• facebook
  • whatsapp
  • telegram

వన్యప్రాణుల సంరక్షణ

మన దేశంలో పులి, సింహం, ఏనుగు, కృష్ణజింక, మొసలి, ఖడ్గమృగం, చిరుత, ఆస్ట్రిచ్, నెమలి మొదలైనవి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి.

ప్రపంచంలో చాలా దేశాలు పక్షులు, జంతువులను చంపడం లేదా వాటితో వ్యాపారం చేయడాన్ని నిషేధిస్తూ చట్టాలు చేశాయి. మన దేశంలో కూడా సింహాలు, పులులు, కృష్ణజింకలు, నెమళ్లను చంపడం చట్టరీత్యా నేరం.


ప్రభుత్వ చర్యలు


వన్యప్రాణులు, సహజ వృక్ష సంపద రక్షణ కోసం ప్రభుత్వం జాతీయ పార్కులు  (National parks), వన్యప్రాణుల అభయారణ్యాలు  (Wildlife sanctuaries),జీవావరణ కేంద్రాలను  (Biosphere reserves)  ఏర్పాటు చేసింది. చెరువులు, సరస్సులు, చిత్తడి ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది.


ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌ (1992) 


ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. దీని ముఖ్య ఉద్దేశం భారతీయ ఏనుగులను సంరక్షించడం.


ప్రస్తుతం మన దేశంలో మొత్తం ఎలిఫెంట్‌ రిజర్వ్‌ల సంఖ్య 33.


 2017 నాటికి భారతదేశంలో ఉన్న మొత్తం ఏనుగుల సంఖ్య 27,312. ఏనుగుల ప్రాముఖ్యతను తెలిపేందుకు ఏటా ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.


 దేశంలో మొదటి ఎలిఫెంట్‌ రిజర్వ్‌ సింగ్భమ్‌ రిజర్వ్‌ (ఝార్ఖండ్‌).


దేశంలో అతిపెద్ద ఎలిఫెంట్‌ రిజర్వ్‌ కర్ణాటకలోని మైసూర్‌ రిజర్వ్, చిన్నది నాగాలాండ్‌లోని ఇంటంకి. అధిక ఎలిఫెంట్‌ రిజర్వ్‌లు ఉన్న రాష్ట్రం అసోం. 


 ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరులో ‘రాయల ఎలిఫెంట్‌ రిజర్వ్‌’ ఉంది.


 2010లో ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించారు.


హాథీ మేరా సాథీ (Elephant is my friend) దీన్ని పర్యావరణ, అటవీ,, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ( MOEFCC ), వైల్డ్‌ లైఫ్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా  (WTI) ఆధ్వర్యంలో చేపట్టారు. దీని ముఖ్య ఉద్దేశం - ఏనుగుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం.


ఏనుగుల రక్షిత ప్రాంతాలు


1.Green zone:ఏనుగు - మానవ సంఘర్షణ తక్కువ ఉన్న ప్రాంతం.


2.Yellow zone: ఏనుగు - మానవ సంఘర్షణ మధ్యస్థం.


3.Red zone: ఏనుగు - మానవ సంఘర్షణ అధికం.


దేశంలో అత్యధిక ఏనుగులు ఉన్న రాష్ట్రాలు: కర్ణాటక, అసోం, కేరళ.


ఆపరేషన్‌ ఒలీవియా 


 ఆలీవ్‌ రిడ్లే తాబేళ్లు ఒడిశాలోని గహిర్‌మాతా బీచ్‌కు ఏటా దక్షిణ అమెరికా నుంచి ప్రజననం (Breeding) కోసం వస్తాయి. ఇవి చిన్నగా ఉండే సముద్ర తాబేళ్లు. సముద్రంలో చేపల వేటకు వాడే మర పడవల వల్ల ఇవి పెద్ద సంఖ్యలో మరణిసున్నాయి. వీటిని కాపాడేందుకు ప్రభుత్వం ‘ఆపరేషన్‌ ఒలీవియా’ను ప్రారంభించింది.


 ఆలీవ్‌ రిడ్లే తాబేళ్ల ప్రజనన కేంద్రాన్ని ఒడిశాలోని గహిర్‌మాతా బీచ్‌ వద్ద ఏర్పాటు చేశారు.


ప్రాజెక్ట్‌ క్రొకడైల్‌ 


దీన్ని 1975లో ప్రారంభించారు. మొసళ్ల సంరక్షణ, వాటి సంఖ్యను పెంపొందించడం దీని ఉద్దేశం. దేశంలో మొదటిసారి ఒడిశాలోని సత్‌కోషియా గార్జ్‌ శాంక్చుయరీలో మొసళ్ల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొసళ్ల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని నందన్‌కానన్‌ జూలాజికల్‌ పార్క్‌లో ఏర్పాటు చేశారు.


ప్రాజెక్ట్‌ రైనో 


2005లో ప్రారంభించారు. 2020 నాటికి రైనోల (ఖడ్గమృగాలు) సంఖ్యను 3000కు పెంచడం దీని లక్ష్యం. కజిరంగా, పోచితోర, ఓరాంగ్, మానస్, లాకోవా, దిబ్రూ, షైకోవా శాంక్చుయరీలను వీటి ఆవాస ప్రాంతాలుగా గుర్తించారు. 


గ్రేట్‌ ఇండియన్‌ బస్ట్టర్డ్‌ (బట్టమేకతల పిట్ట) సంరక్షణ 


ఈ పక్షి మన దేశంలో రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ ఉత్తర భాగంలో ఎక్కువగా కనిపిస్తుంది.


 ఇది రాజస్థాన్‌ అధికారిక పక్షి. ఇది ఎగరగలదు. ఎక్కువ బరువు ఉంటుంది. దీన్ని స్థానికంగా గోడ్‌వాన్‌ అంటారు.


 ఈ పక్షి గడ్డి భూముల్లో ఎక్కువగా జీవిస్తుంది. ఈ భూముల ఆక్రమణ వల్ల ఈ జాతి అంతరించిపోయే జాబితాలో చేరింది.


 జైసల్మీర్‌లోని డిజర్ట్‌ నేషనల్‌ పార్క్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉన్న రోళ్లపాడు వద్ద బట్టమేకతల పిట్ట సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.


ప్రాజెక్ట్‌ రెడ్‌ పాండా 


రెడ్‌ పాండాలు సమశీతోష్ణ అడవుల్లో నివసిస్తాయి. వెదురు (Bamboo) వీటి ప్రధాన ఆహారం. వెదురు నిరంతరం తరిగిపోవడం వల్ల వీటి జీవితం ప్రశ్నార్థకంగా మారింది.


 ఇవి మన దేశంలో పశ్చిమ్‌ బంగా, సిక్కిం, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉన్నాయి.


 డార్జిలింగ్‌లోని పద్మజానాయుడు హిమాలయన్‌ జూలాజికల్‌ పార్కులో స్వీటీ, మినీ అనే రెండు రెడ్‌ పాండాలకు రక్షణ కల్పించారు. తర్వాత వాటిని పశ్చిమ్‌ బంగాలో ఉన్న సింగాలియా నేషనల్‌ పార్క్‌కి తరలించారు.


CITES - Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora 


 వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వచ్చి ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీనికి అనుగుణంగా CITES అనే సంస్థను ఏర్పాటు చేశారు.


 అంతర్జాతీయ వ్యాపారం వల్ల వన్యప్రాణులు, వృక్షజాతుల ఉనికికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అనేది దీని ముఖ్య ఉద్దేశం.


 దాదాపు 5000 రకాల వన్యప్రాణులు, 28,000 వృక్షజాతులను కాపాడటం దీని లక్ష్యం. ఈ ఒప్పందం 1973లో జరగ్గా, 1975 నుంచి అమల్లోకి వచ్చింది.


CITES ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.


 1976లో భారత్‌ ఇందులో సభ్యదేశంగా చేరింది. ప్రస్తుతం CITES లోని సభ్యదేశాల సంఖ్య 183.


ప్రాజెక్ట్‌ టైగర్‌ 1972 వరకు మన జాతీయ జంతువుగా సింహం ఉండేది. ఆ సమయంలో దేశంలో పులుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వీటిని సంరక్షించేందుకు 1973లో అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ టైగర్‌ను ప్రారంభించింది. అదే ఏడాది నుంచి పులి మన జాతీయ జంతువుగా మారింది.


 ఈ ప్రాజెక్ట్‌ ప్రకారం, పులుల సంరక్షణ కోసం టైగర్‌ రిజర్వ్‌లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భారతదేశంలో 54 టైగర్‌ రిజర్వ్‌లు ఉన్నాయి.


దేశంలో పులుల సంఖ్య


ప్రాజెక్ట్‌ టైగర్‌ ప్రారంభించి 2023, ఏప్రిల్‌ 1 నాటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 2022 ఏడాదికి సంబంధించిన పులుల గణన వివరాలను మైసూరులో విడుదల చేశారు. ఇది అయిదో పులుల గణన నివేదిక. దీని ప్రకారం దేశంలో 3167 పులులు ఉన్నాయి.


* దేశంలో పులుల గణనను మొదటిసారి 2006లో చేశారు. అప్పుడు 1411 పులులు ఉన్నాయి. అప్పటి నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి వీటిని లెక్కిస్తున్నారు. 2010లో పులుల సంఖ్య 1706 ఉండగా, 2014లో 2226, 2018లో 2967 ఉన్నాయి.


* పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.


* మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు పులుల సంఖ్యను పెంచడానికి విశేష కృషి చేస్తున్నాయి. మన దేశంలో ఎక్కువ పులులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్‌.


జిమ్‌ కార్బెట్‌ టైగర్‌ రిజర్వ్‌: ఇది దేశంలో తొలి టైగర్‌ రిజర్వ్‌. దీన్ని 1936లో స్థాపించారు. బ్రిటిష్‌ వారు మొదట దీన్ని జాతీయ ఉద్యానవనంగా నెలకొల్పారు. అప్పట్లో దీన్ని ‘విలియం మాల్కం హేలీ నేషనల్‌ పార్క్‌’ అని పిలిచేవారు. 1956లో దీని పేరును ‘జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌’ అని మార్చారు. 1973 నుంచి ఇది పులుల సంరక్షణ కేంద్రంగా మారింది.


శ్రీవిల్లిపుత్తూర్‌ మేఘమలై టైగర్‌ రిజర్వ్‌: దీన్ని 2021లో ఏర్పాటు చేశారు. ఇది దేశంలో 51వ టైగర్‌ రిజర్వ్‌. తమిళనాడులో ఉంది. శ్రీవిల్లిపుత్తూర్‌ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చుయరీ, మేఘమలై వైల్డ్‌ లైఫ్‌ శాంక్చుయరీలను కలిపి దీన్ని నెలకొల్పారు.


రామ్‌ఘర్‌ విశ్‌ధారి టైగర్‌ రిజర్వ్‌: ఇది 52వ టైగర్‌ రిజర్వ్‌. రాజస్థాన్‌లో ఏర్పాటైన నాలుగో టైగర్‌ రిజర్వ్‌. మిగిలినవి: రణథంబోర్‌ టైగర్‌ రిజర్వ్, సరిస్కా టైగర్‌ రిజర్వ్, ముకుంద్రా హిల్స్‌ టైగర్‌ రిజర్వ్‌.


గురుఘాసిదాస్‌ నేషనల్‌ పార్క్‌: దేశంలో 53వ టైగర్‌ రిజర్వ్‌. ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. దీన్ని సంజయ్‌ నేషనల్‌ పార్క్‌ అని కూడా అంటారు. గురుఘాసిదాస్‌ నేషనల్‌ పార్క్, టామోర్‌ పింగ్లా వన్యప్రాణుల అభయారణ్య సంయుక్త ప్రాంతాలను కలిపి టైగర్‌ రిజర్వ్‌గా గుర్తించారు.


రాణీపుర్‌ టైగర్‌ రిజర్వ్‌: దేశంలో కొత్తగా నెలకొల్పిన 54వ టైగర్‌ రిజర్వ్‌. దీన్ని 2022, అక్టోబరు 19న ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఉంది.


దేశంలోని టైగర్‌ రిజర్వ్‌లు


ఉత్తరాఖండ్‌: రాజాజీ టైగర్‌ రిజర్వ్, కార్బెట్‌ టైగర్‌ రిజర్వ్‌.


ఉత్తర్‌ ప్రదేశ్‌: దుద్వా టైగర్‌ రిజర్వ్, పిలిభిత్‌ టైగర్‌ రిజర్వ్‌.


రాజస్థాన్‌: ముకుంద్రా, సరిస్కా, రణథంబోర్, రామ్‌ఘర్‌ విశ్‌ధారి.


మధ్యప్రదేశ్‌: బంధన్‌ఘర్, కన్హా, మెల్‌ఘాట్, పన్నా, సంజయ్‌ దుబ్రి, పెంచ్‌.


ఛత్తీస్‌గఢ్‌: గురుఘాసిదాస్, ఉదంతి.


ఝార్ఖండ్‌: పలమావు టైగర్‌ రిజర్వ్‌.


ఒడిశా: సత్కాషియా, సిమ్లిపాల్‌.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: నాగార్జునసాగర్‌ - శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌.


తెలంగాణ: కవ్వాల్, అమ్రాబాద్‌.


మహారాష్ట్ర: సహ్యాద్రి, తడోబా అంధేరి.


కర్ణాటక: భద్ర, దండేలి, మధుమలై, నాగర్‌హోల్‌. 


రచయిత


పి.కె. వీరాంజనేయులు

 

Posted Date : 26-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు