• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచంలో విపత్తులు - సమీక్ష

అంతకంతకు అధికమవుతున్న ఆపదలు!


 

ప్రపంచవ్యాప్తంగా విపత్తుల వల్ల నష్టాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రాబోయే దశాబ్దాల్లో నగరీకరణ వల్ల మరింత ముప్పు ముంచుకొచ్చే అవకాశాలు ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రకృతి విపత్తులతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య ఆసియా దేశాల్లోనే అధికంగా ఉంది. మానవ కారక విపత్తులు కూడా గణనీయంగా ఎక్కువవుతున్నాయి. ఇవి మానవాభివృద్ధి అల్పంగా ఉన్న ప్రాంతాల్లో అధికంగా ఉండటం గమనార్హం. దక్షిణాసియా ప్రాంతం కూడా దుర్బలత్వాన్ని ఎదుర్కొంటోంది. ఇక్కడ జలావరణ విపత్తుల వల్ల అధిక ఆర్థిక నష్టాలు ఏర్పడుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ తాజా గణాంకాలతో సహా అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటితోపాటు ఇటీవల సంభవించిన వైపరీత్యాలకు సంబంధించిన వివరాలపై పరీక్షల కోణంలో అవగాహన పెంచుకోవాలి. 

ప్రకృతి విపత్తులకు సంబంధించిన రికార్డుల నమోదు క్రీ.పూ.430 సమయంలోనే ప్రారôభమైంది. ఆ ఏడాదే ఏథెన్స్‌ నగరంలో టైఫన్‌ మహమ్మారి సంభవించినట్లు నమోదైంది. క్రీ.శ.1556కు ముందు   ప్రపంచంలో 10 అత్యంత భయంకరమైన ప్రకృతి విపత్తులు సంభవించాయి. 1556, జనవరి 23న చైనాలోని షాంఘై ప్రావిన్స్‌లో భూకంప తాకిడికి 8,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచవ్యాప్తంగా విపత్తుల కారణంగా ఏటా సగటున సంభవించే నష్టం విలువ 1980లలో 50 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు ఉండగా, గత దశాబ్దం (2010)లో నాలుగింతలు అంటే 200 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులకు పైగా నగరాల్లో నివసిస్తారని ఐక్యరాజ్యసమితి అంచనా. ఈ ధోరణులు 1.3 బిలియన్ల ప్రజలను, 158 బిలియన్‌ డాలర్ల ఆస్తులను నదీ, తీరప్రాంత వరదల ముప్పులోకి నెట్టనున్నాయని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. నగరాలను మరింత పటిష్ఠం చేయడానికి గణనీయమైన పెట్టుబడులు పెట్టాలని, లేకపోతే 2030 నాటికి ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచ    వ్యాప్తంగా నగరాల్లోనే ఏటా 314 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లుతుందని కూడా ప్రపంచ బ్యాంకు ‘ఇన్వెస్టింగ్‌ ఇన్‌ అర్బన్‌ రెసిలియన్స్‌’ నివేదిక పేర్కొంది. 20వ శతాబ్దం రెండో అర్ధ భాగంలో ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల్లో 200కి పైగా పెనువిపత్తులు సంభవించాయి. సుమారు 14 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పారిశ్రామిక దేశాలతో పోల్చుకుంటే విపత్తుల వల్ల సంభవించిన నష్టం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 20 రెట్లు అధికంగా ఉంది. ప్రకృతి విపత్తుల ప్రాణనష్టం అధికంగా జరిగిన దేశాల జాబితాలో ఆసియా దేశాలు అగ్రభాగాన ఉన్నాయి.

ఇటీవల కాలంలో సహజ, మానవకారక విపత్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 1994 నుంచి 1998 వరకు ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 428 విపత్తులు సంభవించాయి. 1992-2000 మధ్య ఏటా సగటున 500 విపత్తుల చొప్పున, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 4,989 విపత్తులు సంభవించాయి. 1990-2023 మధ్య ఏటా సగటున 707 విపత్తులు నమోదయ్యాయి. 1994-1998 మధ్యకాలంతో పోల్చుకుంటే 1999-2003 మధ్య విపత్తుల సంఖ్య సగటున సంవత్సరానికి 60% పెరిగింది. మానవాభివృద్ధి అల్పంగా ఉన్న దేశాల్లో 142% విపత్తులు పెరగడం గమనార్హం. 1992-2001 మధ్య సంభవించిన విపత్తులను పరిశీలిస్తే కరవు, దుర్భిక్షం అత్యంత ప్రాణాంతక విపత్తులని నిరూపితమయ్యాయి. వరదలు, సాంకేతిక ప్రమాదాలు, భూకంపాలు, తుపాన్లు, అసాధారణ ఉష్ణోగ్రతలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

దక్షిణాసియా పరిస్థితి: వైపరీత్య ఘటనలకు సంబంధించి దక్షిణాసియా ప్రాంతం అధిక ప్రమాదం, దుర్బలత్వాన్ని ఎదుర్కొంటోంది. అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులను కూడా తప్పనిసరిగా సహాయక, ప్రతిస్పందన, పునరావాస కార్యక్రమాలకు వెచ్చించాల్సి వస్తోంది. ఫలితంగా మూలధన కల్పనను బలవంతంగా నిలిపేయాల్సిన పరిస్థితి. గత పదేళ్లలో దక్షిణాసియా దేశాలకు వాటిల్లిన నష్టం 50 బిలియన్‌ డాలర్లకు పైమాటే. ఎమర్జెన్సీ ఈవెంట్స్‌ డేటాబేస్‌ (EMDAT) ప్రాతిపదికన 1971-2009 మధ్యకాలంలో దక్షిణాసియా 1,017 ప్రకృతి విపత్తులను ఎదుర్కొంది. 1971లో 8 విపత్తులు నమోదుకాగా, 2009లో 40కు పైగా నమోదయ్యాయి. ఈ ఘటనలు 2 బిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేయగా, 8 లక్షల మందికి పైగా మరణించారు. ఈ కాలంలో 80 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు పైగా ప్రత్యక్ష ఆర్థిక నష్టం వాటిల్లింది. పరోక్ష నష్టాలనూ పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత ఎక్కువవుతుంది. అధిక వర్షపాతం, తుపాను ఘటనలను తట్టుకునే సామర్థ్యం పరిమితంగా ఉండటం, తీవ్ర ముప్పున్న ప్రాంతాల్లోనే ఆస్తులు కేంద్రీకృతం అవుతుండటంతో దక్షిణాసియా ప్రాంతంలో జలవాతావరణ విపత్తుల వల్ల ఆర్థిక నష్టాలు అధికమవుతున్నాయి.

ప్రపంచంలోనే అత్యధికంగా వరదలు, తుపాన్లను ఎదుర్కొనే ప్రాంతంగా దక్షిణాసియా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా వరదలకు గురయ్యే ప్రజల్లో 64% దక్షిణాసియా వాసులే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తుపాన్లకు గురయ్యే ప్రాంతాల్లో దక్షిణాసియాది రెండో స్థానం. గత 40 ఏళ్లలో దక్షిణాసియా ప్రాంతంలో మౌలిక వసతులపై వ్యయం గణనీయంగా పెరిగింది. స్థిర మూలధన కల్పన 1970తో పోల్చుకుంటే 2010 నాటికి దాదాపు 50 రెట్లు అధికమైంది. ఫలితంగా నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు మౌలిక వసతులతో ఎక్కువగా ఆస్తుల కేంద్రీకరణ జరిగింది. అభివృద్ధి స్థాయులు పెరిగినప్పటికీ ఈ ఆస్తులు  వైపరీత్య ఘటనలను తట్టుకునే విధంగా ఉండటం లేదు ఆస్తులు, ఉత్పత్తిపై దీర్ఘకాలిక ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాల కారణంగా దక్షిణాసియాలో వరదల వల్ల నష్టాలు అధికంగా ఉంటున్నాయి. దక్షిణాసియా ప్రాంత జీడీపీ పరిమాణంలో వరద నష్టాలు, దేశాల నష్టాల కంటే దాదాపు 15 రెట్లు అధికం. దీనికి భిన్నంగా అధిక మరణాలకు దారితీసే తుపాన్లు, అధిక తీవ్రత కలిగిన ఘటనలు తక్కువ నష్టం కలిగిస్తున్నాయి. గత కొన్నేళ్లలో సహజ విపత్తుల కారణంగా దక్షిణాసియాలో 8,25,000 మంది మృతిచెందారు. గత దశాబ్దం (2010)లోనే ఈ ప్రాంత జనాభాలో సగం కంటే ఎక్కువ అంటే 700 మిలియన్ల మందికి పైగా ప్రజలు విపత్తుల ప్రభావానికి గురయ్యారు.

తుర్కియే అతలాకుతలం

తుర్కియేలో 2023, ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపం గత శతాబ్ద కాలంలో కనీవినీ ఎరుగని తీరులో ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విపత్తులో 35 వేల మందికిపైగా దుర్మరణం చెందారని, 1,05,505 మంది గాయపడ్డారని ఆ దేశాధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డొగాన్‌ ప్రకటించారు. 2,11,000 మంది నివసిస్తున్న 47 వేల భవనాల్లో కొన్ని కుప్పకూలగా, మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంపం సంభవించిన తొమ్మిది రోజుల తర్వాత కూడా శిథిలాల కింద నుంచి ప్రజల స్వరాలు వినిపిస్తున్నట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. నీరు, ఆహారం లేక అలమటించి ఎందరో ప్రాణాలు విడిచారు. క్షతగాత్రుల చికిత్స కోసం తుర్కియే ఒక యుద్ధ నౌకను తాత్కాలిక ఆసుపత్రిగా మార్చింది. ఇదే భూకంపంలో పొరుగునున్న సిరియా దేశంలో 50 లక్షల మంది ప్రభావితమయ్యారు. వీరిని ఆదుకోవడానికి 397 మిలియన్‌ డాలర్ల సేకరణకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. తుర్కియే, సిరియాలో కలిపి 2 కోట్ల 60 లక్షల మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అతిశీతల ఉష్ణోగ్రతలు, అపరిశుభ్రత కారణంగా అనేక రోగాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. తుర్కియేలోని ఎర్జింకాన్‌ ప్రావిన్స్‌లో 1939లో వచ్చిన భూకంపంలో 33 వేల మంది  మరణించారు.

ఇతర వివరాలు

2005లో రెగెర్, బాబర్‌ రచించిన ‘ఇన్‌ ద లైన్‌ ఆఫ్‌ ఫైర్‌: ట్రామా ఇన్‌ ది ఎమర్జెన్సీ సర్వీసెస్‌’ పుస్తకం ప్రకారం 1995-2005 మధ్య ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు లేదా ప్రపంచ జనాభాలో 1/3వ వంతు జనాభా విపత్తుల తాకిడికి గురైంది. సహజ విపత్తుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 60,000 మంది మరణిస్తున్నారు.

* ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌క్రాస్‌ అండ్‌ రెడ్‌క్రిసెంట్‌ సొసైటీస్‌ ప్రచురించిన ‘ప్రపంచ విపత్తు నివేదిక 2010’ ప్రకారం 2000-2009 మధ్య ప్రపంచవ్యాప్తంగా విపత్తుల ప్రభావానికి గురైన వారిలో 85% ఆసియా, పసిఫిక్‌ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు.

* ఐక్యరాజ్యసమితి విపత్తు కుదింపునకు అంతర్జాతీయ వ్యూహం విడుదల చేసిన గ్లోబల్‌ అసెస్‌మెంట్‌ రిపోర్ట్‌ 2011 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వరదలకు గురవుతున్న వారిలో 90 శాతానికిపైగా దక్షిణాసియా, తూర్పుఆసియా, పసిఫిక్‌ దేశాల్లోనే ఉంటున్నారు.

* అధిక జనాభా కారణంగా భారత్, బంగ్లాదేశ్‌ అధికంగా విపత్తులకు గురవుతున్నాయి. భౌగోళిక విస్తీర్ణం, నదులు, స్థలాకృతి కారణంగా బంగ్లాదేశ్‌ తీర ప్రాంతాలు వరదలు, తుపాన్ల బారిన పడుతున్నాయి.  ః ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన ‘నేచురల్‌ హజార్డ్స్, అన్‌నేచురల్‌ డిజాస్టర్స్‌’ నివేదిక ప్రకారం వరదలు, తుపాన్లు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం విస్తరించి ఉండగా, ఆఫ్రికాలో తరచూ కరవులు సంభవిస్తున్నాయి. కరవులు, వరదల పీడిత దేశాలే ప్రపంచంలోనే అత్యంత ఆకలి దేశాలుగా ఉన్నాయి.

* కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2011 నివేదిక ప్రకారం విపత్తుల వల్ల సంభవించే నష్టం (జీడీపీలో శాతం) పారిశ్రామిక దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 20 రెట్లు అధికం.

* యూఎన్‌ఐఎన్‌డీఆర్‌ విడుదల చేసిన ‘డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌: యాన్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ అఛీవింగ్‌ ద మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌’ ప్రకారం భూకంపాలు, తుపాన్లు, వరదలు, కరవులకు గురవుతున్నవారిలో 85% మంది అభివృద్ధి చెందుతున్న దేశాలవారే.

* విపత్తుల వల్ల నేరుగా సంభవించే నష్టం విలువ 1960ల్లో సంవత్సరానికి 75.5 అమెరికన్‌ బిలియన్‌ డాలర్లు కాగా, గత పదేళ్లలో సంవత్సరానికి ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్ల (లక్ష కోట్ల డాలర్లు)కు చేరింది.


రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌  

Posted Date : 23-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌