• facebook
  • whatsapp
  • telegram

నగర సమాజ శాస్త్రం (ఆవిర్భావం, అభివృద్ధి, పరిధి)

పట్టణీకరణపై ప్రత్యేక పరిశీలన!

దేశంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతోంది. గ్రామీణ జనాభా వలసలతో పట్టణాలు, నగరాలు కిక్కిరిసిపోతున్నాయి. గ్రామీణ సమాజానికి పూర్తి భిన్నమైన సమాజం, జీవనశైలి, వాతావరణం నగరాల్లో ఉంటుంది. అందుకు తగిన విధంగా వసతుల కల్పన నుంచి శాంతిభద్రతల వరకు సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నగరాల్లోని పోకడలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి పరిష్కారాలు గుర్తించేందుకు ఆవిర్భవించిందే నగర సమాజ శాస్త్రం. గతాన్ని విశ్లేషించి, వర్తమానాన్ని అధ్యయనం చేసి, భవిష్యత్తుకు ప్రణాళికలు వేసే సమాజశాస్త్ర విభాగమిది. దీని పూర్వాపరాలు, మన దేశంలో దాని ఆవశ్యకత గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. 


సామాజిక నిర్మితిని, ప్రగతిని శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే సమాజ శాస్త్రం. ఈ శాస్త్రాన్ని 1837లో ‘ఆగస్ట్‌ కామ్ట్‌’  రూపొందించారు. ప్రత్యేక అధ్యయనం, శాస్త్రాభివృద్ధి దృష్ట్యా సమాజ శాస్త్రాన్ని అనేక విభాగాలుగా రూపొందించారు. వాటిలో నగర సమాజ శాస్త్రం ముఖ్యమైంది.

సమాజంలో వ్యక్తుల మధ్య ఉన్న సామాజిక సంబంధాలను అధ్యయనం చేయడం సమాజ శాస్త్ర లక్ష్యం. ప్రత్యేకంగా నగర సమాజంలోని సామాజిక సంబంధాలను మాత్రమే అధ్యయనం చేస్తే దాన్ని నగర సమాజ శాస్త్రంగా పేర్కొంటారు. ఇందులో అధ్యయన విషయం ‘నగరం’. నగర సమాజాన్ని, అందులో ఉత్పన్నమయ్యే సమస్యలను అధ్యయనం చేయడమే దీని లక్ష్యం.


నిర్వచనం: నాగరిక సమాజ శాస్త్ర నిర్మితిని, దాని ప్రవృత్తిని, ఆ సమాజంలోని పరివర్తనను విశ్లేషించే శాస్త్రాన్ని ‘నగర సమాజ శాస్త్రం’ అంటారు. ‘‘పట్టణ, నగర సమాజ జీవనాన్ని అధ్యయనం చేసే శాస్త్రం’’ అని ప్రొఫెసర్‌ అండర్స న్‌ పేర్కొన్నారు.

నగర సమాజ శాస్త్రం 1925లో అమెరికాలో రూపుదిద్దుకుంది. దీనిపై విస్తృత పరిశోధనలు ఆ దేశంలోనే జరిగాయి. 

సామాజికవేత్తల పరిశోధనలు: బర్గెన్‌ రచించిన ‘నగర సముదాయం’, పార్క్‌ మెకంజీ రాసిన ‘ద సిటీ’ అనే గ్రంథాలు నగర సమాజ శాస్త్రానికి పునాది వేశాయి. భారత దేశంలో ఘుర్యే, రాధా కమల్‌ ముఖర్జీ,  డిసౌజా మొదలైనవారు దిల్లీ, బెంగళూరు, చండీగఢ్, విజయవాడ, హైదరాబాద్‌ నగరాలను పరిశీలించి గ్రంథాలు రాశారు.

* నగర జనాభా పెరుగుదల, నగరీకరణ లాంటి సామాజిక ప్రక్రియలు ఆధునిక సమాజాలను ప్రభావితం చేస్తున్నాయి. గ్రామాల నుంచి నగరాలకు వలసల ప్రాధాన్యం రోజురోజుకూ అధికమవుతోంది. నగరాల్లో నివసించే జనాభాతో పాటు, నగరాల సంఖ్య పెరుగుతోంది. నగరీకరణ ప్రభావంతో గ్రామీణ, నగర సముదాయాల్లో నివసిస్తున్న ప్రజల ఆచారాలు, విలువలు, ప్రవర్తనారీతుల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. నగరీకరణ, పారిశ్రామికీకరణ ప్రభావాలతో సాంప్రదాయిక, వ్యావసాయిక సమాజాలు పారిశ్రామిక సమాజాలుగా మారుతున్నాయి.

* రోజురోజుకు ఉద్ధృతమవుతున్న నగరీకరణ, నగర జనాభా పెరుగుదల వల్ల నగరాల్లో వాతావరణ కాలుష్యం, మురికివాడలు, ఇళ్ల కొరత లాంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. నేరాలు, బాల నేరస్థులు, మద్యపానం అలవాటు, వేశ్యా వృత్తి లాంటి సామాజిక రుగ్మతలకు నగరాలు కేంద్రాలవుతున్నాయి. గ్రామీణ సముదాయాలతో పోలిస్తే నగర సముదాయాల్లో సాముదాయిక అవ్యవస్థ ఎక్కువగా కనిపిస్తుంది. అమెరికా, బ్రిటన్‌ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా నగర సముదాయాల్లోని సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రజ్ఞులు, ప్రణాళికావేత్తలు, పరిపాలకులు నగర సమ స్యలపై దృష్టి సారించారు. నగర జీవితంలోని అనేక అంశాలను శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేస్తున్నారు. వీరి కృషి ఫలితంగానే నేడు నగర సమాజ శాస్త్రం ఒక ప్రత్యేక భాగంగా రూపొంది, అభివృద్ధి చెందింది.

 

నగర సమాజ శాస్త్ర లక్ష్యాలు:

1) నగర సముదాయంలోని అనేక సమస్యలు గుర్తించడం.

2) ఆధునిక ప్రజలపై నగర సమస్యల ప్రభావం, వాటివల్ల కలిగే లాభనష్టాల అధ్యయనం.

3) నగర సమాజాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్న అనేక సమస్యలు గుర్తించి పరిష్కరించే ప్రయత్నం చేయడం.

4) నగర సముదాయాభివృద్ధికి అవసరమైన సూత్రాల రూపకల్పన.

5) నగర ప్రణాళికలు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక కార్యక్రమాలు రూపొందించి అమలుపరచడం.


పరిధి: నగర సమాజ శాస్త్రం పరిధి రోజురోజుకు విస్తృతమవుతోంది. గ్రామీణ సమాజంలో నివసించే జనాభా తగ్గుతూ, పట్టణ జనాభా పెరుగుతుండటంతో నగర సమాజ శాస్త్ర పరిధి కూడా విస్తృతమవుతోంది. నగర సముదాయాన్ని, జీవన పద్ధతులను అధ్యయనం చేస్తుంది. సముదాయ నిర్మితి, ప్రకార్యాలు, సంబంధాలు, పరివర్తనలను పరిశీలిస్తుంది. ఆధునిక నగరాల మూలం, అభివృద్ధిని నగర సమాజ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. నగర జనాభాలోని లైంగి క, వైవాహిక వయసు; వృత్తిపర అంతస్తులను విశ్లేషిస్తారు. వివిధ కాలాల్లో, పలు సమాజాల్లో నగరీకరణను ప్రభావితం చేసే కారకాలను అధ్యయనం చేస్తారు. 

నగర ప్రణాళికలు, నగరాభివృద్ధి కార్యక్రమాల ఆవశ్యకతను కూడా నగర సమాజ శాస్త్రజ్ఞులు చర్చిస్తారు. పార్క్, లూయిస్‌వర్త్‌ నగర సమాజ శాస్త్ర పరిధిని మూడు వర్గాలుగా విభజించారు.

1) నగర ఆవరణ వ్యవస్థాపన: ఈ విభాగంలో నగర జనాభా, పరిసరాలు, వ్యవస్థాపన, వీటి మధ్య ఉండే పరస్పర సంబంధాలను అధ్యయనం చేస్తారు. అంటే నగరంలోని విభిన్న నివాస ప్రాంతాల్లోని వ్యత్యాసాలను, నగర జీవితంపై వాటి ప్రభావం, ఆయా ప్రాంతాల్లోని వివిధ సంస్థలు, సమూహాలు తీసుకునే చర్యలను పరిశీలిస్తారు.

2) నగర సాంఘిక వ్యవస్థాపన: ఈ విభాగంలో నగర వాసుల సామాజిక జీవితంలోని వివిధ అంశాలను, వాటి సమస్యల గురించి అధ్యయనం చేస్తారు.

ఉదా: వివిధ రకాల నేరాలు, పడుపు లేదా వేశ్యా వృత్తి, మురికివాడలు లాంటి సాంఘిక సమస్యల ప్రభావం నగరవాసుల జీవితంపై ఎలా ఉంటుందో చర్చిస్తారు.

3) మూడో విభాగంలో నగరవాసుల ప్రవర్తన, పాటించే విలువలు, వైఖరులను అధ్యయనం చేస్తారు.

నగర సమాజ శాస్త్రంలో మొదట్లో నగర సమస్యలను మాత్రమే అధ్యయనం చేసేవారు. ప్రస్తుతం నగర జీవితానికి సంబంధించిన అనేక అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. 

నగర సమాజ శాస్త్ర పరిధి ప్రధానంగా మూడు విభాగాలుగా సాగుతుంది.

 1) నగర సమాజ శాస్త్ర పరిచయ విభాగం

2) విశ్లేషాత్మక నగర సమాజ శాస్త్ర విభాగం  

3) సంస్కరణాత్మక నగర సమాజ శాస్త్ర విభాగం


1) నగర సమాజ శాస్త్ర పరిచయ విభాగం: ఇందులో నగర జీవనానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను పరిశీలిస్తారు. నగరాలు, పట్టణాల్లోని వ్యక్తుల జీవనం నగర సమాజశాస్త్రానికి ప్రధానమని ‘అండర్సన్‌’ పేర్కొన్నారు. నగర సమాజ నిర్మాణం, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సంస్థల స్వరూప స్వభావాలు, నగర జనసాంద్రత మొదలైన మౌలిక విషయాలను ఈ విభాగంలో అధ్యయనం చేస్తారు. వీటితో పాటు నగర సమాజంలోని వ్యక్తుల మానసిక విశ్లేషణ అవసరం. నగర సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే వ్యక్తుల మానసిక రీతులను పరిశీలించాలి. వారి భాష, ఆలోచనా సరళి, ప్రతిస్పందనలు, మానసిక వికాసం లాంటి అంశాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. నగరవాసుల గమనాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రకమైన అధ్యయనం అవసరం. ఒకే రకమైన సంఘటనకు గ్రామీణులు ఒక రకంగా, నగరవాసులు మరో రకంగా ప్రతిస్పందిస్తుంటారు. అందుకే నగర జీవనంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. దీన్ని అర్థం చేసుకునేందుకు మానసిక విశ్లేషణ అవసరం.

2) విశ్లేషాత్మక నగర సమాజ శాస్త్ర విభాగం:  నగరాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని పరిశీలించి విశ్లేషించడం ఈ విభాగం లక్ష్యం. అంటే ఒక సమాజాన్ని పరిశీలిస్తున్నప్పుడు అది గ్రామీణ సమాజం కంటే ఏ విధంగా విభిన్నంగా ఉంది? దాన్ని పట్టణంగా లేదా నగరంగా పరిగణించాలా? అన్న అంశాలను ముందుగా అధ్యయనం చేస్తారు. నగర సమాజంగా దాన్ని గుర్తించిన తర్వాత అది నగరంగా పరివర్తన చెందడానికి దోహదం చేసిన వివిధ అంశాలను గ్రహిస్తారు. ఈ విధమైన విశ్లేషణ ఫలితంగా భవిష్యత్తులో ఆ సమాజం ఏ రీతిలో మార్పు చెందుతుందనే విషయాన్ని విశ్లేషించడానికి వీలుంటుంది. 


3) సంస్కరణాత్మక నగర సమాజ శాస్త్ర విభాగం:  నగర సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలను ఈ విభాగంలో చర్చిస్తారు. ముందుగా ఆ సమస్యలకు కారణాలు కనుక్కుంటారు. తర్వాత వాటి పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తారు. ఉదాహరణకు నేటి నగరాల్లో మురికివాడల విస్తరణ ముఖ్య సమస్య. ఆ మురికివాడలే నిరుద్యోగం, దారిద్య్రం, వ్యభిచారం, నేరాలు లాంటి అనేక సమస్యలకు నిలయాలు. ఇలాంటి సమస్యల నిర్మూలనకు నగర సమాజ శాస్త్రం పరిష్కార మార్గాలను అన్వేషిస్తుంది. అలాగే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నగర సమాజాభివృద్ధికి ప్రణాళికా రచన చేస్తుంది. 

ఈ మూడు ముఖ్య విభాగాల ద్వారా నగరాల్లో జన జీవనాన్ని అధ్యయనం చేస్తారు. అనేక వాస్తవాలను బహిర్గతం చేస్తారు. ఇందులో నగర సామాజిక జీవన అధ్యయనం అన్నింటికంటే ముఖ్యమైంది.




రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి


 

 

Posted Date : 08-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌