• facebook
  • whatsapp
  • telegram

శాతవాహనుల కాలం నాటి పరిస్థితులు

ఆర్థిక పరిస్థితులు - వర్తకం - వాణిజ్యం 

శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశంలో ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉండేది. వ్యవసాయం, పారిశ్రామిక, దేశ-విదేశ వ్యాపారంలో ఈ ప్రాంతం గణనీయమైన ప్రగతి సాధించింది. 

ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. భూమిశిస్తు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరు.

* వృత్తి పన్నులు, రహదారి - రేవులపై సుంకాల ద్వారా రాజ్యానికి అధిక ఆదాయం సమకూరేది. 

* నదీతీర  ప్రాంతాల్లో పంటలు బాగా పండేవి. వరి, చెరకు, జొన్న, జనుము, నువ్వులు మొదలైన పంటలు పండించేవారని ‘గాథాసప్తశతి’లో పేర్కొన్నారు. పండిన పంటలో ఆరోవంతు ప్రభుత్వానికి పన్నుగా చెల్లించేవారు. 

* ఆ కాలంలో వివిధ వృత్తుల వారు శ్రేణులుగా (సంఘాలు) ఏర్పడ్డారు. ఈ శ్రేణులు బ్యాంకులుగా పనిచేసేవి.

* సమాజంలో వృత్తుల ఆధారంగా కులాల విభజన జరిగింది. వీరిలో కోలిక (చేనేత), కులారిక (కుమ్మరి), తిలపినక (నూనె తీసేవారు), కమ్మర (కంసాలి), సువర్ణకార (స్వర్ణకారులు), వధిక (వడ్రంగి), బదయంత్రిక (నీటియంత్ర కార్మికులు) ముఖ్యులు.

* శ్రామికులు తమ సంఘాల వద్ద ధనాన్ని నిల్వ చేసుకునేవారు. ఆయా సంఘాలు వారికి 12% వరకు వడ్డీ చెల్లించేవి.

* ఆ కాలంలో గుమాస్తాలను లేఖకులు అని, రాతి పనివారిని మితికులు, కర్రపని చేసేవారిని వద్దకిలు అని పేర్కొన్నారు.

* శాతవాహనుల కాలంలో పశ్చిమ దక్కన్‌లో ప్రతిష్టానం, కోడూర, విజయపురి, తగర, నాసిక్, వైజయంతి, గిర్నార్‌ ప్రముఖ వర్తక కేంద్రాలుగా ఉండేవి.

* తూర్పు దక్కన్‌లో ధాన్యకటకం (ధరణి కోట) ప్రధాన వర్తక కేంద్రం. పశ్చిమతీరంలో బరుకచ్చం, సోపార, కల్యాణి; తూర్పుతీరంలో కోడూర, ఘంటసాల, మైసోలియా ప్రధాన రేవు పట్టణాలు. ఈ వ్యాపార కేంద్రాల ద్వారా ఎగుమతి, దిగుమతులు జరిగేవి. 

* సారాయి, మణులు, వజ్రాలు, వెండి, బంగారం, గాజు ప్రధాన దిగుమతులు కాగా; దంతపు సామాన్లు, పట్టువస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, చందనం, బియ్యం, గోధుమలు, నెయ్యి, చెక్కర ముఖ్య ఎగుమతులు. 

* వీరు ఎక్కువగా రోమ్‌తో వ్యాపారం చేసేవారు. 

* ప్లీని, స్ట్రాబో రచనలు; ‘పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియన్‌ సీ’ అనే గ్రంథంలో ఆనాటి వర్తక, వాణిజ్యాల గురించిన సమాచారం ఉంది.

* శాతవాహనుల కాలంనాటి నాణేలు రోమ్‌లో లభించాయి. 

* ఆ కాలంలో నూలు, వస్త్ర పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. 

* ఓడల నిర్మాణానికి అవసరమయ్యే కలపను రోమ్‌వారు భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నారు.

* శాతవాహనులు ఎక్కువగా రాగి, సీసం మిశ్రమంతో కలిపిన నాణేలను ముద్రించారు. 

* గ్రామాలు, స్థానిక వ్యాపారాల్లో వస్తుమార్పిడి విధానం ఉండేది. ఉద్యోగులకు జీతాలను వస్తురూపంలోనూ చెల్లించేవారు. 

* ఈ వ్యాపార, వాణిజ్యాల వల్ల పశ్చిమ దేశాలతో పాటు ఆగ్నేయాసియా, దూరప్రాచ్య దేశాలతోనూ సాంస్కృతిక  సంబంధాలు ఏర్పడ్డాయి. 


 

సాంస్కృతిక పరిస్థితులు - సాహిత్యం, వాస్తు, శిల్పకళ 

* శాతవాహనుల కాలంలో భాష, సారస్వతం, వాస్తు, శిల్పకళ బాగా అభివృద్ధి చెందాయి. వీరి రాజభాష ప్రాకృతం. శాతవాహనుల శాసనాలన్నీ ప్రాకృత భాషలో, బ్రహ్మీలిపిలో ఉన్నాయి. 

*  హాలుడు గాథాసప్తశతి అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. ఇందులో 700 పద్యాలు ఉన్నాయి. హాలుడికి కవివత్సలుడు అనే బిరుదు ఉంది. ఈ గ్రంథం అప్పటి సాంఘిక పరిస్థితులను తెలుపుతుంది. 

*  శాతవాహనుల ఆస్థానంలో గుణాఢ్యుడు అనే కవి ఉండేవాడు. అతడు ప్రాకృతంలో ‘బృహత్కథను’ రాశాడు.

* చివరి శాతవాహనుల కాలంలో బ్రాహ్మణ మతం బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో సంస్కృత భాషకు ప్రాధాన్యం పెరిగింది.

*  ఆ కాలంలో ప్రాకృతం, సంస్కృతంతో పాటు దేశీ అనే భాష కూడా ఉండేది. అత్త, పోట్ట, పిల్ల, అద్దం, నత్తి, చరచు, చెక్క, చెప్పు అనే దేశీ పదాలు గాథాసప్తశతిలో ఉన్నాయని చరిత్రకారులు పేర్కొన్నారు.

* దేశీ అంటే స్థానిక ప్రజల భాష అని అర్థం. ఇది తెలుగుకు దగ్గరగా ఉంటుందని అచార్య డి.సి.సర్కార్‌ పేర్కొన్నారు. 

*  భట్టిప్రోలు, జగ్గయ్యపేటలోని శాసనాలు బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. 

*  శాతవాహనులు ఉపయోగించిన లిపిని దక్షిణాది లిపులన్నింటికీ మాతృకగా చరిత్రకారులు భావిస్తాయి. 

*  శర్వవర్మ రచించిన ‘కాతంత్య్రవ్యాకరణం’, ఆచార్య నాగార్జునుడి రచనలు సంస్కృత భాషలో ఉన్నాయి.

* శాతవాహనుల కంటే ముందే ఆంధ్రదేశంలో వాస్తు శిల్పకళా సంప్రదాయాలు ఉన్నాయి. 

*  ఆంధ్రులకు 30 సురక్షిత నగరాలు ఉన్నట్లు మెగస్తనీస్‌ ‘ఇండికా’లో పేర్కొన్నాడు. 

* అమరావతి, జగ్గయ్యపేట, ఘంటశాలలో ఇటుకలతో స్తూపాలు నిర్మించి, వాటికి పాలరాతి పలకలను అమర్చారు. 

*అమరావతి స్తూపం ప్రసిద్ధి చెందిన అద్భుత కళాఖండం. దీని నిర్మాణాన్ని క్రీ.పూ. 200లో ప్రారంభించారు. క్రీ.శ.2వ శతాబ్దంలో దీన్ని పూర్తిగా పునఃనిర్మించారు. దీన్ని శంకాకారంలో కట్టారు. దీని అడుగు వ్యాసం కొలత 53 మీటర్లు, ఎత్తు 33 మీటర్లు. 

*  ఈ స్తూపంలో బుద్ధుడి జీవితానికి సంబంధించిన అనేక దృశ్యాలను రాళ్లపై చెక్కారు. 

ప్రధానంగా బుద్ధుడి పుట్టుక-కమలంతో, మహాభినిష్క్రమణ - గుర్రంతో, జ్ఞానోదయం - బోధివృక్షంతో, ధర్మచక్రపరివర్తనామానాన్ని - ధర్మచక్రంతో, మహాపరినిర్వాణాన్ని - స్తూపంతో పోల్చారు. 

* కార్లే, నాసిక్, కన్హేరి, బేడ్సాలో చైత్యాలయాలను మంచి శిల్పకళతో కట్టారు. వీటిలో కార్లే అందమైన గుహాలయం. సాంచి, అమరావతి స్తూపాలు వాస్తు - శిల్పకళకు మంచి ఉదాహరణ. సాంచీ స్తూపంలో ఉండే తోరణాలు అమరావతి, నాగార్జునకొండలోని శిల్పాలు శాతవాహనుల కాలానికి చెందినవే. 

* అమరావతి శిల్ప పద్ధతులే ఇతర స్తూపాల్లోనూ ఉన్నాయి. అందుకే ఆంధ్ర శిల్పానికి ‘అమరావతి శిల్పకళ’ అనే పేరు వచ్చింది. 

*  వివిధ భంగిమల్లో మానవాకృతిని చిత్రించడంలో అమరావతి శిల్పులకు సాటిలేరని దేవీప్రసాద్‌ ఘోష్‌ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. 

*  శాతవాహనుల కాలంలో చిత్రలేఖనం కూడా అభివృద్ధి చెందింది. అజంతా 10వ గుహలోని శ్వేత గజజాతక చిత్రం శాతవాహనుల కాలానికి చెందిందే. ఆనాటి సమాజంలో ప్రజలు తమ గృహాల గోడలపై రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి పురాణ గాథలను చిత్రించుకునేవారు.

 


మతపరిస్థితులు 

* శాతవాహనుల కాలం నాటికి వైదిక, జైన, బౌద్ధ మతాలు దక్షిణ భారతదేశంలో వ్యాప్తి చెందాయి. 

* వీరు వైదిక మతస్థులు. మొదటి శాతకర్ణి అశ్వమేథ, రాజసూయ యాగాలు; గోదానాలు చేశాడని నానాఘాట్‌ శాసనంలో ఉంది.

* గౌతమీపుత్ర శాతకర్ణి వర్ణాశ్రమ ధర్మాలను రక్షించి, బ్రాహ్మణులను పోషించి ‘ఏక బ్రాహ్మణ’, ‘ఆగమనిలయ’ అనే బిరుదులు పొందాడు. 

* నానాఘాట్‌ శాసనంలో ఇంద్ర, వాసుదేవ, సూర్య, చంద్ర, యమ, వరుణ మొదలైన దేవతల ప్రార్థనా గీతాలు ఉన్నాయి. 

* వీరు ఎక్కువగా వైదికమతాన్ని అనుసరించినప్పటికీ, బౌద్ధమతాన్ని ఆదరించారు. వర్తకులు, స్త్రీలు ఎక్కువగా బౌద్ధమతాన్ని ఆచరించారని ఆనాటి శాసనాల్లో ఉంది.

* శాతవాహనుల కాలంలో మహారాష్ట్రలో కార్లే, నాసిక్, కన్హేరి, భాజ మొదలైన ప్రాంతాల్లో గుహచైత్యాలయాలు; తూర్పు తీరంలోని జగ్గయ్యపేట, చినగంజాం, రామిరెడ్డిపల్లి, నాగార్జున కొండల్లో స్తూపవిహారాలు వెలిశాయి. 

* యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆచార్య నాగార్జునుడు ధాన్యకటకం, శ్రీపర్వతాల్లో నివహిస్తూ మహాయాన బౌద్ధమతాన్ని ప్రచారం చేశాడు. 

* నాగార్జునుడు ‘సుహృల్లేఖ’ అనే గ్రంథాన్ని రచించి, ‘మాధ్యమికవాదాన్ని’ ప్రచారం చేశాడు.

* మొదటి శాతకర్ణి జైనమతాభిమాని. ఇతడు రాజధానిలో జైనుల కోసం చైత్యాలు నిర్మించాడు. అదే కాలానికి చెందిన కొండకుందాచార్యుడు అనే జైనాచార్యుడు అనంతపురం జిల్లా కొనకొండ్లలో ఆశ్రమం స్థాపించి, జైనమతాన్ని ప్రచారం చేశాడు. ఇతడు ‘సమయసారం’ అనే గ్రంథాన్ని రచించాడు. 

* కళింగ ఖారవేలుడు మహామేఘవాహన విహారాన్ని నిర్మించాడు. ఇతడు జైనమతాన్ని పోషించాడు. 

* బౌద్ధమతాన్ని ప్రచారం చేసిన ఆచార్య నాగార్జునుడు క్రీ.శ 2వ శతాబ్దంలో ‘ఆరోగ్యమంజరి’, ‘రసరత్నాకరం’ (రసాయన శాస్త్రం) అనే గ్రంథాలు రచించి, తాత్వికచింతన విధానమైన శూన్యవాదాన్ని ప్రచారం చేశాడు. ఇతడు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో ఉండేవాడని చరిత్రకారుల భావన. 

* బౌద్ధ మతస్థులు బుద్ధుడి చిహ్మాలైన బోధివృక్షం, ధర్మచక్రం, సింహాసనం, త్రిరత్నం లాంటి వాటిని పూజించేవారు. 

* బౌద్ధగ్రంథమైన ప్రజ్ఞాపారమితశాస్త్రాన్ని ఆంధ్రబౌద్ధులు రచించారు. 

* అమరావతి శాసనాల్లో బౌద్ధమతం గురించి ఉంది. ధాన్యకటకం, శ్రీపర్వతం, జగ్గయ్యపేట, గుంటుపల్లి ప్రముఖ బౌద్ధకేంద్రాలుగా విలసిల్లాయి. 

 


శాతవాహనుల తర్వాతి రాజవంశాలు

*  శాతవాహన సామ్రాజ్యం పతనమయ్యాక, వారి సామంతులు అనేక ప్రాంతాలను ఆక్రమించి స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. 

*  వీరిలో ఇక్ష్వాకులు ముఖ్యులు. వీరు విజయపురి లేదా నాగార్జునకొండను రాజధానిగా చేసుకుని కృష్ణా - గుంటూరు ప్రాంతాన్ని సుమారు 50 ఏళ్లకుపైగా పరిపాలించారు. 

* ఇక్ష్వాకుల సామంతులు ‘బృహత్పలాయనులు’. వీరు కృష్ణానది ఉత్తరతీరాన్ని (కోడూర) పాలించారు. 

*  ఆనందగోత్రులు గుంటూరును పాలించారు. వీరి రాజధాని కందపురం.

*  వీరి తర్వాత శాలంకాయనులు ‘వేంగి’ని’ రా జధానిగా చేసుకుని 120 ఏళ్లకుపైగా పాలించారు.

*  శాతవాహనుల తర్వాత క్రీ.శ. 5, 6 శతాబ్దాల్లో విష్ణుకుండినులు కళింగతోపాటు, పూర్తి ఆంధ్రదేశాన్ని పాలించారు. 

*  కుంతల, మహారాష్ట్ర ప్రాంతాలను చుటు వంశీయులు పాలించారు. 

*  అభీరులు పశ్చిమోత్తర భూముల్లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. 

*  క్రీ.శ. 4, 5 శతాబ్దాల్లో విదర్భ ప్రాంతాన్ని వాకాటకులు పాలించారు. 

*  బనవాసి ప్రాంతాన్ని కందుబులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.

*  తర్వాతి కాలంలో దక్షిణభారతదేశాన్ని పల్లవులు, చాళుక్యులు, చోళులు, రాష్ట్రకూటులు, కాకతీయులు పాలించారు.

Posted Date : 21-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌