• facebook
  • whatsapp
  • telegram

కార్బోహైడ్రేట్‌లు

* స్థూల పోషకాలు
* ఎదుగుదలకు దోహదం

  మానవ శరీరానికి అవసరమయ్యే ప్రధాన పోషక పదార్థాల్లో కార్బోహైడ్రేట్‌లు ఒకటి. శారీరక శక్తికి, ఎదుగుదలకు ఎంతగానో దోహదపడే ఇవి అనేక పదార్థాల ద్వారా లభ్యమవుతాయి. పిండి పదార్థాలు, చక్కెరలుగా లభ్యమయ్యే కార్బోహైడ్రేట్‌ల నిర్మాణం.. వాటిలో రకాలు.. అవి దొరికే పదార్థాలు.. తదితర అంశాల అధ్యయన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..

  కార్బోహైడ్రేట్‌లు స్థూల పోషక పదార్థాలు. ఇవి మానవ శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరం. శక్తి జనకాలుగా ఉపయోగపడతాయి. కార్బోహైడ్రేట్‌లలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనే మూలకాలు ఉంటాయి. వీటితోపాటు కొన్నింటిలో నైట్రోజన్ కూడా ఉంటుంది. కార్బోహైడ్రేట్‌ల నిర్మాణాత్మక ప్రమాణాలు చక్కెరలు.

 

లభించే ఆహార పదార్థాలు

బంగాళాదుంప, చిలగడదుంప, క్యారెట్‌లలో పిండి పదార్థాల రూపంలో ఉంటాయి. పాలు, తేనె, చెరకు, పండ్లలో చక్కెర రూపంలో ఉంటాయి.
కార్బోహైడ్రేట్‌లలో ఉండే చక్కెర అణువులను అనుసరించి ఇవి 3 రకాలు.
1. మోనోశాఖరైడ్‌లు
2. ఒలిగోశాఖరైడ్‌లు
3. పాలిశాఖరైడ్‌లుి.

 

మోనోశాఖరైడ్‌లు

  ఒకే చక్కెర అణువు ఉండే కార్బోహైడ్రేట్‌లను మోనోశాఖరైడ్‌లు అంటారు. ఎరిథ్రోజ్ గ్లూకోజ్, మానోజ్, గాలక్టోజ్, ఫ్రక్టోజ్, సార్‌బోజ్, అరాబినోజ్, క్సైలోజ్, రైబోజ్ అనే చక్కెరలు వీటికి ఉదాహరణలు. వీటిలో ఉండే కార్బన్ పరమాణువులను బట్టి వీటిని డైయోజ్‌లు, ట్రయోజ్‌లు, టెట్రోజ్‌లు, పెంటోజ్‌లు, హెక్సోజ్‌లు అనే రకాలుగా విభజింపవచ్చు.

ఉదా: 1. ఎరిథ్రోజ్ - టెట్రోజ్ చక్కెర. దీనిలో 4 కార్బన్ పరమాణువులు ఉంటాయి.
2. అరాబినోజ్, క్సైలోజ్, రైబోజ్ - పెంటోజ్ చక్కెరలు (5 కార్బన్ పరమాణువులు).
3. గ్లూకోజ్, మానోజ్, గాలక్టోజ్, ఫ్రక్టోజ్, సార్‌బోజ్ - హెక్సోజ్ చక్కెరలు (6 కార్బన్ పరమాణువులు).
4. గ్లూకోహెప్టోజ్ - హెప్టోజ్ చక్కెర (7 కార్బన్ పరమాణువులు)

 

ఒలిగోశాఖరైడ్‌లు

2-10 చక్కెర అణువులు ఉండే కార్బోహైడ్రేట్‌లను ఒలిగోశాఖరైడ్‌లు అంటారు. మాల్టోజ్, లాక్టోజ్, సెల్లోబయోజ్, సుక్రోజ్, ట్రెహలోజ్, రాఫినోజ్, జెన్షియానోజ్ అనే చక్కెరలు వీటికి ఉదాహరణలు. ఒలిగోశాఖరైడ్లలో ఉండే చక్కెర అణువులను అనుసరించి వీటిని డై, ట్రై, టెట్రా, పెంటా శాఖరైడ్‌లు అనే రకాలుగా విభజించారు.

 

ఒలిగోశాఖరైడ్‌ల ప్రత్యేకతలు

1. మాల్టోజ్: పిండిపదార్థంపై అమైలేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల మాల్టోజ్ చక్కెర ఏర్పడుతుంది. ఇది మాల్ట్‌లు, కార్న్ సిరప్‌లలో ఉంటుంది. మాల్టోజ్ చక్కెరపై మాల్టేజ్ అనే ఎంజైమ్ చర్య జరిపి దాన్ని గ్లూకోజ్, గ్లూకోజ్‌గా విడగొడుతుంది.

2. లాక్టోజ్: ఇది పాలలో 2-6 శాతం వరకు ఉంటుంది. దీన్ని మిల్క్ షుగర్ అని అంటారు. లాక్టేజ్ అనే ఎంజైమ్ లాక్టోజ్ చక్కెరపై చర్య జరిపి దాన్ని గ్లూకోజ్, గాలక్టోజ్‌గా వేరు చేస్తుంది.

3. సుక్రోజ్: చెరకు, బీట్‌రూట్, పైనాపిల్‌లలో ఈ చక్కెర ఉంటుంది. దీన్ని టేబుల్ షుగర్ అంటారు. దీన్ని మనం రోజూ టీ, కాఫీల్లో ఉపయోగిస్తాం. తీపి పదార్థాల (స్వీట్స్) తయారీలో కూడా వాడతారు. ఇది చెరకు రసంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కేన్ షుగర్; బీట్‌రూట్‌లో ఉంటుంది కాబట్టి బీట్ షుగర్ అని కూడా అంటారు. వాణిజ్యపరంగా దీన్ని చెరకు రసం నుంచి తయారు చేస్తారు. సుక్రేజ్ అనే ఎంజైమ్ దీనిపై చర్య జరిపి గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌గా విడగొడుతుంది.

4. రాఫినోజ్: ఇది బీట్‌రూట్ మొలాసిస్‌లో, పత్తిగింజల పిండి(7 శాతం)లో ఉంటుంది. శిలీంద్రాలు, ఉన్నతస్థాయి మొక్కల్లో కూడా ఇది కొంతవరకు కనిపిస్తుంది. ఈస్ట్ అనే సూక్ష్మజీవి వల్ల రాఫినోజ్ కిణ్వప్రక్రియకు గురవుతుంది.

 

పాలిశాఖరైడ్‌లు

10 కంటే ఎక్కువ మోనోశాఖరైడ్ చక్కెరలు ఉండే కార్బోహైడ్రేట్‌లను పాలిశాఖరైడ్‌లు అంటారు. వీటిలో ఒకే రకమైన చక్కెర అణువులున్న పాలిశాఖరైడ్‌లను హోమో పాలిశాఖరైడ్‌లు లేదా హోమో గ్త్లెకాన్స్ అంటారు. ఉదా: పిండి పదార్థం(స్టార్చ్), అమైలోపెక్టిన్, గ్త్లెకోజన్, సెల్యులోజ్, డెక్స్‌ట్రిన్, ఇన్యులిన్‌లు.. అనేక రకాల మోనోశాఖరైడ్ చక్కెర అణువులు ఉండే కార్బోహైడ్రేట్‌లను హెటిరో పాలిశాఖరైడ్‌లు లేదా హెటిరో గ్త్లెకాన్స్ అని అంటారు. అగార్ - అగార్, గమ్అరాబిక్, పెక్టిన్, ఆల్జినిక్ ఆమ్లం, హైయలురోనిక్ ఆమ్లం (Hyaluronic acid).. హెటిరో పాలిశాఖరైడ్‌లకు ఉదాహరణ.

 

హోమోపాలిశాఖరైడ్‌ల ప్రత్యేకతలు

1. పిండిపదార్థం
వరి, గోధుమ, జొన్న, సజ్జ, మొక్కజొన్న లాంటి ధాన్యాల్లో; బంగాళాదుంప, చిలగడదుంప, క్యారెట్ లాంటి దుంపల్లో పిండిపదార్థం ఉంటుంది. మొక్కలు ఆహారాన్ని పిండి పదార్థరూపంలో నిల్వ చేస్తాయి. మనం రోజూ ఆహారంలో భాగంగా ఎక్కువగా పిండి పదార్థాలను తీసుకుంటాం.

 

2. గ్లైకోజెన్
ఇది జంతువుల్లో నిల్వ ఉండే కార్బోహైడ్రేట్. కాబట్టి దీన్ని అనిమల్ స్టార్చ్ అంటారు. జంతువుల్లో ఇది కాలేయం, కండరాల్లో; శిలీంద్రాలు, ఈస్ట్ లాంటి వాటిలో కూడా ఉంటుంది. కాలేయంలో ఉండే గ్లైకోజెన్ గ్లూకగాన్ అనే హోర్మోను వల్ల విచ్ఛినం చెంది గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది రక్తంలో కలిసి శరీర భాగాలకు సరఫరా అవుతుంది. రక్తంలో ఎక్కువైన గ్లూకోజ్ ఇన్సులిన్ అనే హోర్మోన్ సహాయంతో గ్లైకోజెన్‌గా మారి నిల్వ ఉంటుంది.

 

3. సెల్యులోజ్
ఇది మొక్కల్లో ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్. మొక్కల కణ కవచాల్లో ఉంటుంది. పత్తిపోగులు, ప్లాక్స్ (జనుము) లాంటి వాటిలో 97-99 శాతం, చెక్కలో 41-53 శాతం, వరిగడ్డిలో 30-43 శాతం వరకు ఇది ఉంటుంది. ప్రకృతిలో అతి ఎక్కువగా ఉండే సేంద్రీయ పదార్థం సెల్యులోజ్. ఇది మానవ శరీరంలో ఉండదు. మానవ జీర్ణవ్యవస్థలో సెల్యులేజ్ ఎంజైమ్ లేకపోవడం వల్ల ఇది మానవుడిలో జీర్ణం కాదు. పూర్తి శాకాహార జంతువులు దీన్ని జీర్ణం చేసుకుంటాయి. సెల్యులోజ్‌ను నైట్రో సెల్యులోజ్, సెల్యులోజ్ ఎసిటేట్ తయారీలో ఉపయోగిస్తారు. నైట్రో సెల్యులోజ్‌ను పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు.

 

4. ఇన్యులిన్
ఇది చికోరి, డాహ్లియా లాంటి దుంపల్లో, ఉల్లి, వెల్లుల్లి లాంటి వాటిలో ఉంటుంది. ఫ్రక్టోజ్‌ను వాణిజ్యపరంగా తయారు చేయడానికి ఇన్యులిన్‌ను ఉపయోగిస్తారు.

 

5. అగార్-అగార్
సముద్ర శైవలాల నుంచి అగార్-అగార్ లభిస్తుంది. దీనికి వాసన, రుచి ఉండదు. వేడినీటిలో కరుగుతుంది. కరిగిన తర్వాత జెల్‌లా మారుతుంది. కాబట్టి దీన్ని జామ్స్, జెల్లీల తయారీలో వాడతారు. కణజాలవర్థనంలో యానకాన్ని ఘనస్థితికి తేవడానికి దీన్ని ఉపయోగిస్తారు.

 

6. గమ్ అరాబిక్
ఇది మొక్కల నుంచి లభిస్తుంది. దీన్ని ఔషధాల తయారీలోనూ, కొన్ని ఆహార పదార్థాల్లోనూ, వస్తువులను అతికించడానికి వాడతారు.

 

7. పెక్టిన్
ఈ పదార్థం, నిమ్మజాతి ఫలాలు, ఆపిల్, క్యారెట్, బీట్‌రూట్ లాంటి వాటి గుజ్జులో ఉంటుంది.

 

8. ఆల్జినిక్ ఆమ్లం
ఇది సముద్ర శైవలాల నుంచి లభిస్తుంది. దీన్ని పెద్ద మొత్తంలో ఎమల్సీకరణ పదార్థంగా, ఆహార పదార్థాలు సున్నితంగా, మెత్తగా ఉండటానికి వాడతారు.

Posted Date : 24-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌