• facebook
  • whatsapp
  • telegram

విపత్తు నిర్వహణ - సంసిద్ధ చర్యలు

సంస్థాగత ఏర్పాట్లతో సంరక్షణ!

 

  విపత్తు నిర్వహణలో సంసిద్ధత అనేది ఒక సంరక్షణ ప్రక్రియ. ఇందులో ప్రభుత్వాలు, వ్యక్తులు విపత్తు    పరిస్థితులకు సత్వరమే స్పందించడానికి అనుగుణంగా చర్యలు ఉంటాయి. ముందస్తుగా తగిన ప్రణాళికలు వేయడం, చట్టబద్ధమైన సంస్థల ఏర్పాటు, తగిన   హెచ్చరిక వ్యవస్థలు సిద్ధం చేయడం, వాటి నిర్వహణ, వ్యక్తులకు శిక్షణ వంటివన్నీ ఉంటాయి. విపత్తు    సంభవించినప్పుడు విధ్వంసాన్ని తగ్గించడానికి ముందుగానే తీసుకునే చర్యలన్నీ సంసిద్ధతలో భాగమే.

 

  కమ్యూనిటీ ప్రణాళిక: విపత్తు ఏర్పడినప్పుడు ఆ ప్రాంతానికి పొరుగున ఉన్నవారు లేదా కమ్యూనిటీ ప్రజలే తక్షణం ప్రతిస్పందిస్తారు. స్థానిక అధికారులు, ప్రభుత్వ సంస్థల నుంచి ఏ సహకారం అందకముందే ఇలాంటి ప్రతిస్పందనలు కనిపిస్తాయి.

 

  2004, డిసెంబరు 26న సునామీ తాకిడితో తమిళనాడులో సామియార్‌పెట్టాయ్‌ గ్రామానికంటే దాని చుట్టూ ఉన్న గ్రామాల్లో ఎక్కువ ప్రాణనష్టం జరిగింది. సామియార్‌పెట్టాయ్‌ గ్రామస్థులకు ప్రథమ చికిత్స, శోధన, రక్షణ చర్యలు, తొలి హెచ్చరిక వంటి వాటిలో ముందుగానే శిక్షణ ఇచ్చి ఉండటంతో ప్రాణనష్టం స్థాయి తగ్గింది. ఎలాంటి విపత్తును ఎదుర్కొనేందుకైనా కమ్యూనిటీయే కీలకమని కొన్ని ప్రాధాన్యాలు వివరిస్తాయి.

 

1) మొదటి ప్రతిస్పందకుడు: ఏదైనా విపత్తు జరిగినప్పుడు తక్షణమే స్పందించి కార్యాచరణలోకి దిగేది అక్కడి కమ్యూనిటీయే.

 

2) గరిష్ఠ సమాచారకుడు: ఒక ప్రాంతంలో విపత్తు   జరిగినప్పుడు దాని ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించేది ఆ ప్రాంత నివాసితులే. అందువల్ల విపత్తుకు సంబంధించి అత్యంత నమ్మకమైన సమాచారాన్ని ఆ కమ్యూనిటీయే అందిస్తుంది.

 

3) స్థానిక యంత్రాంగాన్ని కలిగి ఉండటం: కొన్ని ప్రాంతాల్లో విపత్తులు పునరావృతం అవుతుంటాయి. అలాంటిచోట స్థానిక ప్రజలు సంప్రదాయబద్ధమైన యంత్రాంగాలను ముందుగానే కలిగి ఉంటారు.

ఉదా: వరదలు వచ్చే ప్రదేశాలలో ఇళ్లకు దగ్గరగా గట్లు వేసుకుని నీళ్లు రాకుండా చేసుకునే ఏర్పాట్లు వంటివి.

 

4) స్వయం సహాయకుడు: విపత్తుల సమయంలో  స్థానికులకు బయటి నుంచి సహకారం అందేలోపు స్వయంగా వారిలో వారే సహాయం చేసుకుంటారు.

  పాఠశాల వద్ద విపత్తులు ఎదుర్కొనేందుకు నిర్వహణా ప్రణాళిక: 2001, జనవరి 26న గుజరాత్‌లో సంభవించిన కచ్‌ భూకంపంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి కవాతు చేస్తున్న 300 మంది విద్యార్థులపై ఇరువైపులా ఉన్న  భవనాలు కూలడంతో చనిపోయారు. అందువల్ల పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళిక సైతం సిద్ధంగా ఉంటే    విలువైన ప్రాణాలు కాపాడుకోవచ్చు. 

 

ఈ ప్రణాళికలో ఉండాల్సిన అంశాలు:

* ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యానికి విపత్తులపై అవగాహన కల్పించడం, విపత్తు నిర్వహణ ప్రణాళిక ఆవశ్యకతను తెలియజేయడం.

* విపత్తు నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయడం.  ఈ కమిటీకి ప్రిన్సిపల్‌ నాయకత్వం వహించాలి.

* వైపరీత్యాన్ని గుర్తించడం, మదింపు చేయడం.

* మానవ వనరులు, భౌతిక వనరుల జాబితా తయారు చేయడం.

* చిన్నపిల్లలు, ఇతర సిబ్బంది తప్పించుకోవడానికి అందుబాటులో ఉన్న వనరులను గుర్తించే విధంగా మ్యాపులు తయారుచేయడం.

* పాఠశాలలో సురక్షిత ప్రదేశం, ఖాళీ చేసే మార్గం సూచించే చార్టులు అందుబాటులో ఉంచడం.

 

గ్రామ విపత్తు నిర్వహణ ప్రణాళిక: సర్పంచ్‌ నాయకత్వంలో గ్రామ విపత్తు నిర్వహణ కమిటీని ఏర్పాటుచేసుకోవాలని మండల అభివృద్ధి అధికారి (ఎమ్‌డీఓ) గ్రామస్థులకు సూచిస్తారు. ఆ విధంగా ఏర్పాటయ్యే కమిటీలో పాఠశాల ఉపాధ్యాయులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, స్వయం సహాయక సంఘం లీడర్లు, ఆశా వర్కర్లు సభ్యులుగా ఉండాలి. ఈ కమిటీలో వాలంటీర్లుగా యువకులను తీసుకుంటారు. వారికి ప్రాథమిక వైద్యం అందించడంలో, శోధన, రక్షణ చర్యల్లో శిక్షణ ఇస్తారు. వీరంతా విపత్తు సమయంలో ముందుండి రక్షణ చర్యల్లో పాల్గొంటారు.

 

విపత్తు వేళ ప్రతి కుటుంబం వద్ద ఉండాల్సిన కిట్‌: 1) పొడి దుస్తులు 2) ఎండు ఆహార పదార్థాలు, తాగునీరు  3) ముఖ్యమైన పత్రాలు  4) బ్యాటరీలు, టార్చిలైట్, ట్రాన్సిస్టర్‌ 5) ప్రథమచికిత్స పెట్టె  6) అవసరమైన మందులు 7) ఇష్టమైన బొమ్మలు, ఆటవస్తువులు 8) దుప్పటి, దిండు 9) కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువుల ఫొటోలు.

 

దేశంలో విపత్తు నిర్వహణ పరిణామక్రమం

 

1) 1937లో బిహార్‌ - నేపాల్‌ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. ఈ తర్వాత బ్రిటిష్‌ హయాంలోనే విపత్తు నిర్వహణపై వ్యవస్థీకృత నిర్మాణం ప్రారంభమైంది. దీనికోసం ఒక శాఖను ఏర్పాటుచేసి ప్రధాన ఉపశమన అధికారి (సెంట్రల్‌ రిలీఫ్‌ కమిషనర్‌) ఆధ్వర్యంలో నిర్వహించారు.

 

2) ఈ వ్యవస్థ విపత్తు సంభవించిన ప్రదేశంలో  ఉపశమన సామగ్రిని అందించడం, డబ్బు, వస్త్రాలు, మందుల పంపిణీ వంటి పరిమిత  విధులు నిర్వర్తించేది.

 

3) స్వాతంత్య్రానంతరం కూడా విపత్తు నిర్వహణ ప్రధాన   ఉపశమన అధికారి ఆధ్వర్యంలోనే చాలాకాలం కొనసాగింది.

 

4) 1990లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా 1990 - 2000ను ప్రకటించింది. ఆ వెంటనే మన దేశంలో  శాశ్వతమైన సంస్థాగత విపత్తు నిర్వహణ విభాగాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

 

5) మహారాష్ట్రలోని లాతూర్‌ భూకంపం (1993), ఉత్తరాఖండ్‌లోని మాల్పా భూపాతం (1998), ఒడిశాలో సూపర్‌ సైక్లోన్‌ (1999) వంటి వరుస విపత్తుల నేపథ్యంలో 1999, అక్టోబరులో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి జె.సి.పంత్‌ ఛైర్మన్‌గా విపత్తులపై అత్యున్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటుచేశారు.

 

6) 10వ పంచవర్ష ప్రణాళికలో విపత్తు నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధి పథకాల్లో విపత్తు నిర్వహణ, తీవ్రతను తగ్గించే పథకాలను కూడా  కలిపినప్పుడే దీర్ఘకాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ ప్రణాళికలో పేర్కొన్నారు.

 

7) 2002, ఫిబ్రవరి 2న విపత్తు నిర్వహణ విభాగాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చారు. అప్పటినుంచి హోం మంత్రిత్వ శాఖలోని  ఒక సంయుక్త కార్యదర్శి  ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ కొనసాగుతోంది.

 

8) ప్రస్తుతం విపత్తు నిర్వహణ సంస్థాగత నిర్మాణం కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఉంది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు బహుళ భాగస్వామ్య వ్యవస్థగా పనిచేస్తోంది. ఇందులో పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖల పాలనా సంస్థలు పాలుపంచుకుంటాయి. ఈ విధంగా దేశంలో విపత్తు   నిర్వహణ ఏదైనా సంఘటన  జరిగినప్పుడే ప్రతిస్పందించే స్థాయి నుంచి విపత్తుకు ముందే దానికి దారితీసే కారణాలు  అన్వేషించి, వాటిని నివారించే వ్యవస్థాగత స్థాయికి అభివృద్ధి చెందింది. అంటే ఏక ప్రావీణ్య పరిధి నుంచి బహుముఖ సామర్థ్య  స్థాయికి చేరింది.

 

విపత్తు నిర్వహణ చట్టం: సమర్థ విపత్తు నిర్వహణకు, విపత్తుకు సంబంధించిన లేదా దానివల్ల యాదృచ్ఛికంగా జరిగిన ఘటనల నిర్వహణకు భారత ప్రభుత్వం చట్టం చేసింది. 2005, డిసెంబరు 23న ‘విపత్తు నిర్వహణ చట్టం’ను రూపొందించింది. 

Posted Date : 21-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌