• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ భౌతిక స్వరూపాలు

 3 భాగాలు... 33 జిల్లాలు

నిజాం ప్రభుత్వంలో మొదటి సాలార్‌జంగ్‌ పరిపాలనా సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్‌ రాష్ట్రంలో సుమారు 16 జిల్లాలు ఉండేవి. ఇందులో 8 జిల్లాలు తెలంగాణలో, 5 జిల్లాలు మరాఠ‌లో, 3 జిల్లాలు కన్నడలో ఉండేవి. అంటే హైదరాబాద్‌ నిజాం ప్రభుత్వం 1948 వరకు స్వదేశీ సంస్థానాల్లో అతిపెద్ద ప్రాంతంగా ఉంటూ ఒక దేశంగా ఉండేది. ఇది 1948 సెప్టెంబరు 17న భారత యూనియన్‌లో విలీనమైంది. తర్వాత పెద్దమనుషుల ఒప్పందం వల్ల ఆంధ్ర - తెలంగాణ విలీనంతో 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌గా అవతరించి ఒక ప్రాంతంగా ఏర్పడింది. 1956 - 2014 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాంతంగా ఉంటూ అనేక ఉద్యమాల ఫలితంగా తిరిగి 2014 జూన్‌ 2న ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.

 

పరిపాలనా పరంగా... 

హైదరాబాద్‌ రాష్ట్రంలో భాగంగా తెలంగాణలో 1948 నాటికి 8 జిల్లాలు ఉండేవి. 1953 అక్టోబరు 1న నూతనంగా మధిర, అశ్వరావుపేట, భద్రాచలం ప్రాంతాలతో కలిసి ఖమ్మం 9వ జిల్లాగా ఏర్పడింది. తర్వాత 1974 జిల్లాల పునర్విభజన ఏర్పాటు చట్టం ద్వారా 1978 ఆగస్టు 15న హైదరాబాద్‌ను రూరల్‌ జిల్లాగా ఏర్పాటు చేశారు. దీన్నే రంగారెడ్డి జిల్లాగా మార్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం 1974 జిల్లాల పునర్విభజన ఏర్పాటు చట్టం, సెక్షన్‌ 101 ప్రకారం 2016 అక్టోబరు 11న 21 జిల్లాలు, 2019 ఫిబ్రవరి 19న మరో రెండు జిల్లాల ఏర్పాటుతో ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఇందులో 119 అసెంబ్లీ నియోజక వర్గాలు, 74 డివిజన్లు, 593 మండలాలు ఉన్నాయి.  

 

భౌగోళిక పరంగా...

భారతదేశ దక్షిణ దక్కన్‌ పీఠభూమిలో తెలంగాణ రాష్ట్రం ఒక ప్రాంతం. ఇది భౌగోళికంగా 15o50' నుంచి 19o51' ఉత్తర అక్షాంశాల మధ్య, 77o15' నుంచి 81o19' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. తెలంగాణకు భౌగోళికంగా దక్షిణాన జోగులాంబ గద్వాల, ఉత్తరాన ఆదిలాబాద్, పశ్చిమాన నారాయణపేట, తూర్పున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం భూపరివేష్టిత ప్రాంతం. దీనికి ఈశాన్యంలో చత్తీస్‌గఢ్, ఉత్తరాన మహారాష్ట్ర, పశ్చిమాన కర్ణాటక; దక్షిణ, తూర్పు సరిహద్దులుగా ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి.   

  తెలంగాణ ఆవిర్భావ సమయం నాటికి రాష్ట్ర భౌగోళిక వైశాల్యం 1,14,840 చ.కి.మీ. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014 యాక్ట్‌ నెం.6ను అనుసరించి, 2014 జులై 17న యాక్ట్‌ నెం.19, సెక్షన్‌ 3ను అనుసరించి పోలవరం ముంపు గ్రామాలను దృష్టిలో ఉంచుకొని సవరణ చేశారు. దీనిలో భాగంగా 7 మండలాలు, 327 గ్రామాలను (2763 చ.కి.మీ వైశాల్యం) ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. వీటిలో కూనవరం, చింతూరు, వి.ఆర్‌.పురం, భద్రాచలం (పాక్షికంగా) తూర్పుగోదావరిలో; కుకునూర్, వేలేరుపాడు, బూర్గంపాడు (పాక్షికంగా) మండలాలను పశ్చిమ గోదావరిలో విలీనం చేశారు. 

  ప్రస్తుతం తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ. ఇది దేశ విస్తీర్ణంలో 3.4 శాతంతో 11వ స్థానంలో ఉంది. జనాభా పరంగా 3.50 కోట్లతో 12వ స్థానంలో ఉంది. 

 

తెలంగాణ నైసర్గిక విభాగాలు

తెలంగాణ రాష్ట్రం భౌతికంగా ద్వీపకల్ప భారతదేశంలోని దక్కన్‌ పీఠభూమిలో లావాతో ఏర్పడిన ప్రాంతం. ఈ రకమైన తెలంగాణ పీఠభూమి నైసర్గికంగా పశ్చిమదిశలో ఎత్తుగా ఉండి, తూర్పు వైపునకు వెళ్తున్న కొద్దీ వాలి ఉంటుంది. ఎత్తు ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. 

1) పశ్చిమ భాగమైన హైదరాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మెదక్‌ - దాని ఉమ్మడి జిల్లాలు సముద్ర మట్టానికి 600 మీ. ఎత్తులో ఆర్కియన్, నీస్‌ శిలలతో అభివృద్ధి చెంది ఉన్నాయి.  

2) పశ్చిమ భాగానికి దిగువన అంటే మధ్య భాగంలో మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్‌ - దాని ఉమ్మడి జిల్లాలు విస్తరించి గోండ్వానా శిలలతో ఏర్పడి బొగ్గు నిక్షేపాలతో ఉన్నాయి. ఇవి సముద్ర మట్టానికి 300 - 600 మీ. ఎత్తులో ఉండి గోదావరి తీరం లోయలో విస్తరించి వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయి.  

3) తెలంగాణ తూర్పు, ఉత్తరాన ఎక్కువ భాగం కలిగి గోదావరి నదికి ఇరువైపులా విస్తరించి సముద్ర మట్టానికి 150 - 300 మీ. ఎత్తులో ఉంది. ఈ ప్రాంతంలో నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్‌ ఉన్నాయి.

 

భౌతిక నిర్మాణం

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలను భౌతిక నిర్మాణ స్వరూపాన్ని బట్టి ప్రధానంగా మూడు ప్రాంతాలుగా విభజించారు.

తెలంగాణ ప్రాంత పీఠభూమి: ఈ ప్రాంతం అగ్నిపర్వత శిలల లావా ద్వారా ఏర్పడి 400 - 600 మీ. ఎత్తులో ఉంటుంది. ఇది రాష్ట్ర భౌగోళిక వైశాల్యంలో సుమారు 59,903 చ.కి.మీ. ఈ పీఠభూమిలో నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, భువనగిరి - యాదాద్రి, నల్గొండ, రామన్నపేట, సూర్యపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్‌ జిల్లాలు ఉన్నాయి.  

  హైదరాబాద్‌లో రాచకొండలు, గోల్కొండ, కాలాపహడ్‌ కొండలు; ఆదిలాబాద్‌లో సత్నం కొండలు, వికారాబాద్‌లో అనంతగిరి కొండలు (తెలంగాణ ఊటీ), మహబూబ్‌నగర్‌లో శాబాన్‌ కొండలు, గుట్టలు ఎత్తు పల్లాల స్థలాకృతితో ఉన్నాయి. ఈ ప్రాంతం ఆర్కియన్‌ హార్న్‌బ్లెండ్‌ - బయోటిటిస్‌ శిలలతో ఏర్పడింది.

గోదావరి పరీవాహక ప్రాంతం: ఈ ప్రాంతం ద్వీపకల్ప భారతదేశంలో అతిపెద్దది. అందువల్ల ఈ ప్రాంతాన్ని ద్వీపకల్ప ముఖ్య లక్షణంగా అభివర్ణిస్తారు. ఇది 300 మీ. ఎత్తులో రాష్ట్ర భౌగోళిక వైశాల్యంలో సుమారు 37,934 చ.కి.మీ.తో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌ జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వర్షాకాలంలో వరదలతో ప్రభావితమవుతుంది.

  తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తయిన పర్వతకొండ ధూళిగుట్ట (965 మీ.) భూపాలపల్లి - చత్తీస్‌గఢ్‌  సరిహద్దుల్లో ఉంది. జగిత్యాలలో రాఖీ కొండలు, కరీంనగర్‌లో అమలు కొండలు, భద్రాద్రిలో బైసన్‌ కొండలు, హన్మకొండలో హసన్‌పర్తి, చంద్రగిరి కొండలు; నిజామాబద్‌లో సర్నాపల్లి కొండలు విస్తరించి ఉన్నాయి. 

  ఈ ప్రాంతం కార్బొనిఫెర్రస్‌ శిలలు, గోండ్వానా నిక్షేపాలతో ఏర్పడింది. ప్రాణహిత - గోదావరి బేసిన్‌లో బొగ్గు  అత్యధికంగా లభిస్తుంది. ఇది ఏటవాలుగా ఉండటం వల్ల కోతకుగురై క్రమక్షయం చెందుతుంది. 

కృష్ణలోయ ప్రాంతం: ఈ భూభాగం కొంత ఎత్తు పల్లాలతో ఏర్పడింది. ఇది కృష్ణా, డిండినదికి దక్షిణ మధ్యలో 300 మీ. లోపు ఎత్తు కలిగి ఉంది. దీన్ని తెలంగాణలో విస్తరించి ఉన్న అతిచిన్న ప్రాంతంగా (సుమారు 14,240 చ.కి.మీ.) అభివర్ణిస్తారు. ఈ పరీవాహక ప్రాంతం నారాయణపేట, గద్వాల, వనపర్తి, నల్గొండ, సూర్యపేట జిల్లాలకు దక్షిణ సరిహద్దుల్లో ఉంది. 

  ఈ ప్రాంతంలో ఉన్న నల్గొండలో నంది కొండలు, ఫణిగిరి కొండలు, నాగార్జున కొండలు; నాగర్‌కర్నూలులో అమ్రాబాద్‌ కొండలు, నల్లమల కొండలు; గద్వాలలో గద్వాల కోట, వనపర్తి కోట, కృష్ణానది లోయ తీరం, మల్లెల తీర్థం జలపాతం ఉన్నాయి. కృష్ణా - తుంగభద్ర నది సంగమం మధ్యలో తుంగభద్ర నది తీరాన ఉన్న అలంపూర్‌ జోగులాంబ, నవబ్రహ్మ ఆలయం ప్రసిద్ధి చెందాయి. ఇక్కడి నేలలు సాగుకు అనుకూలంగా ఉండి ప్రికాంబ్రియన్‌ శిలలు, ఆర్కియన్‌ శిలలతో ఏర్పడ్డాయి. ఇక్కడ యురేనియం నిక్షేపాలు, వజ్రాలు లభిస్తాయి.

 

భౌమ శిలలు

తెలంగాణ ప్రాంతం దార్వార్‌ రకానికి చెందిన అతి పురాతనమైన శిలలతో నిర్మితమైంది. ఈ రకానికి చెందిన గ్రానైట్‌కు కరీంనగర్, ఖమ్మం ప్రసిద్ధి. గోదావరి లోయ ప్రాంతాలైన బెల్లంపల్లి, గోదావరిఖని, భూపాలపల్లి, కొత్తగూడెం, సత్తుపల్లిలో గోండ్వా నిక్షేపాలకు చెందిన బొగ్గు లభిస్తుంది. కోల్‌కతాలోని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రకారం తెలంగాణ ప్రాంతం ఆర్కియన్, వింధ్య, గోండ్వానా, ద్రవిడన్‌ అనే నాలుగు వర్గాల శిలలతో ఏర్పడింది. 

 

మాదిరి ప్రశ్నలు  

1. గోండ్వానా నిక్షేపాల్లో బొగ్గు ఏర్పడినట్లు తెలిపిన యుగం? 

1) పెలాజాయిక్‌ యుగం 2) ప్రికాంబ్రియన్‌ యుగం 3) మీసోజాయిక్‌ యుగం 4) టెర్షియెరరీ యుగం 

 

2. తెలంగాణ రాష్ట్రానికి అత్యంత దక్షిణాన సరిహద్దు కలిగిన జిల్లా? 

1) నారాయణపేట  2) గద్వాల్‌  3) నాగర్‌కర్నూల్‌  4) ఆదిలాబాద్‌ 

 

3. రాఖీ కొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? 

1) కరీంనగర్‌  2) వరంగల్‌  3) నిజామాబాద్‌  4) జగిత్యాల 

 

4. తెలంగాణ ఊటీ అని దేనికి పేరు?

1) అమ్రాబాద్‌ కొండలు  2) అనంతగిరి కొండలు  3) రాచ కొండలు  4) కాలాపహడ్‌ కొండలు 

 

5. తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో గోదావరి నది ఏ జిల్లాలను వేరు చేస్తుంది? 

1) నిర్మల్‌ - జగిత్యాల   2) భూపాలపల్లి - ములుగు 

3) భద్రాద్రి - ఖమ్మం   4) మంచిర్యాల - అసిఫాబాద్‌

 

సమాధానాలు

1-3,   2-2,   3-4,   4-2,   5-1. 

కొత్త గోవ‌ర్ధ‌న్ రెడ్డి

Posted Date : 12-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌