• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ పరిరక్షణ

ఆమ్ల వర్షాలతో పాలరాయి క్యాన్సర్‌!

భూమి, నీరు, గాలి, చెట్లు, రకరకాల జీవజాతులతో కూడిన ప్రకృతినే పర్యావరణం అంటారు. మానవుడితోపాటు ఇతర అన్నిరకాల జీవరాశుల ఆరోగ్యకర మనుగడకు, సుస్థిర అభివృద్ధికి సహజ ఆవరణ వ్యవస్థ అవసరం. అయితే మనిషి స్వార్థం, వనరుల విధ్వంసం, విశృంఖల అభివృద్ధి ఫలితంగా పర్యావరణం, జీవవైవిధ్యం ప్రమాదంలో పడింది. దానికి కారణమైన  మానవ చర్యలు, కాలుష్య వాయువులు, పర్యావరణ క్షీణత పర్యవసానాలు, జరుగుతున్న నష్టాలు, నివారణ చర్యలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. కాలుష్య నియంత్రణ, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రభుత్వం చేసిన చట్టాలు, చేపట్టిన చర్యలు, విధానాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న జీవావరణ రిజర్వులు, అభయారణ్యాలు, వాతావరణ మార్పుల నివారణకు కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాల గురించి తెలుసుకోవాలి.

 

పర్యావరణం తనకు కావాల్సిన సేంద్రియ పదార్థాలను స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుంది. సేంద్రియ పదార్థ ఉత్పాదన అనేది ప్రాంతం, శీతోష్ణస్థితి ఆధారంగా మారుతూ ఉంటుంది. ఆవరణ వ్యవస్థల సమతౌల్యాన్ని కాపాడటం పర్యావరణ వ్యవస్థ ముఖ్య లక్షణం.


‘‘ఏదైనా జీవి లేదా జీవ సముదాయాన్ని ఆవరించి ఉన్న జీవ, నిర్జీవ అనుఘటకాలు, వాటి మధ్య జరిగే అంతఃచర్యలే పర్యావరణం.’’


ప్రతి జీవికి స్వతఃసిద్ధమైన పర్యావరణం ఉంటుంది. పర్యావరణంలోని జీవ, నిర్జీవ అనుఘటకాలు, వాటి మధ్య జరిగే అంతఃచర్యలు ఆయా జాతి జీవుల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయి. పర్యావరణ విస్తృతి ఒక జీవి చుట్టూ ఉన్న ఒక చదరపు సెం.మీ. భూభాగమైనా కావొచ్చు లేదా అనేక జాతులు నివసించే భూగోళం అంతటినీ ఒక పర్యావరణ యూనిట్‌గా పరిగణించవచ్చు. ఎలా తీసుకున్నా అందులో జీవ, నిర్జీవ అనుఘటకాలు ఉండి, వాటి మధ్య నిరంతరం అంతఃచర్యలు జరుగుతూ ఉండా లి. పర్యావరణం అనే పదాన్ని ఇంగ్లిష్‌లో ‘ఎన్విరాన్‌మెంట్‌’ అని పిలుస్తారు. ఇది ఎన్విరాన్‌ అనే ఫ్రెంచ్‌ పదజాలం నుంచి వచ్చింది. ఫ్రెంచ్‌ భాషలో ఎన్విరాన్‌ అంటే ‘చుట్టూ ఆవరించి ఉన్న’ లేదా ‘చుట్టుకుని ఉండటం’ అని అర్థం.


పర్యావరణ ముఖ్య లక్షణాలు


1.  ఏదైనా భౌగోళిక ప్రాంతంలో నిర్దిష్ట కాలవ్యవధిలో ఉన్న జీవ, నిర్జీవ కారకాల మొత్తం పర్యావరణం.


2.  ప్రాంతం, కాలాన్ని అనుసరించి పర్యావరణం అనేక మార్పులకు లోనవుతుంది. అంటే ఇదొక గతిశీల వ్యవస్థ.


3.  పర్యావరణ నిర్వహణ విధానం అందులోని శక్తి   ప్రవాహాలపై ఆధారపడి ఉంటుంది.


4.  ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించే జీవ   వైవిధ్యత, జీవుల ఆవాసాలు, ఆ ప్రాంతంలో   అందుబాటులో ఉన్న శక్తివనరులన్నింటినీ కలిపి  ఆవరణ వ్యవస్థ నిర్మాణంగా పేర్కొనవచ్చు.


5.  జీవ, నిర్జీవ అంశాల మధ్య జరిగే అంతఃచర్యలు, జీవుల మధ్య ఉన్న విధిపూర్వక సంబంధాలపై  పర్యావరణ మనుగడ ఆధారపడుతుంది.


మాదిరి ప్రశ్నలు


1.  ఆల్ఫా వైవిధ్యం అంటే ఏమిటి?

1) రెండు ఆవాసాల మధ్య జాతుల్లో వైవిధ్యం

2) ఒక జీవ పరిణామ వ్యవస్థలో జాతుల  జీవవైవిధ్యం

3) ఒక ఆవాసం లోపల జాతుల జీవవైవిధ్యం

4) ఒక ఖండంలో జాతుల జీవవైవిధ్యం


2.  ఒక యూనిట్‌ విస్తీర్ణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ నిల్వ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకునే అత్యుత్తమ కర్బన శోషణ ప్రదేశాలు ఏవి?

1) ఉష్ణమండల వర్షారణ్యాలు     

2) హిమానీనదాలు

3) సముద్ర ఉపరితలం

4) నీలికర్బన జీవావరణ వ్యవస్థలు


3.  ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’ అంటే ఏమిటి?

1) నదులను రక్షించేందుకు ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’   చేపట్టిన జాతీయ ఉద్యమం

2) నదులను రక్షించేందుకు ఈశా ఫౌండేషన్‌ చేపట్టిన జాతీయ ఉద్యమం

3) కేరళలోని వార్షిక బోట్‌ ర్యాలీ

4) ‘నమామి గంగే’ కార్యక్రమం ద్వారా నదుల  ప్రక్షాళనకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం


4.  కాలుష్యం మూలంగా కురిసిన ఆమ్ల వర్షాల వల్ల తాజ్‌మహల్‌ పాలరాయి క్షయానికి గురికావడాన్ని ఏమంటారు?

1) పాచి పేరుకుపోవడం    2) పసుపు చిలుము

3) పాలరాయి మృత్యువు    4) పాలరాయి క్యాన్సర్‌


5. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనకు కారణమైన విషవాయువు?

1) మిథైల్‌ ఐసో సయనైడ్‌ 

2) మిథనో ఐసో సయనైడ్‌

3) మిథైల్‌ ఐసో సయనైట్‌

4) మిథనో ఐసో సయనైట్‌


6.   దిల్లీలోని వాయు కాలుష్యానికి ఏది ఎక్కువ కారణం?

1) రాజస్థాన్‌లో పంట కోశాక మోళ్లను తగలబెట్టడం

2) పంజాబ్‌లో పంట కోశాక మోళ్లను తగలబెట్టడం

3) పంజాబ్‌లో వంటచెరకు వాడకం

4) రాజస్థాన్‌లో వంటచెరకు వాడకం


7.  ఘనవ్యర్థాల సమస్య తగ్గించేంద]ుకు ఏ పద్ధతి మెరుగైంది?

1) చెత్తగుట్టల వద్ద తగలబెట్టడం

2) పునర్వినియోగం

3) సముద్రంలో పారవేయడం

4) ఒత్తిడి ద్వారా కుదించడం


8.  సంభావ్య కాలుష్యత ఆధారంగా కేంద్ర కాలుష్య నివారణ బోర్డు, పరిశ్రమలను ఏ విధంగా వర్గీకరిస్తుంది?

1) ఎరువు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు

2) ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ

3) ఎరుపు, నారింజ, నీలం, ఆకుపచ్చ

4) ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, తెలుపు


9.  జీవవైవిధ్యంపై వ్యూహాత్మక ప్రణాళిక 2011-2020 ప్రకారం ఎన్ని జీవ వైవిధ్య లక్ష్యాలను  నిర్ణయించారు?

1) 10     2) 17     3) 20     4) 24


10.  కిందివాటిలో జీవివైవిధ్య సంహిత నిర్వహణ నియమాల్లో జీవభద్రతకు సంబంధించిన ప్రోటోకాల్‌?

1) నగోమా ప్రోటోకాల్‌   2) కార్బజెతా ప్రోటోకాల్‌

3) కౌలాలంపుర్‌ ప్రోటోకాల్‌    4) కాంకన్‌ ప్రోటోకాల్‌


11.  భారత అటవీ స్థితి నివేదిక (ISFR)  2015  ప్రకారం భారతదేశపు అడవుల్లోని మొత్తం కర్బన నిల్వ ఎంత (మిలియన్‌ టన్నుల్లో)?

1) 7044   2) 6934      3) 5847  4) 8156 


12. భారత్‌లో 2024, జూన్‌ 10 నాటికి చిత్తడి నేలలు/రామ్‌సర్‌ సైట్‌ల సంఖ్య?

1) 75    2) 82     3) 96   4) 18


13. బ్రంట్‌లాడ్‌ కమిషన్‌గా పిలిచే పర్యావరణ, అభివృద్ధిపై ప్రపంచ కమిషన్‌ నివేదిక ఎప్పుడు ప్రచురించింది?

1) 1987  2) 1991   3) 2000  4) 1997


14.  జీవవైవిధ్య చట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆమోదించింది?

1) 2002   2) 2001  3) 2003  4) 1999


15. కిందివారిలో ఎవరికి చిప్కో ఉద్యమంతో సంబంధం ఉంది?

1) సుందర్‌లాల్‌ బహుగుణ 2) అరుంధతీ రాయ్‌

3) వందనా శివ   4) మేధా పాట్కర్‌


16. కిందివాటిలో ఆనకట్టల ప్రధాన లక్ష్యం ఏమిటి?

1) నీటిపారుదల సౌకర్యం    2) వాటర్‌ లాగింగ్‌

3) వరద నియంత్రణ     4) వినోదం


17. ఒక వేళ జాతులు సమృద్ధిగా ఉండి, అవి  సంఖ్యాత్మకంగా క్షీణిస్తున్నట్లయితే అలాంటి వర్గాన్ని ఏమంటారు?

1) అపాయకరమైన విపత్తులో ఉన్న జాతులు 

2) బెదిరింపునకు లోనైన జాతులు

3) అరుదైన జాతులు 

4) అంతరించిపోయే జాతులు


18. కిందివాటిలో వాహనాల నుంచి వెలువడే మూలకం ఏది?

1) రుబీడియం  2) థోరియం

3) యురేనియం   4) లెడ్‌


19. వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ వాయువుల  పెరుగుతున్న స్థాయి (గ్రీన్‌హౌస్‌ ప్రభావం)ని  ఏమంటారు?

1) బయోమాగ్నిఫికేషన్‌    2) జీవ అధోకరణం

3) మంచుతో కప్పిన అంశం   4) గ్లోబల్‌ వార్మింగ్‌


20. కింది జాతీయ పార్కులను, సంబంధిత రాష్ట్రాలతో జత చేయండి.

1) బందీపుర్‌ జాతీయ పార్కు  ఎ) అస్సాం
2) గిర్‌ అటవీ జాతీయ పార్కు  బి) గుజరాత్‌
3) జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కు  సి) కర్ణాటక
4) మానస్‌ జాతీయ పార్కు  డి) ఉత్తరాఖండ్‌
  ఇ) రాజస్థాన్‌

1) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ    2) 1-సి, 2-ఇ, 3-బి, 4-ఎ

3) 1-బి, 2-ఇ, 3-డి, 4-సి   4) 1-ఇ, 2-బి, 3-సి, 4-డి


21. భారతదేశంలోని కింది జీవావరణ నిల్వల్ని, వాటికి సంబంధించిన రాష్ట్రాలతో జతపరచండి.

జీవావరణ రిజర్వు రాష్ట్రం
1) పన్నా ఎ) మేఘాలయ
2) అచనక్మార్‌ బి) మధ్యప్రదేశ్‌
3) నొక్రెక్‌ సి) ఒడిశా
4) సిమిలిపాల్‌ డి) మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌

1) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి    2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి

3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి     4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ


22. కిందివాటిలో సుస్థిర అభివృద్ధిలో ఏది అతి ముఖ్య లక్షణంగా పరిగణనలో ఉంది?

1) తరాల మధ్య సమానత్వం 

2) తరాల్లో అసమానత్వం

3) మద్యంపై వ్యయం పెరుగుదల  

4) పొదుపు స్థాయి పెరుగుదల


23.    కిందివాటిలో ఆవరణ వ్యవస్థలో నిర్జీవ అంశం కానిది ఏది?

1) ఉష్ణోగ్రత   2) వర్షపాతం 

3) ఖనిజాలు   4) సూక్ష్మజీవులు


24. జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ సోలార్‌ మిషన్‌కు సంబంధించి కిందివాటిని పరిశీలించి, సరైనవి గుర్తించండి.

ఎ) చమురు దిగుమతులపై తక్కువ ఆధారపడటం

బి) శుభ్రమైన విద్యుత్తు వాటాను పెంచడం

సి) ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధి, విస్తరణ

డి) 2020 వరకు తలసరి విద్యుత్తు వినియోగాన్ని ప్రపంచ సగటు స్థాయికి తీసుకుపోవడం

1) ఎ, డి      2) బి, సి, డి  

3) ఎ, బి, సి      4) ఎ, బి, సి, డి


25. షెడ్యూల్డ్‌ తెగలు, అటవీ నివాసితుల చట్టం - 2006 ప్రకారం సమూహ, వ్యక్తిగత లేదా రెండింటి అటవీ హక్కుల స్వభావం, పరిధిని నిర్ణయించే ప్రక్రియ మొదలుపెట్టడానికి ఎవరికి అధికారం ఉంది?

1) రాష్ట్ట్ర్ర అటవీ శాఖ

2) జిల్లా కలెక్టర్‌/డిప్యూటీ కమిషనర్‌

3) తహసీల్దార్‌/ బ్లాకు డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌/మండల రెవెన్యూ ఆఫీసర్‌ 

4) గ్రామసభ


26. భారతదేశంలో మొదటి ఆర్గానిక్‌ రాష్ట్రం ఏది?

1) అస్సాం   2) మేఘాలయ 

3) మణిపుర్‌   4) సిక్కిం


27. వాహన కాలుష్యంలో రసాయనంగా ఉండి, రక్తానికి ఉన్న ఆక్సిజన్‌ మోసే సామర్థ్యాన్ని తగ్గించేది ఏది?

1) కార్బన్‌ మోనాక్సైడ్‌     

2) సల్ఫర్‌ డయాక్సైడ్‌

3) కార్బన్‌ డయాక్సైడ్‌     

4) నైట్రస్‌ ఆక్సైడ్‌


28. ఓజోన్‌ పతనానికి సాధారణ కారణం ఏమిటి?

1) పరారుణ కిరణాలు       

2) క్లోరోఫ్లోరో కార్బన్స్‌ 

3) అతి నీలలోహిత కిరణాలు    

4) అమ్మోనియా నైట్రేట్‌


సమాధానాలు


1-3; 2-4; 3-2; 4-4; 5-3; 6-2; 7-2; 8-4; 9-3; 10-2; 11-1; 12-2; 13-1; 14-1; 15-1; 16-1; 17-2; 18-4; 19-4; 20-1; 21-3; 22-1; 23-4; 24-3; 25-4; 26-4; 27-1; 28-4.

రచయిత: ఇ.వేణుగోపాల్‌

Posted Date : 11-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌