• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో వాణిజ్య పంటలు 

భారతదేశ వాణిజ్య పంటలన్నింటిలోకి పత్తి అగ్రస్థానంలో ఉంది. ఎందుకంటే దేశ జౌళి (వస్త్ర) పరిశ్రమ (Textile Industry) అభివృద్ధికి ఇది వెన్నెముకలాంటిది. జౌళి పరిశ్రమ ప్రధానంగా వ్యవసాయాధారం. పత్తి ఫలం (Fruit) నుంచి లభిస్తుంది. దీని గింజలను వనస్పతి ఉత్పత్తిలో, పశుగ్రాసంగా వినియోగిస్తారు. దీన్ని శ్వేత బంగారం అని పిలుస్తారు. భారతదేశం పత్తిపంట విస్తీర్ణంలో మొదటి స్థానంలో, ఉత్పత్తిలో రెండో (చైనా తరువాత) స్థానంలో ఉంది. 50 నుంచి 100 సెం.మీ. వర్షపాతం, 21o- 31o సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఈ పంట అత్యధికంగా కేంద్రీకృతమై ఉంది. నీటిపారుదల సదుపాయంతో శుష్క ప్రాంతాల్లో పత్తిని పండించవచ్చు. దక్కన్, మాల్వా పీఠభూముల్లోని లోతైన, మధ్యరకం నల్లరేగడి నేలలను ఈ పంటకు అనువైనవిగా పరిగణిస్తారు. పత్తి పంటకు అత్యంత అనువైనవి కాబట్టే నల్లరేగడి నేలలను Black Cotton Soils అని పిలుస్తారు. దీన్ని ప్రధానంగా ఖరీఫ్ పంటగా పండిస్తారు. ప్రపంచంలోనే మొదటి సంకరజాతి పత్తిని భారతదేశం ఉత్పత్తి చేసింది.

 

పత్తి పంటకు సంబంధించి విస్తీర్ణం, ఉత్పత్తిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లోని రాష్ట్రాలు వరుసగా...

                     1. మహారాష్ట్ర,     2. గుజరాత,       3. పంజాబ్. 

                     1. మహారాష్ట్ర,     2. గుజరాత,       3. ఆంధ్రప్రదేశ్.

హెక్టారుకు దిగుబడిలో మొదటి మూడు రాష్ట్రాలు వరుసగా 1. పంజాబ్ 2. హర్యానా 3. తమిళనాడు


అధిక దిగుబడి వంగడాలు: సుమంగళ; రాజ్- 16, వరలక్ష్మి; సురభి; CSHH - 238; H - 1098 మొదలైనవి.


చెరకు (Sugarcane)

       భారతదేశంలోని వాణిజ్య పంటల్లో పత్తి తరువాత చెరకు ముఖ్యమైంది. చెరకు విస్తీర్ణం, ఉత్పత్తిపరంగా భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. చెరకునుంచి పంచదార, బెల్లం ఉత్పత్తవుతున్నాయి. ఆల్కహాల్ ఉత్పత్తికి కావలసిన ముడిపదార్థం కూడా దీని ఉప ఉత్పత్తుల్లో ప్రధానమైంది. చెరకు పిప్పి నుంచి పేపర్‌ను కూడా తయారు చేస్తారు. చెరకు దీర్ఘకాలపు పంట. ఇది 10-18 నెలల కాలంలో పక్వానికి వస్తుంది. ఈ పంటకు సాలీనా 75-150 సెం.మీ. వర్షపాతం, లేదా నీటిపారుదల సౌకర్యం తప్పనిసరి. ఈ పంటకు తేమ ఉన్న ఉష్ణప్రాంతం అనువైంది. అంటే 21º- 27º C ఉష్ణోగ్రతలో ఎక్కువగా సాగవుతోంది.

     చెరకుకు సారవంతమైన ఒండ్రు లేదా నల్లరేగడి లేదా జేగురు నేలలు అనువైనవి. తుహినం ఈ పంటకు వినాశకారిణి.

చెరకు విస్తీర్ణంలో, ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు వరుసగా

        1. ఉత్తరప్రదేశ్     2. మహారాష్ట్ర      3. కర్ణాటక     4. తమిళనాడు.

       అధిక దిగుబడి (yield per hectare)కు సంబంధించి అంటే చెరకులోని సుక్రోజ్ శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఇటీవల చెరకుకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చెరకు రైతులు ఆందోళన చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పంటపై రైతులు ఆసక్తి చూపడంలేదు.

 

జనుము (Jute)

       భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో జనుము చాలా ముఖ్యమైన పంట. జనుముకు 25º- 35º సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత. 100 - 140 సెం.మీ. వర్షపాతం ఉన్న ఉష్ణ, ఆర్ద్ర వాతావరణం అవసరమవుతుంది. సారవంతమైన డెల్టా, ఒండలి నేలలు బాగా అనువైనవి. ఈ మొక్క కాండం నుంచి జనుము లభిస్తుంది. జనుము కేవలం ఖరీఫ్ పంటే.

విస్తీర్ణంలో, ఉత్పత్తిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లోని రాష్ట్రాలు వరుసగా

             1. పశ్చిమబెంగాల్,     2. బీహార్,                        3. అసోం.

హెక్టారుకు దిగుబడిలో మొదటి మూడు రాష్ట్రాలు  వరుసగా

             1. ఒరిస్సా                  2. పశ్చిమ బెంగాల్         3. అసోం.

 

అధిక దిగుబడి వంగడాలు: కోపంత్ 84212; COS 88216; UP 39; శ్వేత; COJ 65 మొదలైనవి.


పొగాకు (TObacco)

         క్రీ.శ. 1508లో పోర్చుగీసు వారు, పొగాకు మొక్కను భారతదేశంలో ప్రవేశపెట్టారు.పొగాకు ఉత్పత్తిలో చైనా, యు. ఎస్.ఎ.ల తరువాతి స్థానం భారత్‌దే. ఆశించిన వయనం, రంగు, వాసన రావడానికి కోసిన తరువాత పొగాకును క్యూర్ చేస్తారు. పొగాకు పంటకు 16º- 35º సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత, 50 - 80 సెం.మీ. మించిన వర్షపాతం లేదా నీటి పారుదల సదుపాయం అవసరం. నల్లరేగడి ఈ పంటకు బాగా అనుకూలం. పొగాకు ఖరీఫ్ పంట. సిగరెట్, బీడి, హుక్కా, గుట్కా మొదలైన పరిశ్రమలకు కావలసిన ముడిసరకుగా దీన్ని వినియోగిస్తారు.

* పొగాకులో రెండు రకాలున్నాయి. అవి.. 1. నికోటియానా టొబాకం వర్జీనియా, 2. నికోటియానా రస్టికా. ఇందులో వర్జీనియా రకం అత్యంత నాణ్యమైంది. దేశంలో ఈ రకానికి చెందిన పొగాకు గుంటూరు జిల్లాలో అత్యధికంగా పండుతుంది. 

పొగాకులో ఉన్న ఆల్కలాయిడ్ నికోటిన్.

     విస్తీర్ణం, ఉత్పత్తిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో వరుసగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.

     అధిక దిగుబడి వంగడాలు : GTH-1, జయశ్రీ, ఆనంద్-3, మోతిహారి మొదలైనవి.

 

తేయాకు (Tea)

      ప్రపంచంలో అత్యధికంగా తేయాకును ఉత్పత్తి చేసేది భారతదేశమే. దేశం చేసే ముఖ్యమైన ఎగుమతుల్లో ఇదొకటి. 150 - 300 సెం.మీ. వర్షపాతం 20º- 30º సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న కొండవాలుల్లో పండుతుంది. నీరు నిల్వ ఉండటం ఈ పంటకు హానికరం. భారతదేశంలో అసోం రాష్ట్రంలో అత్యధికంగా తేయాకు ఉత్పత్తవుతుంది.

 

ఇతర రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ.


కాఫీ

      ప్రపంచం మొత్తంమీద జరిగే కాఫీ ఉత్పత్తిలో దాదాపు రెండు శాతం భారతదేశంలో ఉత్పత్తి అవుతోంది. తేయాకు పంటకు అవసరమైన పరిస్థితులన్నీ కాఫీ పంటలకు కూడా అవసరమవుతాయి. అదనంగా ఈ పంటకు నేరుగా సూర్య కిరణాలు పడకుండా రక్షణ కావాలి. దీన్ని సాధారణంగా సముద్ర మట్టానికి 900 - 1800 మీటర్ల ఎత్తున కొండవాలు ప్రాంతాల్లో సాగు చేస్తారు. భారత్‌లోని మొత్తం ఉత్పత్తిలో 83 శాతాన్ని కర్ణాటక రాష్ట్రమే ఉత్పత్తి చేస్తోంది.

కాఫీని ఉత్పత్తి చేసే ఇతర రాష్ట్రాలు: కేరళ, తమిళనాడు.


రబ్బర్

       రబ్బర్ చెట్లు సహజమైన రబ్బరునిస్తాయి. హవియా బోసిలియెన్సిస్ అనేవి అతి ముఖ్యమైన రబ్బర్ చెట్లు. రబ్బర్ ఉత్పత్తిలో కేరళ గుత్తాధిపత్యం వహిస్తుంది. దేశంలోని మొత్తం ఉత్పత్తిలో 90 శాతం వాటా కేరళదే. రబ్బరు పంటకు 250- 350 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 200 సెం.మీ. పైగా వర్షపాతం అవసరం.


కొబ్బరి (Coconut)

         తాడి జాతి చెట్త్టెన కొబ్బరి, ఉష్ణమండల దేశాల్లోని ఆర్ద్ర కోస్తా ప్రాంతాల్లో విస్తారంగా పండుతుంది. దీనికి సంవత్సరానికి 125-150 సెం.మీ. వర్షపాతం అవసరం. నేలలకు మురుగు పారుదల సౌకర్యం ఉంటే మరింత అధిక వర్షపాతానికి కూడా ఇది తట్టుకుంటుంది. దాదాపు 25º- 30º సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, తుహిన రహితమైన వాతా వరణం అవసరం.


భారతదేశంలో కొబ్బరి ఉత్పత్తి చేసే ముఖ్యమైన రాష్ట్రాలు:

             1. కేరళ     2. తమిళనాడు      3. గుజరాత్    4. ఆంధ్రప్రదేశ్.

 

సుగంధ ద్రవ్యాలు (Spices)

      సుగంధ ద్రవ్యాలు ఆహారానికి సువాసన, పోషక పదార్థాలను సమకూరుస్తాయి. ప్రధానంగా అయన, ఉప అయన ప్రాంతాల్లో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను పండిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద సుగంధ ద్రవ్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేసేది, వినియోగించేది భారతదేశమే. దేశంలో సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా కేరళలో ఉత్పత్తవుతాయి. అందుకే ఈ రాష్ట్రాన్ని 'సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం' (Spice Garden of India) అని పిలుస్తారు.

 

మిరియాలు (Pepper)

       సుగంధ ద్రవ్యాల పంటల్లో మిరియాల పంట అతిముఖ్యమైంది. దీన్ని సుగంధ ద్రవ్యాల రాజుగా పేర్కొంటారు. దీనికి 10o- 30oసెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 200 - 300 సెం.మీ. సగటు వార్షిక వర్షపాతం అవసరం. భారతదేశంలో ముఖ్యంగా

మిరియాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు:

               1. కేరళ,        2. కర్ణాటక,      3. తమిళనాడు.


ఏలకులు (Cardamom) 

        దీన్ని 'సుగంధ ద్రవ్యాల రాణి'గా పేర్కొంటారు. 800 - 1500 మీటర్ల ఎత్తులో, 150 - 300 సెం.మీ. పైగా వర్షపాతం 150 - 300 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఏలకుల పంట బాగా పండుతుంది. అటవీ వృక్షాల నీడన ఇది బాగా వృద్ధి చెందుతుంది.

ఏలకులను అత్యధికంగా ఉత్పత్తి, ఎగుమతి చేసే రాష్ట్రాలు:

                           1. కేరళ,    2. కర్ణాటక,   3. తమిళనాడు. 

 

మిరపకాయలు (Chillies)

      మిరపకాయలను ఎర్రమిరియాలు అని కూడా అంటారు. ఈ పంటకు 60 - 125 సెం.మీ. వర్షపాతం 10o - 30o సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత అవసరం. నల్లనేలలు ఈ పంటకు బాగా అనువైనవి.

దీన్ని ఎక్కువగా పండించే రాష్ట్రాలు:

                          1. ఆంధ్రప్రదేశ్       2. కర్ణాటక    3. ఒరిస్సా.


హరిత విప్లవం (Green Revolution)

         స్వాతంత్య్రానంతరం భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే 1960 దశకం మధ్యలో హరిత విప్లవం ప్రారంభమయింది. హరిత విప్లవం అనే పదం రూపకర్త అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ విలియం గాండే. అధిక దిగుబడి వంగడాలను వినియోగించి, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడమే హరిత విప్లవ లక్ష్యం. భారతదేశంలో దీన్ని మొదట ప్రవేశపెట్టేందుకు కృషిచేసింది డాక్టర్ నార్మన్ బోర్లాగ్. ఆ తరువాత దీన్ని విశేషంగా అభివృద్ధి చేసింది డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్. కాబట్టి, నార్మన్ బోర్లాగ్ హరిత విప్లవ పితామహుడిగా, ఎం.ఎస్. స్వామినాథన్‌ను హరిత విప్లవ నిర్మాతగా పేర్కొంటారు.

హరిత విప్లవంలోని ప్రధానాంశాలు:

        1. అధిక దిగుబడి వంగడాల వినియోగం (HYV Seeds). 

        2. రసాయన ఎరువుల క్రిమిసంహారక మందుల వినియోగాన్ని పెంచడం. 

        3. నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధి.

        4. వ్యవసాయ యాంత్రికీకరణ, వ్యవసాయ ఆధునిక శాస్త్రీయ పద్ధతులను అమలు చేయడం.

      ఈ ప్రధానాంశాలతో భూసంస్కరణల అమలు, గ్రామీణ విద్యుదీకరణ, విద్యుత్ పంపుసెట్ల అభివృద్ధి, మార్కెటింగ్ సదుపాయాల కల్పన, వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థాపన మొదలైన అంశాలు కూడా హరిత విప్లవంలోని భాగాలే. హరిత విప్లవం కారణంగా దేశంలోని వ్యవసాయ ఉత్పత్తులతో పాటు పంటల దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. దీంతో ఒక్కసారిగా దేశ వ్యవసాయ ముఖచిత్రం మారిపోయింది. ఆహారధాన్యాల్లో దేశం స్వయం సమృద్ధిని సాధించింది.

హరిత విప్లవాన్ని మొదట పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో ప్రవేశపెట్టారు. పై మూడు రాష్ట్రాల్లో నికర నీటి సౌకర్యాలు ఉండటంతో హరిత విప్లవం కారణంగా ఈ రాష్ట్రాలు అత్యధిక ప్రయోజనాన్ని పొందాయి. హరిత విప్లవం కారణంగా గోధుమ పంట ఉత్పత్తి రెండింతలైంది. గోధుమతోపాటు వరి, జొన్న, మొక్కజొన్న పంటలు కూడా లబ్ధి పొందాయి. ఆ తరువాత హరిత విప్లవ ప్రభావాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు, ఇతర ప్రధాన పంటలకు విస్తరించారు.

 

రెండో (సతత) హరిత విప్లవం: భారతదేశంలో హరిత విప్లవ నిర్మాత ఎం.ఎస్. స్వామినాథన్, దేశంలోని ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించే దిశలో ప్రస్తుత ఆహార ధాన్యాల ఉత్పత్తి 210 మిలియన్ టన్నులకు రెట్టింపు చేసే లక్ష్యంతో నిరంతర (Evergreen Revolution) హరిత విప్లవానికి పిలుపునిచ్చారు.

         దేశంలో వ్యవసాయ పంటల వృద్ధిని సాలీనా నాలుగు శాతం సాధించేందుకు 11వ పంచవర్ష ప్రణాళికలో సమగ్రమైన విధానాన్ని సూచించారు.

దీనిలో ప్రధానంగా కింది అంశాలను పేర్కొన్నారు.

         1. నీటిపారుదల సౌకర్యాలను రెట్టింపు చేయడం. 

         2. మృత్తికా పరిరక్షణ, క్రమక్షయానికి గురైన నేలల అభివృద్ధి. 

         3. వర్షపునీటిని నిల్వ, భూగర్భ జలాల అభివృద్ధి. 

         4. రైతులకు పరపతి సౌకర్యాలను సకాలంలో అందించడం. 

         5. పరిశోధనా ఫలితాలను ఎప్పటికప్పుడు అమలు చేయడం (Lab to Land). 

         6. వ్యవసాయ విస్తరణ పథకాలను విస్తృతంగా అమలు చేయడం

 

Posted Date : 26-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌