• facebook
  • whatsapp
  • telegram

ఆవరణ శాస్త్రం

అంతర చర్యల అనుబంధం!

జీవజాతులు తమ మనుగడకు చుట్టుపక్కల వాతావరణంతో సమతౌల్యత కొనసాగిస్తుంటాయి. ఆవాసం, ఆహార చక్రాలు, పునరుత్పత్తి ప్రక్రియ, అంతర్గత సంబంధాలను చుట్టూ ఉన్న ఆవరణ ఆధారంగానే నిర్ణయించుకుంటాయి. జీవజాతులు పర్యావరణంపై, అలాగే పర్యావరణం జీవజాతులపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలను చూపుతుంటాయి. వీటన్నింటి మధ్య జరిగే అంతర చర్యల గురించి తెలిపే ఆవరణ శాస్త్రంపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి.

 

పర్యావరణంలోని వివిధ జీవజాతుల్లో జీవులు, వాటి పరిసరాలకు మధ్య జరిగే అంతఃచర్యలను అధ్యయనం చేసే విజ్ఞానశాస్త్రమే ఆవరణ శాస్త్రం. దీన్ని ఆంగ్లంలో Ecology అంటారు. ఇది ఒక జీవి ఆవాసాన్ని తెలియజేసే OIKOS,  ఒక జీవి జీవన విధానాన్ని అధ్యయనం చేసే  LOGOS అనే రెండు గ్రీకు పదాల నుంచి వచ్చింది. ఎకాలజీ అనే పదాన్ని మొదట కార్ల్‌ రైటర్‌ 1868లో ఉపయోగించారు. ఎర్నెస్ట్‌ హెకెల్‌ దీన్ని విస్తృత ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆధునిక ఆవరణ శాస్త్ర పితామహుడు యూజీన్‌ ఓడమ్‌. భారత ఆవరణ శాస్త్ర పితామహుడు రామ్‌దేవ్‌ మిశ్రా.

* జీవావరణంలోని వేర్వేరు ప్రాంతాల్లో వివిధ జాతుల మధ్య అంతర్గత సంబంధాలు; పర్యావరణం, జీవులకు మధ్య సంబంధాలను వాటి విధులు, నివాసం, పునరుత్పత్తి ప్రక్రియల ఆధారంగా  అధ్యయనం చేసే శాస్త్రమే ఆవరణ శాస్త్రం.  - రామ్‌దేవ్‌ మిశ్రా

 

పర్యావరణానికి, ఆవరణ శాస్త్రానికి మధ్య తేడా?

ఏదైనా జీవి లేదా జీవ సముదాయాన్ని ఆవరించి ఉన్న పరిసరాలను పర్యావరణం అంటారు. నిర్దిష్ట పర్యావరణంలోని జీవులు, వాటి చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య జరిగే అంతఃచర్యల గురించి అధ్యయనం చేసేది ఆవరణ శాస్త్రం.

 

జీవావరణ అనుక్రమం

భౌతిక పరిస్థితుల వల్ల కాలానుగుణంగా ఒక సమాజ స్థానాన్ని ఇతర సమాజాలు ఆక్రమించుకోవడాన్ని లేదా ప్రతిక్షేపించడాన్ని జీవావరణ అనుక్రమం అంటారు. ఇది నెమ్మదిగా అవిచ్ఛినంగా స్థిర సమాజం ఏర్పడేవరకూ కొనసాగుతూనే ఉంటుంది. ఈవిధంగా జీవావరణ అనుక్రమంలో మొదట ఏర్పడిన సమాజాన్ని ‘పయోనీర్‌’ సమాజం అంటారు. దీని తర్వాత అనేక మధ్యంతర సమాజాలు ఏర్పడతాయి. వాటిని సీరల్‌ (seral) దశలు అంటారు. జీవ అనుక్రమంలో చివరకు ఏర్పడిన సమాజాన్ని పరాకాష్ఠ (climax) సమాజం అంటారు. దీనిలో సమాజంలో స్థిరత్వం కనిపిస్తుంది.

 

జీవావరణ అనుక్రమంలో రకాలు ఉన్నాయి. 

హైడార్క్‌: కుంటలు, సరస్సులు, బురద ప్రదేశాల్లో జీవావరణ అనుక్రమాన్ని హైడార్క్‌ అంటారు. ఇది రెండు రకాలు. 

* మంచినీటిలో జరిగే అనుక్రమం - హైడ్రోసీర్‌

* ఉప్పు నీటిలో ప్రారంభమయ్యే అనుక్రమం - హాలోసీర్‌ 

జీరార్క్‌: ఎడారిలో జరిగే జీవావరణ అనుక్రమాన్ని జీరార్క్‌ అంటారు. ఇందులోని దశలను జీరోసీర్‌ అంటారు.

లిథోసియర్‌: శిలలపై జరిగే జీవావరణ అనుక్రమాన్ని లిథోసియర్‌ అంటారు.

సామోసియర్‌: ఇసుకను ఆధారంగా చేసుకొని జరిగే జీవావరణ అనుక్రమాన్ని సామోసియర్‌ అంటారు.

 

ఆవరణ వ్యవస్థ

జీవ, నిర్జీవ అంశాలతో కూడిన ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో జీవ, నిర్జీవ కారకాల మధ్య పరస్పరం జీవ భూరసాయన వలయాల ద్వారా శక్తి, పోషకాల మార్పిడి జరిగే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతమే ఆవరణ వ్యవస్థ.  - ఎ.జి.టాన్‌స్లే

  ఉష్ణోగ్రత, గాలి, పీడనం, కాంతి లాంటి నిర్జీవ కారకాలు, ప్రాణం ఉన్న జీవ సముదాయాల మధ్య నిర్మాణాత్మక, క్రియాత్మక లక్షణాలతో రక్త ప్రసరణ, పోషక పదార్థాల చక్రీయ వినిమయం జీవావరణ వ్యవస్థలోని ప్రాథమిక ప్రక్రియ. ఆవరణ వ్యవస్థ రెండు రకాలు. అవి..

 

సహజసిద్ధ ఆవరణ వ్యవస్థ: పర్యావరణంలో అనేక రకాల ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. అన్నిరకాల ఆవరణ వ్యవస్థలు జీవ, నిర్జీవ అనుఘటకాల పరస్పర చర్యల ఫలితంగా స్వయంసమృద్ధి కలిగి ఉంటాయి. జాతుల వైవిధ్యం, ఉత్పాదనా రేటులో తారతమ్యాలు ఉంటాయి. వీటిలో రెండు రకాలు ఉన్నాయి. 

ఖండ ఆవరణ వ్యవస్థ:  ఎ) అరణ్య ఆవరణ వ్యవస్థలు బి) గడ్డిమైదానాల ఆవరణ వ్యవస్థలు సి) పరివర్తన ఆవరణ వ్యవస్థలు డి) ఎడారి ఆవరణ వ్యవస్థలు ఇ) టండ్రా ఆవరణ వ్యవస్థలు ఎఫ్‌) టైగా ఆవరణ వ్యవస్థలు

జలావరణ వ్యవస్థ: ఇందులో మూడు రకాలు ఉన్నాయి.

1) సముద్ర ఆవరణ వ్యవస్థలు: ఎ) ఖండ తీరపు ఆవరణ వ్యవస్థ బి) సముద్ర వాలు/ఎబైసెల్‌ ఆవరణ వ్యవస్థ సి) సముద్ర అగాధ/ట్రెంచ్‌ ఆవరణ వ్యవస్థ డి) ముద్ర మైదాన ఆవరణ వ్యవస్థ

2) మంచి నీటి ఆవరణ వ్యవస్థలు: ఎ) నిలకడ మంచినీటి ఆవరణ వ్యవస్థ బి) ప్రవాహ నీటి ఆవరణ వ్యవస్థ.

3) తీరప్రాంత ఆవరణ వ్యవస్థలు: ఎ) ఉప్పునీటి కయ్యల ఆవరణ వ్యవస్థ బి) డెల్టా ఆవరణ వ్యవస్థలు సి) మడ అడవుల ఆవరణ వ్యవస్థ

 

కృత్రిమ ఆవరణ వ్యవస్థ: మానవుడు తన అవసరాల కోసం సాంఘిక, సాంస్కృతిక, పారిశ్రామిక అభివృద్ధి కోసం నిర్మించుకున్న ఆవరణ వ్యవస్థలను మానవ నిర్మిత/కృత్రిమ ఆవరణ వ్యవస్థలుగా పేర్కొంటారు. 

ఉదా: * పంట పొలాల ఆవరణ వ్యవస్థలు * నగర ఆవరణ వ్యవస్థలు * పారిశ్రామిక ఆవరణ వ్యవస్థలు * ప్రయోగశాలల ఆవరణ వ్యవస్థలు  * గ్రహాంతర ఆవరణ వ్యవస్థలు

 

ఆవరణ శాస్త్ర పారిభాషక పదాలు

జాతి: తమలో తాము అంతర ప్రజననం చెందుతూ సమాన లక్షణాలు ఉన్న జీవుల సమూహాన్ని జాతి అంటారు.

ఉదా: మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి

జనాభా: ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవించే ఒకే జాతికి చెందిన జీవుల సంఖ్యను జనాభా అంటారు.

ఉదా: పులుల జనాభా ప్రతి నాలుగు సంవత్సరాలకు లెక్కిస్తారు. తాజా లెక్కల ప్రకారం 2018 నాటికి దేశంలో పులుల జనాభా 2,967 ఉంది. 2014 - 2018 మధ్యకాలంలో ఇవి 741 పెరిగాయి.

జీవ సమాజం: ఒక ప్రాంతంలోని వివిధ జాతుల జనాభాను కలిపి జీవ సమాజం అంటారు. అంటే ఒక నిర్దిష్ట ఆవాసంలోని జంతువులు, వృక్షాలు, సూక్ష్మజీవుల మొత్తం అని అర్థం.

ఎకలాజికల్‌ నిచ్‌: ఒక ఆవరణ వ్యవస్థలోని ఏదైనా ఆవాసంలో ఒక జాతి క్రియాత్మక స్థాయిని తెలియజేసే ప్రక్రియ. ఇది నిర్దిష్ట ఆవాసంలో ఒక జీవి తన విధులను నిర్వర్తించే ప్రదేశం. ఈ పదాన్ని మొదటిసారిగా గ్రిన్నెల్‌ అనే శాస్త్రవేత్త ఉపయోగించాడు.

ఉదా: మానవుడు సర్వభక్షక ఆహార అలవాట్లు కలిగి ఉండటం.

ఎకోటోన్‌: రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న పరివర్తన ప్రాంతాన్ని ఎకోటోన్‌ అంటారు. 

ఉదా: భౌమ‌, జలావరణ వ్యవస్థల మధ్య ఉండే మాంగ్రూవ్‌ ఆవరణ వ్యవస్థ, నదీ ముఖద్వార ఆవరణ వ్యవస్థ (ఎస్టురీ ఆవరణ వ్యవస్థ).

బయోమాగ్నిఫికేషన్‌: ఆహార‌ గొలుసులో కింది స్థాయి జీవులు స్వీకరించిన కొన్ని రకాల రసాయనాలపై పోషణ స్థాయి జీవుల్లో పేరుకుపోవడాన్ని బయోమాగ్నిఫికేషన్‌ లేదా బయోలాజికల్‌ ఎక్యుమ్యులేషన్‌ అంటారు.

ఉదా: రాబందులు పశువుల మృత కళేబరాలను తినడం వల్ల వాటిలోని డైక్లోఫినాక్‌ రసాయనం రాబందుల్లోకి చేరి క్రమంగా అవి అంతరించిపోతున్నాయి.

 

రచయిత: జల్లు సద్గుణరావు

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  చక్రవాతాలు - సునామీ

‣ పర్యావరణం - జీవ వైవిధ్యం

‣ వరద విపత్తులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 04-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌