• facebook
  • whatsapp
  • telegram

భూకంపాలు

అంతర్భాగంలో అలజడులు!

కాలి కింద నేల కదిలిపోతుంది. ముక్కలుగా చీలిపోతుంది. కట్టడాలు కూలిపోతాయి. చెట్లు పడిపోతాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి. అదంతా భూ అంతర్భాగంలో కలిగే అత్యంత శక్తిమంతమైన అలజడుల ప్రభావం. భూమి లోపలి ప్రకంపనలతో ఏర్పడే విధ్వంసం. అలా ఎలా జరుగుతుంది? కారణాలు ఏమిటి? ఆ వైపరీత్యం గురించి ముందుగా ఏవిధంగా తెలుసుకుంటారు? ఈ అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 


భూఉపరితలం ఆకస్మికంగా కంపించడాన్ని భూకంపం అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైనది. అకస్మాత్తుగా సంభవించే ఈ విపత్తు, ముందస్తు హెచ్చరికలు జారీ చేసే సమయం కూడా ఇవ్వదు. రెప్పపాటులో అంతా జరిగిపోతుంది. భూమిలో పగుళ్లు ఏర్పడి, ప్రకంపనలు పుట్టి భూ ఉపరితలంపైకి క్షణాల్లో చేరి విధ్వంసం సృష్టిస్తాయి. దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఖండపలకల (విరూపకారక) చలనాల వల్ల కలిగే భూకంపాలు అధిక శక్తిని కలిగి ఉంటాయి. ఇవి తీవ్రమైన ఆస్తి, ప్రాణనష్టాలను కలిగిస్తాయి.

భూకంపం వల్ల ఉద్భవించే అంతర భౌమ కేంద్రక బిందువును నాభి (హైపో సెంటర్‌) అంటారు. నాభికి లంబంగా భూఉపరితలంపై ఏర్పడే బిందువును అధికేంద్రం (ఎపీ సెంటర్‌)గా వ్యవహరిస్తారు. ఈ బిందువు నష్టం జరిగే ప్రాంతాన్ని సూచిస్తుంది. నాభి నుంచి ప్రారంభమైన చిన్న ప్రకంపనలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విధ్వంసకర అఘాత తరంగాలుగా రూపొందుతాయి. అవి నేలను కదిలించి వెంటనే పరాఘాతాలుగా మారి క్రమంగా తగ్గుముఖం పట్టే కంపనాలుగా తిరిగి భూమిలోకి అంతమవుతాయి.

 

కారణాలు

ఉపరితలంలో: కొండచరియలు, హిమశిఖరాలు, సొరంగాల పైకప్పులు విరిగిపడటం, అణుప్రయోగాలు జరగడం లాంటి సందర్భాల్లో చిన్నచిన్న ప్రకంపనలు రావచ్చు. ఇవి ప్రమాదకరమైనవి కావు.

అగ్నిపర్వతాల వల్ల: అగ్నిపర్వతాల నుంచి లావా వెలువడే సమయంలో భూమి పొరలు కదులుతాయి. ఈ క్రమంలో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. వీటివల్ల పెద్దనష్టం జరగదు.

పాతాళంలో: భూమి అంతర్భాగాల్లో ఉన్న యురేనియం, థోరియం లాంటి అణుధార్మిక పదార్థాలు వాటంతటవే విస్ఫోటానికి గురికావడం వల్ల ప్రకంపనలు ఏర్పడతాయి. ఇవి కూడా అంత నష్టాన్ని కలిగించవు.

సమస్థితి సర్దుబాటు: భూమి పొరల బరువు వల్ల వాటి మధ్య అప్పుడప్పుడు సర్దుబాటు జరిగినప్పుడు ప్రకంపనలు వస్తాయి. వీటి వల్ల ఎక్కువ నష్టం సంభవించదు.


విరూపకారక చలనాలు: అత్యంత ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీసే శక్తిమంతమైన భూకంపాలు విరూపకారక చలనాల కారణంగానే ఏర్పడతాయి. భూమి పైపొర (భూపటలం) విరూపకారక పలకలుగా పిలిచే అతి పెద్ద అంతర్బంధిత శిలాఖండాలతో నిర్మితమవుతుంది. ఈ శిలాఖండాలు వాటి దిగువన ఉన్న ‘అర్ధ ద్రవశిల’ అనే జిగురు లాంటి పొర పైన కదులుతూ ఉంటాయి. ఈ సమయంలో పలకల మధ్య తన్యత, సంపీడన బలాలు పనిచేస్తాయి. ఇవి ప్రకంపనాలను ఉత్పత్తి చేసి భూకంపాలకు కారణమవుతాయి. ఈ పలకలు ఒకదానికొకటి ఎదురెదురుగా లేదా ఒకదాని నుంచి ఇంకొకటి దూరంగా జరగడం లేదా ఒక పలకను మరొకటి తాకుతూ పక్కకు జరగడం.. ఇలా మూడు రకాల కదలికలు కలిగి ఉంటాయి. ఈ క్రమంలో పలకల అంచులు విరిగి పగుళ్ల ద్వారా సంచిత శక్తి విడుదలవుతుంది. ఇలా శక్తి విడుదలయ్యే ప్రతిబల (ఒత్తిడి) ప్రాంతాలను భ్రంశమండలాలు అంటారు. భూమిలో అతుకులు, పగుళ్లు ఉన్న ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి.

 

భూకంపాల్లో పనిచేసే స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతం: భ్రంశ మండలాల వద్ద ఉన్న స్థితిస్థాపకత విరూప చలనం వల్ల నిరోధక స్థితిస్థాపకతగా మారడంతో ప్రకంపనాలు ఉత్పత్తయి భూకంప తరంగాలుగా మారతాయి. నిరోధక స్థితిస్థాపకత వల్ల భూమి పొరల లోపల వికృతీ బలం వృద్ధి చెంది భూకంపాలకు దారితీస్తుంది.

 

మూడు రకాలు


నాభిలోతు ఆధారంగా భూకంపాలను మూడు రకాలుగా విభజించారు.

గాధ భూకంపాలు: భూ ఉపరితలం నుంచి భూకంప నాభి లోతు 60 కి.మీ. కంటే తక్కువ లోతులో ఏర్పడిన భూకంపాలను గాధ భూకంపాలు అంటారు. ఇవి పలకలు దూరంగా జరిగే హద్దుల వద్ద ఎక్కువగా సంభవిస్తుంటాయి.

మాధ్యమిక భూకంపాలు: నాభి లోతు 60 - 300 కి.మీ. మధ్యలో ఉంటే వాటిని మాధ్యమిక భూకంపాలుగా పిలుస్తారు. ఇవి ఎక్కువ శాతం పలకలు ఎదురెదురుగా కలుసుకునే సరిహద్దుల్లో జరుగుతుంటాయి.

అగాథ భూకంపాలు: నాభి లోతు 300 - 700 కి.మీ. లోతు వరకు ఉండి ఏర్పడే భూకంపాలు. ఇవి ఎక్కువ శాతం పలకలు కలుసుకునే ప్రాంత సరిహద్దుల్లో జరుగుతుంటాయి. 1943లో ఇండోనేషియాలో జరిగిన భూకంప నాభి 720 కి.మీ. లోతులో నమోదైంది. నాభి లోతు పెరుగుతున్న కొద్దీ భూకంప తీవ్రత తగ్గుతుంది.


భూకంపన తరంగాలు

భూకంపాలు ఉత్పత్తి చేసే తరంగాలు మూడు రకాలు. అవి..


P - తరంగాలు: వీటిని ప్రాథమిక తరంగాలు అంటారు. ఇవి భూఉపరితలానికి అధిక వేగంతో చేరతాయి. ముందు వెనుకలకు కదులుతూ అన్నిరకాల పదార్థాల ద్వారా ప్రయాణిస్తాయి.


S - తరంగాలు: వీటిని ద్వితీయ తరంగాలు అంటారు. శి తరంగాల తర్వాత ఉపరితలానికి చేరతాయి. ద్రవ పదార్థాల ద్వారా ప్రయాణించలేవు. భూగర్భజలాలు విపరీతంగా వినియోగించడం వల్ల ఈ తరంగాలు చాలాదూరం ప్రయాణించి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇవి ప్రయాణించే మార్గానికి లంబ దిశగా పైకి, కిందకి కదులుతూ ప్రయాణిస్తాయి.


L - తరంగాలు: వీటిని దీర్ఘ తరంగాలు, ఉపరితల తరంగాలు అంటారు. P, S తరంగాల కలయిక కారణంగా ఏర్పడటం వల్ల తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ఉపరితలానికి చేరితే తీవ్ర నష్టం కలిగిస్తాయి.

భూకంపాలను కొలవడం: భూకంపాల పరిమాణం, వాటి వల్ల విడుదలైన శక్తిని సిస్మోగ్రాఫ్‌ లేదా భూకంపలేఖిని అనే పరికరం ద్వారా కొలుస్తారు. ఈ పరికరంలో భూకంపాల తీవ్రతని కొలిచే స్కేలు, భూకంపన తరంగాల ప్రయోగాన్ని నమోదుచేసే సిస్మోగ్రామ్‌ లాంటి విడిభాగాలుంటాయి.

భూకంపాల తీవ్రతను కొలిచే స్కేల్స్‌: ఒమెరీ స్కేల్, రోసీ-ఫోరెల్‌ స్కేల్‌ లాంటి పురాతన స్కేల్స్‌ ఉన్నప్పటికీ రిక్టర్‌ స్కేల్, మోడిఫెడ్‌ మెర్కిలీ స్కేల్‌ లాంటి నవీన స్కేల్స్‌ వాడుకలో ఉన్నాయి. అమెరికాకు చెందిన భూకంప శాస్త్రవేత్త ఛార్లెస్‌ రిక్టర్‌ కనుక్కున్న రిక్టర్‌ స్కేల్‌ ఎక్కువగా ఆమోదంలో ఉంది. దీనిపై 0 - 9 ఏకాంకాలు ఉంటాయి. ఈ స్కేలు భూకంపాల తీవ్రతను, దాని నష్టాన్ని కొలుస్తుంది. అందువల్ల రిక్టర్‌ స్కేల్‌ను మాగ్నిట్యూడ్‌ స్కేల్‌ అంటారు. ఇటలీ శాస్త్రవేత్త తయారుచేసిన మెర్కిలీ స్కేల్‌ నష్టాన్ని మాత్రమే కొలుస్తుంది. అందుకే దీన్ని ఇంటెన్సిటీ స్కేల్‌ అంటారు. దీనిపై 1 నుంచి 12 వరకు రోమన్‌ అంకెలుంటాయి. రిక్టర్‌ స్కేల్‌ పైన 6 పాయింట్లు దాటితే ప్రాణ, ఆస్తి నష్టం నమోదవుతుంది. అదే మెర్కిలీ స్కేల్‌పై 8 పాయింట్లు నమోదైతే ప్రాణ, ఆస్తి నష్టం సూచిస్తుంది.

మాదిరి ప్రశ్నలు

1. భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?

1) సిస్మాలజీ     2) సైనాలజీ      3) ఎకాలజీ     4) సిస్మకాలజీ


2. భూకంప నష్టాన్ని నిర్ధారించే బిందువు?

1) పోపస్‌      2) అధికేంద్రం      3) అపకేంద్రం     4) అభికేంద్రం


3. భూకంపాల తీవ్రతను కొలిచేందుకు ఉపయోగించే పరికరం?

1) సిస్మో గ్రాఫ్‌      2) సిస్మో గ్రామ్‌      3) సిస్మిల్‌ గ్రాఫ్‌     4) సైనిక్‌ గ్రాఫ్‌


4. ప్రకృతి విపత్తుల్లో అంత్యంత భయంకరమైన విపత్తు?

1) వరదలు      2) సునామీలు      3) భూకంపాలు      4) భూపాతాలు


5. భూగర్భజలాలు తగ్గడం వల్ల ఎక్కువ నష్టాన్ని కలిగించే భూకంపన తరంగాలు?

1) L  - తరంగాలు      2) S - తరంగాలు      3) P - తరంగాలు     4) ఏదీకాదు


6. భూకంపనలు ప్రారంభమయ్యే భూమిలోని లోపలి బిందువును ఏమంటారు?

1) నాభి          2) అధికేంద్రం        3) భ్రంశం         4) పగులు


7. కింది ఏ తరంగాలు భూఉపరితలాన్ని చేరితే తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి?

1) S - తరంగాలు        2) L - తరంగాలు        3) P - తరంగాలు       4) అన్నీ


8. భూకంపన నాభి లోతు పెరిగితే భూకంపం తీవ్రత?

1) పెరుగుతుంది        2) తగ్గుతుంది         3) మార్పు ఉండదు  4) ఏదీకాదు


9. ఒక ప్రాంతంలో భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.5గా నమోదయితే దాని వల్ల సంభవించే పరిణామాలు?

1) ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది         2) ఆస్తి, ప్రాణ నష్టం జరగదు

3) ప్రజలు గుర్తించలేరు           4) నిద్రలో ఉండేవారు గుర్తించగలరు


10. భూకంపాలు వేటిని ఉత్పత్తి చేస్తాయి?

1) కంపనాలు       2) ప్రకంపనలు     3) కంపనాలు, ప్రకంపనలు      4) ప్రకంపనలు, మంటలు

 

సమాధానాలు: 1-1,    2-2,    3-1,    4-3,   5-2,    6-1,   7-2,   8-2,   9-1,    10-3.

రచయిత: జల్లు సద్గుణరావు

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  చక్రవాతాలు - సునామీ

 పర్యావరణం - జీవ వైవిధ్యం

 వరద విపత్తులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 02-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌