• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచంలో భూకంపాల విస్తరణ

విలయాలకు నెలవైన అగ్ని వలయం!
 


మానవ మేధ, సాంకేతికత ఎంతగా పురోగమించినప్పటికీ ముందస్తుగా గుర్తించలేని, నివారించలేని అతిపెద్ద ప్రకృతి విపత్తులే భూకంపాలు, సునామీలు. దశాబ్దాలుగా సాధించిన అభివృద్ధి, సృష్టించిన సంపదను క్షణాల్లో నాశనం చేయగలిగిన ప్రచండ శక్తి వాటికి ఉంటుంది. అలాంటి విలయాలకు ప్రపంచ వ్యాప్తంగా అవకాశం ఉన్న ప్రాంతాలు, అందుకు దారితీసే కారణాలు, అవి సృష్టించే విషాదాల గురించి తగిన ఉదాహరణలతో పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. భారతదేశంలోని భూకంప జోన్‌లు, సునామీ  ప్రభావిత ప్రాంతాలపై తగిన అవగాహన కలిగి ఉండాలి.
 

ప్రపంచంలో అత్యంత  తీవ్రమైన, ప్రాణాంతకమైన సునామీ 2004, డిసెంబరు 26న ఉత్తర సుమత్రా- ఇండొనేసియా దీవుల్లో 9.1 తీవ్రతతో, 51 మీటర్ల గరిష్ఠ ఎత్తుతో సంభవించింది. ఈ విలయంలో 2,30,210 మంది మృతిచెందారు.

ప్రపంచ వ్యాప్తంగా భూకంప ప్రమాదం లేని ప్రాంతాలు ఆస్ట్రేలియా ఖండం, భారతదేశ ద్వీప కల్ప భూభాగం మాత్రమే. అగ్నిపర్వత ప్రాంతాల్లో, కొత్తగా ఏర్పడుతున్న వలిపర్వత ప్రదేశాల్లో సాధారణంగా భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. ప్రపంచంలో ముఖ్యంగా రెండు భూకంప మండలాలున్నాయి. అవి-


1) పసిఫిక్‌ మహాసముద్ర పరివేష్టిత భూకంప మేఖల:  ప్రపంచ భూకంపాల్లో 68% ఈ మేఖలలోనే సంభవిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ అమెరికా పశ్చిమ తీరాల్లోని అలూషియన్‌ దీవులు; ఆసియా ఖండ తూర్పు తీరం, జపాన్, ఫిలిప్పీన్స్‌ దీవులు ఈ ప్రాంతం పరిధిలో ఉండి ఎక్కువ భూకంపాలకు గురవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని విలయాలకు నెలవైన అగ్ని వలయం లేదా ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ అంటారు. ఈ మండలంలో అగ్నిపర్వతాల మేఖలలు, ద్వీపఖండ వక్రతలు, అగాధ  కందకాలు ఉన్నాయి. అలాస్కా నుంచి     న్యూజిలాండ్‌ వరకు విస్తరించి ఉన్న ఈ మేఖలలో ఇండొనేసియా ద్వీపసమూహం కూడా ఉంది.


2) ఆల్ఫ్స్‌ పర్వతాల నుంచి హిమాలయ పర్వత ప్రాంతం వరకు ఉన్న మేఖల: ఈ మేఖలలో సుమారు 21% భూకంపాలు సంభవిస్తున్నాయి. దీన్నే ట్రాన్స్‌ అట్లాంటిక్‌ ఏసియాటిక్‌ మేఖల అంటారు. ఇది ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్, ఇటలీ, గ్రీస్, తుర్కియే, ఇరాన్, ఉత్తర భారతదేశం, మయన్మార్‌ల ద్వారా వెళుతుంది. మిగిలిన 11% భూకంపాలు ఆఫ్రికా పగులు లోయ, ఇతర ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి.


భూకంప ఛాయా మండలం: భూఅంతర్భాగంలో P, S తరంగాలు ప్రయాణించని ప్రదేశం అంటే భూకంప నాభికి వ్యతిరేక దిశలో ఉన్న భూభాగం. భూకంప అధికేంద్ర ప్రాంతం నుంచి 105్న-145్న మధ్య ప్రాంతంలో ఎలాంటి P, S తరంగాలు ప్రయాణించవు. ఈ ప్రాంతమే భూకంప ఛాయా మండలం.

భారతదేశంలో భూకంపాల విస్తరణ: బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ నివేదిక ప్రకారం భారత దేశాన్ని అయిదో జోన్‌ నుంచి రెండో జోన్‌ వరకు నాలుగు భూకంప ప్రభావిత ప్రాంతాలుగా    విభజించవచ్చు.
ఎ) జోన్‌-5 (అత్యంత ప్రమాదకరం): ఈ జోన్‌లో సంభవించే భూకంపాల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 7 నుంచి 9 వరకు ఉంటుంది. ఈ ప్రదేశంలో దేశంలోనే అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే హిమాలయ ప్రాంతాలున్నాయి. అండమాన్‌ - నికోబార్‌ దీవులు, దేశ ఈశాన్య ప్రాంతాలు, మయన్మార్‌ - ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు; సిక్కిం-బిహార్‌లోని వాయవ్య ప్రాంతం; ఉత్తరాఖండ్‌లోని తూర్పు ప్రాంతం, కాంగ్రా లోయ ప్రాంతం (హిమాచల్‌ప్రదేశ్‌), శ్రీనగర్, భారత్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లోని ఇండో - కొహిస్థాన్‌ భ్రంశ రేఖ; అలియాబంద్‌ భ్రంశ రేఖ ప్రాంతం (గుజరాత్‌) ఈ జోన్‌లోనే ఉన్నాయి.

బి) జోన్‌ - 4 (ప్రమాదకరం): హిమాలయాల తర్వాత అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే ప్రాంతం. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6 - 7 వరకు ఉంటుంది. గంగా-సింధూ మైదాన ప్రాంతంలోని సిక్కిం, బిహార్, ఉత్తరాఖండ్, గుజరాత్, జమ్ము-కశ్మీర్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర,      మధ్యప్రదేశ్‌లోని కొంతభాగం, దేశ రాజధాని దిల్లీ ఈ జోన్‌లో ఉన్నాయి.

సి) జోన్‌-3 (మధ్యస్థాయి ప్రమాదకరం): దేశంలో ఎక్కువ ప్రాంతం ఈ జోన్‌లో ఉంది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 4 - 6 వరకు ఉంటుంది. ద్వీపకల్ప భూభాగం ఉత్తరపు అంచు, రాజస్థాన్, నర్మద పగులులోయ ప్రాంతాలు; పశ్చిమతీరం, గుజరాత్‌లోని దక్షిణ ప్రాంతం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, దేశవాణిజ్య రాజధాని ముంబయి  ఈ జోన్‌లో ఉన్నాయి.

డి) జోన్‌-2 (తక్కువ రిస్క్‌ లేదా ప్రమాద రహితం): ద్వీపకల్ప పీఠభూముల్లోని మిగిలిన ప్రాంతం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు; హైదరాబాద్,   బెంగళూరు నగరాలు ఉన్నాయి.

భారతదేశంలో మొదటిసారిగా భూకంపాలు నమోదు చేసే కేంద్రాన్ని 1898లో కలకత్తాలో ఏర్పాటు చేశారు.

సునామీ అనే పదం ‘సు’(Tsu),‘నామీ’ (Nami) అనే రెండు జపనీస్‌ పదాల కలయికతో ఏర్పడింది. ఇందులో ‘సు’ అంటే ఓడరేవు లేదా తీరం, ‘నామీ’ అంటే తరంగాలు అని అర్థం. సముద్రాంతర్గత భూకంపాల వల్ల పెద్దఎత్తున సముద్రపు నీరు తీర ప్రాంతాల వైపు స్థానభ్రంశం చెందడంతో తీరప్రాంతాలను ఒకదాని తర్వాత మరొకటి ముంచేసే ఎత్తయిన అలల పరంపరనే ‘సునామీ’ అంటారు. ఈ అలల పరంపరకు 1963లో అమెరికాలోని హవాయిలో జరిగిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల సదస్సులో సునామీ అనే పదాన్ని అంగీకరించారు. తమిళంలో సునామీని ‘ఆజి పెరలై’ అని పిలుస్తారు.

సునామీల నమోదు కార్యక్రమం క్రీ.పూ.479లో ఏజియన్‌ సముద్రంలో సంభవించిన మొదటి సునామీతో ప్రారంభమైనట్లు చరిత్ర ఆధారాలు తెలియజేస్తున్నాయి.సునామీలకు సంబంధించిన మొదటి జాబితాను 1934లో అమెరికాకు చెందిన హెక్‌ అనే శాస్త్రవేత్త రూపొందించారు.

కారణాలు:

1) సముద్రాంతర్గత భూకంపాల వల్ల వచ్చే భ్రంశ చలనాలు - 75%    

2) అగ్నిపర్వత విస్ఫోటాలు - 5%    

3) భూపాతాలు - 5%            

4) ఉల్కాపాతాలు

ప్రపంచంలో 80% సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, భూకంపాలు సర్వసాధారణంగా ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ప్రాంతంలోనే సంభవిస్తూ ఉంటాయి.భారతదేశ తీరప్రాంతం మొత్తం సునామీ దుర్భలత్వంలో ఉంది.

* ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (INCOIS) ప్రకారం భారతదేశ తీరాన్ని సునామీ తరంగాలు తాకాలంటే రిక్టర్‌ స్కేలుపై 7.5 కంటే ఎక్కువ తీవ్రత ఉన్న సముద్రాంతర్గత భూకంపం రావాలి. అండమాన్‌ - సుమత్రా, పాకిస్థాన్‌లోని మక్రాన్‌ ప్రాంతాల్లో మాత్రమే అంతటి తీవ్రతతో భూకంపాలు సముద్రంలో వచ్చేందుకు అవకాశం ఉంది. అంతటి తీవ్రత ఉన్న భూకంపాలన్నీ కచ్చితంగా సునామీలకు దారి తీస్తాయని కూడా చెప్పడం సాధ్యం కాదు. 


లక్షణాలు:  

* సముద్రాంతర్గత ప్రాంతాల్లో భూకంపాలు జనించినప్పుడు విడుదలయ్యే గతిశక్తి కారణంగా పైన ఉన్న నీరు అంతర ప్రవాహంగా గంటకు దాదాపు 500 నుంచి 1000 కి.మీ. వేగంతో తీరప్రాంతాల వైపు కదులుతుంది. 

* సునామీ కెరటాలను గుర్తించలేరు. కారణం ఇవి అంతర ప్రవాహంగా తీరం వైపు కదలడమే. అందువల్ల సునామీ తీరాన్ని దాటేటప్పుడు సముద్ర  ఉపరితల జలాలు మామూలు సమయాల్లో మాదిరి నిశ్చలంగానే ఉంటాయి. 

* ఎడ్జ్‌ వేవ్స్‌ అంటే సముద్ర తీరానికి సమాంతరంగా ముందుకు, వెనుకకు కదులుతూ తీరాన్ని దాటే సంక్లిష్ట అలలు. 

* షోలింగ్‌ లేదా వేవ్‌ స్క్రీన్‌ అంటే తీరప్రాంతాన్ని ఒకదాని తర్వాత మరొకటి చేరే అలల పరంపర.  

* రన్‌ఆఫ్‌ అంటే తీరప్రాంతాల్లో సముద్ర కనీస మట్టంపై అలల ఎత్తును పరిగణించే ఒక ప్రమాణం. 

* సునామీ తరంగాల గరిష్ఠ ఎత్తు దాదాపు 30 నుంచి 45 మీటర్ల వరకు ఉంటుంది. 

* సునామీ అనేది అతి పెద్దదైన ఒకే తరంగం కాదు. అది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ తరంగాల పరంపరతో కూడిన సముదాయం. ఆ తరంగాల పరంపరనే ‘సునామీ తరంగ రైలు’ అని పిలుస్తారు. ఇందులో మొదటి తరంగం పెద్దదిగా ఉండదు. తర్వాత వరుసగా వచ్చే సునామీ తరంగాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. 

* సునామీలు రాత్రి, పగలు అనే తేడా లేకుండా రోజులో ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. అయితే వేకువ   జామున సంభవించే సునామీలు ఎక్కువ   తీవ్రతతో ఉంటాయి.                

* సునామీ అలలు తీరం చేరే కొద్దీ వాటి తరంగదైర్ఘ్యం తగ్గి, డోలనా పరిమితులు పెరిగి ఎక్కువ ఎత్తయిన తరంగాలు తీరాన్ని ముంచేస్తాయి. 

* సునామీల రాకను ముందుగా పసిగట్టడం, గుర్తించడం కుదరదు. కానీ కంప్యూటర్‌ నమూనాలను ఉపయోగించి సునామీ సంభవించే సమయాన్ని కొద్ది నిమిషాల ముందు తెలుసుకోవచ్చు. 

* సునామీ ఉపసంహరణ వల్లే అత్యధిక నష్టం వాటిల్లుతోంది. ఇందుకు కారణం సునామీ తరంగాలు సముద్రం వైపు తిరోగమిస్తున్నప్పుడు కట్టడాల పునాదులు, ఇళ్లు, ఇతర వనరులను సముద్రంలోకి ఈడ్చుకెళతాయి. దీంతో పెద్దస్థాయిలో ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తుంది. 

* 1896లో సంభవించిన పెను విపత్తు తర్వాత ప్రపంచంలోనే మొదటిసారిగా  జపాన్‌లో సునామీ శాస్త్రం, ప్రతిస్పందన  చర్యలను అనుసరించడం ప్రారంభించారు. సునామీని నివారించడం సాధ్యం కాదు.

* నవంబరు 5ను సునామీ అవగాహన దినంగా నిర్వహిస్తారు. 2015, నవంబరు నుంచి దీన్ని పాటిస్తున్నారు.
 

 


రచయిత: సక్కరి జయకర్‌ 


 

Posted Date : 16-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు