• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో వివిధ ఆశ్రిత కుల కళాకారులు

ఆటపాటల్లో కుల చరిత్రలు!
 

కులాలను ఆశ్రయించి బతికే కళలు  తెలంగాణ ప్రాంతంలో అనేకం ప్రాచుర్యంలో ఉన్నాయి. నృత్యం, గానం, వచనం, అభినయాలతోపాటు కొంతమంది పటాలతో గేయగానం చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. ఆ కళలతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వారూ ఉన్నారు.  తమకు ప్రత్యేకమైన కులాల వారి ముందు మాత్రమే ఈ ప్రదర్శనలు ఇస్తుంటారు.  వారి నుంచే దానాలు స్వీకరిస్తుంటారు. కులాల చరిత్రలను, కట్టుబాట్లను ఆ కళల ద్వారా ప్రచారం చేస్తుంటారు. యాచన చేస్తూ, సంచార జీవనం సాగిస్తూ ఆటపాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. కుల కళనే నమ్ముకుని జీవనం సాగించే ఆ కళాకారుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ప్రతి కళకు ఉన్న ప్రత్యేకతలు, ప్రదర్శనల తీరు, వారికి ఉన్న ఇతర పేర్లు, జీవనశైలి గురించి అవగాహన తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రపెంచుకోవాలి. 
 

తెలంగాణలో వివిధ ఆశ్రిత కులాల వారు తమ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ తమకు సంబంధిత కులాల వారిని యాచిస్తూ జీవనం గడుపుతారు.


చిందు బాగోతులవారు: చిందు బాగోతులవారు మాదిగ కుల యాచకులు. వీరికి ‘సిందోళ్లు’, ‘చిందు మాదిగలు’ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీరు తమ దాతృ కులమైన మాదిగలకు ‘జాంబవ పురాణం’ చెప్పి అడుక్కుంటారు. జాంబవ పురాణంలో మాదిగ కుల పుట్టు పూర్వోత్తరాల గురించి ఉంటుంది. ఆ కారణంగా ఈ పురాణాన్ని మాదిగలు ఎక్కువగా ఇష్టపడతారు. జాంబవ పురాణంతోపాటు చిందు మాదిగలు రామాయణం, మహాభారత, భాగవత కథలను కూడా గానం చేస్తారు. వీటిలో మోహినీరుక్మాంధ కథ, చెంచులక్ష్మి, వీరాభిమన్యు, మైరావణ, శ్రీకృష్ణార్జున యుద్ధం, సతీసావిత్రి, గయోపాఖ్యానం ముఖ్యమైనవి. కుల గాయకులందరిలోనూ వీరికి ప్రత్యేక స్థానం ఉంది. వీరు మాదిగల కుల పెద్ద ఇంటి ముందు బహిరంగ ప్రదేశంలో వేదిక నిర్మించి ఈ కథలు చెబుతారు. తమతోపాటు వాయిద్యాలు, అలంకరణ సామగ్రి వెంట తెచ్చుకుంటారు. యక్షగాన పద్ధతిలో కథాగానం చేస్తారు. నృత్యం, గానం, అభినయం, వచనం వీరి ప్రదర్శనలో ప్రధాన పాత్ర వహిస్తాయి. బృంద సభ్యులందరికీ చెప్పే కథపై పూర్తి పట్టు ఉంటుంది. దాదాపుగా తెలంగాణ అంతటా పర్యటిస్తారు. ఇందులో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్‌ ప్రాంత బృందాలకు మంచి పేరుంది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు ప్రాంత చిందు బృందం జాతీయ, అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచింది. ఈ బృందంవారు      ‘సారంగధర’ కథను చెబుతారు. ఇందులో చిత్రాంగి పాత్ర పోషించే చిందుల ఎల్లమ్మకు మంచి పేరు వచ్చింది. ఈ పాత్ర ద్వారా ఈమె ఎన్నో అవార్డులను పొందారు. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతాల్లో చిందు బాగోతులవారు కథాగానం చేస్తూ మాదిగ కులంవారిని యాచించి జీవిస్తున్నారు.


పట ప్రదర్శన కథకులు: కొందరు ఉపకులాల వారి కుల కథాగానంలో పట ప్రదర్శన ఉంటుంది. మామూలు కథాగాన ప్రక్రియకు అదనంగా కథాచిత్ర పటం ఒకటి చేరడంతో, వీరిని పట ప్రదర్శన కథకులు అంటారు. దాదాపు గజం వెడల్పు, ముప్పై గజాల పొడవు ఉన్న ఒక వస్త్రంపై కుల పురాణ కథ చిత్రించి ఉంటుంది. ఇలా చిత్రించిన వస్త్రాన్ని నాలుగు అడుగుల పొడవు ఉన్న గుండ్రని కర్రకు చుడతారు. ఈ బట్టను ఒక పెట్టెలో భద్రపరచి ఉంచుతారు. కథా ప్రదర్శనకు ఒక అడుగు ఎత్తు ఉన్న వేదికను ఎంచుకుంటారు. వేదికకు వెనుక భాగంలో గజం వెడల్పులో రెండు కర్రలను పాతుతారు. ఈ కర్రలపైభాగం ఆంగ్ల అక్షరం ‘వి’ ఆకారంలో ఉండేలా చూస్తారు. ఈ పటం చుట్టను ‘వి’ ఆకారంలోని రెండు కర్రల మధ్యలో ఉంచి కిందకు విడుస్తారు. అప్పుడు ఆ పటం కథలోని మొదటి ఘట్టం ప్రేక్షకులకు కనిపిస్తుంది. ఆ ఘట్టాన్ని ఒక పొడవాటి సన్న కర్రతో చూపుతూ, కథను ప్రారంభిస్తారు. ఈ ఘట్టం గురించి చెప్పడం పూర్తయిన తర్వాత, పటాన్ని సినిమా రీలులా కిందికి చుడతారు. అప్పుడు రెండో ఘట్టం ప్రేక్షకులకు కనిపిస్తుంది. ఈ విధంగా కథ అయిపోయే వరకు పటాన్ని కిందికి చుడుతుంటారు. ఈ కథాగానంలో కూడా ముగ్గురు కళాకారులుంటారు. ప్రధాన కథకుడు పొడవాటి కర్రతో పటంలోని కథా ఘట్టాలను చూపిస్తూ, కథను గేయం, వచనంలో చెబుతూ ఉంటాడు. మిగిలిన ఇద్దరిలో ఒకరు మద్దెల వాయిస్తూ, మరొకరు తాళాలు వాయిస్తూ కథాగానంలో సహకరిస్తారు. ఈ పటాన్ని వీరు చాలా పవిత్రంగా చూస్తారు. కథాగానానికి ముందు, పటాన్ని పెట్టెలో నుంచి బయటకు తీసేటప్పుడు పూజ చేసి కొబ్బరికాయ కొడతారు. పటాన్ని దేవుడి గదిలోనే దాచి ఉంచుతారు.


కూన పులివారు: వీరు మూడేళ్లకు ఒకసారి పద్మశాలి ఇళ్లకు వెళ్లి, పద్మపురాణం/ భావనా రుషి మాహాత్మ్యం గానం చేసి అడుక్కుంటారు. వీరికి పడిగే రాజులు, పడిగిద్దె రాజులు, సైనోళ్లు, పులి జెండావారు అనే పేర్లు కూడా ఉన్నాయి. సంచార జీవనం గడుపుతారు. వీరి కుల పుట్టు పూర్వోత్తరాల గురించి భావనా రుషి మాహాత్మ్యంలో వివరిస్తారు. కథలు చెప్పడం పూర్తయిన తర్వాత చివరి రోజు తమ వాయిద్యాలతో గ్రామంలోని ప్రతి పద్మశాలి ఇంటికి వెళ్లి, వారిని ఆశీర్వదిస్తారు. తదుపరి తమకు రావాల్సిన దానం స్వీకరించి మరొక గ్రామానికి వెళతారు. ప్రస్తుతం వీరు కథా గానం చేయడం లేదు. వీరి కళకు ఆదరణ కరవై, క్రమంగా నశించి పోతోంది. నేడు వీరు జగిత్యాల, హుజూరాబాద్‌ (ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా) మానుకోట, చింతగట్టు, శాయంపేట (ఉమ్మడి వరంగల్‌ జిల్లా) ప్రాంతాల్లో కనిపిస్తారు.


కాకి పడిగెల వారు: వీరు రెండు, మూడేళ్లకోసారి ముత్రాసి లేదా ముదిరాజ్‌ కులాన్ని వినోదింపజేసి కేవలం వారినే యాచిస్తారు. కుల సంచార వ్యక్తులు. వీరిని కాకి రెక్కలవారు, కాకిపడిగోళ్లు అని కూడా పిలుస్తారు. వీరికి తెలంగాణ అంతటా మిరాశీ గ్రామాలున్నాయి. పడిగే అనే పదానికి పతాకం, టెక్కం, ధ్వజం, చిహ్నాం, గుర్తు అనే అర్థాలున్నాయి. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా ఈదెమ్మ కథ, మాతా పురాణంలో ఈ పడిగే పదాన్ని ప్రయోగించారు. కాకి పడిగెల వాళ్లు కాకి ధ్వజాన్ని (జెండా) మోసుకుని వెళ్లి, దానిని వేదిక ముందు పాతి, పటం సహాయంతో కథలు చెబుతారు. వీరు ముఖ్యంగా ముదిరాజ్‌ కుల పుట్టుపూర్వోత్తరాల గురించి వివరిస్తారు. అంతేకాకుండా పాండవ వనవాసం, విరాట పర్వం, ద్రౌపదీ వస్త్రాపహరణం మొదలైన కథలను దాతల కోసం గానం చేస్తారు. కథలు చెప్పడం పూర్తయిన తర్వాత ముదిరాజ్‌ కులంలో పెందోట పెద్దమ్మ అనే దేవతకు బోనాల పండగ చేయిస్తారు. తదుపరి తమకు రావాల్సిన దానం స్వీకరించి మరో గ్రామానికి వెళతారు. ప్రస్తుతం వీరు ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, మెదక్, వరంగల్‌ జిల్లాల్లో కనిపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నర్మెట్ట, బచ్చన్నపేట, చేర్యాల ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉన్నారు.


మాదిరి ప్రశ్నలు


1. కిందివారిలో జాంబవ పురాణం ఎవరు చెబుతారు?

ఎ) రుంజవారు     బి) పటంవారు 

సి) చిందు బాగోతులు   డి) కూనపులి వారు


2.  ఏ ప్రాంత చిందు కళా బృందం వారు అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచారు?

ఎ) ఆర్మూరు బి) పెద్దపల్లి సి) సూర్యాపేట డి) జగిత్యాల


3.  కూనపులి వారు ఏ కులానికి ఆశ్రిత కులంగా ఉంటారు?

ఎ) ముదిరాజ్‌     బి) కుమ్మరి 

సి) విశ్వబ్రాహ్మణ     డి) పద్మశాలి


4.  ‘పులి జెండావారు’ అనే పేరు ఎవరికి ఉండేది?

ఎ) కూనపులి వారు     బి) రుంజవారు 

సి) కాకిపడిగెల వారు   డి) బహురూపులు


5.  కాకి ధ్వజాన్ని ఎవరు ఉపయోగిస్తారు?

ఎ) బహురూపులు     బి) పట ప్రదర్శకులు 

సి) కాకి పడిగోళ్లు     డి) చిందు బాగోతులు


6.  కిందివారిలో ఎవరు పెందోట పెద్దమ్మ అనే దేవతకు బోనాల పండగ చేస్తారు?    

ఎ) కాకి పడిగెలవారు     బి) పటంవారు 

సి) కూనపులి వారు     డి) చిందుబాగోతులు 


7.  సారంగధర కథను చెప్పే కళాకారులు-

ఎ) జగిత్యాల చిందు బృందం 

బి) ఆర్మూరు చిందు బృందం 

సి) కరీంనగర్‌ చిందు బృందం 

డి) జనగాం చిందు బృందం

 


సమాధానాలు: 1-సి, 2-ఎ, 3-డి, 4-ఎ, 5-సి, 6-ఎ, 7-బి.

 


 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి
 

Posted Date : 22-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌