• facebook
  • whatsapp
  • telegram

రక్షణ రంగ సాంకేతికత - ఇటీవల ప్రయోగాలు

ఆధునిక ఆయుధాల అమ్ములపొది!

 

ఆధునిక యుగంలో యుద్ధ తంత్రం రూపు మారుతోంది. అమ్ములపొదిలోని సంప్రదాయ యుద్ధసామగ్రి స్థానాన్ని సాంకేతిక ఆధారిత వ్యవస్థలు ఆక్రమిస్తున్నాయి. లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించే క్షిపణుల ప్రాధాన్యం పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఈ పోటీలో భారతదేశం ముందంజలో ఉంది. స్వదేశీ సాంకేతిక సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటూ అధునాతన ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది. ఇటీవల అభివృద్ధి చేసిన రక్షణ రంగ సాంకేతికత, జరిపిన ప్రయోగాలు, మిత్ర దేశాలతో కలిసి నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల సమాచారాన్ని అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.

 

ఒక దేశ భద్రతకు, సమగ్రతకు రక్షణ రంగ సాంకేతికత అత్యంత అవసరం. శత్రుదేశాలపై పైచేయి సాధించడానికి, యుద్ధరంగంలో విజయానికి, యుద్ధం చేయకుండానే శత్రుదేశాలను కలవరపాటుకు గురిచేయడానికి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం అనివార్యం.

 

రాత్రి వేళ అగ్ని- V క్షిపణి పరీక్ష: అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగిన అగ్ని - 5 క్షిపణిని 2022, డిసెంబరు 15న భారత్‌ పరీక్షించింది. దీని పరిధి 5 వేల కిలోమీటర్లు. ఈ ప్రయోగాన్ని ఒడిశాలోని అబ్దుల్‌ కలాం ఐలాండ్‌ (వీలర్‌ ఐలాండ్‌) నుంచి రాత్రివేళ నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఐజీఎండీపీ)లో భాగంగా అగ్ని క్షిపణిని మన దేశం అభివృద్ధి చేసింది. ఇందులో అగ్ని-I, II, III, IV, V రకాలున్నాయి. వీటన్నింటినీ విజయవంతంగా పరీక్షించి సైన్యంలో ప్రవేశపెట్టింది. అగ్ని - VI అభివృద్ధి దశలో ఉంది.

 

అగ్ని - P (ప్రైమ్‌): భారతదేశం రక్షణ రంగ పరిశోధన సంస్థ - డీఆర్‌డీఓ అగ్ని-P క్షిపణిని అబ్దుల్‌ కలాం ఐలాండ్‌ నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఇది కొత్త తరానికి చెందిన క్షిపణి. తొడుగు నుంచి ప్రయోగించవచ్చు. క్షిపణులను తొడుగు (canister)లో ఉంచడం వల్ల తక్కువ సమయంలో ప్రయోగించవచ్చు. నిల్వ చేయడం తేలిక. ఇది రెండు దశల ఘన ఇంధనం ఉన్న బాలిస్టిక్‌ క్షిపణి.

 

ప్రళయ్‌: ఉపరితలం నుంచి ఉపరితలానికి ఉపయోగించగలిగిన అత్యాధునిక స్వదేశీ క్షిపణి ప్రళయ్‌ని అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి పరీక్షించారు. ఘనరూప ఇంధనంతో పనిచేసే దీని పరిధి 150 - 500 కిలోమీటర్లు. మొబైల్‌ లాంచర్‌ నుంచి ఉపయోగించవచ్చు. ఇది భారత్‌లో మొదటి క్వాసీ బాలిస్టిక్‌ మార్గంలో ప్రయాణించే క్షిపణి. లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించే సామర్థ్యం దీని సొంతం.

 

ధ్రువాస్త్ర: భారతదేశం స్వదేశీ పరిజ్ఞానం నిర్మించిన ట్యాంక్‌ విధ్వంసక క్షిపణి ధ్రువాస్త్ర. ఇది మూడో తరానికి చెందింది. ఎయిర్‌ ఫోర్స్‌ వెర్షన్‌ ట్యాంక్‌ విధ్వంసక క్షిపణిగా పిలుస్తున్నారు. పరిధి 7 - 8 కిలోమీటర్లు. దీన్ని అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ నుంచి ఉపయోగించవచ్చు.  భారతదేశం ఈ క్షిపణినే కాకుండా హెలికాప్టర్‌ నుంచి ప్రయోగించగలిగే హెలీనా అనే ట్యాంకు విధ్వంసక క్షిపణినీ అభివృద్ధి చేసింది.

 

డ్రోన్‌ల దాడిని ఎదుర్కొనే వ్యవస్థలు: మానవ రహిత విమానాలను (UAVs) డ్రోన్‌లు అంటారు. ఇవి సరిహద్దుల్లో చొరబాట్లను గుర్తించడానికి, శత్రుస్థావరాలపై దాడులు చేయడానికి రక్షణ రంగంలో ఎంతో ఉపయోగపడతాయి. భవిష్యత్తు యుద్ధ రంగాన్ని డ్రోన్‌లు శాసిస్తాయనడంలో సందేహం లేదు. డీఆర్‌డీఓ సొంతంగా, ప్రైవేటు వ్యవస్థలతో కలిసి డ్రోన్‌లను నిర్వీర్యం చేసే సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. కొన్ని ప్రైవేటు సంస్థలు ఇప్పటికే డ్రోన్‌లను ఎదుర్కొనే వ్యవస్థలను రూపొందించాయి.

 

 

D4, C-UAS: D4 - డ్రోన్, డిటెక్ట్, డిటర్, డిస్ట్రాయ్‌; C-UAS - కౌంటర్‌ అన్‌మ్యాన్‌డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టం. డీఆర్‌డీఓ, అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ సంయుక్తంగా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే దీన్ని పరీక్షించారు. స్థిరంగా లేదా కదులుతున్న వాహనాలపై ఈ వ్యవస్థను ఉంచి డ్రోన్‌లను ఎదుర్కోవచ్చు. రాత్రి, పగలు కూడా పనిచేస్తుంది. శత్రుదేశాల డ్రోన్‌లను గుర్తించి నిర్వీర్యం చేయవచ్చు. ఇందులో 3600 కోణంలో పనిచేసే X బ్యాండ్‌ రాడార్‌ ఉంది. 4 కిలోమీటర్ల  పరిధిలోని డ్రోన్లను గుర్తిస్తుంది.

 

స్మాష్‌ - 2000 ప్లస్‌ వ్యవస్థ: డ్రోన్‌ల దాడిని ఎదుర్కోవడానికి, వాటిని నేలకూల్చడానికి ఈ వ్యవస్థను ఇజ్రాయెల్‌ రూపొందించింది. భారత్‌ కొనుగోలు చేసింది. AK - 47 లేదా AK - 203 తుపాకులపై ఉంచి దీనిని ప్రయోగించాలనుకుంటున్నారు. వీటి సహాయంతో కదులుతున్న లక్ష్యాలను కూడా నేల కూల్చవచ్చు.

 

డ్రోన్‌ డిఫెన్స్‌ డోమ్‌ - ఇంద్రజాల్‌: భారతదేశంలో మొదటిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన డ్రోన్‌ల రక్షణ వ్యవస్థ ఇంద్రజాల్‌. హైదరాబాద్‌కు చెందిన గ్రెనె రోబోటిక్స్‌ సంస్థ అభివృద్ధి చేసింది. వెయ్యి నుంచి రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో గాలిలో ఉన్న లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం ఈ టెక్నాలజీకి ఉంది. 

 

 

తేలికరకం యుద్ధ హెలికాప్టర్‌: భారతదేశం అభివృద్ధి చేసిన తేలిక రకం యుద్ధ హెలికాప్టర్‌ ప్రచండ్‌. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) రూపొందించింది. దీనికి రెండు ఇంజిన్లు ఉంటాయి. ఇందులో గాలి నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులు, 20 ్ఝ్ఝ తుపాకులు, రాకెట్‌ వ్యవస్థలు ఉన్నాయి. ఈ హెలికాప్టర్‌ సహాయంతో శత్రుదేశాల ట్యాంకులు, బంకర్లు, డ్రోన్లను నాశనం చేయవచ్చు.

 

అయిదో తరం యుద్ధవిమానం: భారతదేశంలో నిర్మిస్తున్న అయిదో తరం యుద్ధ విమానం AMCA - అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌. దీన్ని డీఆర్‌డీఓ, ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, ఫ్రెంచ్‌ సంస్థ-సాఫ్రాన్‌ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం సాఫ్రాన్‌ సంస్థ హైదరాబాద్‌లో తమ యూనిట్‌ను నెలకొల్పింది.

 

సంయుక్త యుద్ధ విన్యాసాలు

కొత్త యుద్ధ రీతులు నేర్చుకోవడానికి, ఇతర దేశాలతో రక్షణ సంబంధాలు ఏర్పరచుకోవడానికి, పోరాట పటిమను మెరుగుపరచుకోవడానికి భారతదేశం ఇతర దేశాలతో కలిసి సైనిక విన్యాసాలు (యుద్ధ విన్యాసాలు) చేపట్టింది.

వరుణ - 2022: భారతదేశం, ఫ్రాన్స్‌తో కలిసి నిర్వహించిన 20వ నావికా విన్యాసాలను వరుణ - 2022గా పిలుస్తున్నారు. అరేబియా సముద్రంలో 2022 మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకు జరిగాయి.

ధర్మ గార్డియన్‌ - 2022: జపాన్, భారత్‌ కలిసి చేసిన సైనిక విన్యాసాలకు ఈ పేరు పెట్టారు. కర్ణాటకలోని బెల్గామ్‌లో 2022 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10 వరకు నిర్వహించారు.

హరిమావు శక్తి - 2022: భారత్, మలేసియాతో కలిసి 2022 నవôబరు 28 నుంచి డిసెంబరు 12 వరకు చేసిన సైనిక విన్యాసాలు. మలేసియాలోని క్లుఆంగ్‌లో నిర్వహించారు. 2012 నుంచి ఏటా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి.

ఫ్రింజెక్స్‌ - 23: భారత్, ఫ్రాన్స్‌ సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాలను ఈ పేరుతో పిలుస్తారు. వీటిని తిరువనంతపురంలోని పంగోడే మిలటరీ స్టేషన్‌లో 2023 మార్చి 7, 8 తేదీల్లో నిర్వహించారు.

మలబార్‌ - 20: భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా సంయుక్తంగా చేపట్టిన యుద్ధ విన్యాసాలకు మలబార్‌ - 20 అని పేరు. 2020 నవంబరులో నిర్వహించారు.

సముద్ర శక్తి: భారతదేశం, ఇండొనేసియాతో కలిసి నవంబరు - 2019న నిర్వహించిన సైనిక విన్యాసాలు.

వరుణ - 19: భారతదేశం, ఫ్రాన్స్‌తో కలిసి 2019, మే లో నిర్వహించిన సైనిక విన్యాసాలు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. భారతదేశం ఇటీవల కింది ఏ క్షిపణిని రాత్రి పూట కూడా ప్రయోగించే విధంగా పరీక్షించింది?

1) అగ్ని - V   2) పృథ్వి - II    3) ఆకాశ్‌   4) బ్రహ్మోస్‌

 

2. తొడుగు నుంచి ప్రయోగించగల అగ్ని క్షిపణిని ఏ పేరుతో పిలుస్తున్నారు?

1) అగ్ని - ఎండ్‌ 2) అగ్ని - హైడ్‌   3) అగ్ని - ప్రైమ్‌  4) అగ్ని - కవర్‌

 

3. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల భారతదేశ మొదటి క్వాసీ బాలిస్టిక్‌ క్షిపణి ఏది?

1) నాగ్‌   2) ప్రళయ్‌     3) త్రిశూల్‌    4) పృథ్వి - V

 

4. భారతదేశం ఇటీవల పరీక్షించిన ధ్రువాస్త్ర ప్రత్యేకత?

1) ఇది బాలిస్టిక్‌ క్షిపణి    2) ఇది సూపర్‌ సోనిక్‌ క్షిపణి  3) ఇది హైపర్‌ సోనిక్‌ క్షిపణి 4) ఇది యాంటీ ట్యాంక్‌ క్షిపణి

 

5. డీఆర్‌డీవో, అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరో స్పేస్‌ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న D4, C - UAS వ్యవస్థ ఉపయోగం?

1) డ్రోన్లను నిర్వీర్యం చేయగలదు.  2) యుద్ధ విమానాలను ధ్వంసం చేస్తుంది. 3) కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలను నాశనం చేస్తుంది. 4) బాంబులను ప్రయోగిస్తుంది.

 

6. డ్రోన్లను నేలకూల్చడానికి ఉపయోగపడే స్మాష్‌ - 2000 ప్లస్‌ను భారతదేశం ఏ దేశం నుంచి కొనుగోలు చేయనుంది?

1) అమెరికా 2) ఇజ్రాయెల్‌  3) రష్యా  4) ఫ్రాన్స్‌

 

7. హైదరాబాద్‌కు చెందిన గ్రెనె రోబోటిక్స్‌ సంస్థ రూపొందించిన డ్రోన్‌ డిఫెన్స్‌ డోమ్‌ను ఏమని పిలుస్తున్నారు?

1) మారుత్‌   2) వినాశక్‌   3) ఇంద్రజాల్‌   4) ఆకర్షణ్‌

 

8. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ రూపొందించిన తేలికరకం యుద్ధ హెలికాప్టర్‌?

1)  ధ్రువ  2) తేజస్‌   3) చేతన్‌    4) ప్రచండ్‌

 

9. డీఆర్‌డీవో, ఫ్రాన్స్‌ సంస్థ సాఫ్రాన్‌ సంయుక్తంగా దేన్ని అభివృద్ధి చేస్తున్నాయి?

1) ఐదో తరం యుద్ధవిమానం   2) బాలిస్టిక్‌ క్షిపణి    3) అణు జలాంతర్గామి  4) విమాన వాహక నౌక

 

10. భారతదేశం, ఫ్రాన్స్‌తో కలిసి అరేబియా సముద్రంలో ఇటీవల నిర్వహించిన నావికా విన్యాసాలను ఏమని పిలుస్తున్నారు?

1) మలబార్‌ - 2020   2) హరిమావు శక్తి   3) వరుణ - 2022 4) ధర్మగార్డియన్‌ - 2022

 

సమాధానాలు: 1-1,   2-3,   3-2,   4-4,   5-1,   6-2,   7-3,   8-4,   9-1,   10-3.

 

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌ 


 

Posted Date : 22-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌