా ఉన్నారు. భారతదేశంలో బాలికల లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రం హరియాణా. ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ.

 

సెల్ఫీ విత్‌ డాటర్‌: ఆడశిశువుల భ్రూణ హత్యలు తగ్గించడం, లింగ వివక్షను నిర్మూలించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే లక్ష్యంతో సెల్ఫీ విత్‌ డాటర్‌ అనే ఒక సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించారు. 2015 జూన్‌లో హరియాణాలోని జింద్‌ జిల్లా బిడిపుర్‌ గ్రామ మాజీ సర్పంచ్‌ సునీల్‌ జగ్లాన్‌ దీన్ని ప్రారంభించారు. ఇదే కార్యక్రమాన్ని 2017, జూన్‌ 9న రాష్ట్రపతి అధికారికంగా ప్రారంభించారు.

 

ఉజ్వల పథకం: అక్రమ రవాణాను అరికట్టడం, లైంగిక దోపిడీకి గురైన మహిళలు, వ్యభిచార వృత్తిలో ఉన్నవారిని రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2007లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం 5 ళి సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుంది.

1) రెస్క్యూ (రక్షించడం): అక్రమ రవాణాకు గురైనవారిని రక్షిస్తుంది. 

2) రిడక్షన్‌ (ప్రివెన్షన్‌ - నివారణ): అక్రమ రవాణాను నివారించడం.

3) రిహాబిలిటేషన్‌ (పునరావాసం): అక్రమ రవాణాకు గురైనవారికి పునరావాసం కల్పించడం.

4) రీ-ఇంటిగ్రేషన్‌ (పునరేకీకరణ): కుటుంబం నుంచి దూరమైనవారిని తిరిగి కుటుంబంలో కలిసేలా చేయడం.

5) రిపాట్రియేషన్‌ (స్వదేశానికి తిరిగి పంపడం): విదేశాలకు అక్రమంగా రవాణా అయినవారిని తిరిగి స్వదేశానికి పంపడం లాంటి చర్యల ద్వారా ఈ పథకం నడుస్తుంది.

లక్ష్యాలు:

* అక్రమ రవాణాను నిరోధించడం. 

* వ్యభిచారులు, అక్రమ రవాణా బాధితులకు పునరావాస కల్పన. 

* అంతరాష్ట్ర, అంతర్జాతీయ మానవ అక్రమ రవాణాను నిరోధించి, బాధితులకు చట్టం ద్వారా సహాయం అందించడం. 

 

కల్యాణ లక్ష్మి - షాదీ ముబారక్‌ పథకాలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతులకు వివాహ సమయంలో వారి తల్లిదండ్రులకు నగదు సహాయం అందించడం కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను తెలంగాణ ప్రభుత్వం 2014 అక్టోబరు 2న ప్రారంభించింది. పథకం ప్రారంభమైన కొత్తలో రూ.51,000 ఇచ్చేవారు. దాన్ని తర్వాత రూ.75,116కు పెంచారు. ప్రస్తుతం రూ.1,00,116 ఇస్తున్నారు. 18 ఏళ్లు నిండిన యువతులు దీనికి అర్హులు. ఈ పథకానికి ఆదాయ పరిమితి పట్టణ ప్రాంతాల్లో సంవత్సరానికి రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.3 లక్షలు.

ప్రయోజనాలు: * ఆడపిల్లల తల్లిదండ్రులకు వివాహ సమయంలో నగదు సహాయం అందుతుంది.* మాతా, శిశు మరణాలు తగ్గుతాయి. * బాల్య వివాహాలు తగ్గుతాయి.* లింగ వివక్ష తగ్గుతుంది.

 

షాదీ షగున్‌ పథకం: ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దీన్ని 2017 ఆగస్టులో ప్రారంభించారు. ఇది 21 ఏళ్లు నిండిన పేద ముస్ల్లిం గ్రాడ్యుయేట్‌ (పట్టభద్రులైన) యువతులకు ఉద్దేశించిన పథకం. వీరికి వివాహ సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ.51,000 అందజేస్తుంది. ఇది ముస్లిం బాలికల్లో పై చదువులను ప్రోత్సహించి తల్లిదండ్రులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకం. మౌలానా ఆజాద్‌ విద్యాసంస్థ ఇచ్చే ఉపకారవేతనం పొందిన వారికే ఈ పథకం వర్తిస్తుంది.

 

అమ్మఒడి: తెలంగాణ ప్రభుత్వం గర్భిణుల కోసం 2017లో ఈ పథకాన్ని ప్రారంభించింది. గర్భిణులను వైద్య పరీక్షల కోసం ఆసత్రులకు తీసుకెళ్లడం, ప్రసవం తర్వాత క్షేమంగా ఇంటికి చేర్చడం దీని ముఖ్య ఉద్దేశం. దీనికోసం ప్రభుత్వ వాహనం అందుబాటులో ఉంటుంది. 102కి ఫోన్‌ చేయడం ద్వారా ఈ వాహన సదుపాయాన్ని పొందవచ్చు. దీని ద్వారా మాతా, శిశు మరణాలు తగ్గించాలనేది లక్ష్యం.

 

కేసీఆర్‌ కిట్స్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం 2017లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆడపిల్ల పుడితే రూ.13,000, మగపిల్లవాడు పుడితే రూ.12,000ను ఈ పథకం ద్వారా అందజేస్తారు.

ప్రయోజనాలు: * సంస్థాగత ప్రసవాలు పెరుగుతాయి. 

* రోగ నిరోధక సేవలు పెరుగుతాయి.

* ప్రసూతి మరణాల రేటు తగ్గుతుంది.

* వేతన నష్టం భర్తీ అవుతుంది.

 

సఖీ కేంద్రాలు: వీటిని వన్‌ స్టాప్‌ సెంటర్‌లు అని పిలుస్తారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. నిర్భయ ఘటన తర్వాత ఉషామెహ్రా కమిటీ మహిళల భద్రత కోసం కొన్ని సూచనలు చేసింది. అవి 181 (24 గంటలు టోల్‌ ఫ్రీ నంబరు) ప్రారంభం, నిర్భయ నిధి ఏర్పాటు, వన్‌ స్టాప్‌ సెంటర్‌లు. తెలంగాణలో వీటిని సఖీ కేంద్రాల పేరుతో ప్రారంభించారు.

 

రచయిత: మేజర్‌ శ్రీనివాస్‌

Posted Date : 08-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌