• facebook
  • whatsapp
  • telegram

వికోషీకరణం 

శిథిలమవుతూ.. చదనుచేస్తూ!
ఎవరో శ్రద్ధగా సర్దిపెట్టినట్లు ఉంటాయి కొన్ని శిలలు. పనిగట్టుకొని చదును చేసినట్లు ఏర్పడతాయి ఇంకొన్ని నేలలు. యంత్రంతో చిత్రిక పట్టినట్లు గుండ్రంగా తయారవుతాయి ఎన్నో రాళ్లు. వీచే గాలి, కరిగే మంచు, ప్రవహించే నీరు వీటికి కారణాలంటే విచిత్రంగా అనిపిస్తుంది. పైనుంచి చేతులతో నెట్టినట్లు సముద్రాల్లో నీటిమట్టం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ఆ నిర్వాకం సూర్యచంద్రులదే అంటే నమ్మాల్సిందే. ఈ ఆసక్తికరమైన అంశాలను జాగ్రఫీ అధ్యయనంలో భాగంగా తెలుసుకుంటే పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది.

భూస్వరూపాల నిర్మాణం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. దీనిపై బాహ్య బలాలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. అంతర బలాలు     

(Endogenetic forces) భూభాగాన్ని ఉత్థానపరిస్తే (upliftz), బాహ్య బలాలు ఈ ఉత్థాన భాగాలను శైథిల్యం, క్రమక్షయం అనే ప్రక్రియల ద్వారా సమం చేస్తాయి. ఇలా శిలలను శిథిలం చేయడం, భూఉపరితలాన్ని సమం (చదును) చేసే ప్రక్రియను వికోషీకరణం (Denudation) అంటారు. శిలాశైథిల్యం, క్రమక్షయం అనే రెండు రకాలుగా వికోషీకరణం కనిపిస్తుంది. 

శిలాశైథిల్యం 
భూ పటలంలోని శిలలు వాతావరణంలోని భౌతిక, రసాయన కారణాల వల్ల కృశించి శిథిలమవటాన్ని శిలాశైథిల్యం అంటారు. ఇది శబ్దరహితంగా, గమనరహితంగా, వేగరహితంగా జరిగే నిరంతర ప్రక్రియ. ఇది శిలల కాఠిన్యంపైన, వాటి భౌతిక, రసాయనిక సంఘటనలపైన ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల శిలాపదార్థాల రవాణా జరగదు.

ప్రభావితం చేసే అంశాలు: శిలాశైథిల్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో శిలా స్వభావం (Nature of rock), శీతోష్ణస్థితి (Climate), కాలం (time) ముఖ్యమైనవి.

* శిలాశైథిల్యాన్ని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 

ఎ) భౌతిక లేదా యాంత్రిక శిలాశైథిల్యం: శిలల రసాయనిక సంఘటనంలో ఎలాంటి మార్పు లేకుండా కేవలం శిలలు భౌతికంగా శిథిలం కావడాన్ని భౌతిక శిలాశైథిల్యం అంటారు. దీనికి ఉష్ణోగ్రతల్లో మార్పులు, మంచు, జంతు వృక్షాల వల్ల కలిగే ఒత్తిడి కారణాలు. ఉష్ణోగ్రత తారతమ్యాల వల్ల జరిగే భౌతిక శిలాశైథిల్యం ఎక్కువగా భూమధ్యరేఖా ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో జరుగుతుంది. ఉన్నత అక్షాంశ ప్రాంతాల్లో మంచు వల్ల శిలాశైథిల్యం సంభవిస్తుంది.

బి) రసాయనిక శిలాశైథిల్యం: శిలల రసాయనిక సంఘటనంలో మార్పులు రావడం వల్ల జరిగే శైథిల్యాన్ని రసాయనిక శిలాశైథిల్యం అని పిలుస్తారు. ఇది ఎక్కువగా అధిక వర్షపాతం, సున్నపురాయి ఉండే భౌగోళిక ప్రాంతాల్లో జరుగుతుంది. భూమధ్యరేఖా ప్రాంతాల్లోనూ ఎక్కువగా ఉంటుంది.

క్రమక్షయం
శిలాశైథిల్యం వల్ల శిలల పైభాగంలో ఏర్పడిన శైథిల్య పదార్థాన్ని (Regolith) పవనాలు, నదులు, హిమానీనదాలు ఒక ప్రదేశం నుంచి మరో  ప్రదేశానికి రవాణా చేస్తాయి. ఈ రవాణా జరిగేటప్పుడు శిలా పదార్థం మరింత ఎక్కువ శైథిల్యం అవుతుంది. దీన్నే క్రమక్షయం అంటారు.

శైథిల్యానికి, క్రమక్షయానికి ముఖ్యమైన తేడా: శైథిల్యం స్థానికంగా జరిగే చర్య, క్రమక్షయం గతిశీతల ప్రక్రియ. ఈ రెండింటినీ కలిపి వికోషీకరణం అంటారు.

అపదళనం: శిలలపై పొరలు లోపలి భాగం కంటే వేడెక్కి పొరలు పొరలుగా ఊడిపోయి గుండ్రని రాళ్లుగా మారితే అలాంటి శిలాశైథిల్యాన్ని అపదళనం (Exfoliation) అంటారు. అపదళనం వల్ల గుండ్రంగా మారిన శిలలను టార్స్‌ (Tors) అంటారు. ఇది అధికంగా గ్రానైట్‌ శిలలో జరుగుతుంది. ఇవి ఎక్కువగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో కనిపిస్తాయి.

* ఉష్ణోగ్రత అధికంగా ఉండే శుష్క శీతోష్ణస్థితి, ఎడారి ప్రాంతాల్లో భౌతిక శిలాశైథిల్యం ఎక్కువగా జరుగుతుంది. వర్షపాతం, ఆర్ద్రత అధికంగా ఉన్న ఆర్ద్ర శీతోష్ణస్థితి ప్రాంతంలో రసాయనిక శిలాశైథిల్యం అధికంగా కనిపిస్తుంది. ధ్రువ ప్రాంతాలు, అధిక అక్షాంశ ప్రాంతాల్లో మంచు వల్ల జరిగే భౌతిక శైథిల్యం ఏర్పడుతుంది.

రిగోలిత్‌: శిలలు శైథిల్యం చెందినప్పుడు శైథిల్యం చెందిన పదార్థం శిలల ఉపరితలంపై ఒక మెత్తని మృదువైన పొరగా ఏర్పడుతుంది. దీన్నే రిగోలిత్‌ అంటారు.

ఆధార శిల: రిగోలిత్‌ కింద ఉండే శైథిల్యానికి గురికాని దృఢమైన శిలనే ఆధార శిల (Bedrock) అంటారు.

పోటుపాట్లు
సముద్ర నీటి మట్టం పెరగడాన్ని పోటు, తగ్గడాన్ని పాటు అంటారు. వీటినే ఆటుపోట్లు అని కూడా వ్యవహరిస్తారు. ఇవి రావడానికి కారణం సూర్యచంద్రుల గురుత్వాకర్షణ బలాలు. పోటుకు, పాటుకు మధ్య కాలవ్యవధి 6 గంటల 13 నిమిషాలు ఉంటుంది. పోటుకు, పోటుకు అలాగే పాటుకు, పాటుకు మధ్య 12 గంటల 26 నిమిషాల వ్యవధి ఉంటుంది. పోటుకు, పాటుకు మధ్య పెరిగి తగ్గిన నీటి వ్యత్యాసాన్ని వేల పరిమితి అంటారు. ఈ సమయంలో వచ్చే తరంగాలను వేలా తరంగాలు అంటారు. ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి. 

పర్వవేలా తరంగాలు: అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సూర్యచంద్రులు భూమికి సరళ రేఖలో 180 డిగ్రీల కోణంలో ఉండటంతో పోటు-పాటులు ఎక్కువై ఏర్పడే తరంగాలు.

లఘువేలా తరంగాలు: అష్టమి రోజులలో సూర్యచంద్రులు భూమికి లంబ దిశలో (90 డిగ్రీల కోణంలో) ఉంటారు. ఈ రోజుల్లో పోటు, పాటు రెండూ తక్కువవుతాయి. అపుపడు వేలా పరిమితి బాగా తక్కువగా ఉంటుంది.

విషవత్తు వేలా తరంగాలు: మార్చి 21, సెప్టెంబరు 23 ఈ రెండు రోజుల్లో వచ్చే తరంగాలు విషవత్తులు.

అయనాంత తరంగాలు: జూన్‌ 21, డిసెంబరు 22 తేదీలను అయనాలు అంటారు. ఈ రెండు రోజుల్లో వచ్చేవి అయనాంత తరంగాలు.

లాభాలు: 
* పోటు ఉన్న సమయంలో జాలర్లు సముద్రం నుంచి బయటకు వస్తారు. పాటు ఉన్న సమయంలో తిరిగి సముద్రంలోకి వెళతారు.
*సముద్రాల్లో కలిసేటప్పుడు నదులు తీసుకొచ్చిన నిక్షేపాలు ఖండ తీరపు అంచుల్లో పేరుకుపోకుండా తీరపు వాలులోకి తీసుకెళ్లి తీరాన్ని శుభ్రం చేస్తాయి.
* పోటు, పాటులపైన ఆధారపడిన ఓడరేవులో ఇవి బాగా సహకరిస్తాయి.

మాదిరి ప్రశ్నలు
1. వికోషీకరణం అంటే?
1) శిలలను శిథిలం చేయడం, భూ ఉపరితలాన్ని సమం చేసే ప్రక్రియ   2) శిలలను, భూఉపరితలాన్ని క్రమబద్ధీకరించడం
3) భూ ఉపరితలాన్ని సమం చేయడం 4) ఏదీకాదు

2. శిలా శైథిల్యాన్ని ప్రభావితం చేసే కారకాల్లో లేనిది?
1) శీతోష్ణస్థితి 2) శిలాస్వభావం 3) కాలం 4) యాంత్రికత

3. టూర్స్‌ అంటే ఏమిటి?
1) గుండ్రంగా మారిన శిలలు  2) అపదళనం వల్ల గుండ్రంగా మారిన శిలలు
3) శైథిల్యం చెందిన శిలలు    4) అపదళనం వల్ల గుండ్రంగా మారని శిలలు

4. ఇది శబ్దరహితంగా, గమనరహితంగా, వేగరహితంగా జరిగే నిరంతర ప్రక్రియ.
1) శిలాశైథిల్యం 2) వికోశీకరణం 3) క్రమక్షయం 4) అన్నీ

5. శిలాశైథిల్యం వల్ల శిలల పై భాగంలో ఏర్పడే శైథిల్య పదార్థాన్ని రవాణా చేయనివి?
1) పవనాలు 2) నదులు 3) హిమానీనదాలు 4) సరస్సులు

6. క్రమక్షయం ఎన్ని దశల్లో జరుగుతుందని డేవిస్‌ భావన?
1) 2  2) 3  3) 4  4) 1

7. అపదళనం ఎక్కువగా కనిపించే శిల?
1) గ్రానైట్‌ శిల 2) నేల బొగ్గు 3) గ్రాఫైట్‌ 4) స్లేట్‌

8. మృత్తికల ఆవిర్భవానికి సోపానం
1) క్రమక్షయం 2) శిలా శైథిల్యం 3) వికోశీకరణం 4) ఏదీకాదు

9. పిడో జెనెసిస్‌ అంటే?
1) మృత్తిక ఆవిర్భావ సహజసిద్ధ పక్రియ   2) మృత్తిక ఆవిర్భావ విరుద్ధ ప్రక్రియ
3) శిలా శైథిల్య ప్రక్రియ     4) వికోషీకరణ ప్రక్రియ

10. సాయిల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1928 2) 1929 3) 1938 4) 1956

సమాధానాలు: 1-1, 2-4, 3-2, 4-1, 5-4, 6-2, 7-1, 8-2, 9-1, 10-4.

రచయిత: సక్కరి జయకర్‌ 
 

Posted Date : 03-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌